Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 2


    "నిజమే లక్ష్మీ! వాడు మానసికంగా ఎదగాలీ అంటే రోజులో కొంత భాగాన్ని తండ్రిగా వాడికోసమూ కేటాయించాలి. బహిర్గతం చేస్తేతప్ప మనసులో దాచుకున్న ప్రేమను గుర్తించే వయసుకాదు వాడిది." నొచ్చుకున్నాడు.


    మరుసటిరోజు రాత్రి ఎనిమిది గంటలకల్లా ఇంటికి వచ్చి సెకెండ్ షో సినిమాకి బలవంతంగా ప్రయాణం కట్టించాడు.


    రిక్షా మరో అరఫర్లాంగు దూరం దాటింది.


    "ఈసారి బొజ్జన్న తీర్థానికి, వెంకుపాలెం జాతరకీ మనమంతా కలిసెళదాం" గొణుగుతున్నట్టుగా అన్నాడు. మరో నిమిషం గడిచిందో లేదో "నేను ముందే జాగ్రత్త పడాల్సింది" అనేసరికి "అబ్బా" అంటూ తలపట్టుకుంది లక్ష్మి.


    "తండ్రీ కొడుకులిద్దరికీ ఏం అలవాటు మహానుభావా?"


    "ఏంటి?"


    "ఓ పట్టాన ఏదీ వదిలిపెట్టరు గదా. మీ అబ్బాయి మాత్రం ఏం తక్కువ తిన్నాడనుకున్నారా? ఏదో విషయం హఠాత్తుగా గుర్తు చేసుకుంటాడు. తప్పెందుకమ్మా ఇస్తే సరిపోతుందిగా అంటాడు వుండుండి. ముందు అర్ధమైచావదు. తెలీనట్టు తెల్లమొహం వేస్తే ఎక్కువ బాధపడతాడో అని అలాగే శశీ అని తలూపేసి తెలివిగా వాడి దగ్గర్నుంచే విషయాన్ని రాబడుతుంటాను" మృదువుగా నవ్వుతూ భర్త భుజంపై తలానించింది "మీరూ అంతే. నిన్న రాత్రి మొదలుపెట్టారు. ఇరవైనాలుగు గంటలు గడిచినా అదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ నిద్రలో కలవరిస్తారే! అలా బాధపడిపోతున్నారు. పసిపిల్లాడండీ... వాడన్న దానికి అంత ఇదైపోతున్నారు. ఏం తెలుసండీ వాడికి?"


    "లేదు లక్ష్మీ! అందరి పిల్లల్లా మనసులో వున్నదాన్ని ఓ పట్టాన బయటకు చెప్పుకునే అలవాటులేదు వాడికి."


    "చెప్పానుగా మీ పోలికే అని" ఆమె పెదవులపై విడిలింది నవ్వు.


    "వాడు నిన్ను పోలితే బాగుండేది."


    "ఏం? ఎంచక్కా అల్లరిపెట్టేవాడంటారా?"


    "అది కాదు లక్ష్మీ! తండ్రిని పోలినవాడు సుఖపడడంటారు."


    "ఇప్పుడు వాడి సుఖానికేం ఢోకా లేదు. మీరు కాస్త స్థిమితంగా వుండండీ... ఇప్పుడు వాడికేం తక్కువ? ఒక్కగానొక్క కొడుకు. అపురూపంగా చూసుకునే తండ్రీ-సీరియల్ గా వాడు కోరే కథలు చెప్పే నేను"


    "నువ్వంటే వాడికి చాలా గురి కదూ!"


    "నువ్వంటే వాడికి చాలా గురి కదూ!"


    "మరేం... ఎంత గురంటే మొన్న మీరు ఎగ్జిబిషన్ లో తెచ్చిన టోయ్ పిస్టల్ తో నేచెప్పిన చోటుని గురిపెట్టి షూట్ చేస్తుంటాడు"


    "అది కాదు లక్ష్మీ..."


    "అబ్బా... వూరుకోండి. మీరూ మీ ప్రశ్నలూను..."


