Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 20

    ఆ కోపం, విసుగు సుబ్బారావుమీద చూపించేది. కాస్త మూడ్ బాగున్న రోజున సరదాగా కాకపోయినా, సౌమ్యంగా ప్రవర్తించడం, అది బాగులేని రోజున ధుమధుమలాడుతూ, విసుక్కుంటూ, చీదరించుకుంటూ, తననితాను తిట్టుకుంటూ, సుబ్బారావుని తిడుతూ ఇల్లు నరకం చేసి పారేసేది.
    ఏదోరకంగా యీ మాత్రమన్నా కాపురం చెయ్యగల్గుతున్న సుబ్బారావు పాలిట శాపంగా "మురారి" వాళ్ళ జీవితంలో ప్రత్యక్షమయ్యాడు.
                                          *         *         *         *
    ఆ రోజు సుబ్బారావు, జ్యోతి సుల్తాన్ బజార్ లో పేవుమెంటు షాపులలో ఏదో కొనుక్కుని, అబిడ్స్ రోడ్డుకి వచ్చి ఇటు అటు కదలాడే జన ప్రవాహాన్ని చూస్తూ బస్సుకోసం నిలబడ్డారు.
    హఠాత్తుగా వాళ్ళముందునించి ఓ ఎంబాసిడర్ సర్రున కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి సుబ్బారావు ముందు ఆగింది.
    అందులోంచి ఓ అందమైన యువకుడు మొహం బయటపెట్టి సుబ్బారావుని ఓ క్షణం పరాకాయించి చూసి, చటుక్కున కారు దిగాడు.
    ఆ కారుదిగి తనవైపే చూస్తూ వస్తున్న యువకుడిని చూస్తుంటే సుబ్బారావుకి కాస్త సందేహం, అనుమానం, సంతోషం అన్నీ కల్గాయి.
    అతను దగ్గరికివచ్చి, "సుబ్రావ్ అన్నాడు ఆనందంగా, సంతోషంగా.
    "మురారీ!" అన్నాడు సుబ్బారావు పరమానందంగా.  
    ఆ మరుక్షణం ఇద్దరూ రోడ్డుమీదే ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు. ఆనక చేతులు నొక్కేసుకున్నారు.
    "నిజంగా నువ్వేరా!" అన్నాడు మురారి.
    "ఎన్నాళ్ళకి కలిశాంరా?" అన్నాడు సుబ్బారావు ఆనందంతో తల మున్కలవుతూ.
    "ఎక్కడున్నావురా ఇన్నాళ్ళు? ఇక్కడేం చేస్తున్నావురా? అసలు నేను గుర్తున్నానా నీకు?" అంటూ, మురారి "ఎంత తమాషాగా కలిశాంరా. ఇక్కడే వున్నావా? ఎన్నాళ్ళబట్టి వున్నావురా? ఏం చేస్తున్నావు?" వగైరా ప్రశ్నలు ఒకరిని ఒకరు వేసుకుని, ఆ పదినిముషాలలో పదేళ్ళక్రితం కబుర్లు తిరగతోడేసుకుంటూ, అది రోడ్డన్న సంగతి మరిచిపోయి కబుర్లాడేసుకుంటున్నారు.
    జ్యోతి అక్కడే వుందన్న విషయం కూడా గుర్తురాలేదు సుబ్బారావుకి.
    జ్యోతి ఆశ్చర్యంగా, ఆనందంగా అదంతా గమనిస్తూంది. తన భర్తకి, ఆఫ్టరాల్ గుమస్తాగాడికి కారున్న ఇంత అందమైన మిత్రుడున్నాడా? తెల్లగా, ఆరడుగులు పొడుగుగా ధృఢంగా, నవీనంగా చెంపలు, జుత్తు పెంచి, నల్లటి టెర్లిన్ పాంటుతో మల్లెపూవువంటి తెల్లటి షర్టు టక్ చేసి, టై కట్టుకుని, బూట్లేసుకుని, అతి మోడ్రన్ గా కనిపిస్తున్న అతను, కారులోంచి దిగిన అతను - ఏ పెద్ద ఆఫీసరు ఉద్యోగమో చేస్తున్న అతను, నలిగిపోయిన ప్యాంటు, చెమటకంపు కొడుతున్న టెర్రికాట్ షర్ట్ , ఆకుచెప్పులు, పొట్టిగా, పీలగా గుమస్తా ఉద్యోగం చేసే సుబ్బారావుకి మిత్రుడా?
