Previous Page Next Page 
అష్టావక్ర పేజి 18


    ఆ సమయంలో కూడా ఆయనకి ఆనందంగానే వుంది. తన కూతురు చక్కటి నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పాముని వివాహం చేసుకోకుండా వివేకమైన పని చేసింది. అదే ఆనందం.

    కానీ ఆ ఆనందాన్ని కూడా రాకేష్ ఆయనకి మిగల్చలేదు.

    "ముసలోడా!" అన్నాడు వికటంగా. "నువ్వన్నావే, శాడిస్ట్ అని. నిజమే. కానీ దానికన్నా మంచి పదం మరొకటి వుంది. స్కిజోఫ్రెనియా అని. అవును. నేను సైకోపాత్నే. పైకి సభ్య సమాజంలో గౌరవప్రదమైన మనిషిని. కానీ అంతర్గతంగా నువ్వన్నా, నీ కూతురన్నా నాకు అపరిమితమైన అసహ్యం. నీ కూతురిమీద ఇంతకన్నా దారుణంగా కసి తీర్చుకోబోతున్నాను- భవానీశంకరం!! జాగ్రత్తగా విను. ఇందాక నువ్వన్నావు- ఇంతటి మానసిక వ్యాధిని నువ్వు ఎలా తట్టుకోగలిగావు అని. నిజమే.... ఏ హషిష్ గానీ, మరే డ్రగ్ కానీ దీన్ని తగ్గించలేదు. హహ్హ.... నేను చాలా ఆరోగ్యంగా వున్నాను కదూ ఇప్పుడు. కారణం ఏమిటో తెలుసా? ఉస్సోక్.... అవును ఉస్సోక్!"

    భవానీశంకరం కన్నార్పకుండా రాకేష్ నే చూస్తున్నాడు. టోటల్ పర్వెర్షన్- అవును. పూర్తి ఇన్ సేనిటీ!!

    "ఉస్సోక్ ప్రభువైన కుట్టిసైతాన్ అష్టావక్రుడి రూపంలో ఈ భూమ్మీదకు రాబోతున్నాడు. మేమతడికి సాయం చేస్తాం- పుట్టగానే తల్లిని చంపుతాడు. పుట్టినరోజే తండ్రిని చంపుతాడు. పెద్దవాడై- క్షుద్రుల సాయంతో రాజ్యం ఏలతాడు. ముసలోడా! నీ గుండె పేలిపోయే వార్త చెబుతున్నాను. విను! ఆ అష్టావక్రుడు పుట్టేది నీ కూతురి కడుపునే.... అర్ధమైందా? నన్ను కాదని ఆ సిద్ధార్థగాడిని చేసుకున్న నీ కూతురిమీద ఎంత స్వీట్ గా కసి తీర్చుకున్నానో- అర్ధమైందా? ఎంజాయ్! ఎంజాయ్ ఇట్ భవానీ... హహాహా".

    కార్పెట్ రక్తంతో తడుస్తూంది. ఆఫీసు టేబిల్ పక్క నేలమీదకు వాలిపోయి వున్నాడు ఆయన.

    పోయే రక్తంతోపాటూ ప్రాణం కూడా కొద్ది కొద్దిగా పోతూంది. క్షణాల్లో వుంది. పది... తొమ్మిది.... ఎనిమిది.

    ఆయనకి తన కూతురు జ్ఞాపకం వచ్చింది. ముగ్ధంగా- అమాయకంగా- ప్రపంచం అంతా మంచివాళ్ళేనని నమ్మే నిర్మాల్యతతో...

    ఏడు... ఆరు.... అయిదు.... నాలుగు.... సిద్ధార్థ గుర్తొచ్చాడు. తన అల్లుడిలో ఏదో తెలియని శక్తి వుందని ఆయన ఎప్పుడో గుర్తించాడు. ఈ పాముని తన అల్లుడు కనిపెట్టగలడా? కనిపెట్టీ ఏం లాభం? చేతులు కాలాక....

    మూడు... రెండు... ఒకటి.

    ఆయన ప్రాణం పోయింది.

    రాకేష్ చాలాసేపు అలాగే నిశ్చలంగా వున్న ఆ శరీరాన్ని చూస్తూ వుండిపోయాడు. తరువాత తలుపు దగ్గిరగా వేసి బయటకు నడిచాడు.

