Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 19

సమయానికి ఆ లిఫ్ట్ ఆపరేటర్ కుర్రాడు అక్కడ లేకపోతే సుందరేశన్ భానురేఖని ఏం చేసి ఉండేవాడు!
ఊహించుకోవడానికే అసహ్యం వేసింది రఘురాంకి. కాసేపు అసహనంగా, అటూ ఇటూ పచార్లు చేసి, తర్వాత విలాసినితో అన్నాడు. "ఈ ఫ్లాట్ అమ్మేసి వేరే బంగళా కొనుక్కోవడం బెటరు. అమ్మాయిని ఇక్కడ బతకనివ్వరు వీళ్ళు."
"అదే చెబుతున్నాను నేను."
"మన సురేష్ తన బంగళా అమ్మేసి ఊరి మధ్యలో ఫ్లాట్ కొనుక్కోవాలని వుందని చెప్పాడు. అది మనమే కొనుక్కుంటే?"
"సురేష్ బంగళా అంటే ఊరవతల ఎక్కడో కదా! మీ ఇష్టం! మీరు చెబితే ఊరవతల కాపరం పెట్టడమేమిటి, ఉరేసుకు చావమన్నా చస్తాను" అంది విలాసిని, ఉక్రోషం వినబడుతోంది ఆమె గొంతులో.
ఆ మాటకు భానురేఖ కూడా వింది.
ఉరి!
ఎంత బావుంటుంది నిజంగా ఉరేసుకు చచ్చిపోతే? ఊరించేటట్లు ఉంది ఆ ఆలోచన. తన్మయంగా కళ్ళు మూసుకుని ఊహించుకుంది భానురేఖ. బట్టలారేసే నైలాన్ తాడు ఫ్యాన్ కి వేలాడదీసి, మెడకి బిగించుకుంటుంది తను. కాళ్ళకింద ఉన్న కుర్చీని తన్నేస్తుంది. కత్తిలా కోసేస్తూ మెడ చుట్టూ బిగుసుకు పోతుంది తాడు. తన నాలుక బయటికొచ్చేస్తుంది. కళ్ళు వెళ్ళుకొస్తాయి. కొద్దిసేపే ఆ యమయాతన. ఆ తర్వాత ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
ఈ బాధలకు దూరంగా, అమ్మకు దగ్గరగా వెళ్ళిపోతుంది తను. కానీ, ఒకవేళ తాడు తెగిపోయి తను కిందపడిపోతే? ప్రాణాలు పోకపోతే? ముచ్చెమటలు పోశాయి భానురేఖకి. చావకుండా బయటపడితే మళ్ళీ పోలీసు ఇన్ స్పెక్టర్ వస్తాడు. తనని జైల్లో పెడతాడు.
చాలాసేపటి తర్వాత భానురేఖ గదిలోకి వచ్చాడు రఘురాం. వచ్చీరాగానే అతను గమనించినది భానురేఖ బొమ్మలని. మెడచుట్టూ దారాలు కట్టి, ఉరేసినట్లు వేలాడుతున్నాయి అవన్నీ. ట్రాన్స్ లో ఉన్నట్లు వాటివైపే చూస్తూ కూర్చుని ఉంది భానురేఖ.
"స్వీటీ!" అన్నాడు రఘురాం. కడుపు తరుక్కుపోతూ ఉండగా, "స్వీటీ! ఎందుకమ్మా ఇలా కట్టావ్ బొమ్మల్ని? ఆడుకుంటున్నావా?"
"అవును నాన్నా!" అంది భానురేఖ చూపులు మరల్చుకుంటూ.
"మనం కొత్త బంగళా కొనుక్కుని వెళ్ళిపోదాం తల్లీ! అక్కడ నీకు చాలా బాగుంటుంది. ఏం? సరేనా?"
