"ప్రైంమినిస్టర్ చెబితేనే వినని మనిషి, సో పవర్ ఫుల్. అప్పటికీ ప్రైం మినిస్టర్ తో చెప్పి పద్మవిభూషణ్ యిప్పించాను. బిరుదు తీసుకున్నాడు గానీ మన పని చెయ్యలేదు" నెమ్మదిగా అన్నాడు అచ్యుతముని.
"ఈసారి మీరెలా మేనేజ్ చేస్తారో తెలీదు. దేశ్ ముఖ్ చేత మనం పని చేయించగలిగితే, మన ఆశ్రమానికి పదికోట్లు నెట్ ఎమౌంట్ ఫండ్స్ వస్తాయి. ఆంధ్రాలో మన ఏక్టివిటీస్ కి అంకురార్పణ జరుగుతుంది..." చెప్పాడు జనమే జయరావు.
"అవును! ఆంధ్రలో మన యాక్టివిటీస్ ని స్టార్ట్ చేయాల్సిన అవసరం వుంది" రుద్రాక్షలు సర్దుకుంటూ అన్నాడు అచ్యుతముని.
కారు నారీమన్ పాయింట్ రోడ్డు మీదుగా వెళుతోంది.
"ఇంకా?" అడిగాడు అచ్యుతముని.
"మన నర్సరీకి మంచి మొక్కల్ని తెప్పించాను. మీరొకసారి చూస్తే చాలు' నవ్వుతూ చెప్పాడు జనమేజయరావు.
అర్ధమైపోయింది అచ్యుతమునికి.
"కాయ మొక్కలా? పళ్ళమొక్కలా?" హుషారుగా అడిగాడు అచ్యుతముని.
"కాయ మొక్కల మీద కాన్సన్ ట్రేట్ చేయమన్నారు గదా! అతికష్టమ్మీద పదికాయ మొక్కల్ని సంపాదించాను."
"గుడ్... గుడ్... ఎలాంటి నేలలో వేసినా వాడకుండా వుండేవి కాయ మొక్కలు, లేత మొక్కలే" కామెంట్ చేశాడు అచ్యుతముని.
కారు బాంద్రా ఏరియాలోని లాండ్స్ ఎండ్ రోడ్డులో ఓ గెస్ట్ హౌస్ ముందాగింది.
* * * *
రాత్రి పదిగంటలైంది.
షాండిలియర్ వెలుగుల్లో విశాలమైన హాలు ఇంద్రభవనంలా మెరిసి పోతోంది.
ఆ హాలు మధ్యన వెండి ఉయ్యాల వూగుతోంది.
ఆ ఉయ్యాల్లో కూర్చున్న వ్యక్తి అచ్యుతముని! ఆ పక్కన నలభై ఏళ్ళ మహిళ అతనికి ఆకు, వక్కని అందిస్తోంది.
ఆ మహిళ పేరు కుశాలి! కుశాలి అచ్యుతముని నర్సరీకి ఇన్ ఛార్జి.
"మొత్తం వంద మొక్కలు దొరికాయి. యాభై మొక్కల్ని నేనే ఏరి పారేశాను. మిగతా యాభైని మూడు గ్రూపులుగా చేశాను. మీరొక్కసారి చూసి ఎక్కడకు ఎక్స్ పోర్ట్ చేయమంటే అక్కడకు చేస్తాం" చెప్పింది కుశాలి.
"నీకు బొట్టు చిన్నది... బొడ్డు పెద్దది కుశాలి...! అరగంట నుంచి మొక్కలను వర్ణించడమే తప్ప, చూపించడంలేదే?" నవ్వుతూ అన్నాడు అచ్యుతముని.
"ఊరించి చూపెడదామని..." లేచి నిలబడింది కుశాలి. అదే సమయంలో ఆమె నడుంకివున్న వెండి తాళాల గుత్తి చప్పుడు వింతగా వినిపించింది.
అయిదు నిమిషాలు గడిచాయి.
"మొక్కలొస్తున్నాయి చూడండి..." పక్కనున్న గదిలోనుంచి బయటికొస్తూ అంది కుశాలి.
