"ఏ వేదాంతులూ సమాధానం చెప్పలేని ఈ ప్రశ్నకు ఈ నిర్భాగ్యుడేం సమాధానం చెప్పగలడు ఆశా!" దీనంగా అన్నాడు రావు.
ఆశ రసం తాగలేదు. చూస్తుండగానే టెంపరేచర్ ఎక్కువయిపోయింది ఆశకు. శోభక్కూడా గాభరా కలిగింది. వణికే చేతులతో ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు రావు.
ఆశ మంచంప్రక్కనే కుర్చీలో కూలబడ్డాడు.
"ఈ ఇంజక్షన్ వల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఆశ మనసు మళ్ళించాలి. ఎలా? ఏం చెయ్యను?"
"నోరెరుగని ఆ పసికందు శారీరకంగా, మానసికంగా పడుతున్న బాధకూ, రావు ఆవేదనకూ కదిలిపోయింది శోభ. తను పాట పాడుతూంటే ఆశ తనను తను మరిచి వినటం గుర్తుకొచ్చింది. తానొక పాట పాడితే ఆశ మనసు అమ్మనుండి తన పాట మీదకు మళ్ళుతుందా? తన పాటకంత శక్తి ఉందా?
మంద్రస్థాయిలో లాలిపాట ఎత్తుకొంది. అట్లాంటి సమయంలో పాట పాడుతున్న శోభను ఆశ్చర్యంగా చూశాడు రావు.
ఆశ కళ్ళు తెరిచి శోభవంక చూసింది.
అమ్మనూ, సమస్తాన్నీ మరచి ఆ లేత మనసు ఆ పాటలో లీనమయిపోయింది శోభ పాట ఆపింది.
"పాడండి టీచర్!"
"నువ్వు మందుతాగి రసం తాగితే పాడతాను."
శోభ స్వయంగా ఆశకు మందు పట్టించి రసమిచ్చింది. ఆ మందులో నిద్రపట్టించే గుణం ఉంది. నిద్రలో ఆశ తల్లిని మరిచిపోవచ్చనే ఆశతో ఆ మందు తయారుచేశాడు రావు. పాట వింటూ తనను తాను మరచి శోభ వళ్ళో కళ్ళు మూసుకుంది ఆశ. ఇప్పుడామె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.
విచిత్రంగా మరొక గంటకే ఆశకు టెంపరేచర్ తగ్గిపోయింది. రావు ముఖం వికసించింది.
"హమ్మయ్య! ప్రస్తుతానికి గండం గడిచింది. నేను చెప్పలేదూ! నీ పాటతో దాని మనసులోని కలతను దూరం చెయ్యగలిగావు. అందుకే జ్వరం తగ్గింది. ఇంకరాదు. శోభా! ఇవాళ నువ్వు ఇక్కడే ఉండాలి ప్లీజ్!"
శోభ హడలిపోయింది.
శోభ అంగీకరించినట్లుగానే భావించి వెళ్ళిపోయాడు రావు.
శోభ కంతులేని ఆశ్చర్యం కలిగింది. అన్ని విషయాలలోనూ చాలా స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నాడు రావు. అతని ధోరణి పరాయి వ్యక్తిని ప్రాధేయపడుతున్నట్లుగా లేదు. స్వంతవాళ్ళని ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది. అతనలా వ్యవహరించటం తనకు హాయిగానే ఉన్నా, ఏదో వెలితి. ఈ రావు సంపూర్తిగా తనవాడు కాడు. తల్లిని మరిచిపోలేని ఆశకు తండ్రి. ఆశ లేత మనసులో ప్రతిష్టించుకుపోయిన ఆశ తల్లికి భర్త. ఒక నిర్మల మనోమందిరాన్ని సుస్థిరంగా ఆక్రమించుకోగలిగే అదృష్టం లేకపోగా, ఎంతో గజిబిజిగా ఉన్న రావు హృదయంలో తన స్థానాన్ని వెతుక్కుంటూ అతని జీవితంలోకి ప్రవేశించాలి.
"ఆయాతో చెప్పి నీకీ గదిలోనే పక్క వేయిస్తాను. ఆశకు ఒక రాత్రివేళ మెలకువ వస్తే నువ్వు దగ్గిరగా ఉంటావు." అంటూనే రావు అవతలికి వెళ్ళిపోయాడు.