    భవానీశంకరం ఆఫీసు టేబుల్ పై ప్లేట్ క్రింద డిక్టాఫోన్ వుంది. తన సెక్రెటరీకి ఆయన అందులోనే డిక్టేషన్ యిస్తాడు. దానికే ఒక టేప్ రికార్డర్ వుంది. రాకేష్ పొదగానే ఆయన క్రిందికి కూలిపోతూ వుండగా ఆ టేబుల్ ని ఆసరాగా పట్టుకున్నాడు. టేప్ రికార్డర్ మెట్లు వ్రేళ్ళకి తగిలినయ్. 'ఆన్' చేసి కార్పెట్ మీదకి జారిపోయాడు.

    రాకేష్ ఆ గదిలోంచి వెళ్ళిపోయిన చాలాసేపటివరకూ టేపు తిరుగుతూనే వుంది. ఆ తరువాత 'టప్' మన్న శబ్దంతో అది ఆగిపోయింది.


                                                        14


    "ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ ఒక స్త్రీ మీద మొట్ట మొదటిసారిగా పద్దెనిమిదో శతాబ్దపు చివర్లో ప్రయోగింపబడినది. జాన్ హంటర్ అనే ఒక డాక్టర్, పురుషుడి మాస్టర్బేషన్ ద్వారా వెలువడిన స్పెర్మ్ ని చిన్న సిరెంజిలోకి ఎక్కించి దాన్ని స్త్రీలోకి ప్రవేశింపచేయటం వల్ల ఆమెకి గర్భప్రాప్తిని సాధించగలిగాడు. సాధారణంగా, భర్త యొక్క అవయవం కావలసింత గట్టితనాన్ని పొందలేకపోయిన సందర్భాల్లో, దాన్ని భార్యలోకి ప్రవేశింపచేయటం కష్టం కాబట్టి, అతడి వీర్యాన్ని ఆమెలోకి ఇంజెక్ట్ చేయటం - దీన్ని A.I.H. అంటారు. (Artificial Insemination by Husband)  కానీ ఇటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఎన్నో కేసుల్లో కేవలం భర్త యొక్క వంధ్యత్వం వల్ల, అతడి వీర్యకణాల్లో పిల్లల్ని పుట్టించే శక్తి లేకపోవటం వల్ల స్త్రీలు గొడ్రాళ్ళుగా వుండిపోవటం సంభవిస్తుంది. అందువల్లే A.I.H. కన్నా A.I.D. తొందర్లో వ్యాప్తికి వచ్చింది. A.I.D. అంటే Artificial Insemination by Donor. భార్యాభర్తలకి తెలియని మూడోవ్యక్తి యొక్క వీర్యాన్ని దంపతుల అనుమతితో భార్యలోకి ప్రవేశపెట్టటాన్ని A.I.D. అంటారు".

    చెప్పటం ఆపి, డాక్టర్ వంశీకృష్ణ హాలువైపు చూశాడు. దాదాపు పాతికమంది డాక్టర్లు కూర్చుని వున్నారు.
   
    ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అది. అందులో ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ సెంటర్ కొత్తగా స్థాపించబడింది. ఆ రోజు ఆ విషయంమీద మాట్లాడటానికి డాక్టర్ వంశీకృష్ణ ఆహ్వానింపబడ్డాడు. ఆ ముప్పై అయిదేళ్ళ యువకుడు భారతదేశపు జన్యుశాస్త్రంలో అగ్రగామిగా ప్రస్తుతం పరిగణింపబడుతున్నాడు.

    "తమకు పిల్లలు లేరన్న అసంతృప్తి రోజు రోజుకీ పెరిగి, ఏదో విధంగా పిల్లలు కలిగితే చాలన్న భావం దంపతుల్లో పెరుగుతుంది. తన అసమర్ధతకీ, భార్య అసంతృప్తికీ మధ్య భర్త మానసికంగా నలిగిపోతాడు. హద్దులు దాటడానికి నైతికధర్మం అడ్డువస్తుంది. ఇదిగో సరీగ్గా ఈ పరిస్థితుల్లో కనుక్కోబడింది కాబట్టే A.I.D కి వెంటనే ప్రాచుర్యం లభించింది. ఇందులో ఒక 'మంచి' ఏమిటంటే, తన భార్యకి ఎక్కించబడిన వీర్యం ఏ పురుషుడిదో భర్తకు గానీ, తన బిడ్డకి తండ్రి ఎవరో భార్యకిగాని ఎటువంటి పరిస్థితులలోనూ తెలిసే అవకాశం లేదు. 1957 సమయానికే ఒక్క అమెరికాలోనే 1,00,000 పైగా ఈ విధంగా పుట్టిన పిల్లలున్నారంటే- ఇది ఎంత తొందరగా ప్రజలచే 'ఒప్పుకోబడిందో' అర్ధమవుతుంది. లండన్ లో కొంతమంది డాక్టర్లు కేవలం ఇదే వృత్తిగా పెట్టుకుని జీవిస్తున్నారు. వారి దగ్గిర రకరకాల పురుషుల వీర్యకణాలు వుంటాయి. (కాని ఎటువంటి పరిస్థితిలోనూ 'దాత' చిరునామాగానీ, పేరు గానీ వుండవు) భార్యాభర్తలు తమకి కావలసిన బిడ్డని ఒక విజ్ఞానవంతుడి ద్వారాగానీ, క్రీడాకారుడి ద్వారాగానీ, తమకు ఎలా కావలసివస్తే అలా పొందవచ్చు. జపాన్, టోక్యో క్లినిక్ లో సంవత్సరానికి కొన్ని వందలమంది ఇలా పిల్లల్ని పొందుతున్నారు.