    అందులో అంత ఆప్తమిత్రుడా? నమ్మలేకపోతూంది జ్యోతి. ఆమె కలల్లో హీరో, ఆమెకి కలల్లో కనిపించి నిద్రని, మనశ్శాంతిని హరించే హీరోకి ప్రతిరూపంలా వున్న మురారిని సంబరంగా చూస్తుంది జ్యోతి. పావుగంట గడిచాక మిత్రులిద్దరూ పరామర్శలు, కుశలప్రశ్నలు ఉద్యోగాలు వగైరా వివరాలు అడిగేసుకున్నాక- అప్పటికి సుబ్బారావుకి జ్యోతి విషయం గుర్తువచ్చింది.
    చటుక్కున వెనక్కి తిరిగి "జ్యోతీ! ఇతను మురారి అని నా బెస్టు ఫ్రెండ్." మురారీ! మీట్ మై వైఫ్ జ్యోతీ!" అన్నాడు.
    మురారి ఆశ్చర్యంగా చూసి "నీవు పెళ్ళిచేసుకున్నావా? చెప్పవేం రా ఫూల్. ఇందాకటినుంచి పరిచయం చెయ్యవేం? సారీ, మీ మాటే మరిచిపోయాం. గ్లాడ్ టు మీట్ యూ" అంటూ ఆమెకి నమస్కారం చేస్తూ నవ్వుతూ అన్నాడు.
    జ్యోతికి ఎందుకో మొహంఎర్రబడింది. తడబడుతూ నమస్కారం చేసింది.
    "ఈ సుబ్రావ్ గాడూ, నేనూ ఒకే వూర్లో పుట్టి, ఒకే వూర్లో, హైస్కూలు నుంచి ఇంటర్ వరకు చదివాం. ఒక కంచంలోతిని, ఒక మంచంలో పడుకోకపోయినా, అంతస్నేహంగా వుండేవారం. ఏమిటో ఈ అయిదారేళ్ళబట్టి ఎవరిదోవ వారిదయి దూరం అయిపోయాం" అన్నాడు మురారి.
    "జ్యోతీ! వీడు ఐ.ఐ.టి.లో ఇంజనీరింగు చదివి, విదేశాలువెళ్ళి వచ్చి, ఇప్పుడు మూడువేల జీతంతో ఓ కంపెనీలో పని చేస్తున్నాడట. బంగారుపిచ్చుక అయ్యాడు. ఇద్దరం ఎంత స్నేహంగా వుండేవారమో తెలుసా? ఆరేళ్ళ తరువాత యీనాటికి మళ్ళీ కలుసుకున్నాం" అన్నాడు సంతోషంగా.
    ఇంజనీరు, మూడువేలు జీతం, అందం, ఉద్యోగం, హోదా అన్నీ వున్న మురారి, ఒక్కక్షణంలోనే ఆకట్టుకున్నాడు జ్యోతిని.
    "ఏమిట్రా? ఎక్కడికి ఇలా బయల్దేరావు? షాపింగ్ కా? అయిందా? పదరా ఈ రోడ్డుమీద ఎందుకు, కారెక్కండి. పద, ఇన్నాళ్ళకి కల్సుకున్నాం. లెటజ్ సెలబ్రేట్ ద అకేషన్. ఏదన్నా రెస్టారెంట్ కి పోదాం, కమాన్" అంటూ కారు తలుపులు తీసాడు.
    "అబ్బే! ఎందుకురా వద్దు. కావాలిస్తే అలా పబ్లిక్ గార్డెన్ కి పోయి కాసేపు కబుర్లు చెప్పుకుందాం" అన్నాడు సుబ్బారావు మొహమాటంగా.
    జ్యోతికి ఒళ్ళుమండింది. చక్కగా తీసుకెళతానంటుంటే ఈ నస ఎందుకు? కోపంగా చూసింది సుబ్బారావు వైపు.
    "అబ్బ.... రారా! ఎప్పుడూ ఒక్కలాగే వున్నావు. ఊఁ కారెక్కు అంటూ చనువుగా భుజం పట్టుకుని లోపలికి తోశాడు ఫ్రంట్ సీట్ లోకి.
    సుబ్బారావు ఎక్కగానే "కమాన్! రండి" జ్యోతిని మర్యాదగా ఆహ్వానించాడు.
                  *            *            *           *
    ఆ సాయంత్రం జ్యోతి జీవితంలో మరపురాని రోజు. ఖరీదయిన హోటల్లో, మంద్రంగా ఉండే కొవ్వొత్తుల కాంతి, అంతకంటె మంద్రంగా వినవస్తున్న మృదుమధురమైన సంగీతం, నిశ్శబ్దంగా గునగున లాడుకుంటున్నట్టు మాటలు, తెల్లటి బట్టలతో అటూ ఇటూ తిరుగుతున్న బేరర్స్, అందంగా ఆధునికంగా కనిపిస్తున్నరకరకాల జంటలు. 

 Previous Page Next Page