ఇతను... సారీ... ఇది... ఉహు! కాదు! ఇతను, ఇంకా అజిత్ లాగే మామూలుగా మాట్లాడుతున్నాడు. జిత్తులమారి తనమా ఇది?
ప్రపంచాన్ని అంతా కలవర పరుస్తున్న రాబొట్, డాక్టర్ సంజీవ్ ని చంపిన రాబొట్ ఇదేనా... ఇతనేనా? ఇతనే అమ్మని ఏమైనా చేసి వుంటాడా?
ఆమె కళ్ళలో మెదులుతున్న భావాలు అర్ధమయినట్లు విచారంగా తల వూపాడు అజిత్. "మా నాన్నగారిని - ఐమీన్ డాక్టర్ సంజీవ్ గారిని నేను చంపలేదు అపురూపా! ఆయన నన్ను సృష్టించారు. కాబట్టి నేను ఆయన్ని తండ్రిగానే భావిస్తాను. అయామ్ ఏ సెంటిమెంటల్ ఫూల్!"
బుద్ధిజీవి దగ్గరగా వచ్చి ఆసక్తిగా అతని మాటలు వింటోంది.
అజిత్ చెప్పడం మొదలెట్టాడు.
"మనిషిని మించిన రాబొట్ ని తయారుచెయ్యాలనుకున్నారు డాక్టర్ సంజీవ్. అలా తయారయిన రాబొట్ ని నేనే! ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తన కొడుకు అజిత్ మీద మమకారం కొద్దీ అచ్చం అతని రూపంలోనే తయారుచేశారు నన్ను. అదే పేరు పెట్టారు."
'మరి అసలు అజిత్ ఏమయిపోయాడు?' అన్న ప్రశ్న కనబడింది అపురూప మొహంలో.
"సంజీవ్ గారి కొడుకు అజిత్ చిన్నప్పటినుంచే కొంచెం తాత్వికుడిలాగా వుండేవాడు. అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయి చాలా రోజులయింది. అతను హిమాలయాల్లో ఏదో ఆశ్రమంలో వుంటున్నాడని తెలిసి, గుండె రాయి చేసుకుని ఊరుకున్నారు సంజీవ్ గారు.
"చాలా తెలివైన మరమనిషిని సృష్టించాలనుకున్నారు ఆయన. కానీ ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ మేథస్సుతో తయారయ్యాను నేను. అది నా తప్పుకాదు. దురదృష్టవశాత్తూ,సంజీవ్ గారి మేథస్సుకంటే నా తెలివితేటలు ఎక్కువని రెండు మూడు విషయాల్లో రుజువయింది.
"ఒక మేజర్ ప్రాబ్లెం డాక్టరుగారు సాల్వ్ చెయ్యలేక సతమతమవుతుంటే ఆయనకి సాయం చేస్తున్నాననుకుని నేనే దాన్ని సాల్వ్ చేసేశాను. అదే ఘోరమైన పొరపాటు అయిపోయింది అపురూపా! ఆయన చెయ్యలేనిది నేను చెయ్యగలగడంతో అహం తీవ్రంగా దెబ్బతింది.
అంతే!
నన్ను నాశనం చేసెయ్యాలని నిశ్చయానికొచ్చేశారు ఆయన.
నేను నిరభ్యంతరంగా, మహదానందంగా చనిపోయి ఉండేవాణ్ని అపురూపా! అప్పటికే ఆయన మీ అమ్మగారి పరిశోధన సంగతి చెప్పకపోతే."
"ఏమయింది అమ్మకి? ఎక్కడ ఉంది?" అంది అపురూప వణుకుతున్న గొంతుతో.
"ఏమీ కాలేదు. నేను తయారుచేసుకున్న లేబరేటరీలోనే భారరహిత స్థితిలో ఉంచాను. భోజనంతో సహా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అందులో. తాత్కాలికమైన ఖైదు... అంతే! ఆమె మాత్రం తను ఎక్కడో అంతరిక్షంలో బందీ అయినట్లు భ్రమపడి భయపడి ఉంటుంది. మనం తిరిగి వెళ్ళగానే ఆమెను విడుదల చేస్తాను."
"ఎందుకు ఖైదు?" అంది అపురూప అయోమయంగా.
"మానవ కళ్యాణానికి ఉపయోగించాల్సిన సైన్సుని సెన్సు లేకుండా మారణ హోమానికి ఉపయోగించాలని చూసినందుకు చిన్న శిక్ష.
డాక్టర్ సంజీవ్ గారు చెప్పారు అపురూపా! మీ అమ్మగారు దారుణమైన వైరస్ ని సృష్టించే ప్రయత్నంలో ఉన్నారని. ఆ క్రిమిని ఎలాగైనా నిర్మూలించాలను కున్నాను నేను. నాకోసం కాదు, మానవజాతి కోసం! మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక సార్ధకత ఉండాలంటారు. మరమనిషిగా పుట్టినా, ఈ ఒక్క మంచిపని చేసి జన్మ సార్థకం చేసుకోదలచుకున్నాను నేను. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని చిత్రమైన పరిస్థితుల వల్ల నేనేదో ప్రపంచ వినాశనానికి ఉద్భవించిన భూతాన్ని అని భయపడ్డారు అందరూ!"
