Read more!
 Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 2


    "ఏదో బాధ, కష్టం లేకపోతే ఎవరు మాత్రం వూరికే చచ్చిపోవాలనుకుంటారు" శ్రీధర్ ఫ్రీజ్ లో నీళ్ళు తీసుకు తాగి విజయకి ఓ గ్లాసు అందించాడు.
    గంటక్రితం అపస్మారక స్థితిలో వున్న శారదని యిరుగు పొరుగు యిద్దరు ముగ్గురు మోసు కొచ్చారు నర్సింగ్ హోముకి; చామనఛాయ రంగులో, సన్నగా నాజుగ్గా వుండి. చదువు సంస్కారం ఉట్టి పడే వేషంతో వున్నది శారద. పట్టుమని ఇరవై రెండేళ్ళుకంటే వుండని ఆ అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం ఏమి వచ్చిందో విజయకి అర్ధం కాలేదు. పొరుగింటి ముసలాయన యిచ్చిన సమాచారంవల్ల శారద భర్తకి ఏదో కంపెనీలో పని. పెళ్ళయి ఏన్నర్ధం అయింది పిల్లలు లేరు.
    శారద భర్త నిన్న కంపెనీ పనిమీద కలకత్తా వెళ్ళాడు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి చాకలివాడు బట్టల తెచ్చి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయలేదు శారద. పైనతాళంలేదు. లోపల గడియవేసి వుండడం. శారద ఎంత పలకక పోవడంతో చాకలివాడికి ఆశ్చర్యం. అనుమానం వేసిపక్కనించి వెళ్ళి బెడ్ రూము కిటికీలోంచి తొంగి చూశాడు శారద పక్కమీద పడుకునివుంది. కిటికీలోంచి ఎన్నిసార్లు పిలిచినా శారదలో చలనంలేదు. చాకలివాడికి గదిలోంచి ఏదో మందువాసన కూడా వేసింది. అనుమానం తోచి పక్కింటి ఆయన్ని పిలుచుకు వచ్చాడు.
    గదిలో పరిస్థితి చూడగానే వాళ్ళకీ అనుమానం వచ్చింది. ఆ గలభాకి యిరుగు పొరుగు మూగారు. అంతా కలిసి వీధి తలుపు బద్దలు కొట్టారు. శారద పక్కమీద తెలివి తప్పి పడివుంది. కింద టిక్ ట్వంటీ ఖాళీ సీసా అందరికీ పరిస్థితి అర్ధం అయింది. చకచక ఆ వీధిలోనే వున్న "విజయశ్రీ" నర్శింగ్ హోముకి మోసుకొచ్చారు.
    డాక్టర్ శ్రీధర్, విజయ ఒకగంట నానా తంటాలు పడి స్టమక్ వాష్ చేసి, ఇంజక్షనులు ఇచ్చాక శారదలో చలనం కనిపించింది. మరో అరగంట ఆలస్యం అయితే ప్రాణం పోయివుండేది.
    తెలివి వచ్చి తనున్న స్థితి చూసుకోగానే శారద తన యత్నం విఫలమైనందుకు, నలుగురి నోళ్ళల్లో పడిపోయి నందుకు సిగ్గుతో బాధతో తనని తాను మరిచి హిస్టీరియా వచ్చినదానిలా హృదయ విదారకంగా ఏడ్చింది. అంత చిన్న వయసులో వుండి ఏ కారణంతో ఇంత ఘాతుకానికి పాల్పడిందో అన్న జాలితో డాక్టర్ విజయ మనసు ద్రవించింది. పొరుగింటి ఆయనవల్ల ఏ సమాచారం రాబట్టలేక పోయింది విజయ. శారద బాగా కోలుకున్నాక ఆమె నించి వివరాలు సేకరించి తనేదన్నా చేయగలిగిన సహాయం వుంటే చెయ్యాలని నిర్ణయించుకుంది విజయ.
    "ఏమిటో నీ పిచ్చిగాని. లోకంలో ఎందరో ఇలాంటి వాళ్ళు. జాలిపడినా సహాయం ఎంత మందికి చెయ్యగలం. ఎవరి సమస్యలు వాళ్ళవి. అనవసరంగా నీ బుర్ర పాడు చేసుకుంటావెందుకు చెప్పు." రాత్రి విజయ శారద గురించి పదేపదే విచారిస్తుంటే ఆఖరికి అన్నాడు శ్రీధర్.
    "నీకు తెలియదు శ్రీధర్! ఏ ఆడపిల్లన్నా నిండు నూరేళ్ళ జీవితం పరిసమాప్తి చేసుకోవాలనుకుంటే ఆమె మనసెంత కృంగి పోయి ఉంటుందో నీ కర్ధం కాదు. నాకు తెలుసు. పెళ్ళయి భర్తతో కాపురం చేసుకుంటున్న ఆ అమ్మాయికి అంత రాకూడని కష్టం ఏముంటుంది? భర్త అనాదరణో, అనుమానమో కారణం అయి ఉంటుందని నాకు గట్టి నమ్మకం. అందుకే నా కంత ఆరాటంగా ఉంది శ్రీ?"
    "పిచ్చీ - ఇంత సెన్సిటివ్ అయితే ఎలా చెప్పు. రేపు అడుగుదాంలే. ఇంక నిద్రపో" ప్రేమగా ఆమె జుత్తు సవరించుతూ అన్నాడు శ్రీధర్.
    అతని గుండెలో వదిగిపోయి "ఏ స్త్రీ అయినా భర్త ఆదరణ. అభిమానానికి దూరమైతే ఆ బ్రతుక్కి అర్ధం కనిపించదు, ఇది మీ మగవాళ్ళకి అర్ధం కాని విషయం శ్రీ-" విజయ బేలగ అడిగింది.
    శ్రీధర్ నవ్వి ఆమెని దగ్గిరకి పొదువుకున్నాడు.
    
