Previous Page Next Page 
అష్టావక్ర పేజి 19


    "ఏడువు గౌరీ... ప్లీజ్... గుండెలు తేలికయ్యేలా ఏడువు".

    ఆమె కదిలే శిలాప్రతిమలా వుంది. ఆమె కళ్ళు గాజుగోళాల్లా వున్నాయి. చూపులు ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నాయి.

    దాదాపు మూడు రోజుల్నుంచి ఆమె అలాగే వుంది.

    దుఃఖం లేదు.

    వేదన లేదు.

    ఆమెనే గమనిస్తున్న సిద్ధార్థ వ్యాకులతతో భృకుటి ముడిచాడు. ఒంటరిగా వుంచితే ఆమె సర్దుకుంటుందని తలచాడు. కానీ ఆమెలో ఈ పరిణామం అతడికి భయంగా వుంది.

    బయట ఇన్ స్పెక్టర్ మాట్లాడుతున్నాడు.

    బాత్ రూమ్ లోంచి ఎంతసేపటికి బయటకి రాకపోవటంతో ఇద్దరు నౌకర్లు తలుపులు బ్రద్ధలుకొట్టి చూస్తే ఏముంది? రక్తపు మడుగులో భవానీశంకరం పడి వున్నాడు. కాలుజారి పడటంతో క్లీనర్ తాలూకు ఊచ డొక్కలో గుచ్చుకుని వుంది.

    -ఇదీ వారు చెప్పింది.

    ఇన్ స్పెక్టరు మిగతా ఇద్దరు నౌకర్ల దగ్గరా స్టేట్ మెంట్లు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరూ మాట పొల్లుపోకుండా, తొణక్కుండా, ఒకేలా దీన్ని చెప్పారు. బ్లాక్ స్కెలిటన్స్ తొణకరు!

    ఇన్ స్పెక్టరు వెళ్ళిపోతూ సిద్ధార్థని కూడా ఒకటి రెండు ప్రశ్నలు వేశాడు. సిద్ధార్థ అన్యమనస్కంగా సమాధానం చెప్పాడు. అతడి మనసంతా భార్య గురించి ఆలోచనలతో నిండి వుంది.

    ఒకరోజు గడిచేసరికి అతడికో విషయం అర్ధమైంది. కేదారగౌరిని ఈ వాతావరణంలో వుంచితే మారదు. ఇది నిశ్చయంగా ఒక రకమైన హిస్టీరియాకి దారితీస్తుంది.

    ఆ రోజే అతడు భార్యని తీసుకుని పల్లెకి వచ్చేశాడు. మిగతా పన్లన్నీ మానేసి ఆమెతోనే వుండేవాడు. ఆమెని తిరిగి మామూలు ప్రపంచంలో పడెయ్యటానికి శాయశక్తులా ప్రయత్నించసాగాడు.

    కానీ ఆమె మారలేదు. ఒక రాతిబొమ్మలా వుండిపోయింది.

    చాలామంది మొగవాళ్ళలాగే అతడికి ప్రేమని ప్రకటించటం తెలీదు. అంత భాష రాదు. కానీ ప్రేమలో నిజాయితీ వున్నప్పుడు దానికి భాషగానీ, అందమైన మాటలు గానీ అవసరం లేదు. అతడు ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ లాలనగా అన్నాడు.

