కృష్ణమోహన్ గాభరా పడిపోయాడు. "గీత, ప్లీజ్ కాస్త నెమ్మదిగా మాట్లాడు. అమ్మ వింటే ఏమనుకుంటుంది. సరోజ ఏమనుకుంటుంది. ఆ అమ్మాయి అసలే సెన్సిటివ్..." కోపం అతి ప్రయత్నంమీద అణుచుకుంటూ గీతని శాంత పరచడానికి తాపత్రయపడ్డాడు.
"నాన్సెన్స్....ఎవర్తీ సరోజ. ఒక పనిమనిషికి-దానికి మీరింత భయపడడం ఏమిటి. ఆవిడగా రెవర్తో దానికి నేను భయపడడం ఏమిటిది? మీరు కావలిస్తే నెత్తి నెక్కించుకోండి గాని నాకు చెప్పకండి యీ కబుర్లు - నేనీ యింటికి కాబోయే కోడల్ని. యీమాత్రం మాట్లాడే హక్కు నాకుందని తెలుసు. ఎవరేం అనుకున్నా వున్న మాట అనడానికి నేనేం భయపడను-యిప్పటికయినా ఎవరి స్థానాల్లో వారి నుంచండి-" హేళనగా తిరస్కారంగా అంటూవిసవిస నడిచి మెట్లు దిగింది గీత.
క్రింద హాలులోవున్న సరస్వతమ్మ సరోజలని చూస్తూ తలెగరేసి నిర్లక్ష్యంగా నడిచి వెళ్ళిపోయింది గీత.
కృష్ణమోహన్ బాధ, అవమానం, సిగ్గు ఏవేవో అనుభూతులకి గురి అవుతూ - క్రిందకి వెళ్ళి తల్లి సరోజల మొహం ఎలా చూడాలో అర్ధంకాక అక్కడున్న కుర్చీలో భారంగా వాలిపోయాడు.
గీతకి సరోజపట్ల యింత విముఖత ఎందుకో అతనికి అర్ధంగాలేదు. అసలు ముందురోజు చూసినపుడే - కారులో వెడుతూండగానే - "అదేమిటి ముక్కూ మొహం తెలియని దాన్ని యింట్లో చేర్చి కూతురనడం ఏమిటి, చేతి కందింది ఏదో పట్టుకు పారిపోగలదు." అంది గీత నుదురు చిట్లించి సరోజపట్ల అయిష్టతని స్పష్టంగా వ్యక్తీకరిస్తూ ఆ మాట్లాడిన తీరుకి కృష్ణమోహన్ నొచ్చుకుంటూ, "ఛా-ఏమిటలా మాట్లాడతావు. ఆ అమ్మాయికి డబ్బు లేకపోవచ్చుగాని చదువు సంస్కారం వున్నాయి."
"ఆఁ ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాం. యింట్లో మిమ్మల్ని మంచి చేసుకుని, నమ్మకం కల్గించి ఎప్పుడో కొంప ముంచుతుంది. అయినా మీ అమ్మగారు బీరువా తాళాలనించి అప్పచెప్పడం ఏమిటి-" కోపంగా అంది. కృష్ణమోహన్ ఇంక వూరుకోలేక "సరోజని మా అవసరం కోసం మేం వుంచుకున్నాంగాని ఆ అమ్మాయి వుంటాననీ అనలేదు. మమ్మల్ని ఏ సహాయము కోరలేదు. డబ్బు లేక పోయినా ఆ అమ్మాయికి ఆత్మాభిమానం వుంది. ఎంతో బలవంతపెడితే మొహమాటంగా ఉంటుంది. అమ్మసంతోషం కోసం నేనే బలవంతపెట్టి వుంచాను. ఆమె వున్న యీ నెల రోజులనించి అమ్మ కాస్త గతం మరిచి యింట్లో ఆనందంగా ఉంటుంది. అమ్మకి చేదోడు వాదోడుగావుండి యిల్లు చక్కబెడ్తూ అమ్మకి సహాయంగా వుంది. నీవు వచ్చి ఒకరోజు ఇంట్లోవుండి చూసి, నీ అభిప్రాయం తప్పని నీవే తెలుసుకుంటావు-" నొచ్చుకుంటూ, నిష్ఠూరంగా అన్న కృష్ణ మోహన్ మాటలకి గీత మొహం ముడుచుకుని "నాదేం పోయింది, మీ యిష్టం వచ్చినట్లు వుంచుకోండి, నే చెప్పాల్సింది చెప్పాను, తరువాత మీ యిష్టం" అంది. కృష్ణ మోహన్ ఏం అనకుండా వూరుకున్నాడు.
