వాళ్ల ఆలోచనలు అలా సాగుతుంటే కనకమ్మ కళ్లకి చెయ్యి అడ్డం పెట్టుకొని కళ్లు చిట్లించి చూడసాగింది....
కారు తలుపు తెరుచుకొని ముప్పయ్యేళ్ల స్పురద్రూపి అయిన యువకుడొకడు దిగాడు, ఖరీదయిన లాల్చీ, పైజామా, వేళ్లకి ఖరీదయిన ఉంగరాలు, పెద్ద రిస్ట్ వాచ్, రిమ్ లెస్ కళ్లజోడులో హుందాగా, అందంగా వున్నాడు.
అతడు చెయ్యి అందించి కారులోవున్న ఇద్దరబ్బాయిల్ని, ఒక అమ్మాయినికూడా దింపాడు. అమ్మాయిని అతడు ఎత్తుకొని ఇంట్లోకి దారితీస్తుంటే....
"కనకమ్మగారూ! గుర్తుపట్టారా? మీ అచ్యుతంలా వున్నట్టున్నాడు!" అని కేకపెట్టాడు ఎదురింటి వాకిట్లో నిలబడిన పాపిశెట్టి.
ఖరీదయినదుస్తులలో పిల్లలు యాపిల్ పళ్లలావున్నారు పాప మరీ ముద్దుగా, బొద్దుగా వుంది. అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు.
కనకమ్మ హృదయంలో సముద్రం పొంగినట్టుగా అయింది. తడబడే అడుగులతోటయినా గబగబా నడిచింది.
"అమ్మా! అమ్మా" అతడు గడపలో అడుగు పెడుతూ కేకపెట్టాడు.
"ఎవరు? నా అచ్యుతమేనా" ఆవిడ గొంతుకేదో అడ్డుపడ్డట్టయింది.
అతడు గిరుక్కున వెనుదిరిగి, కూతుర్ని క్రిందికి దించి తల్లి చంకలోంచి బిందె అందుకొన్నాడు.
"అయ్యో! మడినీళ్లురా!" కొడుకు చాపిన చేతులలో ముసలి గువ్వలా ఒదిగిపోతూ ఆ మాటమాత్రం అనడం మరిచిపోలేదు.
ఆ పల్లెజనమంతా అక్కడే వున్నారన్నట్టుగా ఇల్లు నిండిపోయారు.
అచ్యుతానికి ఇంతదశ ఎలాతిరిగింది? అందరిముఖాల్లో ఇదే ప్రశ్న.
పాపిశెట్టి అడగనే అడిగాడు. "ఇడ్లీలమ్ముకొంటూ తిరుగుతున్నావని ఆ మధ్య ఎప్పుడో అన్నారు! తస్సదియ్య ఒక్కసారే కారులో దిగావేమయ్యా! రామలక్ష్మణుల్లా యిద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల... ఎంత ముచ్చట గొల్పుతున్నారో!"
"కష్టేఫలే?" చిరునవ్వుతో అన్నాడు అచ్యుతం.
పట్నంలో ఇప్పుడతడికి మూడు పెద్దహోటళ్ళు రెండు సినిమాహాళ్లు, ఇంకా ఎందులోనో పార్టనర్ షిప్పు వున్నాయని తెలిసి అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.
"అయితే నీపని దినదినంగా పెరిగే పున్నమిచంద్రునిలా వుందన్నమాట. నువ్వు ఏది పట్టినా బంగారమౌతుందన్న మాట! దశ తిరగడం అంటే ఇదే! పదేళ్లనాడు ఎలా వున్నవాడివి. రివటలా, పిలకజుట్టుతో, బిత్తరచూపులు చూస్తూ - ఇప్పుడు చూడవయ్యా!రూపం, వేషం అన్నీ మారిపోయాయి. అన్నట్టు నీ భార్యని తీసుకురాలేదేమిటయ్యా!" అడిగాడు శెట్టి.
"రావాలనే అనుకొంది. తీరా బయలుదేరే ముందు కొంచెం సుస్తీచేసింది. అనుకొన్న ప్రయాణం ఎందుకు ఆగిపోవడం అని మమ్మల్ని బయలుదేరమంది."
"నీ చేతులతో నీకు కావలసిన వాళ్లంతా పంచవమ్మా!"
"ఇవాళ కనకమ్మగారికే పండగకాదు. ఇంత స్థితిమంతుడివ తిరిగివచ్చినందుకు ఈ ఊరికే పండుగ! తేవయ్య ఓ మిఠాయివుండ ఇలా పడెయ్యి. తినివెళ్లి కొట్టులోకూర్చోవాలి" అన్నాడు శెట్టి.
స్వీట్లు, పళ్లు తీసుకొని ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయాక, "ఏమ్మా! నా మీద కోపం పోయిందా? అని అడిగాడు అచ్యుతం.
"ఇక కోపం తెచ్చుకొనే శక్తి నాకెక్కడిదిరా? అంతా అయిపోయింది. ఇప్పుడున్నది ఒక్కటే కోరిక! నీ చేతుల్లో కళ్లు మూయాలని."
గంట తరువాత ఇంటకి తాళం పెట్టి కారెక్కాడు.
తల్లిని జాగ్రత్తగా కారెక్కించిన అచ్యుతం ముందు సీట్లో వెళ్లి కూర్చున్నాడు.
అటు ఇటు ఇద్దరు మనుమళ్లనీ, ఒళ్ళో మనుమరాలినీ కూర్చోబెట్టుకొని కూర్చొన్న కమకమ్మని చూసి,
"అబ్బా! ముసలావిడ కష్టాలిప్పుడు తీరాయి! అని ఊరి జనమంతా తేలిగ్గా ఒక నిట్టూర్పు విడిచారు.
* * * *
దాదాపు పదిహేను సంవత్సరాల తరువాత ఒకనాటి సంగతి.
శంకరికీ, ఆమె పెద్దకొడుకు నవీన్ కూ చాలాసేపటి నుండి తీవ్రమైన వాగ్వివాదం నడుస్తూంది!
నవీన్ విసిగిపోయినట్టుగా, "నీ కింత పట్టుదల ఏమిటో నాకర్దం కావడం లేదమ్మా!" అన్నాడు. "నిన్ను ఎంతో అవమానించిన వాళ్లతో, నిన్ను ఎంతో మనేవేదనకు గురి చేసిన వాళ్లతో నువ్వు వియ్యమందాలనుకొంటున్నావంటే నీ మనస్తత్వమేమిటో నా కర్దం కావడంలేదు. నీ మీద ఆవ గింజంత ప్రేమలేని వాళ్లమీద మీ కింత మమకారం మేమిటో చెప్పు!"