    "గౌరి! నేనూ నీలాగే చిన్నప్పటినుంచీ ఒంటరిగాణ్ణి. ఎవరూ దగ్గిరకి రానిచ్చేవారు గాదు- ఒక్క అమ్మ తప్ప!! అందుకని నీ బాధ అర్ధం చేసుకోగలను. మన మిద్దరమూ అందవికారులమే. ఇద్దరమూ ఈ అందమైన ప్రపంచానికి అక్కర్లేని వాళ్ళమే! ఎవరైనా కొద్దిగా ఆప్యాయత చూపిస్తే ఎలా కరిగిపోతామో నాకు తెలుసు. నీకు అలా చూపించింది నీ తండ్రి! ఆయన పోవటం నీకెంత శూన్యాన్ని కలిగిస్తుందో నేను అర్ధం చేసుకోగలను. కానీ ఈ కారణం వల్ల నువ్వు నాకు దూరమైతే నేను భరించలేను. అయ్యో! నీకెలా చెప్పాలి?... గౌరీ నేను అంత తెలివైన వాడిని కాను. నీ తండ్రిలాగా జీవితపు అనుభవంతో నీ మార్గదర్శిని కాలేను. కానీ నాకు చేతనైనంతలో నీకు ఏ లోటూ రాకుండా చూసుకోగలనని ఎలా నమ్మించను? గౌరీ... ఈ చేతులు చూడు, ఇవి అంత అందమైనవి కావు. కానీ నిన్ను రక్షించటానికీ, కోటలా నీ చుట్టూ నిలబడటానికీ, ఈ ప్రపంచంలో దేన్నించయినా సరే నిన్ను కాపాడటానికీ ఇవి ఎంత బలంగా వున్నాయో చూడు. ఇన్ సెక్యూర్ గా ఫీలవకు గౌరీ! అదే నాక్కావలసింది. నన్ను నమ్ము. ప్లీజ్ నన్ను నమ్ము..."

    అప్పుడొచ్చింది ఆమెకి దుఃఖం.

    ఆనకట్ట తెగగానే సుడులు తిరిగే నది ఒక్కసారిగా ప్రవహించినట్టు. ఆమె మనసులో అప్పటివరకూ కరడు కట్టుకుని వున్న దుఃఖం ఒక్కసారిగా కనులవెంట బయటకు దూకింది. అతడి అరచేతులను తన ముఖానికి ఆన్చుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అతడామెని ఓదార్చే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆమె ఎంత ఏడిస్తే అంత మంచిదన్నట్టు అలానే ఆమె ముంగురులను సవరిస్తూ వుండిపోయాడు. ఆమె రోదన వెక్కిళ్ళలోకి దిగింది. "మీకు...మీకు తెలీదు. నేను నాన్నని ఎం...త ప్రేమించానో...నాకు...నాకు ఆయనొక్కడే... ఆయనే గురువు... దైవం... అన్నీ. నాన్నా...నేనూ...ఒక మంచి స్నేహితుల్లాగా..."

    ఇంకా వెక్కిళ్ళ మధ్య మాట పూర్తి కాలేదు.

    గుండెల మధ్య సన్నటి నొప్పి బయల్దేరి వళ్ళంతా వ్యాపించినట్టయింది. ఆమె తల అతడి వళ్ళో వాలిపోయింది. "గౌరీ..గౌరీ" అన్నాడు.

    ఆమెలో చలనం లేదు.

    అతడు కంగారుగా చుట్టూ చూశాడు. అప్పటికే చీకట్లు బాగా అలుముకున్నాయి. ఎక్కడా మనుష్య సంచారం లేదు. అతడు కంగారు పడ్డాడు. చుట్టూ పొలాలు. దూరంగా పల్లెలో లైట్లు మినుక్కు మినుక్కు మంటున్నాయి. కీచురాళ్ళ అరుపులు తప్ప మరేమీ వినబడటంలేదు.

    అతడు కొద్దిగా నీళ్ళు అరచేతిలోకి తీసుకుని ఆమె మొహాన్ని తడిచేస్తూ మళ్ళీ ఇంకొకసారి "గౌరి" అని పిలిచాడు.

    ఇంతలో దూరంగా రెండు లైట్లు కనిపించాయి.

    ఏదో కారు వస్తూంది.

    సాధారణంగా ఆ పల్లెకి కార్లు రావు. వస్తూన్నది రాకేషేమో అనుకున్నాడు. చెయ్యి ఎత్తి ఆపు చేశాడు.

    కానీ కార్లో వున్నది మరో ఇద్దరు వ్యక్తులు! వంశీకృష్ణని రంగప్రసాద్ డిన్నర్ కి తీసుకువస్తున్నాడు.

    సిద్ధార్థ జరిగింది చెప్పాడు. 'అరెరె' అనుకుంటూ ముగ్గురూ పదడుగులు వేశారు. ఆమె కాస్త తేరుకుంది. అయినా నీరసంగా వుంది. సిద్ధార్థ ఆమెని జాగ్రత్తగా కారు ఎక్కించాడు. కారు కదులుతూంటే రంగప్రసాద్, వంశీకృష్ణని పరిచయం చేశాడు.

