కాని ఏ trick వల్లనో అదృష్టం వల్లనో ఆ గాయకుడు ఆ కవి పేరు పొందాడా, ముందుగా యీ ప్లీడరే, యీ డాక్టరే "మన__ మనవూరి...మన కులం... నే...నాతోటి విద్యార్ధి...నా ముత్తాత మామగారి మునిమనమరాలి కొడుకు...ఇతను...అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను" అని పొగిడి కొంత reflected glory కోసం పెనుగులాట!
కాని ఏదో ఆదర్శాన్ని నమ్మి artist కీర్తికాంత 'చిరునవ్వుని తృణీకరించాడా' యీ కుక్కలు ఎన్ని కాట్లు, ఎన్ని చీలికలు!
ఏ సహాయమూ అవసరం లేనివాళ్ళు కూడా తమ కష్టాల్ని ఇంకోరితో చెప్పుకోవడం అలవాటయిన యీ దేశంలో కొంచెం కష్టముంటే దానిని గంపెడంత చేసుకుంటారు.
పె__ఉత్తరం వ్రాసింది. ఏదో సహాయం కావాలని వ్రాస్తుంది. తనకి తాను సహాయం చేసుకోదు. ఏ సహాయం కావాలో తనకే తెలీదు. నేనిచ్చే సహాయం తను కోరిన రూపాన రావాలి. చాలామంది కష్టాల్లో వున్నవాళ్లు అంతే. ఉద్యోగాలు లేవంటారా? ఉద్యోగాలు లేక కాదు తాము కోరిన ఉద్యోగాలు, తమకి తగిన ఉద్యోగాలని తాము నిర్ణయించుకున్న ఉద్యోగాలు లేవని అర్ధం. ఆమెకా బాధలన్నీ ఇష్టమే. కనా 'సింపతీ' కోసం వ్రాస్తుంది. ఆ గోలలన్నీ వదిలి బైటికి రాదలుచుకుంటే సహాయం చేస్తానని ఖచ్చితంగా వ్రాస్తే ఆమెకి అర్ధంకాదు కాని బంధువుల్ని వదిలి నన్ను నమ్మి వస్తుందా? ప్రేమా? చాలామంది స్త్రీలకి వీలైనంతవరకే ప్రేమ. ఆశ. అక్కడే ఆ బురదలోనే రాళ్లు పాతుకుని, గట్టుననున్న నాకేసి ముఖం వంచుతుంది. అందుకోగలిగానా పరిమళాలు వెదజల్లుతుంది. అందదా ఆ బురదలోకి పన్నీరు కన్నీళ్లు జారుస్తుంది. కొన్నాళ్ళు యీ దాతల వలె మిషనరీల వలె ఏ స్త్రీ కష్టంలో వుంటుందా ఎవతైనా సహాయం అడుగుతుందా అని వెతికేవాణ్ణి. నేను ముందు శక్తిని సంపాయించాలి__ఇతరులకి సహాయం చేసే ముందు. ఆత్మారాం ఒకసారి నన్ను కోప్పడ్డాడు. 'ఈ వెర్రి యోచనలలో, ఏదో ఇంతమంది దిక్కులేక బాధపడుతున్నారే అనే దిగులుతో నీ శక్తినంతా డిస్సిపేట్ dissipate చేసుకుంటున్నావు. ముందు ధనం సంపాదించు. అప్పుడు సహాయం చెయ్యగలవు. ఇప్పుడు నీకేముంది, ఇతరులకి ఇవ్వడానికి?" అన్నాడు. అది చాలా sounl advice కాని నేను ధనం సంపాయించగలనా? నా చాతనవుతుందా? ఎట్లా సంపాదించను? కొన్ని యేళ్ళకి సంపాదించాననుకో. ఈ ధనం మోతలో హృదయాల రోదన వినపడదు.
ఎంతో దానం ఇవ్వడం కన్నా, జీవితమంతా పోషించడం కన్నా, హృదయంలో సానుభూతి, (కనికరం కాదు, quality of mercy కూడా కాదు.) fellow feeling. పాపంలో, పతితత్వంలో ఏకత్వం, మనసులోనించి ధైర్యమివ్వడం, 'నేనున్నాను' అనగలగడం _ ఎంతో గొప్ప సహాయం _ స్వంత లాభాన్ని లెక్కలు వెయ్యని ఆహ్వానం ఇది. ఎక్కువ ఓదార్పు నిస్తాయని తిరిగి తిరిగి రూఢి పడుతోంది జీవితంలో.
