Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 16

 

    డార్క్ డెవిల్ రహస్యంగా అతని చెవిలో మాట్లాడాడు.
    "బాంబేలో ఒక గ్యాంగ్ ని ఎంగేజ్ చేశాను. వాళ్ళకెంత ఇవ్వాలో తెలుసా? లక్ష! అందుకే మాకు మిగిలిన ఒకే ఒక్క ఇల్లు బేరం పెట్టాను. ఇంకో నెలరోజుల్లో అది అమ్మితే లక్ష చేతికి వస్తుంది. రాగానే 'బాంబే వెళ్ళటమే. అంతే!"
    సురేష్ కి భయం వేసింది.
    "కానీ ఎందుకోచ్చిందిరా ఇదంతా! వాళ్ళ జోలికి పోకుండా ఆ లక్షతో సుఖంగా బ్రతికేయ్యోచ్చుగా....." డార్క్ డెవిల్ సురేష్ చేతిని తన భుజం మీద నుంచి విసిరికొట్టాడు. అతని చొక్కా పట్టుకున్నాడు ఆవేశంగా.
    'ఒరేయ్! అది మా అస్తిరా! మా తాతయ్యా, ఫాదర్ చెమడోడ్చి సంపాదించినా ఆస్తి. అది అక్రమంగా, అన్యాయంగా కాజేశాడు వాడు. అంచేత అది వాడికి దక్కటానికి వీల్లేదు. దాని బదులు ఆ ఆస్తిని తినడానికి తిండి లేని వాళ్ళందరికీ పంచడం నాకిష్టం. లేదా రోడ్డు మీద వంద నోట్లు విరజిమ్మేయడం నాకిష్టం. అంతే! అంతేగాని ఆనీతి లేని బాస్టర్డ్ ......."
    సురేష్ అతని భుజం మీద చేయి వేశాడు మళ్ళీ.
    "పద - వెళ్దాం"
    ఇద్దరూ  మళ్ళీ నడవసాగారు.
    "సురేష్! మగాడికి అనందం ఎప్పుడు దొరుకుతుంది? నిజమైన అనందం......"
    "అమ్మాయి సంతృప్తిగా కళ్ళు మూసుకుని వుంటే ముద్దు పెట్టుకున్నప్పుడు.'
    "డోంటాక్! అది నీలాంటి ఇడియట్ కి. నిజమైన మగాడికి అనందం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? తన శత్రువుల్ని స్మాష్ చేసినప్పుడు. అందుకే బాంబే గ్యాంగ్ ని ఎంగేజ్ చేశాను. వాళ్ళెంత ప్రమాదకరమయిన మనుషులో తెలుసా?" డిల్లీలో రష్యన్ ఎంబసీకి చెందినవాడిని పొలిటికల్ గా వాళ్ళే మర్డర్ చేశారు. బాంబేలో మిలినియర్స్ యిద్దర్నీ ఒకేరోజున వేటాడి చంపారు. రాష్ట్రంలో ఒక మంత్రి కర్టెన్ వెనుక పనులను బయటపెట్టబోయిన ఒక జర్నలిస్ట్ నీ , ఒక చిన్న పత్రిక ఎడిటర్ని నడిరోడ్డు మీద నరికి పారేశారు.
    వాళ్ళకు లక్ష రూపాయలంటే లెక్కలేదు నిజానికి. కానీ వాళ్ళ లీడర్ కి నేనంటే అభిమానం. ఒకసారి బాంబే లో బార్ లో నేను గిటార్ వాయిస్తుంటే థ్రిల్ అయ్యాడు. అందుకని బేరం లక్షకి సేటిలయిపోయింది. ఒకసారి అతను ఓ.కే అన్నాడంటే యింక తిరుగులేదనుకో.అవతలి వాడెక్కడున్నా , ఏ మూల కెళ్ళినా వెదికి వెదికి వేటాడి చంపేస్తారు. ప్రస్తుతం మన దేశములో దాన్ని మించిన డేంజరస్ గ్యాంగ్ ఇంకోటి లేదు. అమెరికా, సి ఐ ఏ తో కూడా కాంటాక్ట్స్ వున్నాయి వాళ్ళకు.'
    డార్క్ డెవిల్ రూమ్ కి చేరుకున్నారిద్దరూ.
    డార్క్ డెవిల్ మంచం మీద వాలిపోయాడు బూట్లతోనే.
    "ఓ హసీనా జుల్ఫోంవాలీ జానే జహా"
    "ఒరే డార్క్ డెవిల్!"
    "ఏమిటి?"
    "హసీనా ఎక్కడుందిరా ఇప్పుడు?"
    డార్క్ డెవిల్ చటుక్కున మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు.
    "తెలీదు. ఎక్కడున్నా ఫర్వాలేదు. ఐ డోంట్ కేర్! ఎందుకో తెలుసా?"
    "ఎందుకు?"