"మరి సంజీవ్ గారిని చంపింది ఎవరు?" అంది అపురూప.
"అది హత్య కాదు ఆత్మహత్య" అన్నాడు అజిత్. "నేను తప్పించుకుని బయటికి వచ్చేశాను. తనకి జరిగిన తలవంపులు నేను బయట పెట్టేస్తానేమో అని ఆయన భయపడిపోయి లేసర్ గన్ తో కాల్చేసుకున్నారు."
"మైగాడ్!" అంది అపురూప.
"ఆయన నరహరిని ఆపరేట్ చేసి మైక్రో కంప్యూటర్ ని అమర్చినప్పుడు బహుశా అతని జ్ఞాపకార్థం నరహరి ఫొటోని తన దగ్గర ఉంచుకుని ఉంటారు. వికృతంగా ఉన్న ఆ ఆకారాన్ని చూసి అదే రాబొట్ అని అపోహ పడ్డారు జనం. నరహరిని ఆపరేట్ చేసిన డాక్టర్లందరూ విమాన ప్రమాదంలో మరణించడం వల్ల నిజం చెప్పేవాళ్ళెవరూ లేకపోయారు.
"నరహరిని ఇంట్లో నుంచి గెంటివేసిన పాపానికి శిక్షలాగా అతని భార్యా, కొడుకూ ఇద్దరూ పిచ్చివాళ్లై, మెంటల్ హాస్పిటల్ లో చేరారు. అందుకని వాళ్ళు చెప్పే స్థితిలో లేరు. నాగరికతకి అందనంత దూరంలో వుంటూ వుండడం వల్ల నరహరికి ఈ గొడవంతా తెలియదు.
"నరహరి రాబొట్ కాదని నాకు తెలిసినా, అది బహుశా హిమాలయాల్లో వుండే మంచు మనిషి 'యెతీ' లాంటి జంతువేమో ననుకున్నాను నేను. దాన్ని కూడా ఒకసారి చూడాలని నిశ్చయించుకున్నాను నేను. అలాగే ఫ్లయింగ్ సాసర్లు నిజమో కాదో కూడా తేల్చుకోదలుచు కున్నాను.
"ప్రపంచం దృష్టి అంతా నామీద కాకుండా నరహరి మీద పడటం నేను చెయ్యబోయే పనికి అనుకూలమయింది. ఎవ్వరూ నోటీస్ చెయ్యకుండా డాక్టర్ శోధనను తీసుకెళ్ళిపోయి ఆమె దగ్గరవున్న విషక్రిమి కాప్స్యూల్ ని వశపరుచుకున్నాను. అదే ఇది" అని చేతిలో వున్న కాప్స్యూల్ ని ఎత్తి బాగా కనబడేలా పట్టుకున్నాడు.
ప్రపంచంలోని ప్రాణులన్నిటినీ అత్యల్ప వ్యవధిలో నిర్జీవం చెయ్యగల మహా శక్తివంతమైన విషక్రిమి అది!
భయంతో, ఆశ్చర్యంతో దానివైపే చూస్తోంది అపురూప. ఇప్పుడు మొత్తం మానవజాతి భవిష్యత్తు ఇతని చేతిలో వుందన్న మాట! పొరపాటున అతను దాన్ని జారవిడిస్తే...!?
ప్రళయమే!
అప్పుడు జరిగింది అది -
అప్పటిదాకా ఎటో వెళ్ళిన పొట్టి రాబొట్ కేటూ అజిత్ ని చూడగానే సంతోషంతో రివ్వున పరిగెత్తుకుంటూ వచ్చి "అజిత్!" అని అతని కాళ్ళను పెనవేసుకుపోయింది.
బాలెన్స్ తప్పింది అజిత్ కి!
కాప్స్యూల్ చెయ్యిజారి కిందపడింది!
అరక్షణంలో అక్కడికి చేరిపోయి కాప్స్యూల్ ని కింద పడనివ్వకుండా నోరు తెరిచి అందుకుని, దాన్ని మింగేసింది బుద్ధిజీవి!
అందరూ నోరు తెరిచి చూస్తూ వుండిపోయారు.
ఏమవుతుంది బుద్ధిజీవి?
బెలూన్లా పేలిపోతుందా? నీళ్ళలా మరిగిపోతుందా? గాల్లో కరిగిపోతుందా?
ఏమవుతుంది?
ఏమీ కాలేదు!
గుండ్రాయిలాగా నిలబడి వుంది బుద్ధిజీవి.
"నేస్తం! చెప్పానుగా. మా గ్రహం మీ భూమికంటే కోట్ల సంవత్సరాల ముందు పుట్టిందని! అందుచేతే మా వైద్యం, మా సైన్సూ మీకంటే కోట్లరెట్లు ఎక్కువ! ఇలాంటి క్రిములన్నిటికీ అతీతమయిపోయాం మేము, మా సైన్సు సహాయంతో. అదే నేస్తం నేను మళ్ళీ రెట్టించి చెప్పేది. సైన్సుని మనకి ఉపయోగపడేలా మలచుకోవాలి గానీ దానిచేత వెర్రితలలు వేయించకూడదు."
