నాకెందుకో ఇరవయ్యేళ్లకే మ్రోడులా మిగిలిపోవాలనిపించలేదు. మన ప్రక్కింటి రుక్మిణత్త అన్నట్టు 'పూర్వజన్మలో దేవుడిని పూలతోకాదు, రాళ్లతో పూజ చేసి వుంటాము. అందుకే ఈ జన్మలో ఈ రాత' అని సరిపెట్టుకోలేకపోయాను. ప్రయత్నించటి ఈ రాతను మార్చుకోవాలని.. .మనిషికి నియమం, నిగ్రహం గొప్పవే కావచ్చు నిత్యం కాల్చుకొని కాల్చుకొని ఎవరిని వుద్దరించాలి?ఎందుకోసం? ఎవరికోసం?
నా మనసుకు తెలుసు. నేనేం పాపం చేయడం లేదని. నాకో చిన్న ఇల్లు, ఇద్దరో ముగ్గురో చిన్నారి పిల్లలు... .ఒక చిన్న స్వర్గం సృష్టించుకోవాలనే తపనతోటే అచ్యుతాన్ని నా ఆశయానికి ఆలంబనగా చేసుకొని ఇల్లు విడిచాను. క్షమించమని అడగను. నేనేం తప్పు చేశానని?
వదిన నన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. వాకిటి లోంచే వెళ్లగొట్టింది. నిజంగా అంత తప్పు నేనేం చేయలేదని ఆమెకు చెప్పండి.
అన్నయ్యా!
నీ చెల్లెలు తప్పేమీ చేయలేదనుకొంటే ఒక ఉత్తరం ముక్కరాయి. కనీసం నీ చేతి రాతతో నిన్ను చూసుకొని తృప్తిపడతాను.
ఇట్లు,
నీ చెల్లెలు, శంకరి.
శంకరి వ్రాసిన వుత్తరం ఒక్కసారి కాదు, నాలుగు సార్లు చదువుకొన్నాడు ఆచారి. శంకరి అచ్యుతంతో వెళ్లిపోయిన రోజు గుండెల్లో మంట పెట్టినట్టయింది. ప్రపంచానికి ఎలా ముఖం చూపించాలి అనుకొన్నాడు అవమాన భారంతో క్రుంగిపోయాడు.
ఈ ఉత్తరం చదువుతూంటే ఆమె వాదం సమంజసమే అనిపించినా, ఈ ప్రపంచంలో అవరికి వీలైన పద్దతుల్లో వాళ్లు జీవిస్తామంటే సమాజం ఏర్పరచుకొన్న నియమాలు' కట్టుబాట్లు ఏం కావాలి ఎవరినో తీసుకొని లేచిపోవడం ధర్మకార్యమా? ఎవరైనా అది మంచిపని అంటారా?
ఆచారి చెల్లెలి ఉత్తరానికి సమాధానం ఇవ్వలేదు.
* * * *
స్నానం చేసి, బిందె తీసుకొని నూతి దగ్గరికి వచ్చింది కనకమ్మ. నూతిలో చేద వేసి అతికష్టంగా రెండు బాల్చీలు తోడి బిందెలో వేస్తూ, "దేవుడు నాకిన్ని కష్టాలు ఎందుకు పెట్టాడో తెలియదు. ఇంకా ఎన్నాళ్లు పెడతాడో తెలియదు. పాపం పాతికేళ్లు లేవు. ఆ రత్నమ్మకు! హఠాత్తుగా పడుకొన్న చోట పడుకొన్నట్లే కన్నుమూసింది. ఆ చావు నాకు రాకూడదా? దేవుడు ఇంకా ఏమాసించి నన్ను తీసికెళ్లడంలేదో ఈ భూమ్మీద ఇంకా నాకెంత బాకీ వుందో...." అని సణుగుతూంటే.
నూతి మీదికి నీళ్లకోసం వచ్చిన కమ్మరుల పిల్ల శారద, "ఆ బిందె వేసుకొని క్రిందపడి దెబ్బలు తాకించుకొంటే అదొక బాధకదా, అమ్మగారూ? రోజూ రెండు బిందెలు స్నానం చేసి నేను తెచ్చి పెడతానంటే వినరెందుకు" అంది చనువుగా కోప్పడుతూ.
"ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటి వెనుకపడి చచ్చినట్టుగా కాటికి కాళ్లు చాచుకొని నీ చేతినీళ్లు త్రాగి మైలపడి పోదునా? నాచేత నీ నీళ్లు త్రాగించాలని నీ తాపత్రయం. నీ చేతినీళ్లు త్రాగితేతప్ప నీ కడుపు చల్లబడదేమే దెష్టదానా."
"పోయినేడు స్మార్త ఏకాదశని, వైష్టఏకాదశని వరుసగా రెండురోజులు ఉపవాసంచేసి ఒంట్లో త్రాణలేక పాలూపోసి పోయిన ప్రాణాన్ని తిరిగి బొందిలోకి తెప్పించింది ఈ దెష్టపిల్లే కదా, అమ్మగారూ?" కొంటెగా అడిగింది శారద.
"నాకు ఒంటిమీద స్మారకం లేనప్పుడు ఏం జరిగిందో ఆ పాపం, పుణ్యం అంతా నీకే! ఆ దోషం నన్నంటదు."
"ఎందుకొచ్చిన కష్టాలు. కొడుకూ, కోడలిదగ్గరికి వెళ్లిపోరాదా?"
"నాకెవరూ కొడుకులేడు, కోడలు లేదు."
"చావసిద్దమై ఇంకా ఎంత పౌరుషమో ఈ ముసలామెకి."
"ఏయ్ కాస్త ఆగు! బిందె ఎత్తుకుపోయే దాకా నిలుకడలేదా? మీద నీళ్లుచిమ్మి మైలపడేస్తావా ఏమిటి?" వణుకుతూ, వణుకుతూ బిందె చంకలోకి ఎత్తుకొని!" ఆరోజు కారోజు వయసు వస్తోందా, పోతోందా హు" రెండడుగులు వేసేసరికి -
నల్లగా నిగనిగలాడుతూ, పాములా మెత్తగా జారిపోతున్నట్టుగా కారొకటివచ్చి వాకిట్లో ఆగింది.
ఇళ్లముందు నిలబడిన అయిదారుగురు ప్రపంచంలో ఎనిమిదో వింతను చూస్తున్నట్టుగా చూస్తున్నారు ఆ ఊరులో కారున్నవాళ్ళు లేరు. ఈ ఊరివాళ్లకి కారులో వచ్చేవాళ్లూ లేరు. అదీ కనకమ్మగారి వాకిట్లో ఆగిందంటే ఆవిడ తాలూకా అయివుంటారు. ఆవిడింటికి కారులో వచ్చే వాళ్లెవరబ్బా? వున్న ఒక్క కొడుకు ఎవతెనో తీసుకొని లేచిపోయాడు.