వాడు శ్రీరాముని వెనుకనున్న జానకిని గమనించి తన చేతులయందున్న యీటెలను జారవిడిచి పరుగు పరుగున వచ్చి ఆమెను బుజముపై కెత్తుకొని దూరముగా పోయి నిలిచినాడు. వాడు రామలక్ష్మణులతో "మునులవలె కపట వేషధారులై వచ్చిన మీరెవరు? మునులైనచో ధనువులనూ, అమ్ములనూ ఖడ్గములనూ కలిగియున్నా రెందులకు?... మీకు నా సంగతి తెలియక ఆ అరణ్యమును ప్రవేశించినారనుకొనెదను. నా పేరు విరాధాడు. నేనన్నచో ఇక్కడ మానవులకే కాక దానవులకునూ హడలు పుట్టును. ఈ ఆడు దానిని నేను పెండ్లాముగ జేసికొందను. మీరు దీనిపై ఆశను వదలి ఇచ్చట నుండి వెంటనే వెడలిపొండు. పోకున్నచో మిమ్మిప్పుడే భక్షించెదను!" అన్నాడు.
శ్రీరాముడు వానితో "క్షుద్రుడా అన్యస్త్రీ అపహరణమును తలపెట్టి మరణమును తెచ్చుకొన్నావు!" అని ఒక దాని వెనుక నొకటి యేడు బాణములను వానిపై ప్రయోగించినాడు. ఆ శర సప్తకము విరాధుని దేహమును తూట్లమయము చేసినది. రక్తము ధారలుగ స్రవించినది కాని వాని ప్రాణములు పోలేదు! విరాధుడు సీతను జారవిడిచి రామ లక్ష్మణులను 'చెరియొక బుజము పైనను వేసికొని "మిమ్ములను చంపివేసెదను!" అనుచూ పరుగెత్తుచుండగా శ్రీరాముడు "లక్ష్మణా అలసించక వీని ఎడమ చేతిని నీ కత్తితో నరికివేయము, వీని దక్షిణ హస్తమును నా ఖడ్గముతో ఖండించెదను" అన్నాడు. మరుక్షణముననె వాని చేతులు రెండునూ తెగి నేలపై పడినవి. వజ్రాయుధము దెబ్బలకు ఱెక్కలు తెగిన పర్వతము వలె విరాధుడు పుడమిపై కుప్పగా కూలినాడు.
విరాధుడు గాయముల వలన కలిగిన వేదనను భరించజాలక "బ్రహ్మదేవుడిచ్చిన వరము నేడిట్లు వికటించునని నేనానాడు ఊహించలేదు!" అని రోదించినాడు.
రాముడు: నీవు తపమున బ్రహ్మదేవుని మెప్పించి ఆర్జించిన వరమేమిటి?
విరాథుడు: "ఏ ఆయుధము వలననూ నాకు మరణము సంభవించరాదు" అన్నది ఆ వరము.
రాముడు: సృష్టి స్ధితి లయములు అని వార్యములు. మరణము కాల ధర్మము. చావును తప్పించుకొనలేము.
విరాధుడు: నాకప్పుడా వివేకము లేకపోయినది. (బాధతో) అబ్బా! నాకీ యాతన దుర్భరముగా నున్నది!
రాముడు:(కరుణాంతరంగుడై) విరాధా నేను నీకిప్పుడు చేయగల మేలు ఏమైన నున్నదా?
విరాథుడు:నాకిప్పుడు మరణమే శరణము. విధాత వరము కారణముగా నీ ఆయుధముల వలన నాకు చావు సమకూరదు. నా ప్రాణములను వదలుట కొక ఉపాయము తోచుచున్నది.
రాముడు: ఏమిటది?
విరాధుడు: నా మహాకాయమును ఇముడ్చుకొన గల పెద్ద గొయ్యిని త్రవ్వి నన్నందు పడవైచి మట్టితో కప్పివేసినచో ఊపిరి సలుపక అనువులు నన్ను విడిచిపోవును. ఖననము వలన నీవు నాకు మేలోనరించిన వాడవగుదువు.
రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు గోతిని త్రవ్వుట ప్రారంభించినాడు.
విరాథుడు:(పశ్చాత్తప్తుడై) ఈ సాధ్వీమణికి అపచారము తలపెట్టిన దుర్మార్గుడను నన్ను క్షమించి నాకీ యుపకారమును చేయుచున్న మహనీయులు మీరెవరో తెలుపగోరుచున్నాను.
రాముడు: ఈమె నా ధర్మపత్ని ఆర్యావర్తమున కల విదేహ దేశమును పాలించు జనక మహారాజు కుమారై పేరు సీత.
విరాథుడు: తల్లీ నీకు నమస్కారము, నన్ను క్షమించుము.
