శ్రీహర్ష మొహంలో విస్మయమూ, కళ్ళలో ఆరాధనా కనబడింది. ఉద్విగ్నత నిండిన కంఠంతో "నువ్వింత లోతుగా ఆలోచించగలవని నాకు తెలీదు సుమా! పైలా పచ్చీసుగా తిరిగే యువకుడిగా మాత్రమే నాకు తెలుసు."
బృహస్పతి నవ్వి "NECESSITY MAKES MAN TO SHINE" అన్నాడు.
* * *
డిప్యూటీ వాగ్దానం చేసినట్టే మరుసటిరోజు సాయంత్రానికి సరళరేఖ అక్కడికి చేరుకుంది. కనీసం ఇరవయ్ పార్లమెంటు స్థానాలు వస్తాయనుకున్న పార్టీనుంచి- ఇరవయ్ మంది ఎం.ఎల్.ఏ.లు వెళ్ళిపోతే ఆ పార్టీ అధ్యక్షురాలి పరిస్థితి ఎలా వుంటుందో, అలా వుంది ఆ అమ్మాయి మొహం.
"ఇక్కడి జనాల్ని కంట్రోల్ చేయడానికీ, ట్రాఫిక్ ఏర్పాట్లకీ మిమ్మల్ని పంపించినట్టున్నారు" అన్నాడు బృహస్పతి ఏడిపిస్తున్నట్టు.
"కాదు.... భద్రతా ఏర్పాట్లకీ, సెక్యూరిటీకీ...." అంది సరళరేఖ కోపంగా.
"ఓ గ్లాసు మంచినీళ్ళు తీసుకురా" అన్నాడు బృహస్పతి.
"వ్వాట్?" అంది అదిరిపడి.
"గన్ మాన్లతో స్వంత పనులు చేయించుకోవడం ఆనవాయితీయేగా! ఆశ్చర్యపోతావేం?"
"నేను నీ గన్ మాన్ ని కాదు! ఇన్ స్పెక్టర్ ని. తాహతు తెలుసుకుని మాట్లాడు."
"ఓహో! నీ తాహతెక్కువా? అయితే మంచినీళ్ళు కాదు.... బీరు తీసుకురా."
"మిస్టర్! నోరు అదుపులో వుంచుకో."
"ప్రొహిబిషన్ లో వున్న రోజుల్లో కూడా రాజకీయ నాయకులు ఇంత ధైర్యంగా మందు కొడుతున్నారంటే గన్ మాన్లు కాపలా కాయడం వల్లేగా! అంతకన్నా నీ స్థాయి ఎక్కువని ఎలా అనుకుంటున్నావ్? నువ్వు నాకు కాపలా కాయడానికి వచ్చావ్. నీ బాధ్యత నువ్వు సరిగ్గా చేయడం లేదని, మా భక్తుడైన డిప్యూటీతో ఒక్కమాట చెప్పావంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు."
సరళరేఖ కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. "అవకాశం వచ్చింది కదాని అధికారాన్ని వాడుకోకండి అనవసరంగా" అంది.
"అవకాశం వచ్చింది కదాని అధికారాన్ని వాడుకున్నది మీరు! ఒక రాజకీయ నాయకుడు నిన్ను పక్కన పెట్టుకుని, నన్ను కొట్టినప్పుడు ఏమైంది నీ అధికారం? నీకన్నా పెద్ద అధికారానికి నువ్వు దాసోహం అనలేదూ? అది నిరూపించడానికే నిన్ను ఇక్కడికి రప్పించాను. అంతే తప్ప లంచాలు దొరికే స్థానం నుంచి నిన్ను తప్పించడానికి కాదు...." అకస్మాత్తుగా అతడి కంఠంలో అల్లరి ధ్వనించింది. ".... ఎవడినో ఎం.పీ.ని చేసి, వాడు చచ్చాక నువ్వు రాజకీయాల్లోకి రావడం దేనికి? మా ఓంఫట్ బాబాకి ఉంపుడు గత్తెగా వుండు. ఎం.పీ.ని చేస్తాం..."