అది వినగానే గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు అజిత్. "థాంక్ గాడ్! ఆ క్రిమిని తయారుచేసి కాప్స్యూల్ లో పెట్టిన తర్వాత, సరిగ్గా పదిరోజుల్లోగా దాన్ని ప్రయోగించకపోతే, దాన్లోని క్రిములు వృద్ధిచెంది దానంతట అదే బరస్ట్ అయిపోతుంది. అందుచేత దీన్ని ధ్వంసం చెయ్యడానికి సులభమైన మార్గం ఏదా అని వెతుకుతున్నాను. మీరు దాన్ని మింగేసి, ఈ భూగోళాన్ని కాపాడారు. థాంక్స్ ఎలాట్!" అన్నాడు కృతజ్ఞతగా.
స్నేహంగా నవ్వింది బుద్ధిజీవి.
"బెస్టాఫ్ లక్ అజిత్! బెస్టాఫ్ లక్ టూ యూ అపురూపా! అండ్ బెస్టాఫ్ లక్ టూ మాన్ కైండ్!" అంటూ ఫ్లయింగ్ సాసర్లోకి వెళ్ళి చెయ్యి వూపింది.
అజిత్ రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టాడు.
"బోన్ వాయెజ్!" అంది అపురూప ఆర్ద్రంగా.
విశ్వంలో సంచరిస్తూ, భూమిమీద కొద్దిరోజులు గడిపిన ఆ దూర గ్రహజీవి చివరిసారిగా వీడ్కోలు చెప్పి ఫ్లయింగ్ సాసర్ తో సహా కనుమరుగైపోయింది.
అజిత్, అపురూపా ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోవడానికి ఇబ్బందిపడుతూ తలలు పక్కకి తిప్పుకున్నారు.
నెమ్మదిగా అపురూప కళ్ళలో నీళ్ళు నిలిచాయి.
తనకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు ఇతన్ని చూడకముందు!
అలాంటి తను వివశురాలైపోయి, తీవ్రమైన ప్రేమలో పడిపోయింది ఇతనితో!
ఇంత కల్లోల సమయంలో కూడా ఇతని సాహచర్యంలో తను నిబ్బరంగా ఉండగలిగింది. ఇతను కాసేపు కనుమరుగైపోతే ఆదుర్దాతో సతమతమైపోయింది.
కానీ... ఇతను... ఇతను మనిషి కాడా? మరమనిషా?
ఎందుకిలా అయిపోయింది తన పరిస్థితి!
ఆమెకి ఉవ్వెత్తున దుఃఖం వచ్చింది.
"అపూ... అపురూపా!" అన్నాడు అతను సంశయంగా ఒక అడుగు ఆమెవైపు వేసి.
నెమ్మదిగా తలెత్తి చూసింది అపురూప.
కొంచెం దగ్గరగా వచ్చాడు అజిత్. "ఈ క్షణం రాకూడదని ఎంతో కోరుకున్నాను అపూ! కానీ వచ్చేసింది. అయామ్ వెరీ సారీ!"
ఏం మాట్లాడకుండా నిలబడిపోయింది అపురూప.
"అపూ! నువ్వు నన్ను అంతం చేసేయదలుచుకుంటే ఈ స్విచ్ ఆఫ్ చేస్తే చాలు" అన్నాడు అజిత్ నిస్పృహగా. తన చెవి పక్కన పుట్టుమచ్చలా ఉన్న చిన్న స్విచ్ ని చూపిస్తూ.
షాక్ తిన్నట్లు ఫీలయి అలా మాట్లాడవద్దన్నట్లు ప్రాధేయపూర్వకంగా చూసింది అపురూప. ఆమె కళ్ళలో నీటిపొర.
కొద్ది నిమిషాలు మౌనం.
కాస్త తేరుకున్న తర్వాత అతను నెమ్మదిగా ఆమెకి చెయ్యి అందించాడు. సందేహిస్తూ అందుకుంది ఆమె.
ఆ మనిషీ, మెషినూ కలిసి ముందుకి సాగిపోయారు - మానవ కళ్యాణం కోసం పాటుపడడానికి.
కానీ తమ కళ్యాణం మాత్రం జరగదనీ, అది చాలా అసహజమనీ వాళ్ళిద్దరికీ తెలుసు.
అయినా తెలియకుండానే, అప్రయత్నంగానే, ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిచారు. చాలా సింబాలిక్ గా వుంది అది.
కంప్యూటర్లని ఉపయోగించడంలో మూల పురుషుడిలాంటి ఒక శాస్త్రజ్ఞుడు శతాబ్దం క్రితమే ఊహించాడు ఆ పరిణామాన్ని! "దాదాపు సజీవమైన రెండు ప్రాణుల కలయిక లాంటిది అది" అని చెప్పాడు.
అది నిజమయింది ఆ రోజున!
* సమాప్తం *