"ఆర్ యు ఫ్రమ్ స్టేట్స్?" ఎయిర్ హోస్టెస్ చిరునవ్వును ఒలకబోస్తూ అడిగింది.
"ఎస్... బట్... మీకెలా తెలుసు?"
"సాధారణంగా అంతదూరం వెళ్ళినవాళ్ళే తమ వాళ్ళను త్వరగా చూడాలన్న ఆసక్తితో ఫ్లయిట్ ఆగకముందే సీట్లోంచి లేచిపోతారు. పైగా హ్యాండ్ బేగ్ కి పానమ్ బ్యాగేజ్ స్లిప్ వుంది" అంది నవ్వుతూనే.
"యూ ఆర్ రైట్... మా నాయనమ్మను ఎంత త్వరగా చూస్తానా అని..." అంటూ డోర్ కేసి వస్తూన్న లేడర్ ని చూస్త మరో అడుగు ముందుకేసింది.
మరికొద్ది క్షణాల్లో లాడర్ మీంచి వేగంగా దిగి రన్ వే మీద పరుగులాంటి నడకతో అవుట్ గేట్ కేసి దూసుకుపోసాగింది నాయకి.
సరిగ్గా అప్పుడే ఫస్ట్ ఫ్లోర్ కి చేరుకున్న కనకారావు బైనాక్యులర్స్ సామంత్ కిచ్చి "కథానాయకి వస్తోంది వడివడిగా చూడు" అని తొందర పెట్టాడు.
సామంత్ బైనాక్యులర్స్ ఎడ్జస్ట్ చేసుకుంటూ నాయకి మీదకు వచ్చి ఆగాడు.
"అవునూ ఆమె పేరు నాయకి కదా? కథానాయకి అంటావేమిటి? నీకు మతిమరుపు ఎక్కువయిపోయిందీ మధ్య..." బైనాక్యులర్స్ నుంచి నాయకిని చూస్తూనే అడిగాడు సామంత్.
"అవును... నాకు పుట్టెడు మతిమరుపు. ఒప్పుకుంటున్నాను. హింస పెట్టక పిల్లని పరిశీలనగా చూడు..." అన్నాడు కనకారావు తనూ చూస్తూ.
"అమెరికావాళ్ళంతా తెల్లగా వుంటారంటారు ఈ పిల్లేమిటి నల్లగా వుంది?" బైనాక్యులర్స్ ని కిందకి మరల్చుతూ ఆమెను ఫ్రేమ్ లోకి తీసుకుంటూ అడిగాడు సామంత్.
"ఎందుకయ్యా నీకు?" చిరాగ్గా అడిగాడు కనకారావు.
"ఏమిటెందుకు?"
"ఆ పిల్ల రంగు!"
"నాకు కాక ఎవరికి? పెళ్ళి చేసుకునేది నువ్వా, నేనా?"
"పెళ్ళి చేసుకుని వదిలేస్తున్నావు నువ్వు సంసారం చెయ్యబోవడం లేదు. అది మర్చిపోకు!"
"బ్రహ్మంగారిలా కాలజ్ఞానం చెప్పకు... దెబ్బ తింటావ్... అమ్మాయి వాటంగా వుంటే సంసారం చెయ్యడానికేం? నాకేమన్నా రోగమనుకున్నావా? నువ్వంటే సంసారానికి పనికిరావని మీ వీధిలో ఆడపిల్లలంతా తేల్చిపడేశారు"
నాయకి లోపలకు వెళ్లిపోవడంతో సామంత్ బైనాక్యులర్స్ ని తీసి కనకారావుకి అందిస్తూ - "మా వీథిలో కొచ్చి చూడు - ఎంతమంది ఆడపిల్లలు నేనంటే పడిచస్తున్నారో..." అన్నాడు.
రాత్రి 8-30కి ఢిల్లీ టు మద్రాసు ఎయిర్ బస్ హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయింది.
నాగమ్మ పంపిన హోండా ఆకురా కారు ఎయిర్ పోర్ట్ అవుట్ గేట్ దగ్గర వెయిట్ చేస్తుండగా నాయకి, ఆ వెనుకే అర్జునరావు రన్ వే మీంచి అవుట్ గేట్ కేసి రాసాగారు.
"నాయనమ్మ ఎలా వున్నారు అర్జునరావుగారు!" నాయకి ప్రశ్నించింది.
"ఇప్పటికి ఈ ప్రశ్న కనీసం రెండొందలసార్లు అడిగి వుంటావమ్మా... నీకు నాయనమ్మగారి మీద వున్న ప్రేమని, అభిమానాన్ని చూస్తుంటే నా కళ్ళు చెమర్చిపోతున్నాయి. నాగమ్మగారు కులాసాగానే వున్నారు" అన్నాడు నవ్వుతూ అర్జునరావు.
