Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 18


    "హలో ' అన్నాడు వులికిపాటుని అర్జంటుగా కప్పిపుచ్చుకుంటూ.
    "నేను గుర్తున్నానా?" చిరునవ్వుతో అడిగిందామె.
    "ఓ! లేకేం" మీ అంత అందమైన అమ్మాయిని ఎవరయినా మర్చిపోతారా?" తనూ నవ్వుతూ అన్నాడు.
    "ఆ రోజు నుంచీ ఎదురుచూస్తున్నాను - మళ్ళీ మీరు ఆ రోడ్ మీదే కనబడతారేమోనని."
    "మీరే కాదు! చాలా మంది అమ్మాయిలు ఇదే మాట చెప్పారు నాతొ. ఏదో స్పెషల్ ఎట్రాక్షన్ పవర్ వుండి ఉంటుంది."
    "మీ ఎట్రాక్షన్ పవర్ కాదు! దానిని ఆ ఆడపిల్లల తాలుకూ ఇడియో సింక్రసీ అంటారు."
    సురేష్ కి మతిపోయింది. మహా మొండి ఘటం యిది.
    "అంటే?"
    "ఇడియో సింక్రసీ అంటే తెలీదా?"
    "తేలిసినట్టు లేదు."
    తులసి నవ్వుతోంది.
    "క్షణ కాలం వూగించి వేసే తెలివితక్కువ తనం."
    "వండర్ పుల్! ఈసారి డిక్షనరీ చూడాల్సి వచ్చినప్పుడు మీ దగ్గర కొస్తాను."
    "షాపులో కొస్తారా?" అడిగిందామె.
    "ఆ బొమ్మ తప్పకుండా తీసుకుంటాను. ఇప్పుడు మాత్రం కాదు."
    "దాని కోసం కాదు."
    "మరి?"
    "ఆ రోజు మీరు దొంగతనంగా తీసుకోపోయిన బుద్దుడి బొమ్మ గురించి డిస్కస్ చేయటానికి."
    సురేష్ నవ్వేశాడు.
    "అదా! ఎలా కనుక్కున్నారు?"
    "మా బాస్ మర్నాడు నా జీతంలో ఆ బొమ్మ ధర కట్ చేస్తానని చెప్పినప్పుడు."
    "నిజంగా మీ బాస్ జీనియస్."
    "మరి షాపులోకొస్తారా?"
    "అవసరం లేదు. రేపు తెచ్చిస్తేస్తాను. కానీ మీ బాస్ కు చెప్పండి అలా కస్టమర్స్ ని మోసం చేయవద్దని."
    "మోసమేమిటి?"
    "ఆ బొమ్మ తాలుకూ చెవి- ముక్కు విరిగిపోయాయి. ఐ డోంట్ లైక్ సచ్ చీటింగ్."
    "ఆ బొమ్మ తెచ్చేవరకూ ఫిప్టీన్ రూపీస్ డిపాజిట్ పెట్టండి."
    "నా మీద యింకా నమ్మకం కుదర్లేదా?"
    "లేదు"
    తులసి నవ్వపుకుంటోంది.
    "పోనీ ఓ పదిహేను రూపాయలు మీరే అప్పిస్తే? నాకు ఉద్యోగం దొరగ్గానే తీర్చేస్తాను."
    "షాప్ లోనికి వస్తారా. బాస్ ని పిలవమంటారా?"
    తులసి తన బ్యాగ్ లోంచి పదిహేను రూపాయలు తీసి అమెకిచ్చేసింది.
    "థాంక్ యూ!" అందామె తులసితో. "మీ దగ్గర యింకేమీ మిగిలి వుండదు - అన్నీ దొంగిలించి వుంటాడీ పాటికి" నవ్వుతోంది.
    ఆమె షాపులో కెళ్ళిపోయింది.
    తులసి మళ్ళీ ప్రముఖ తెలుగు వార పత్రికల్లోని డాక్టర్ సమాధానాలు శీర్షిక గురించి చెప్పటం ప్రారంభించింది.

 