    పది నిముషాల్లో కారు రంగప్రసాద్ క్లినిక్ ముందు ఆగింది. ఇంజెక్షన్ ఇవ్వటం కోసం గౌరిని లోపలికి తీసుకెళ్ళాడు. వంశీకృష్ణ, సిద్ధార్థ ఇద్దరే మిగిలారు. బల్లకోడుకు చిన్న తెల్ల కుక్కపిల్ల కట్టేసి వుంది.

    "ఏడుస్తూ సడెన్ గా మైకంలోకి జారిపోయింది" అన్నాడు సిద్ధార్థ ఆందోళనగా. "అదృష్టవశాత్తూ మీరు కనబడ్డారు".

    "ఎగ్జయిట్ మెంట్ ఎక్కువ అయివుంటుంది. కంగారు పడనవసరం లేదు" అన్నాడు వంశీకృష్ణ. "...మీరు కూడా మాతో భోజనం తీసుకోండి".

    "నో...థాంక్స్".

    ఈ లోపులో డాక్టర్ లోపల్నుంచి వచ్చాడు. అతడి మొహంలో చిరునవ్వు కదలాడుతుంది. "కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ సిద్ధార్థ! మీరు తండ్రి కాబోతున్నారు" అన్నాడు.

    సిద్ధార్థకి మొదట ఒక క్షణం అర్ధం కాలేదు. అవగానే కేదారగౌరి కోసం లోపలికి తొంగిచూశాడు. ఆమె లోపల్నుంచి నెమ్మదిగా నడిచి వస్తూంది. ఆమె మొహంలో కొత్త సిగ్గులు నాట్యం చేస్తున్నాయి.

    ఆమె దగ్గిరకి వస్తూండగా, వున్నట్టుండి బల్లకు కట్టిన కుక్క చెంగున ఎగిరింది. ఎవరో చెర్నాకోలాతో కొట్టినట్టు హృదయ విదారకంగా ఏడ్చింది.

    దాన్నెవరూ పట్టించుకోలేదు.

    ప్రసాద్ నవ్వుతూ "తను వెళ్ళిపోయిన బాధని మరిపించటానికి మీ నాన్నగారే తిరిగి పుడుతున్నారేమో" అన్నాడు.

    చాలా కాలానికి ఆమె పెదాలమీద చిరునవ్వు కదలాడటం సిద్ధార్థకి సంతృప్తి నిచ్చింది.

    "థాంక్స్ డాక్టర్ థాంక్యూ" అని గౌరిని తీసుకుని బయటకు నడిచాడు. మెట్లు దిగుతూంటే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమెకూడా ఏదో ఒక అలౌకికావస్థలో వున్నట్లు అతడి భుజంమీద తల ఆన్చింది.

    మొన్న మొన్నటివరకూ చిన్నపిల్ల- నిన్న పెళ్ళయింది- ఈ రోజు తల్లి కాబోతూంది. డాక్టర్ గారన్నట్టు తన కడుపున పుట్టే తన తండ్రి....ఇచ్చిన ఆప్యాయతనంతా రంగరించి ఉగ్గుపాలతో తిరిగి పుచ్చుకోవటానికి..... ఆ భావనతో అప్రయత్నంగా ఆమె వళ్ళు పులకరించింది- భర్తకి మరింత దగ్గిరగా జరిగి నడవసాగింది.

    ఆ దంపతులిద్దరూ చీకట్లో తమ ఇంటివైపు సాగిపోతున్నారు.

    దూరంనుంచి కుక్క అరుపు మాత్రం వికృతంగా ఇంకా వినిపిస్తూనే వుంది.


                         15


    "ఊ! చెప్పండి ఇక" అన్నాడు వంశీకృష్ణ సిద్ధార్థ, గౌరి వెళ్ళిపోయాక.

    భోజనాలు ముగించి ఇద్దరూ బయట వరండాలో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. వెన్నెల లోపలికి పడుతూంది.

    "ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ మీద నాకింకా అనుమానాలు అలానే వుండిపోయాయి".