"వయస్సు మీద పడుతోంది గదా... అందుకే నాకింత ఆందోళన అర్జునరావుగారూ!"
"నీకు పెళ్ళయి, పిల్లలు పుట్టి ఆ పిల్లలతో కలిసిపోయి ఆడుకునే వరకు వాళ్ళ ఆలనా పాలనా చూసేవరకు ఆ భగవంతుడు కూడా ఆమె ఆరోగ్యాన్ని ఏమీ చేయలేడమ్మా! మనిషి శారీరక ఆరోగ్యానికి మానసిక ఆనందం ఇచ్చే బలాన్ని మందులు, వైద్యశాస్త్రం కూడా ఇవ్వలేదమ్మా"
ఓ మధురోహ ఆమె హృదయాన్ని కనురెప్పపాటు కాలం సున్నితంగా స్పృశించి తప్పుకుంది.
"బిజినెస్ ఎలా వుందంకుల్?"
ఆమె ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేక పోయాడు అర్జునరావు.
ఆ చెప్పలేకపోవడం కేవలం నాటకమే. ఇప్పుడతను చెప్పేందుకు సందేహిస్తున్నట్టుగా నటిస్తున్నాడు. నాయకి చూచాయగా ఆయనలోని సందిగ్ధతను పసిగట్టి తనూ సందేహపడింది. ఆ తరువాత ఇద్దరూ మౌనంగా అవుట్ గేట్ లాంజ్ లోకి వచ్చారు.
మరో ప్రశ్న వేయాలన్నా, వేసిన ప్రశ్ననే రెట్టించాలన్నా ఆమెకు భయంగా వుంది- ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందోనని.
నాయకి బ్యాగేజి స్లిప్స్ కారు డ్రైవర్ కిచ్చి బయటికి వచ్చి కారెక్కి కూర్చుంది. అర్జునరావు కూర్చోగానే కారుని ముందుకు దూకించింది.
"అదేంటమ్మా... డ్రైవర్ రావాలిగా? పైగా నీ బ్యాగేజి ఇంకా రాలేదు" అన్న అర్జునరావు మాటలు గాల్లో కలిసిపోయాయి.
కారు సర్రున దూసుకుపోతూనే వుంది.
ఆమె కీడునే శంకిస్తోంది. వ్యాపారం ఎలా వుంది అని అడిగితే టక్కున బాగుందనో, ఫర్వాలేదనో చెప్పవలసిన అర్జునరావు మౌనం వహించాడు. దానర్థం ఏమిటి?
సాధారణంగా అరగంట పట్టే దూరాన్ని ఇరవై నిమిషాల్లోనే అధిగమించింది నాయకి.
కారు బంగ్లా ఆవరణలోకి ప్రవేశిస్తుండగానే సింహద్వారం వద్ద నుంచుని తన ఆగమనం కోసమే ఎదురుచూస్తున్న నాయనమ్మ కనిపించి ఒకింత రిలీఫ్ ఫీలయింది నాయకి.
ఇంజన్ ఆఫ్ చేస్తూనే నాయనమ్మ దగ్గరకు పరుగెత్తుకు వచ్చింది నాయకి.
చిన్నపిల్లలా పరిగెత్తుకు వస్తున్న మనుమరాల్ని చూసి నాగమ్మ కళ్ళు చెమర్చాయి. ఎన్నో ఏళ్ళనాటి జ్ఞాపకాలు వరద ప్రవాహంలా క్షణకాలంపాటు ఆమెను ముంచెత్తాయి.
ఒక గంటసేపు తనను విడిచి వున్నా తట్టుకోలేక, పట్టులంగా కాళ్ళకు అడ్డుపడుతున్నా లెక్క చేయకుండా పరుగెత్తుకు వచ్చి తన ఒడిలో వాలే తన చిన్నారి మనుమరాలు...
ఒక్కోసారి కాళ్ళకు లంగా అడ్డుపడి బోర్లాపడి దెబ్బలు తగిలినా తనను చూడగలుగుతున్నానన్న ఆనందంతో, తన ఒడిలోకి చేరుతున్న సంతోషంతో బాధ మరిచిపోయే తన చిన్నారి తల్లి... నాలుగు సంవత్సరాల ఎడబాటు తర్వాత శారీరకంగా గమనించతగ్గ అందమైన ఎత్తుపల్లాలతో తన ముందుకు వస్తోంది.
ఆమెకా క్షణాన నాయకిని చూస్తుంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా వుంది.
దగ్గరగా వచ్చిన మనుమరాల్ని చేతులు చాపి అక్కున చేర్చుకుంది.
కొద్దిక్షణాలపాటు మౌనం...
భాష కందని భావం, మాటలకందని ఆత్మీయత, అనుబంధం ఆ ఇద్దర్నీ కుదిపివేసింది.
అర్జునరావు కారులోంచి దిగాడు.