"మీ ఇష్టం నాన్నా"
కూతురి నిర్లిప్తత చూస్తే అతనికి బావురుమని ఏడవాలనిపిస్తోంది. కోమాలో నుంచి బయటికి వచ్చిన మొదట్లోనే నయం! కనీసం ఏదో ఒకటి మాట్లాడుతూ వుండేది. రోజులు గడిచేకొద్దీ టచ్ మీ నాట్ లాగా ముడుచుకు పోతుందే గానీ మామూలు మనిషిగా మారడంలేదు భాను.
ఆమెని మార్చడం ఎలా?
తన ప్రాణానికి ప్రాణమైన భానురేఖ సంతోషం కోసం తను ఏమైనా చేస్తాడు. ఆ సంగతి భానుకి తెలిసేలా చెప్పడం ఎలాగ?
"భానూ!"
"ఊ!" అంది వినీ వినబడకుండా. తన దృష్టి అంతా ఉరికంబానికి ఊగుతున్నట్లు ఉన్న బొమ్మలమీదే ఉంది.
చచ్చిపోతే ఎంత బాగుంటుంది!
అదే ఆలోచన భానురేఖకి పొద్దస్తమానం.
"భానూ డార్లింగ్! నీకు సిక్స్ త్ క్లాసులో స్కూల్ ఫస్టు వచ్చినందుకు గ్రాండ్ ప్రెజెంటేషన్ ఇస్తానన్నాను గుర్తుందా?"
"గుర్తుంది నాన్నా!"
"ఇటు చూడు"
చూసింది భానురేఖ. "కారు తాళం చెవులు! నీకోసం, కేవలం నీకోసమే కొన్నాను స్వీటీ. నిస్సాన్ కారు. హ్యాపీ?"
సంతోషం లేకుండా తలూపింది భానురేఖ.
"ఇంకేమన్నా కావాలా భానూ?"
"మీరు మళ్ళీ ఊరికెళ్ళిపోవాలా నాన్నా?" గొంతులో సన్నటి దిగులు.
"సాయంత్రం వెళ్ళి మళ్ళీ వచ్చేవారం వచ్చేస్తా తల్లీ! అప్పటికి కొత్త బంగళాలోకి మారిపోతాం మనం. ఓకే?"
ఒక్కసారి రఘురాం కళ్ళలోకి చూసి, అతని చెయ్యి పట్టుకుని, ఆ చేతికి తన మొహం ఆనించింది భానురేఖ. కొద్దిక్షణాల్లో అతని షర్ట్ తడిసిపోయింది. ఆమె తల నిమిరాడు రఘురాం.
"అర్జెంటు పని వుంది. వెళ్ళిరానా అమ్మా?"
అయిష్టంగానే తల ఊపింది భానూ.
రఘురాం వెళ్ళిపోయాడు హడావుడిగా. తన కూతురికి కావలసినది కొత్త బంగళాలూ. కొత్త కార్లు కాదనీ, ఈ కొత్త జీవితానికి అలవాటు పడేదాకా ధైర్యం చెబుతూ నడిపించే తోడు మాత్రమే ఆమెకు కావాలనీ అతను గ్రహించలేక పోయాడు. చాలామంది లాగానే.
తనకి తెలియకుండానే కొన్ని సూచనలు ఇస్తుంది భానురేఖ. బతకాలనే కోరిక తనకు చచ్చిపోయిందని సూచిస్తూ.
తన బొమ్మలన్నిటికీ ఉరి వెయ్యడం అందులో ఒకటి.
ఆత్మహత్య చేసుకోదలుచుకున్న వాళ్ళలో చాలామంది తమ ఉద్దేశాన్ని గురించి ముందే కొన్ని క్లూలు ఇస్తారంటారు సైకాలజిస్టులు. అవి మాటల ద్వారా కావచ్చు (నువ్వు నన్నింక ఎన్నో రోజులపాటు చూడవు) ప్రవర్తన ద్వారా కావచ్చు. (తమకు చాలా ఇష్టమైన వస్తువులని ఎవరికైనా ఇచ్చేయడం, వ్యవహారాలన్నీ వరసబెట్టి చక్కబెట్టేసుకోవడం).

 Previous Page Next Page