హాల్లో అందరూ ఒక్కసారిగా తేలిగ్గా నిట్టూర్చి చప్పట్లు కొట్టారు.
ఇంతలో చిదానందం పరుగున వచ్చి మైకు పట్టుకుని "వచ్చేనెలలో మా సంస్థ మినిస్టర్ మారయ్యగారిని ఘనంగా సత్కరించాలని నిర్ణయించుకుంది..." అని అనౌన్స్ చేశాడు.
జనం ఎవరూ చప్పట్లు కొట్టలేదుగాని మారయ్య మాత్రం సంతోషంగా ఫటఫట చప్పట్లు కొట్టి చుట్టుచూసి నాలుక కరుచుకున్నాడు.
తర్వాత ప్రముఖ సినీ నటి స్టెప్పుమలినిని ప్రసంగించవలసిందిగా అధ్యక్షుడు కోరాడు.
స్టెప్పుమలిని జజ్జనకడి...జజ్జనకడి...జజ్జనకడి... అని గంతులేస్కుంటూ మైకు దగ్గరికొచ్చి వయ్యారంగా నిలబడింది. జనం చప్పట్లు కొట్టారు.
"సభకి నమస్కారం"
ఒక బొంగురు కంఠం ప్రేక్షకులకి వినిపించింది. అందరూ కంగారుగా అటూ ఇటూ కలయజూశారు.
"ఏంటలా దిక్కులు చూస్తున్నారు?... ఇప్పుడు మీరు వింటున్న గొంతు నాదే..." బొంగురుగా బొలబొలా నవ్వుతూ అంది హిరోయిన్ స్టెప్పుమలిని.
హాల్లోని అందరూ హాహాకారాలు చేశారు.
నా గొంతు ఇలా ఉంటుంది కాబట్టే సినిమాల్లో నాకు డబ్బింగ్ వాయిస్ పెడ్తారు... నాకు సభల్లో, సమావేశాల్లో మాట్లాడే అలవాటు లేదు... అందుచేత నేనింక కూర్చుంటాను... నాకీ అవకాశం ఇచ్చిన సర్వకళా సమితి కార్యకర్తలకి ధన్యవాదాలు" అని చెప్పి జజ్జనకడి జజ్జనకడి అని గెంతుకుంటూ తన ఆసనం దగ్గరికి వెళ్ళబోయింది స్టెప్పుమలిని. కానీ అంతలోనే ఒక అభిమాని చేతిలో దండతో సుడిగాలిలా స్టేజిమీదికి వచ్చి ఆ దండని స్టెప్పుమలిని మెడలో వేశాడు.
అంతే... వర్సగా ఆమె అభిమానులు ఆమెకి దండలు వేయసాగారు. ఆ దండల కార్యక్రమం ఒక పావుగంటసేపు సాగింది.
ఇంతలో ఒక అభిమానికి వీరావేశం వచ్చి మైకుని కౌగిలించుకుని స్పీచి ఇవ్వడం మొదలుబెట్టాడు.
"... ...మనసంతా ఇన్నాళ్ళూ తెరమీద ఆమె తొడలనీ, పొట్టనీ,నడుమునీ... ఇంకా పిక్కల్నీ..(సిగ్గుపడ్తూ) వాటినీ మాత్రమే చూశాం.ఈనాడు ఆమె మొహాన్ని చూడగలిగినందుకు ఆమె అభిమానులమైన మనందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళూ ఆమె తొడల్తోనే నటిస్తుంటే మనసంతా చూసి ఆనందించాం... ఆమె మొహంతో కూడా నటిస్తే చూడాలని అభిమానులనైన మేమంతా ఉవ్విళ్ళూరుతున్నాం..."
అందరూ చప్పట్లు కొట్టారు.
తమ రాబోయే ఒక చిత్రంలో మొహంతోనే నటించినట్టు మైకులో అనౌన్స్ చేసింది స్టెప్పుమలిని .
అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టారు.
సినీ నటి స్టెప్పుమలినికి మరికొంతమంది అభిమానులు దండలు వేయడం మొదలు పెట్టారు... ఇది చూసి మినిస్టర్ మారయ్య చిన్నతనంగా ఫీలయి సెక్రట్రిని పిల్చి అతని చెవిలో ఏదో ఊదాడు. దాని ఫలితంగా నగరంలో వివిధ సాంస్కృతిక సంస్థలవారు మినిస్టర్ మారయ్యకి వర్సగా దండలు వేసి ఆయన్ని పొగుడ్తూ కొన్ని ఉపన్యాసాలు చేశారు.
అప్పటికే రాత్రి ఎనిమిది కావొస్తుంది. హాలు తొమ్మిదిదాకానే బుక్ చేస్కున్నారు. మీటింగ్ గంటసేపు, కల్చరల్ ప్రోగ్రాం రెండు గంటలసేపు అని అనుకున్నారు. కానీ అప్పటికే రెండుగంటలు అయిపోయింది. గ్రీన్ రూంలో మేకప్ వేస్కున్న కళాకారులు కొందరు గోడకేసి తలలు కొట్టుకుంటుంటే కొందరు జుట్టుపీక్కుంటున్నారు.
ఓ పది నిమిషాల తర్వాత స్టెప్పుమలిని తనకి షూటింగ్ ఉందంటూ సభ మధ్యలో లేచి వెళ్ళిపోయింది. ఆమెతో బాటు హాల్లోని సగం జనం లేచి వెళ్ళిపోయారు. మినిస్టర్ మారయ్య నాకేనా పనుల్లేనిది అన్నట్లు నిర్వాహకుల వంక చూసి " నేను ముఖ్యమంత్రి గారితో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి " అని అతను వెళ్ళిపోయాడు. అతనితో బాటు ఇంకాస్త మంది వెళ్ళిపోయారు. తర్వాత రాకెట్ రాముడు మేటి సాహిత్యం తీరు తెన్నులు మీద అరగంట మాట్లాడి ఉన్నట్లుండికవయిత్రి హింసశ్రీ గురించి పొగుడుతూ మాట్లాడాడు. తర్వాత హింసశ్రీ రాకెట్ రాముడ్ని ఇంకా ఎక్కువగా పొగుడుతూ, సిగ్గుపడుతూ కులుకుతూ మాట్లాడింది. రచయిత్రి సిద్దమ్మ తనేదో నవలరాస్తే మెదడులోని ఒకటి రెండు నరాలు చిట్లిపోయాయని చెప్పి ఆ నవల గురించి అరగంట మాట్లాడింది. మిగతా స్పీకర్లు కూడా మాట్లాడి సభ పూర్తయ్యేసరికి రాత్రి పది గంటలైంది.
హాల్లో రెండు డజన్ల ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళు కూడా కల్చరల్ ప్రోగ్రాంలో వేసే వారి తాలుకూ మనుషులు.
టైము అయిపోయిన కారణంగా మనుషులు లేని కారణంగా కల్చరల్ ప్రోగ్రాం కాన్సిల్ చేస్కున్నారు నిర్వహకులు.
ఆ తర్వాత తమ ఫంక్షన్ ని గ్రాండ్ గా చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు సర్వకళా సమితి సంస్థ నిర్వాహకులు.