ఆమె పెదవులు ఆవేశంగా వణకసాగాయి. ముక్కుపుటాలు అదిరాయి. నిన్నూ.... నిన్నూ...." అంది.
"నేను అన్నదాంట్లో తప్పేమీలేదు. నేను చేస్తున్నదీ అదే! శారీరక వ్యభిచారానికీ, రాజకీయ వ్యభిచారానికీ తేడా లేదు. పోతే నేను చెప్పుకో గలుగుతున్నాను.... నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. అంతే!" అని అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
ఇది జరిగిన కొంచెంసేపటికి "ఇండియా" విలేఖరి వచ్చాడు. అదే సమయానికి ఒక కేంద్ర మంత్రి కూడా అక్కడికి ప్రయాణం పెట్టుకున్నాడు. ఆ రోజు ఆదివారం- అమావాస్య కలిసి రావడంతో 'ఓంఫట్ బాబా' స్పెషల్ పూజలు నిర్వహిస్తానని ముందే ప్రకటించాడు. పై రెండు కారణాలవల్లా జనం అక్కడ తండోప తండాలుగా వున్నారు.
'ఇండియా' పత్రిక తరఫున వచ్చిన విలేఖరి ఈ వ్యవహారం తాలూకు బండారాన్నంతా బయట పెట్టడానికి కృతనిశ్చయుడై ఉన్నట్టున్నాడు. డాకూ మంగళ్ సింగ్ తాలూకు చరిత్రనంతా సేకరించి సిద్ధంచేసుకుని వచ్చాడు.
అదే సమయానికి ఒక లోకల్ టీ.వీ. వాళ్ళు ఇంటర్వ్యూని ప్రసారం చేయడానికి సమాయత్తమై కెమేరాలతో రెడీగా వున్నారు.
రెండు మూడు ప్రశ్నలు మామూలుగా అడిగిన తర్వాత-
"రత్నాబాయితో మీరు కలిసి వుండకముందే మీకు వివాహం జరిగింది. వివాహం జరిగాక మీరు ఆమెని వదిలేసి చంబల్ వాలీకి వెళ్ళిపోయారు. రత్నాబాయితో కాపురం పెట్టాక మళ్ళీ ఆమెను కలుసుకున్నారా?" విలేఖరి ప్రశ్నించాడు.
అతడి కంఠంలో ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు వచ్చిన చిన్న మార్పుని బృహస్పతి గుర్తించాడు. మంగళ్ సింగ్ కి నిజంగా మొదటి వివాహం జరిగిందో లేదో శ్రీహర్షకి కూడా తెలీదని అతడివేపు చూస్తుంటే బృహస్పతికి అర్ధమైంది.
"నాకు ఆ విషయాలేవీ గుర్తులేవు" అన్నాడు.
"మీ మొదటి భార్యని కలుసుకోవడమన్నది చిన్న విషయం ఏమీకాదే!"
బృహస్పతి మాట్లాడలేదు.
"పోనీ మీకు వివాహం జరిగిందా, లేదా- ఆ విషయం చెప్పండి. అదేమీ చిన్న విషయం కాదుగా!"
తను కార్నర్ చేయబడుతున్నానన్న విషయం బృహస్పతికి అర్ధం అవుతోంది. ఇద్దరు మేధావులు చదరంగం ఆడుతున్నప్పటి పరిస్థితి ఇది! దీన్నిక్కడితో ఆపకపోతే ముందు ముందు చాలామందితో ఆడవలసిరావచ్చు. ఒకసారి అదృష్టవశాత్తూ గెల్చినా, తర్వాత ఓడిపోయే రిస్క్ వుంది.
"డాకూ మంగళ్ సింగ్ గురించి నేనేమీ మాట్లాడదల్చుకోలేదు. కేవలం ప్రజలకి సేవచేయడం కోసం నన్ను దేవుడు పంపించాడు అంతే!" అన్నాడు.
"మీరు ఓంఫట్ బాబా సహాయంతో జనాన్ని మోసం చేయడానికి రాలేదని మాకేమిటి నమ్మకం?"
