Previous Page Next Page 
రక్షరేకు పేజి 20


    "నువ్వూ, నేనూ మంచిదని అంటే ఏం ప్రయోజనం? అందరూ లేచిపోయిన మనిషని అంటున్న తరువాత......"
    "అందరూ ఏదంటే దానికి అవుననటమేనా? మనం ఆలోచించేదేమీ లేదా?"
    "ఏమో బాబూ! మా అమ్మ ఒప్పుకోదు."
    "మా అమ్మని నేను ఒప్పించగలిగాను!"
    "మీలో ఇలాంటి పట్టింపులుండవు."
    లోలోపల ఎక్కడో భగ్గుమంది. జైహింద్ బాబుకి.....
    "ఉండవూ? ఉంటాయి. మీకు రెండింతలూ, మూడింతలూ ఉంటాయి? ఐశ్వర్యంలో, వైభోగాల్లో అందరూ ఒకటి కాదు. ఔన్నత్యంలో, ఔదార్యంలో అందరూ ఒకటి కాదు. కానీ, మూర్ఖత్వంలో అందరూ ఒక్కటే! ఒకరిని మించిపోయిన మూర్ఖత్వం మరొకరిది - అన్ని తరగతుల మనుషుల్లోనూ వదలక నిలిచే వారసత్వం ఇదే!  మా అమ్మ వీల్లేదంది. మా వాళ్ళంతా వాళ్ళని మా మద్య వుంచడానికి వీల్లేదన్నారు. కొందరు కొట్టడానికి కూడా తయారయ్యారు. కానీ, నేను అన్నిటికీ తట్టుకున్నాను, పాపం, మా ఇంట్లో ఉండలేకపోతున్నారని కాని....."
    గిర్రున తిరిగివెళ్ళిపోయాడు జైహింద్ బాబు. అతనలా వెళ్ళటం సుధీర్ కి కష్టంగానే తోచింది. ఏంచెయ్యగలడు.
    జైహింద్ బాబు సరళా, సారధుల సంగతి వ్యాసమూర్తికి చెప్పాడు. కొన్నాళ్ళు ఆశ్రయం ఇయ్యమన్నాడు.
    "అక్కడా ఇక్కడా ఆశ్రయం సంపాదించుకోవటానికి ప్రయత్నించకూడదు! ప్రతిఒక్కరూ తమ కాళ్ళమీద తాము నిలబడటానికి ప్రయత్నించాలి. దయానంద వాళ్ళ కేంటీన్ లో అసిస్టెంట్ కుక్ కావాలన్నాడు. ఈవిడ చేరుతుందేమో అడుగు. దయానంద్ తో చెప్పి ఈవిడతో ఉద్యోగం వచ్చేలా చూడగలను" అన్నాడు వ్యాసమూర్తి.
    సరళతో ఈ విషయం చెప్పాడు జైహింద్ బాబు సరళ పరమానందంతో వెంటనే ఒప్పుకుంది.
    జైహింద్ బాబు సంకోచంగా "అమ్మగారూ! అది మిలటరీ కేంటీన్. అక్కడ వంటపని అంటే చేపలూ, మాంసమూ ఇలాంటివన్నీ వండాలి. హెడ్ కుక్ ఉంటాడనుకోండి. అయినా మీరు అన్నీ చెయ్యాలి!" అన్నాడు.
    సరళ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
    "ఫరవాలేదు. ఏ పనైనా చేస్తాను. నన్ను నేను పోషించుకోవటానికి ఎలాటి కష్టమైనా పడతాను" అంది.
    వ్యాసమూర్తి సరళలో ఆ ఆత్మాభిమానాన్ని మెచ్చుకున్నాడు లోలోపల. జైహింద్ బాబు, వ్యాసమూర్తి దయానంద్ తో మాట్లాడారు. వ్యాసమూర్తి మాట కాదనలేని దయానంద్, సరళకు తమ కేంటీన్ లో అసిస్టెంట్ కుక్ గా ఉద్యోగం ఇప్పించాడు. సరళకూ, సారధికీ రెండు గదులు సర్వెంట్ క్వార్టర్స్ కూడా వచ్చేలా చూశాడు.
    మిలటరీ కేంటీన్ లో అడుగుపెట్టిన సరళ శరీరం జలదరించింది. తలుపురెక్క ఆసరాగా పట్టుకుని అలా నిలబడిపోయింది కొన్ని క్షణాలు. హెడ్ కుక్ వింతగా చూశాడు. తెప్పరిల్లి నిబ్బరంగా పనిలో ప్రవేశించింది సరళ.