ఆ తరువాత అనేక సందర్భాలలో సరోజ పట్ల అయిష్టత వ్యక్తం చేస్తూనే ఉంది గీత.
ఒకరోజు గీత వచ్చేసరికి సరోజ చాకలి తెచ్చిన బట్టలు కృష్ణమోహన్ బీరువాలో సర్దుతుంది. కృష్ణమోహన్ ఆ గదిలోనే కూర్చుని ఏదో పుస్తకం పైకి చదువుతూ సరోజతో ఏదో చెపుతూ నవ్వుతున్నాడు. గదిలోకి అడుగు పెట్టి ఆ దృశ్యం చూసిన గీత అసూయతో సరోజ వంక చూసింది వారిద్దరి మధ్య ఆ చనువుకి ఆమె మనసు అసూయతో ఉడికిపోయింది. ఈర్ష్యాద్వేషాలతో సరోజని చూస్తున్న గీతని అప్పుడే చూసిన కృష్ణమోహన్.... "రా...రా....ఎంతసేపయింది వచ్చి" అంటూ పలకరించాడు. గీత మొహం గంటు పెట్టుకుంటూ వచ్చి కూర్చుంది. సరోజ బట్టలు సర్దడం పూర్తి చేసి క్రిందికి వెళ్ళబోతూ 'కాఫీ తీసుకురానా మీకు' అంది మర్యాదగా. గీత చుర చుర చూస్తూ, "ఏం అక్కరలేదు" అంది కరకుగా. సరోజ కాస్త ఆశ్చర్యంగా చూస్తూ తల వంచుకుని వెళ్ళిపోయింది. కృష్ణమోహన్ ఏదో అనబోయి మానేశాడు.
మరోసారి కృష్ణమోహన్ డ్రస్ అవుతున్నాడు. గీత అక్కడే ఉంది. ఇద్దరూ సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నారు. కృష్ణమోహన్ టై కోసం బీరువా అంతా వెతుకుతూ "సరోజా, సరోజా నా టై కనపడ్డంలేదు. రుమాలుకూడా కావాలి, సాక్స్ ఎక్కడ పెట్టావు" అంటూ పిలిచాడు.
"నీవు వెతుక్కోలేవూ...సరోజ ఎందుకు?" మొహం చిట్లించి అంది గీత.
"అవన్నీ ఎవరు వెతుక్కుంటారు. మా సరోజ వచ్చిందగ్గిరనుంచి అన్నీ తనే చూస్తుంటే బొత్తిగా ఏ వస్తువు ఎక్కడుందో కూడా మరిచిపోయి, అన్నీ అమర్చి పెడితేతప్ప వెతుక్కునేంత బద్దకిష్టునై పోయాను. సరోజ వచ్చిం దగ్గిరనుంచి ఎంత సుఖంగా ఉందో- ఏ వేళకేం కావాలో అన్నీ అమరుస్తూంటుంది." కృష్ణమోహన్ తల దువ్వుకుంటూ అద్దంలో చూసుకుంటూ గీత మొహం చూడలేదు. చూసివుంటే గీత మొహం ఎలా ఎర్రపడిందో, ఆమె కళ్ళల్లో ఎంత అసూయద్వేషాలు ప్రతిఫలిస్తున్నాయో తెలిసేది. సరోజ రాగానే ఆమెవంక చుర చుర చూసి, విసురుగా మొహం తిప్పుకుంది గీత. సరోజ బీరువా తీసి, "మీకు ఎదురుగా ఉన్నవే కనపడడం లేదీమధ్య" అంది చనువుగా మందలిస్తున్నట్లు. "నీవుండగా వెతుక్కునే బాధ ఎవరు పడ్తారు. ఒక కేకవేస్తే నీవు వచ్చి యిస్తావని తెలిసాక బద్ధకం పెరిగిపోయింది సరోజా....ఆ ఇదిగో యీ ప్యాంటు డ్రై వాష్ కీయాలి. అన్నట్టు పర్సులో డబ్బుందో లేదొ చూసి లేకపోతే పెట్టు" అంటూ పురమాయించాడు టై కట్టుకుంటూ. సరోజ అతని పనులన్నీ చేసి క్రిందకి వెళ్ళేవరకు అతి ప్రయత్నంమీద కోపం నిగ్రహించుకుంది గీత. సరోజ అలా వెళ్ళగానే "మీ అమ్మగారితో పాటు నీకూ ఆ సరోజని చూస్తుంటే మతిపోయిందా ఏమిటి!" దూకుడుగా అంది గీత.