                                              *    *    *
    
    ఉదయం నర్శింగ్ హోమ్ కి వస్తూనే డాక్టర్ విజయ శారద గదిలోకి ఆరాటంగా వచ్చి చూసింది.
    శారద రాత్రంతా నిద్ర పట్టీ పట్టనట్టు మత్తుగా, తెల్లవారుఝామున కాస్త బాధ తగ్గి నిద్రపోయింది. ఏడుగంటలకి లేచాక వేడి వేడి కాఫీ త్రాగాక కాస్త ప్రాణం కుదుట పడినట్టు తేటగా అన్పించింది.
    గదిలోకి వచ్చిన డాక్టరుని చూడగానే శారద మొహం సిగ్గుతో కాస్త ఎర్రబడింది. తను చేసిన పనికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడినందుకు ఇబ్బందిగా కదిలింది.
    విజయ వస్తూనే స్నేహ పూర్వకంగా నవ్వి శారద చేయి అందుకుని పల్సు చూస్తూ "ఏమ్మా రాత్రి బాగా నిద్ర పట్టిందా? కడుపులో వికారం అది పూర్తిగా పోయిందా ఉదయం మందు వేసుకున్నవా?" డాక్టరుగా ప్రశ్నలు వేసింది.
    శారద తల ఆడించింది.
    శారదలో నిన్నటి ఆవేశం, నిరాశ, నిర్లిప్తత కాస్త తగ్గి ప్రశాంతంగా వున్నట్టు కనపడగానే "ఏమ్మా, ఇంట్లో యింకెవరూ లేనట్టున్నారే. మీ వారు ఎప్పుడు వస్తారు. వారికి టెలిగ్రాం ఈయమన్నావా-" అనడిగింది.
    శారద చప్పున తల అడ్డంగా వూపుతూ "వద్దు - వద్దు" అంది గాభరాగా.
    విజయ శారద మొహంలో హావభావాలు ఆశ్చర్యంగా పరిశీలించి "పోనీ - మీ అమ్మా నాన్నగార్ల ఎడ్రసు చెప్పు, ఎలాగైనా రెండు రోజులు రెస్టు తీసుకోవాలి నీవు."

 Previous Page Next Page