                                                    *    *    *    *

    ప్రత్యూష ఏదో పుస్తకం చదువుతోంది.
    లైబ్రరీ ఇంచుమించుగా ఖాళీగా ఉంది.
    ఏ క్షణంలోనయినా వర్షం కురవవచ్చు.
    సురేష్ లోనికి రావడం ఆమె గమనించలేదు.
    "హలో!" పలకరించాడు సురేష్.
    ఆమె పుస్తకంలోంచి తలెత్తి అతని వైపు చూసింది. పొడిగా నవ్వింది.
    'అంత డీప్ గా వెళ్ళిపోయారు . ఏం పుస్తకం?"
    "సెక్స్ A టు Z."
    "అదంతా మన వార పత్రికల్లో వేస్తున్నారుగా. మళ్ళీ యిదెందుకు?"
    "అందులో బూతు వుంటుంది. నాలెడ్జ్ వుండదు. అదీగాక టైం పాస్."
    "టైం పాస్ కి ధియరీ కాదు చదవాల్సింది."
    ఆమె నవ్విందిసారి మనస్పూర్తిగా.
    "అలా వున్నారేమిటివాళ?
    చాలా తేడా వుంది మీ ప్రవర్తనలో."
    "ఏం తేడా వుంది."
    "పెళ్ళి ముందు రోజు ఉత్సాహానికి, తరువాత రోజు నిరుత్సాహానికి ఉన్నంత తేడా. ఏమైపోయారిన్ని రోజులు?"
    "డిసప్పాయింట్ మెంట్" తల వంచుకుని టేబుల్ మీద చేతి వేలితో ఏదో డిజైన్ చేస్తూ చెప్పింది.
    "ఎందుకు?"
    "ఐ ఏ ఎస్ మళ్ళీ పోయింది."
    'అయితే పదండి. సెలబ్రేట్ చేసుకుందాం.'
    "సారీ! ఐయాం నాట్ ఇన్ మూడ్స్...."
    "డోంట్ వర్రీ ........ఐ ఎల్ ఎస్ ట్రై చేయండిసారి తప్పక సక్సెస్ అవుతారు..........మీ ఎడమచేతిలో ఆ సర్కిల్ వుంది చూశారా........"
    "ఐ ఎల్ ఎస్ ఏమిటి?"
    "ఐ ఏ ఎస్ ఫెయిలయితే బాధపడే వాళ్ళ కోసం కొత్తగా ప్రారంభించారు. ఇండియన్ లవ్ సర్విస్....ఇంక వెళదామా మరి?"
    "కాఫీ ఇక్కడికే తెప్పిస్తానులెండి" నవ్వాపుకుంటూ ఫ్యూన్ ని పిలిచి కాఫీకి పంపించింది.
    "మీరేమైపోయారు యిన్ని రోజులు?"
    "వేట ఎక్కువ చేశాను."
    "ఏమి దొరకలేదా?"
    "ఊహు! అదీగాక యిప్పుడున్న  జాబ్ మరీ టైర్ సమ్ గా వుంటోంది."
    "ఇప్పుడున్న జాబేమిటి?" అనడిగి అంతలోనే సిగ్గుపడిపోయింది . "తెలుసులెండి చెప్పొద్దు."
    'ఇంకో సమస్య కూడా చుట్టుకునేట్లు వుంది యిప్పుడు" అన్నాడు సురేష్.
    "ఏమిటది?"
    "తులసికి జాబ్ పోయేట్లుంది."
    "అరె ఎందుకని?"
    "మేమిద్దరం పెళ్ళి చేసుకుని కాపురం పెట్టినట్లు, పెళ్ళంటే ఇష్టం లేని అమ్మాయి ఎవరో మేనేజిమెంట్ కి చెప్పింది."
    'అదేమిటి పెళ్ళి చేసుకుంటేనేం?"
    'ఆ కంపెనీ రూల్స్ అలా వున్నాయి. మొన్న మొన్నటి వరకూ ఎయిరిండియాలోనూ, విజయవాడ లో ఓ కంపెనీలోనూ అలాంటి రూల్స్ వున్నాయి కదా!"
    "ఎందుకలాంటి రూల్స్ పెట్టటం? అవి మన రాజ్యాంగానికి వ్యతిరేకం కదా."
    "మన రాజ్యాంగం ఏమిటో మన గవర్నమెంట్ కే సరిగ్గా తెలీదు. అదీగాక రాజ్యాంగాన్ని అసలేవరు ఫాలో అవుతున్నారని."
    కాఫీ తీసుకొచ్చి యిచ్చాడు ఫ్యూన్.
    "అయితే ప్రాబ్లమే మీకు."
    "అవును! ఇప్పుడు కేవలం రాత్రిళ్ళు - అప్పుడు రాత్రింబవళ్ళు."
    అతని చేతి మీద లాగి కొట్టిందామే.
    "అరె! మర్చిపోయాను. చాలా రోజులయింది మీ కోసం పేపర్ కటింగ్స్ దాచాను పనికొస్తాయేమో చూడండి" తన బ్యాగ్ లో అన్ని అరలూ వెతికి న్యూస్ పేపర్స్ కటింగ్స్ బయటకు తీసిందామే.
    అన్నీ ఓ నిమిషంలో చూసేశాడతను.
    "ఈ బంగారు భవిష్యత్తు ఉద్యోగాలన్నీ నాకు తెలుసు. ఇంటింటికి వెళ్ళి అగరొత్తులు, సబ్బులు అమ్మమంటారు."
    'అవును నాకూ ఎక్స్ పీరియన్స్ వుంది."
    'తమాషాగా వుందే. మనిద్దరిదీ ఒకే రాశి అనుకుంటాను. మీ డేటాఫ్ బర్త్ ఏమిటి?"
    "లైబ్రరీ క్లోజ్ టైమయింది" అందామె లేచి నిలబడుతూ.
    "మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. చూస్తూండండి . ఏదొక రోజు మీరు వప్పుకుంటే చమటోడ్చి మీ ఋణం తీర్చేసుకుంటాను."
    ప్రత్యూష నవ్వుతోంది.


                                                 *    *    *    *

    గంగాభవాని వారపత్రిక చదువుతొందల్లా సురేష్ లోపలకు రావడం చూడగానే లేచి నిలబడి పైట సరిజేసుకుంది.
    "ఏం కావాలి?" అంది తీక్షణంగా.
    "నిజం చెప్పండి. మీకు తెలీదా?" నవ్వుతూ అన్నాడు.
    "వెళ్ళండి మీరు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నాను."
    "అంటే తల వంచుకునే వాళ్ళందరూ మన లాగానే ........" సమీపంగా వచ్చేశాడతను.
    ఆమె ఓ అడుగు వెనక్కి వేసింది.
    "ఇంక దగ్గర కొచ్చారంటే మర్యాదగా వుండదు" రోషంగా అంది.
    "మొన్న మర్యాదగానే వుంది కదా?"
    "చెంప పగిలేదే కమల ఆ సమయానికి రాకపోయినట్లయితే.'
    'అయితే ఆమెను పిలుచుకోస్తాను మళ్ళీ."
    "చాల్లే ఇక వెళ్ళండి."
    "మీకు చెప్పిన జ్యోతిష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు.'

 Previous Page Next Page