రాముడు: విరాధా పశ్చాత్తాపము నీ పాపమును హరించినది... నేను చెప్పుచున్నది ముగించెదను వినుము. ఆర్యవర్తమున అయోధ్య రాజదానిగా కల కోసల దేశమును సూర్యవంశజుడగు దశరథుడు పాలించెను. న్నెఉ ఆ మహారాజు జ్యేష్ఠపుత్రుడను. నన్ను రాముడు అని పిలిచెదరు. అతడు నా అనుజుడు లక్ష్మణుడు. మా తండ్రి సత్యవ్రతమునకు భంగము కలుగకుండ సహకరించుటకు మేమీ దండకారణ్యమును ప్రవేశించవలసి వచ్చినది.
దుస్సహమగు అత్యంత యాతనను అనుభవించుచునే వినుచున్న విరాథుని వదనము ఆనందముతో వికసించినది.
విరాథుడు: (సంతోషముతో) నాకు శాపము నుండి విముక్తిని కలిగించుటకు విచ్చే సేదవన్న ఆ దశరథాత్మజూడవు నీవేనా ప్రభూ! శ్రీరామచంద్రా! ధన్యుడను!! ధన్యుడను!!!
రాముడు: నీవు శాపగ్రస్తుడావా, విరాధా?
విరాథుడు: ఇపుడు నీముందున్న నాకీ వికృత రూపమునూ రాక్షసత్వమునూ దాపురించుటకు కారణము కుబేరుని శాపము. నేను ధనదుని పరివారములోని ఒక యక్షుడను. ఇంద్రుని ఆహ్వానముపై మేము పరివారములోని వారమందరమూ కుబేరుని అనుసరించి అమరావతికి పోయినాము. అమరేంద్రుని కొలువులోని 'రంభ' యను అప్సరస నా సౌందర్యమునకు ముగ్దురాలైనది. నేనునూ ఆమె అందముచే ఆకర్షింపబడినాను. ప్రణయమును పడిన నేను కుబేరుని పరివారములోని కింకరుడుగా పాటించవలసిన నా విధులను విస్మరించుట జరిగినది. కుబేరుడాగ్రహించి నన్ను "నీ సౌందర్యమును కోల్పోయి వికృత రూపుడవగుము, అమరత్వమును పోగొట్టుకొని దనుజూడవై దండకాటవిని క్షుద్ర జీవితమును గడపుము" అని శపించినాడు. నేను దుఃఖించుచు ఆయన పాదములపై పడి 'క్షమించుడు' అని పరిపరి విధముల ప్రార్ధించినాను. ఆయన ఎట్టకేలకు ప్రసన్నుడై "మున్ముందు పితృవాక్య పరిపాలనా దక్షుడునూ, సకల సద్గుణ సంపన్నుడునూ దశరథాత్మజుడునూ అగు శ్రీరాముడు దండకారణ్యమున వసించుటకు వచ్చును. అప్పుడు నీకు శాప విమోచనము కలుగును" అని చెప్పినాడు. మరుక్షణమునే నేను విరాథునిగ మారిపోయి అమరావతి నుండి త్రోయబడి ఈ అరణ్యమున పడిపోయినాను. ఆ క్షణముననె నాకు పూర్వస్మృతియూ పోయినది. నేను శాపగ్రస్తుడనగు యక్షుడనన్న విషయము నీవు దశరథాత్మజూడవని తెలిసిన పిమ్మట జ్ఞప్తికి వచ్చినది.
గోయి సిద్దమైనది. రామలక్ష్మణులా మహాకాయుడు విరాథుని లోతుగా నున్న ఆ గోతిలో జారవిడిచి మట్టితో పూడ్చినారు. కొంతసేపటికా సమాధి నుండి తేజఃపుంజ మొకటి వెల్వడి సుందరుడగు యక్షునిగా మారినది.
యక్షుడు:(కృతజ్ఞతతో) శ్రీ రామచంద్రా నీ కృప వలన నాకు శాపము నుండి విముక్తి కలిగి పూర్వరూపమునూ అమరత్వమునూ తిరిగి లభించినవి. (క్షణముఆగి) ఇప్పుడు మీకొక విషయమును తెలిపెదను అలకించుడు: ఈ దండకారణ్యమున మునుల ఆశ్రమము లెన్నియో యున్నవి. అందలి తాపసులను రాక్షసులనేక విథముల బాధించుచూ వారి తపములకు విఘ్నములను కలిగించుచున్నారు. ఇప్పుడు మీ అన్నదమ్ములు దండకాటవి కేతెంచినారని తెలిసి తాపసులు సంతసించుచున్నారు. "వీరాగ్రగణ్యులునూ సాధుజన రక్షకులునూ అగు దశరథాత్మజులు రామలక్ష్మణులు ఇంక మనలను అసురుల హింస నుండి కాపాడెదరు" అన్నదైర్యము వారికి చేకూరినది...మీరు పోయి తాపనులను సందర్శించుడు. ప్రతి ఆశ్రమమునందునూ మీకు స్వాగతము లభించును.
యక్షుడట్లు చెప్పి అనంతరము సీతారామ లక్ష్మణుల నుండి వీడ్కోని కుబేరుని రాజధాని యగు అలకారురిని చేరుకొన్నాడు.
* * *