Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 18


    అవును మాధవరావుతో ఏదో ఒక వ్యాపారం ప్రారంభింపజేయాలి. అందుకవసరమైన పెట్టుబడి తను సమకూర్చవచ్చు. దాంతో అతని జీవితం గడిచిపోయింది. బాగా లాభాలు వచ్చినప్పుడు తిరిగి తన పెట్టుబడి తనకిచ్చేస్తాడు . ఈ పద్దతి సరయినదిగానే అనిపించిందతనికి.
    "స్కూటర్ మీద మాధవరావు ఇల్లు చేరుకున్నాడతను.
    "ఏం చేస్తున్నావు ఇంట్లో?" అడిగాడు సోఫాలో కూర్చుంటూ.
    "ఎంత ప్రయత్నించినా వెలగని దీపాన్ని వెలిగిస్తూ కూర్చోవడం కంటే చుట్టూ వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం మంచిదనుకొంటున్నాను" పొడిగా నవ్వుతూ అన్నాడు మాధవరావు.
    "ఏడ్చావ్ గానీ --- నేనడిగిందానికి సమాధానం చెప్పు. నువ్వు ప్రయత్నించిన ఉద్యోగాలు ఏమయినాయి? ఎక్కడయినా దొరికే అవకాశం వుందా?
    "ఒక్కదాని కూడా నమ్మకం లేదు !"
    "పోనీ మీ కంపెనీ లాకౌట్ ఇప్పట్లో ఎత్తేసే అవకాశం ఉందా?"
    "ఊహు! అధసలె లేదు!"
    "మరేం చేయానులకొంతున్నావ్!"
    "చెప్పాను కదా! ఎంత ప్రయత్నించినా వెలగని ......."
    "చాల్చాలే! బోరు కొట్టకు! నువ్వుట్టి వెధవ్వని, ఇంటర్ నేషనల్ ఫూల్ వనీ అంచేత చేతులు ముడుచుకొని ఇంట్లోనే కూర్చుండి వుంటావనీ నేను ముందే అనుకొన్నాను."
    "థాంక్యూ . నా విషయాలు ఎలా తెలిసినయ్యబ్బా నీకు.........' ఆలోచిస్తున్నట్లు అన్నాడు మాధవరావు.
    "ఎడ్చావ్ గానీ -- నేనో ఉపాయం ఆలోచించాను వింటావా?"
    "మరికొంచెం అప్పు తీసుకోమంటావ్! అంతేగా. నేనింకా నీ దగ్గర అప్పు తీసుకోదల్చుకోలేదు. అది తప్ప ఇంకేదయినా అయితే మాట్లాడు"
    అతని మాటలు రెడ్డి కంటే సీతకే ఎక్కువ కోపం తెప్పించాయి.
    పోనీ లేక దాని ఆయనేదో సలహా చెప్పడాని కొస్తే సంతోషంగా వినడం పోయి అది చెప్పవద్దు . ఇది మాట్లాడవద్దు అని ఫోజిస్తే ఎలా!
    అప్పు తీసుకోరట!
    తీసుకోక ఏం చేస్తారో?
    తనని కూడా పస్తులుంచుతారా! అన్నీ అర్ధంలేని మాటలు వీటిని ప్రిన్సిపుల్ అనరేవరూ! చేతకాని తనం అంటారు. అవును! భార్యని ఏదో విధంగా పోషించాల్సిన ధర్మం భాద్యత భర్తది. అలాంటిది ఈ మనిషి ......పోనీ తన డబ్బయినా వుంటే ఈ సమయంలో ఎంతో ఉపయోగపడేది. అది కాస్తా తీసుకెళ్ళి "మేనమామో" అంటూ వాళ్ళ చేతిలో పెట్టారు. ఇప్పుడా మేనమామ బాగానే ఉన్నాడు. అడుక్కుతినబోతోంది. తామిద్దరూనూ! ఇప్పుడు తన రచనల మీద వచ్చే డబ్బు కూడా ఏమి లేదు. రెండో సీరియల్ పూర్తి అవుతే గాని చేతికి డబ్బు రాదు. కదల మీద వచ్చేది చెప్పుకో దగ్గది కాదు. దురదృష్టం ఏమిటో గాని ఈ రెండో నవల కొనుక్కోడానికి ఏ పబ్లిషరూ రాలేదింతవరకూ.