    పురుషుడి వీర్యాన్ని 'ఫ్రీజ్' చేసే పద్ధతి కనుక్కోబడిన తర్వాత, ఈ పని మరింత సులువైంది. నైట్రోజన్ ద్రవం ద్వారా మైనస్ 196.5 డిగ్రీల దగ్గిర కోడిగుడ్డు సొన, గ్లిజరాల్, ఆన్టీ బయోటిక్స్ కలిపి వుంచితే వీర్యం శాశ్వతంగా జీవంతో వుంటుందని... నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం అంటే- వంద సంవత్సరాల తర్వాత అమెరికాలో ఒక దంపతులు తమకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తాలూకూ సంతానం కావలసి వుంటే దాన్ని పొందవచ్చునన్నమాట. అఫ్ కోర్స్- బ్రతికున్నప్పుడు నెహ్రూ దాన్ని ఇవ్వటానికి వప్పుకుని వుంటే..."

    సభలో నవ్వులు.

    "ఈ పద్ధతివల్ల మరికొన్ని సమస్యలు తొలగిపోయాయి. తన భార్యకు పుట్టిన కొడుకు తాలూకు తండ్రి ఈ భూమ్మీదే ఎక్కడో వున్నాడన్న భావంకన్నా, ఎప్పుడో చనిపోయాడన్న భావం మగవాడికి సంతృప్తినిస్తుంది. కానీ దీనితో వచ్చిన సమస్య ఏమిటంటే- ఫ్రెష్ వీర్యం పని చేసినంత చురుగ్గా ఈ దాచివుంచిన వీర్యం పనిచేయదు. సగటున 19 సార్లు ఎక్కిస్తే ఒకసారి స్త్రీ గర్భం దాల్చే వీలుందని స్టాటిస్టిక్స్ చెపుతున్నాయి. నా కిద్దరు పిల్లలు. నేను వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాక వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? అని అడిగే పురుషులకి కూడా ఇది సమాధానం చెపుతుంది. ఆపరేషన్ కి ముందే అతడి వీర్యాన్ని కావలసినంత తీసుకుని స్టోర్ చేయటం ద్వారా ఈ సమస్యని చాలా సులభంగా పరిష్కరించవచ్చు. దీనియొక్క విలువని మనం ఇంకా పూర్తిగా, ముఖ్యంగా మన దేశంలో గుర్తించకపోవటం మన దురదృష్టం!!

    వంశీకృష్ణ తన ఉపన్యాసం కొనసాగించాడు.