    ఓ ఇంట్యూషన్ అతడ్ని ఉద్వేగంలోకి నెడుతుంటే ఇక వ్యవధిలేనట్టు "ఒకవేళ అనుకోనిదేదన్నా అయితే..." అంటూ టక్కున ఆగిపోయాడు.


    అప్పుడు చూసింది భర్త మొహాన్ని.


    అలాంటి ప్రశ్నని భర్త నోటివెంట వినడం కాని, భర్త గొంతులో అటువంటి ఆందోళన ధ్వనించడం కాని ఆమెకు కొత్త.


    "ఏం జరిగింది?" మనసులో అంకురించిన భయాన్ని అదిమిపెడుతూ అడిగింది" ఇప్పుడేమైనదని ఇలా మాట్లాడుతున్నారు?"


    అన్యమనస్కంగానైనా నోరు జారినందుకు నొచ్చుకుంటూ "అబ్బే ఏం లేదు" అన్నాడు తలని మరో వేపుకి తిప్పుకుంటూ.


    "నా దగ్గర దాయొద్దు" ఓ చేత్తో భర్త తలని తనకేసి బలంగా లాక్కుంది "చెప్పండి" అంది సూటిగా చూస్తూ.


    అప్పటికే రిక్షా మరో ఫర్లాంగు దూరాన్ని అధిగమించింది.


    "చెప్పకపోతే... చెప్పండి" ఒక నిశ్చల మానస సరోవరంలో రేగిన సుడిగుండాల్లా ఆమె కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి.


    మనసులో వేదనికి భయాన్ని ఓ స్థాయి వరకూ అనూహ్యమైన నిబ్బరంతో దాచుకుని ఓ స్థితిలో వూపిరందక ఇన్ ఫీరియారిటీ, ఇన్ సెక్యూరిటీల నడుమ నలిగిపోతూ బయటకు కక్కేసే మధ్యతరగతి మనస్తత్వం అతడిది.


    "ఆ మధ్య ఫాక్టరీలో ఏక్సిడెంటుతో ఆరుగురు చచ్చిపోయారు."


    "అవును గుర్తుంది".


    "ప్రమాదం యాజమాన్యపు భద్రత లోపంతో జరిగిందని నిరూపించబడితే చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు చాలా ఎక్కువ నష్ట పరిహారం  చెల్లించాల్సి వుంటుంది. ఎంత కాదన్నా ఆరేడు లక్షలు...


    "అయితే..."


    "త్వరలో ఫాక్టరీ చీఫ్ ఇన్ స్పెక్టర్, లేబర్ కమీషనర్ ఎంక్వయిరీకి వస్తున్నారు. ఆ ప్రమాదం జరిగిన సెక్షన్ కి నేను ఇన్ ఛార్జిని కాబట్టి నేను సాక్ష్యం చెప్పాలి"


    "......."


    "నిజానికి ఏక్సిడెంట్ అయింది యాజమాన్యం నిర్లక్ష్యంతో కాబట్టి వాస్తవాల్ని తెలియచేయడానికి నేను సిద్ధపడుతుంటే అది కుదరదంటూ నిజాన్ని కప్పిపుచ్చుకుంటూంది యాజమాన్యం. వస్తున్నది డబ్బుకి, పలుకుబడికీ లొంగని ఎంక్వయిరీ ఆఫీసరు కావడంతో ఈ రోజు చివరిసారిగా నన్ను పిలిచి అల్టిమేటం ఇచ్చారు." ఆగేడు క్షణం. "లక్ష్మీ..." డబ్బు కోసం నిజాన్ని ఎలా సమాధి చేయగలను? ఆ కుటుంబాల వుసురు ఎలా పోసుకోను? అదే అన్నాను."


    ఆమె వింటూంది నిశ్శబ్దంగా.


    "అలా చేస్తే ఆ సెక్షన్ ఇన్ ఛార్జిగా ప్రమాదానికి నేనే బాధ్యుడ్నని నిరూపించి నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తామన్నారు. నిజానికి ఈ ప్రమాదాన్ని నేనెప్పుడో ఊహించాను. ముందుగా తెలియపరిచాను కూడా."

 Previous Page Next Page