    వంశీకృష్ణ నవ్వుతూ "మీ తండ్రిగారు ఈ రంగంలో ఎంతో కృషి చేశారు. అటువంటప్పుడు మీకు ఈ రంగంలో ఇన్ని అనుమానాలు వుండటానికి వీల్లేదే. అయినా మీ మాటల బట్టి చూస్తూంటే మీరు ఆ ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ కి బద్ధ వ్యతిరేకులుగా కనిపిస్తూంది" అన్నాడు.

    "వంశీకృష్ణా" అతడి మాటల్ని మధ్యలో ఆపుచేస్తూ అన్నాడు రంగప్రసాద్. "వీర్యకణాల్లో నూటికి నూరుపాళ్ళు నిర్జీవంగా వుంటే తప్ప, ఒక పురుషుడు 'నిజమైన పురుషుడు' కాదని ఎలా నిర్ణయిస్తారు మీరు? ఉదాహరణకి మీ దగ్గరికి ఒక దంపతులు వచ్చారనుకోండి. స్త్రీ సంపూర్ణ ఆరోగ్యవతి. పురుషుడిని పరీక్ష చేస్తారు. పదిశాతం మాత్రమే జీవకణాలుంటాయి. ఏం సలహా ఇస్తారు? వారికి సంతానం కలగడానికి నిజానికి ఆ పదిశాతం చాలు! కానీ ఛాన్సు తక్కువ. ఇంకొక పురుషుడి వీర్యాన్ని ఎక్కించటం కన్నా కుర్రవాడిని దత్తత చేసుకోవటం మంచిది కాదంటారా? సో దట్... తరువాత తరువాత ఆమె గర్భవతి అయితే, అంతకుముందే ఆమె చెడిపోయిందన్న భావన భర్తకి కలగదు".

    "చెడిపోవటమా? ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ లో చెడిపోవటం అన్న ప్రశ్నేలేదు రంగప్రసాద్!!"

    "ఈ వాదనే నిజమైతే సంవత్సరంవరకూ పిల్లలు పుట్టని దంపతులందరికీ, స్త్రీలో ఏ లోపమూ లేకుండా వుండి వుంటే A.I.D. చెయ్యాలి".

    "ఎందుకు మీరీ అభిప్రాయానికి వచ్చారు డాక్టర్ రంగప్రసాద్?"

    "ఈ దేశపు శీతోష్ణస్థితిలో ఒక ఆరోగ్యవంతుడైన పురుషుడు భార్యతో, తన వివాహం జరిగిన మొదటి సంవత్సరంలో సుమారు 915 సార్లు (3 x (365- (12x5)) కలుస్తాడనుకుంటే, అందులో నిశ్చయంగా 36 రోజులు (12x3) ఫెర్టిలిటీ పీరియడ్ వుంటుంది కాబట్టి, ఆ ప్రోబబులిటీ (1108:915) లో గర్భం రాకపోతే ఇక రాదన్న మాటేగా".

    "మైగాడ్! చాలా దారుణమైన వాదన ఇది".

    "నైతిక విలువల్ని మర్చిపోయి, ప్రకృతిని సైన్సులోకి మార్చింది మీరేగా-"

    వంశీకృష్ణ విస్మయంతో రంగప్రసాద్ వైపు చూసి, "ఎందుకు మీరింత వ్యతిరేకంగా A.I.D. గురించి మాట్లాడుతున్నారు, పైగా డాక్టరై వుండి-" అన్నాడు. అతడి కంఠంలో కాస్త కోపం కాసింత విసుగు మిళితమై వుంది.

    అప్పుడు బయట పడ్డట్టు- "ఎందుకంటే, అది ఒక చిన్న కుటుంబాన్ని సర్వనాశనం చేసింది కాబట్టి! ముగ్గురు వ్యక్తుల పచ్చటి జీవితాలతో ఆడుకుంది కాబట్టి! అంతే"! ఆవేశంగా అన్నాడు రంగప్రసాద్.

    "ఏమిటి ప్రసాద్ మీరంటున్నది? ఆ ముగ్గురెవరు!" అని అడిగాడు వంశీకృష్ణ అర్ధం కానట్టు.

 Previous Page Next Page