వరసగా ముప్పై, ముప్పై అయిదేళ్ళ మధ్య వయసులొ వున్న అమ్మాయిలు ఆ హాల్లోకొచ్చి అచ్యుతమునికి ఎదురుగా, భయం భయంగా నుంచున్నారు.
ఉయ్యాల్లోంచి లేచి వరసగా వాళ్ళ ముఖాలవైపు, శరీరంవైపూ పరీక్షగా చూస్తూ ఆ చివర నుంచి ఈ చివరవరకూ నడిచాడు. ఇద్దరు ముగ్గురిని కొన్ని ప్రశ్నలు వేశాడు.
"వీళ్ళందరూ ప్రేమలో మోసపోయినవాళ్ళు, పెళ్ళి చేసుకుని మోస పోయినవాళ్ళు..." చెప్పింది కుశాలి.
ఒక్కక్షణం ఆలోచించాడు అచ్యుతముని.
"వీళ్ళను మన సీ గ్రూప్ ఏజెంట్సు దగ్గరికి పంపించు" చెప్పాడు అచ్యుతముని.
మొదటి బ్యాచీ వెళ్ళిపోయింది.
రెండో గ్రూప్ వచ్చింది. ఇరవై అయిదు, ముప్పై ఏళ్ళ మధ్య నున్న అమ్మాయిలు వాళ్ళు.
వాళ్ళనెక్కడికి పంపించాలో చెప్పాడతను.
ఆ గ్రూపు వెళ్ళిపోయింది.
మూడో బ్యాచీ! పదిహేనేళ్ళ, పాతికేళ్ళ మధ్యనున్న అమ్మాయిలు. మొగ్గల్లాంటి మొక్కలు!
ఒక్కొక్కరూ బెదురుకళ్ళ చూపులతో లోనికొస్తున్నారు. ఆ వయసు వాళ్ళంటే కస్టమర్లకే కాదు, అచ్యుతమునికి కూడా క్రేజీయే!
వరసగా ఒక్కొక్కరినీ పరీక్షిస్తున్న అతను ఒక లేతమొగ్గ దగ్గర ఆగిపోయాడు.
ఆ లేత మొగ్గ-
లక్ష్మి...!!
"ఆంధ్రా మొక్క! ఫ్రెషంటే ప్రెషే! లక్ష ఖర్చయింది" చెప్పింది కుశాలి.
లక్ష్మి ముఖంవైపు, విశాలమైన కళ్ళవైపూ, ముక్కువైపు, పెదవుల వైపు, కంఠంవైపు, వంటిఛాయ వైపూ చూస్తున్నాడు అచ్యుతముని.
"నీ పేరు?" అడిగాడతను.
చెప్పలేదు లక్ష్మి.
"చెప్పు! మనలాంటివాళ్ళకు దేవుడాయన" అంది కుశాలి.
ఆ మాటకు తలెత్తి చూసింది లక్ష్మి.
"మరి... నాలుగు చేతుల్లేవేం?" నెమ్మదిగా అడిగింది లక్ష్మి.
"నాలుగు చేతులు..." ఆ మాటకు నవ్వాడు అచ్యుతముని.
"గుడ్... భలే ప్రశ్న వేశావే పిల్లా! తెలివైనదానివే...! శక్తి, యుక్తి, అధికారం, అహంకారం ఈ నాలుగు చేతులతో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్న ఆధునిక దేవుడు... ఈ అచ్యుతముని..." గర్వంగా అన్నాడు అచ్యుతముని.
"పంపించేయమంటారా?" ప్రశ్నించింది కుశాలి.
"ఈ అమ్మాయిని తప్ప..."
ఆశ్చర్యంగా చూసింది కుశాలి అతనివైపు.
అందరు అమ్మాయిలూ వెళ్ళిపోయారు. ఒక్క లక్ష్మి తప్ప!
శిలావిగ్రహాన్ని పరిశీలిస్తున్నట్లుగా పరిశీలిస్తున్నాడు లక్ష్మిని!
అంతవరకూ అందరినీ చూసి భయపడిన లక్ష్మి అతన్ని చూసి ఎందుకో భయపడలేదు.
కొన్ని గంటల నుంచి ఆమె మనసులో మెదులుతున్న ప్రశ్న బైటకొచ్చింది.