శోభకు చాలా కోపమొచ్చింది.
"నీ కూతురికి సేవ చేసేందుకు నేను రాలేదు. నిన్ను ప్రేమించినంత మాత్రాన నీ కూతురికి అయాను కాలేను" అని గట్టిగా అరుద్దామనుకొంది.
అంతలోనే ఆయా ఆ గదిలో ఒక పట్టెమంచం వాల్చి పరుపు పరిచి శోభకు పక్క సిద్ధంచేసింది.
"అయ్యగారు పక్కగదిలో పడుకున్నారమ్మా! ఏదైనా అవసరమొస్తే పిలవమన్నారు." అంది.
ఆ సభ్యతను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. రావు పట్ల తనకే అవిశ్వాసమూ లేదు. అక్కడ పడుకున్నంత మాత్రాన ఏ అఘాయిత్యాలూ జరగవు. కాని, అన్నయ్య-వదిన, పిన్ని-లోకం వీళ్ళందరికి తనేం సమాధానం చెప్పుకోవాలి? ఇక్కడెలా ఉండగలదు?
"రావుగారేం చేస్తున్నారో చూడు? ఆయనతో మాట్లాడాలి." అంది ఆయాతో.
ఆయా ప్రక్కగదిలోకెళ్ళి తిరిగొచ్చి "పడుకున్నారమ్మా! ఇవాళ ప్రొద్దుటినుండీ ఆశ జ్వరంతో తిండీ నీళ్ళూ లేకుండా అలమటించిపోయారు. మీరు పాటలు పాడి మరిపించాక ఆశ జ్వరం తగ్గి నిద్రపోయింది. ఆయనా నిశ్చింతగా నిద్రపోతున్నారు." అంది.
"ఇప్పుడు లేపొద్దు" అన్నట్లుగా ఉంది ఆయా ధోరణి.
విసుగ్గా తన పక్కమీద వాలింది శోభ. ఆయా మాట్లాడుతూనే ఉంది.
"ఇదేం జ్వరమో, విచిత్రంగానే ఉంది. మొదట్లో నేనొచ్చినప్పుడూ ఇంతే! ఆశ తల్లిని తలుచుకున్నప్పుడల్లా జ్వరం వస్తుంది. ఆశ మనసు తల్లి నుండి మరల్చగలిగేవరకూ ఏ మందులూ పనిచెయ్యవు. ఇదివరకు నేను మళ్లించగలిగాను. ఇప్పుడు నాతరం కాకపోయింది. మీ పాటతో ఆశ సమస్తమూ మరిచిపోయింది. ఒక ప్రాణాన్ని రక్షించారు. ఒక వ్యథిత హృదయాన్ని సంతృప్తిపరిచారు."
శోభ విని ఊరుకొంది.
ఆయా ఇంకా ఆపలేదు. "దగ్గిర దగ్గిర సంవత్సరము నుండి పనిచేస్తున్నా కదమ్మా! రావుగారు ధర్మాత్ములు. ప్రాణాలన్నీ ఆశమ్మగారిమీద పెట్టుకొని బ్రతుకుతున్నారు. వైద్యం కోసం ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటారు కదా! ఎవరిమీదా రావుగారికి శ్రద్ధుండదు. మీతో ఎలా ఇంత స్నేహం చేసుకున్నారో కాని పాపం ఆ కామాక్షమ్మ ఎంత అవస్థ పడిందో...." అంటూ ఆయా ఫకాలున నవ్వింది.
శోభకు కుతూహలం కలిగింది "ఏవిఁటి?" అంది.
"ఆవిడ భర్త ముసలాడుట! రోజూ వచ్చి రావుగారి దగ్గిర తెగ వగలు గుమ్మరించేది. చూసిచూసి విసిగి రావుగారూ మృదువుగా మందలించారొకనాడు.
"నా తల్లీ తండ్రీ నాకన్యాయం చేశారు. ఇది తప్ప నాకు మరో మార్గమేదీ?" అని ప్రశ్నించింది కన్నీళ్ళతో.
"నీకు జరిగింది అన్యాయమే! అతనికి విడాకులిచ్చెయ్యి. నీకు తగిన వరుణ్ణి చేసుకో!"
"మీరు చేసుకుంటారా?"