"ఓంఫట్ బాబాకీ, నాకూ ఏ సంబంధమూ లేదు. నాకు గత జన్మ గుర్తుచేసి పునర్జన్మనిచ్చిన గురువుగా ఆయనంటే నాకు గౌరవం అంతే! మొదటిరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా వున్నానో, ఇప్పుడూ అలాగే వున్నాను. రాత్రిళ్ళు ఈ చెట్టుకిందే పడుకుంటున్నాను. గ్రామ ప్రజలు ఏర్పాటుచేసిన కనీస సౌకర్యాలు కూడా వాడుకోవడంలేదు. అది చాలదా నా నిజాయితీ నిరూపించుకోవడానికి?"
జనంలోంచి ఎవరో "మంగళ బృహస్పతికీ...." అని అరిచారు.
జయజయ ధ్వానాలు మిన్నుముట్టాయి. కెమేరాలన్నీ జనం వేపు తిరిగాయి.
తన ఇంటర్వ్యూ తప్పుదారి పడుతున్నట్టు విలేఖరి గ్రహించాడు.
"కానుకలూ, విరాళాల రూపంలో ప్రజల దగ్గరనుంచి మీరిద్దరూ చాలా సంపాదించారనీ, అందువల్లే మీనుంచి ప్రజలకి విముక్తి కలిగిస్తామనీ నక్సలైట్లు పోస్టర్లు అతికించారు. దీనిమీద మీ అభిప్రాయం ఏమిటి?"
"సర్వమానవ సమానత్వం గురించి నక్సలైట్ల పాలసీ, నా పాలసీ ఒకటే! వాళ్ళకి నా పట్ల శత్రుత్వం వుండడానికి అవకాశం లేదు. వాళ్ళు అడవుల్లో గడిపితే, నేను చెట్టుకింద గడుపుతున్నాను. అంతే తేడా!"
జనంలో కరతాళ ధ్వనులు తరంగాల్లా వ్యాపించాయి.
"అయితే మీకు ఏమీ సంపాదన లేదంటారు"
"నా దగ్గరేముంది, కట్టుకున్న బట్టలు తప్ప"
"కానీ వందకోట్ల విలువ చేసే నిధి ఎక్కడ వుందో మీకు తెలుసు."
"అది రాజా విక్రమ్ దేవ్ ది!"
"మరి బాబా తాలూకు...."
"ఆయన్ని ఇందులోకి లాక్కండి. ఆయనకీ నాకూ ఆర్ధిక వ్యవహారాల్లో సంబంధంలేదు."
"మరి పోలీసు సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? దొంగలకీ, నక్సలైట్లకీ భయపడి కాదా?"
"కాదు. ఆమె బాబా భక్తురాలు"
వింటున్న సరళరేఖ తన ప్రసక్తి వచ్చేసరికి ఉలిక్కిపడింది. ఆమె అడ్డుపడేలోగా ఇంటర్వ్యూ కొనసాగింది.
"భక్తురాలయితే శలవు పెట్టి స్వంత ఖర్చులమీద సామాన్య వ్యక్తిగా రావాలి."
"ఆ విషయం బాబాల దగ్గరికి వెళ్ళే ప్రధాన మంత్రులనీ, ప్రెసిడెంట్లనీ అడగండి. వాళ్ళు స్వంత ఖర్చులమీద వెళుతున్నారా?"
విలేఖరి కంగారుపడ్డాడు. ఎదుటివ్యక్తి సామాన్యుడు కాదని తెలుస్తోంది. చాలా సక్సెస్ ఫుల్ గా ఇంటర్వ్యూని పక్కదారి పట్టించాడు. అతణ్ణి అష్టదిగ్బంధనం చేయడంకోసమా అన్నట్టు బ్రహ్మాస్త్రం లాంటి ఒక ప్రశ్న చివరగా వేసాడు.