    జైహింద్ బాబు సరళ చేతిలో యాభై రూపాయలు పెట్టాడు! సరళ చెయ్యజాపి ఆ డబ్బు తీసుకుని,  "జయన్నా! ఇంతడబ్బు నీకెక్కడివయ్యా!" అంది.
    "నా స్కాలర్ షిప్ డబ్బు వచ్చింది అమ్మగారూ! ఇంకా పరీక్షఫీజ్ కట్టడానికి చాలా రోజులుందిగా! అప్పటికి మీకు జీతం వస్తుంది!"
    "జయన్నా! నాకు జీతం వస్తుంది. ఆ డబ్బు నీకు తిరిగి ఇస్తాను! కానీ దీనితోపాటు నీ రుణాన్ని తీర్చగలిగే అవకాశంకూడా నాకు వస్తే బాగుండును!"
    "అదేంమాట అమ్మగారూ! మనలో మనం ఆమాత్రం ఒకరినొకరు సహాయపడకపోతే ఎలా!"
    "నాకూ నీలాంటి కొడుకు పుడితే బాగుండును!"
    గతుక్కుమన్నాడు జైహింద్ బాబు. ఒక పెద్దింటి ఆడపడుచు తనలాంటి కొడుకు కలగాలని కోరుకుంటోంది!
    "ఇప్పుడు నేను నీ కొడుకులాంటి వాడ్ని కానా అమ్మ?" అని సరళకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు జైహింద్ బాబు.
    "అక్కా! ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి అన్నాడు సారధి.
    సరళ నవ్వుతూ "ఏడిశావులేరా! ఉద్యోగం చేసే రోజులు ముందున్నాయిలే! ఈసారి కాలేజీలు తెరవగానే కాలేజీలో చేరు....." అంది.
    సారధి తెల్లబోతూ "నన్నుకాలేజీలో చేరమంటున్నావా ఎలా చదివిస్తావ్? అక్కడున్నప్పుడే దిక్కులేదు కాని......." అన్నాడు.
    "అక్కడున్నప్పుడేదిక్కూలేదురా! ఇప్పుడు మనకేంతక్కువ? నాతిండి కేంటిన్ లో గడిచిపోతోంది. జీతం వస్తుంది. నువ్వు దర్జాగా చదువుకోవచ్చు."
    "నువ్వు కేంటినులో తింటావా?"
    "ఏం? అక్కడ చేపలూ, మాంసమేకాదు- పప్పూ, మజ్జిగా కూడా ఉంటాయి. అన్నం తినకపోతే బ్రెడ్ ఉంటుంది. చక్కెర పొంగళ్ళూ, పులిహోరలూ, నా చేతులతో నేను సమృద్ధిగా తయారుచేసిన ఇంట్లో స్థిమితంగా కూచుని నేనేనాడూ ఏదీ తినలేదు. ఈనాడు ఈ రొట్టె ముక్క నాకెంత రుచిగా వుందో నీకేం అర్థమవుతుందీ?"
    సారధి మాట్లాడలేదు.
    "నువ్వు నిరుత్సాహపడకు. జయన్ననడిగి పుస్తకాలు తీసుకుని చదువుకో! మళ్ళీ కాలేజీలు తెరవగానే, జయన్న కాలేజీలోనే చేరుదువుగాని. ఇప్పుడు కూడా అనవసరంగా రోజులు వృధాచేసుకోకు! టైపు నేర్చుకుని టైబుపరీక్షలు పాసవు...."
    సారధి విభ్రాంతిలో అక్కముఖం అలాగే చూస్తూ కూచున్నాడు. తన కృతజ్ఞతను మాటలలో చెప్పుకోటానికి అతనికి మాటలు దొరకలేదు.
    సరళ వాత్సల్యంగా తమ్ముడి తన నిమిరి "వెర్రి నాగన్నా ఏమిటిరా! అలా చూస్తావు? నేను చెప్పలేదూ? దేవుడు ఏది చేసినా, మన మేలుకేనని....." అంది.
    నిండుగా నవ్వుతోన్న సరళను చూస్తూ "నేనుకూడా అలా నవ్వగలిగితే ఈ లోకంలో నాకంటే అదృష్టవంతులుండరు....." అనుకున్నాడు సారధి.   

 Previous Page Next Page