    "మన భారతదేశంలో మనుష్యులకి నైతిక విలువలపట్ల నమ్మకం ఎక్కువ. అంటే విలువకి గౌరవం ఇస్తారు అని కాదు. చేసే వెధవ పన్లన్నీ చేస్తూ దానికి నైతిక విలువల ముసుగు వేసుకుంటారు. (నవ్వులు) మన దేశంలో ఈ కృత్రిమ గర్భధారణ మీద ప్రత్యేకంగా న్యాయ సూత్రాలు లేవు. కానీ భగవాన్ వర్సెస్ మహేష్ అన్న కేసులో - కోర్టు చాలా దారుణమైన జడ్జిమెంట్ ఇచ్చింది. భర్తకి వంధ్యత్వం వుండి, అతడి అనుమతితో భార్య కృత్రిమంగా గర్భం ధరిస్తే బిడ్డ - 'అక్రమ సంతానం' గా నిర్ణయించింది. అంతేకాదు, భర్త వీర్యంలో పిల్లల్ని సృష్టించగలిగే శక్తి వుండీ కేవలం అతడి అవయవం గట్టిపడకపోవటం వల్ల రతి అసాధ్యమై, మాస్టర్బేషన్ ద్వారా అతడి వీర్యాన్ని బయటకు తీసి భార్యలోకి ఎక్కించినప్పుడు పుట్టిన బిడ్డ కూడా 'అక్రమ సంతానమే' అని కోర్టు అభిప్రాయపడింది. అది చాలా దారుణం. డాక్టర్లమైన మనం దీనికి వ్యతిరేకంగా పోరాడాలి! అలా పోరాడినవాడు హరిహరరావు! దేముడు ఒక మనిషికి ఏర్పర్చిన అంగవైకల్యాన్ని తల్చుకుని ఆ మనిషి జీవితాంతం బాధపడనవసరం లేదనీ, వున్నంతలో సంతృప్తి చెందవచ్చుననీ ప్రచారం చేశాడాయన. ఆయన మరణం భారతదేశానికేకాక జన్యు శాస్త్రానికే తీరని లోటు, ఆయన సంస్మరణం కోసం రెండు నిముషాలు మౌనంగా ప్రార్ధించటంతో ఈ సభ ముగుస్తుంది".

    సభ్యులు లేచి నిలబడ్డారు.

    తరువాత వందన సమర్పణ జరిగింది.

    డాక్టర్ వంశీకృష్ణ వేదిక దిగి తోటి డాక్టర్లని కలుసుకున్నాడు. టీ తాగుతూ వాళ్ళు పిచ్చాపాటీ మాట్లాడుకోసాగారు. అప్పటివరకూ సభలో చివరి కుర్చీలో కూర్చుని వున్న ఒక వ్యక్తి వంశీకృష్ణ దగ్గిరకు వచ్చి "నాకు కొన్ని అనుమానాలున్నాయి. మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను" అన్నాడు.

    వంశీకృష్ణ చిరునవ్వుతో "తప్పక అడగండి" అన్నాడు.

    "ఉహూ ఇప్పుడు కాదు. మీరింకో రెండు రోజులు వుంటారుగా. ఒక రాత్రి మా ఇంటికి డిన్నర్ కి రావాలి. తీరిగ్గా మాట్లాడుకోవచ్చు".

    "మీరు?"

    "ఏ హరిహరరావు గురించి ఇప్పటివరకూ మీరు మాట్లాడారో ఆ డాక్టర్ గారి అబ్బాయిని నేను".

    వంశీకృష్ణ దిగ్భ్రాంతుడై అతడివైపు చూసి, "మరింత పెద్ద ఫంక్షన్ మీ తండ్రిగారి నిమిత్తమై జరుగుతూంటే మీరు వేదిక మీద కాకుండా వెనుక ఎక్కడో కూర్చున్నారేమిటి" అన్నాడు. అతడి కంఠంలో విస్మయం కొట్టిచ్చినట్టు కనపడింది.

    "డాక్టర్ హరిహరరావుగారి కొడుకుని నేనని ఇక్కడ చాలా మందికి తెలియదు. అసలు ఇలా ఒక విగ్రహం ఆవిష్కరణ జరగటం మా తండ్రిగారికి కూడా యిష్టం వుండి వుండదు".

    "మీరెందుకో అనవసరంగా ఆవేశపడుతున్నారు".

    "లేదు, లేదు, నా కిటువంటివి యిష్టం లేదని చెపుతున్నానంతే- ఇంతకీ మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు డిన్నర్ కి? ఈ విషయమే కాదు, మరో ముఖ్య సమస్య కూడా మాట్లాడాలి. ఒక నాలుగైదు గంటలు నాతో గడపటానికి వీలవుతుందా?"

    "తప్పకుండా. డాక్టర్ హరహరరావుగారి కొడుగ్గా మీరంటే ఎంతో అభిమానం... ఎక్కడ మీ యిల్లు?"

    "ఇక్కడ కాదు, ఇరవై మైళ్ళు...కార్లో వెళ్ళాలి".

    "తప్పకుండా వెళదాం. అన్నట్టు మీరీ సెమినార్ కి వచ్చారంటే మీరూ డాక్టరే అయి వుండాలి".

    "అవును. డాక్టర్నే".

    వంశీకృష్ణ నవ్వుతూ, "ఇంతసేపట్నుంచీ మాట్లాడుకుంటున్నా మీ పేరు తెలుసుకోలేదు. చూశారా?" అన్నాడు.

    "నా పేరు ప్రసాద్. డాక్టర్ రంగప్రసాద్!"

                                           *    *    *    *

 Previous Page Next Page