"డాకూ మంగళ్ సింగ్ గత చరిత్ర కాస్త ప్రజలకి చెప్పి, అసలయిన నిధి వివరాలు తెలియపరచకపోవడం- యమధర్మరాజు ప్రహసనం- ఇదంతా ఆలోచిస్తే ఇందులో తర్కానికి నిలబడేది ఏదీ లేదని అనిపిస్తోంది. ఇప్పుడు మీరు చేసిందే మరెవరైనా చేసి, ఇలాంటి కట్టుకథ అల్లవచ్చుకదా! దేవుణ్ణి చూసి వచ్చానని మీరు అంటున్నదానికి ఏదయినా ఒక తార్కాణం చెప్పగలరా?"
అక్కడ చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం వ్యాపించింది. అతడేం చెప్తాడా అన్నట్టు జనమంతా ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఆ సవాల్ ఒప్పుకుంటున్నట్టు "సరే. నేను భగవంతుడ్ని ప్రార్థిస్తాను. నా శక్తి వంచన లేకుండా ఆయన్ని వేడుకుంటాను- ప్రజలకి ఓ తార్కాణాన్ని చూపించమని! నా మనవి ఆలకిస్తే సరేసరి.... లేకుంటే, నన్ను ఇన్ని ప్రశ్నలు వేసిన ఈ ప్రజల్ని ఉద్దరించడం అనవసరం అని ఆ దేవుడు అనుకుంటే నాకు సహాయం చేయడంతే" అన్నాడు.
విలేఖరి పెదవుల మీద సన్నటి చిరునవ్వు కదలాడింది. తను వచ్చిన పని నెరవేరినట్టు అనిపించింది. జనం నిరసన ఎదుర్కోక ముందే ఆరోగ్యకరంగా అక్కడినుంచి బయట పడడం కోసం బృహస్పతి - నె పాన్నంతాదేవుడి మీదకి నెట్టేస్తున్నాడని అర్ధమవుతోంది. ఇక బిచాణా ఎత్తుకుని వెళ్లిపోవడం మాత్రమే మిగిలింది. అంతా నిశ్శబ్దంగా వేచి ఉన్నారు. ఆ నిశ్శబ్దంలోంచి బృహస్పతి నెమ్మదిగా లేచి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పూజాసామాగ్రి వుంది. పాలూ, పళ్ళూ, పూజాద్రవ్యాలూ, అగరొత్తుల పొగా....
అతడు వంగి పాలపాత్ర చేతిలోకి తీసుకున్నాడు. తూర్పు వైపు తిరిగి భగవంతుణ్ణి ప్రార్ధించాడు. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు విప్పాడు.
ప్రజలు నిశ్చేష్టులై చూస్తున్నారు. విలేఖరి ఊపిరి బిగపట్టాడు. శ్రీహర్ష, హనుమంతరావు, చివరికి సరళరేఖ కూడా ఉద్విగ్నతతో చేష్టలుడిగి నిలబడ్డారు. కేంద్రమంత్రితో పాటు వచ్చిన ఆయన భార్య చేతులు జోడించి దేవుడికి నమస్కారం చేస్తోంది.
అప్పుడొక అద్భుతం జరిగింది.
బృహస్పతి పాలగిన్నె వినాయకుడి తొండం దగ్గర పెట్టగానే గిన్నెలో పాలు క్రమంగా అదృశ్యమవసాగాయి. వినాయకుడు పాలు తాగడం ప్రారంభించాడు!
మొదట్లో కొంచెంసేపు అక్కడున్న వారికి జరుగుతున్నదేమిటో అర్ధం కాలేదు. కేవలం దగ్గరగా వున్న వారికి మాత్రమే ఆ దృశ్యం స్పష్టంగా కనపడింది. మొదట్లో.... వాళ్ళు తమ కళ్ళను తామే నమ్మలేదు. కానీ తర్వాత ఎదుటి దృశ్యాన్ని చూస్తూ అవాక్కయి చేష్టలుడిగి నిలబడిపోయారు.
విఘ్నేశ్వరుడు పాలు తాగుతున్నాడు!!
తొండంతో కొద్దికొద్దిగా గిన్నెలో పాలు పీల్చుకుంటున్నాడు. దేవుడు ఉన్నాడని నిరూపించడానికీ, హేతువాదుల ఆటకట్టించడానికీ విఘ్నేశ్వరుడు స్వయంగా పూనుకున్నాడు!!!