    'అప్పు సంగతి కాదులేవోయ్! నేను చెప్పేదంతా ముందు పూర్తిగా విను! తరువాత వాగుడువుగాని" అన్నాడు రెడ్డి మళ్ళీ అందుకుంటూ.
    "సరే చెప్పు. ఏమిటా ఉపాయం?"
    "నువ్వో చిన్న వ్యాపారం ప్రారంభించాలి!"
    "వ్యాపారమా?" విచిత్రంగా చూస్తూ అడిగాడు మాధవరావు.
    "అవున్రా! దానిక్కావలసిన పెట్టుబడి నేను ఇస్తాను! ప్రారంభించేయ్. తరువాత నెమ్మదిగా నా డబ్బు నాకిచ్చేద్దువు గాని ......."
    కొద్ది క్షణాలు ఆలోచనలో పడ్డాడు మాధవరావు. తను వ్యాపారం చేయగలనన్న నమ్మకం అతనికి కలగటం లేదు. దానిక్కావలసిన నేర్పూ, మోసం చేయగల సామర్ధ్యం ఆ మోసాన్ని భరించగల ఓర్పూ ఇవేమీ తనకు లేవు.
    "ఏం వ్యాపారం?" అయిష్టంగానే అడిగాడు మాధవరావు.
    "ఏదో ఒకటి. ముందు "చేస్తాను" అని నువ్వు ఒప్పుకొంటే తరువాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు"
    "అయన ఒప్పుకునేదేముందన్నయ్యా ఇందులో! ఏమీ చెయ్యకపోతే ఏం చేస్తారు? ఇల్లెలా గడుస్తుంది?" విసుగ్గా అంది సీత.
    "నీకున్న జ్ఞానం వాడికుంటే చాలా బావుండేదమ్మా!" నవ్వుతూ అన్నాడు రెడ్డి.
    "నన్ను మరీ ఎదవ కింద జమ కట్టకండ్రా బాబూ, అల్ రైట్! నేను నువ్వు చెప్పినట్టల్లా చేస్తాను. ఏం చేయమంటావో చెప్పు. అన్నాడు మాధవరావు.
    "అదే మనమిప్పుడు ఆలోచించాలి. ఏమమ్మా సీతా! నువ్వు కూడా ఆలోచించు ఫాన్సీ షాపు లాంటిదేమయినా బావుంటుందా?"
    అంతా ఆలోచనలో పడ్డారు.
    "పోనీ చిన్నపిల్లల కోసం స్కూలు పెడితే ఎలా వుంటుందన్నయ్యా! నేనూ గూడా పాఠాలు చెప్పడానికి అవకాశం ఉంటుందిగా!" అంది సీత.
    ఈ ఆలోచన బాగానే ఉన్నట్లనిపించింది రెడ్డికి.
    "ఇక్కడ దగ్గరలో స్కూళ్ళేమీ లేవు కదూ?" అడిగాడతను.
    "నాలుగు ఫర్లాంగుల దూరంలో ఉంది. ఈ చుట్టుపక్కల పిల్లలందరూ అంతదూరం వెళ్ళాల్సిందే. ముందు మనం కే.జి.  అప్పర్ కేజీ క్లాసులతో ప్రారంభిస్తే సరిపొతుందనుకొంటాను" అంది సీత.
    రెడ్డి ఆలోచనలో పడ్డాడు.
    "ఈ ఆలోచన బాగానే ఉన్నట్లుంది. ఏరా మాధవా! మరి నీ అభిప్రాయం ఏమిటి?" మాధవరావు వంక చూస్తూ అడిగాడు రెడ్డి.
    "ఫరవాలేదు , సరుకులమ్మే దుకాణం కంటే మంచిదే." నవ్వుతూ అన్నాడు మాధవరావు.

 Previous Page Next Page