అందువల్లనే,
"లోకంలోకి వెళ్ళి సహాయపడరాదా." అని భగవాన్ ని అడిగితే__
"ఇక్కడ కూర్చునే నేను సహాయపడటం లేదని నీకెట్లా తెలుసు?" అనే జవాబులో ఎంత విలువ వుందో అనిపిస్తుంది.
"ఈ దిక్కుమాలిన స్త్రీలకు..." అనే లెక్చర్లూ__
"ఈ సంఘమనే రాక్షసి..." అని నాముందు నిప్పులు కక్కే నా admirers వాక్యాలూ _ ఎంతవరకు ప్రపంచానికి ఉపయోగపడ్డాయో తెలుస్తూనే వుంది.
కాఫీ తాగుతూ హోటల్లో,
"సోషలిజమే యీ లోకానికి ముక్తి. బీదవాళ్ల ఆకలిని గుర్తించని యీ ధనికుల్ని వుందే__"
అని సిగరెట్ లోంచి నిప్పులు కక్కే యువకుల్ని చూసి...
తిరవన్నామలై ఆలయం ముందు నుంచుని, దీక్షితులు గారు
"ఈ నడుములు వొంగిన యువకులూ, యువతులూ దేవాలయాలు ధ్వంసం చేస్తారుట. ఆ రాతిని యెత్తమనండి" అనడం జ్ఞాపకం వస్తోంది.
ఏం లాభం? కాని బాధపడే ప్రతి రోగితోనూ డాక్టరు ఏడిస్తే, ఏం సహాయపడగలడు?
మొగవాడిలో యీ weakness ని ఆడవాళ్ళు 'ఎడ్వాన్ టేజ్' తీసుకుంటారు.
చిన్నప్పుడు క_ తన భర్త పెట్టే తిప్పలన్నీ చెప్పుకుని యేడ్చేది, కుర్రాణ్ణి నాతో. హాస్టలుకి వెళ్ళి, వెర్రివాణ్ణి, ఆమెకోసం రాత్రంతా ఒకటే దిగులు పడేవాణ్ణి. ఏవేవో వింత యోచనలు చేసేవాణ్ణి. ఆమెని రక్షించే మార్గాల విషయం. అవన్నీ మర్నాడు ఆమెతో చెప్పాలని వెళితే, ఆమె కనబడేది కాదు. కనపడి కొంచెం పలకరించి వెళ్ళిపోయేది. నేనెట్లా కోపం తెప్పించానా ఆమెకి అనుకుంటూ వెళ్లిపోతే, మళ్ళీ చీటీ వ్రాసేది రమ్మని. నా ఆలోచనలన్నీ చెపితే, అవి ఒప్పుకొనేది కాదు. అవన్నీ సరైనవి కావని కొత్త ఆలోచనల్ని చేసేవాణ్ణి. కొన్నాళ్ళకి గాని నాకు అర్ధం కాలేదు__ఆమెకి భర్తమీద చాలా ప్రేమ అనీ, యీ బాధలన్నీ ప్రేమలో రొమాన్ సెస్ అనీ, నా సింపతీ పొందడానికే ఆ కథలు చెప్పేదనీ, నా సింపతీ ఎందుకంటే నామీది స్నేహం చేత, యిష్టం చేత. అట్లా చెప్పుకోవడం ఒక విధమైన సరదా. తన గొప్ప, తను యెన్ని కష్టాల్ని భరించి కాపరం చెయ్యగలుగుతుందో - నాతో చిన్నప్పుడు ఆడుకున్న పిల్ల - తాను అప్పుడే యింత భారం వహించవలసిన ఇల్లాలయ్యిందో నాకు తెలియచెయ్యడం. నేను మాత్రం అదంతా చాలా సీరియస్ గా తీసుకుని ఏ త్యాగం వల్ల, ఏ హత్య వల్ల, ఏ ఎస్కపేడ్ వల్ల ఆమెని రక్షించగలనని ఆలోచించడం!
చాలామంది స్త్రీల గోలలు ఇట్లాంటివే. బాధలు వుంటాయి కాని వాటినించి తప్పించుకునే ఇష్టం వుండదు. రైళ్ళల్లో తమ రోగ చిహ్నాలు చెప్పుకునేవాళ్ళు అందరి సలహాలు తీసుకుంటారు. కాని అప్పుడే తెలుస్తుంది, వాళ్లకి ఏ సలహా అక్కర్లేదని, public sympathy కావాలి అని.
* * * *