    "ఇద్దరం కలిసి గడపాలనుకున్న జీవితమంతా వారం రోజుల్లోకి కుదించి హార్స్ లీ హిల్స్ లో నాకిచ్చింది. కొండమీద నుంచి బస్ లో కిందకు దిగేటప్పుడు ఏం చేసిందో తెలుసా?" మనకింక పెళ్ళెందుకు......ఈ వారం ఒకరి గుండెల మీద ఒకరున్నాం. లైఫ్ లాంగ్ ఒకరి గుండెల్లో ఒకరుంటాం. అంతకంటే దగ్గరుండి మాత్రం సాధించేదేముంది" అంది. ఎంత ఒందర్ ఫుల్ గా చెప్పింది? ఎంత కాచి వడబోసి చెప్పింది. అందుకే అయ్ డోంట్ కేర్! హసీనా ఎక్కడయినా వుండనీ.......ఎక్కడయినా వుండనీ..... గుండెలో యిద్దరం ప్రక్కప్రక్కనే వుంటాం.'
    గదంతా మాసిపోయిన బట్టలూ, బూజు పట్టిన డార్క్ డెవిల్ లైబ్రరీ , గోడకు స్కూల్ ఫోటోలు, అల్మారాలో బాటిలూ........టేప్ రికార్డరూ.....
    వీటి మధ్య డార్క్ డెవిల్....
    మళ్ళీ పడుకుని పాట ప్రారంభించాడతను.
    "ఓ హసీనా జుల్ఫోవాలీ"
    సురేష్ గది తలుపు దగ్గర కేసి బయల్దేరాడు.
    చౌరస్తా దగ్గరకు చేరుకునేసరికి యింకా అరగంట టైం మిగిలింది. తులసి ఆఫీస్ నుంచి రావటానికి. అప్పటికే జనప్రవాహం పెరిగిపోయింది.
    అందంగా, పొడుగ్గా , లావుగా వుందామే.
    "36-30-34" అనుకున్నాడు సురేష్.
    ఆమె నడక స్లో అయింది. పెదాల మీద చిరునవ్వు.
    నధింగ్ ఇంటరెస్టింగ్!
    దగ్గరవుతున్న కొద్దీ మరింత స్లో----
    "బాగున్నారా?" తీయని గొంతు.
    సురేష్ ఖంగుతిన్నాడు.
    "ఎవరీమె? ఎప్పుడు చూశాడు? ఎక్కడ చూశాడు? అర్దనరీయా? ఎక్స్త్రార్దినరీయా?
    "ఓ! చాలా బాగున్నాను- మీరెలా వున్నారుఇదిగో ఇలా" పైట సరిజేసుకుంటూ అంది.
    పెదాలతో పాటు కళ్ళు కూడా నవ్వుతున్నాయి. మెదడు పనిచేయటం లేదు. వెనక్కు ఎంత బలంగా తరిమినా మొరాయిస్తుంది.
    ముందున్న విందు ముఖ్యం దానిక్కూడా. ఇలాంటి సమయంలో ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళమంటే ఎందుకు వెళుతుంది?
    "ఇప్పుడెక్కడుంటున్నారు?"
    "ఇక్కడే - అంటే యీ రోడ్డు మీదని కాదు"
    "జాబ్ చేస్తున్నారా?"
    "ఓ యస్! ఎవరి దగ్గర ఖాళీ వుంటే వాళ్ళ దగ్గర"
    "నేనూ యిక్కడే వుంటున్నానిప్పుడు"
    "ఓ! చెప్పరేం? అయితే యింక సమస్యే లేదు"
    "ఏమిటి సమస్యే లేదు?" అడిగిందామె ఆశ్చర్యంగా.
    "అదే! అప్పుడప్పుడు ఇలా కలుసుకోవచ్చని"
    "ఎందుకు కలుసుకోవడం?"
    అతనికి తెలిసిపోయింది - తనింక నటించడం కుదరదు. అయినా మరొక్కసారి ప్రయత్నిస్తే?
    "ఎందుకేముంది? మీరో వూళ్ళో, నేనో వూళ్ళో"
    "నేనేవరనుకుంటున్నారసలు?"
    "భలేవారే! తెలుసులెండి. తెలీకుండా మాట్టాడతాననుకుంటున్నారా?"
    "అయితే నా పేరేమిటో చెప్పండి"
    "నీరజ"
    "ఛీ!"
    "సరదాకన్నాను, మీ పేరు సరోజ"
    "అలా లాటరీ వేయకండి" నవ్వు.
    "అయితే సారీ! దొరికిపోయాను. చెప్పండి మీరెవరో"
    "నిజంగా గుర్తులేదా?"
    "మీరు కట్టుకున్న చీర ఇంతకుముందేక్కడో చూసినట్లే వుంది."
    "ఏం మళ్ళీ చెంప దెబ్బ కావాలా?"
    అదిరిపడ్డాడు సురేష్.
    అంతవరకూ వెనక్కు వెళ్లనని మొరాయించిన మెదడు చెంపదెబ్బ అనేసరికి గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో వెనక్కు ప్రయాణించి ఆ స్మృతి ని లాక్కొచ్చింది.
    "మైగాడ్! శోభాదేవా?"
    "ఏం నమ్మకం లేదా?"
    "బాడీ పెరిగింది, అందం తగ్గింది , అందుకని....."
    "ఇలా రోడ్డు మీద మాట్టాడటమేనా? కూల్ డ్రింక్ తాగించే ఏర్పాటు వుందా?"
    "వెల్ కం! పదండి"
    మతి పోతోంది.
    కాలేజిలో ఉన్నప్పుడు పక్కింట్లో వుండేవాళ్ళు.
    "సినిమా కెళ్దామా?" అని అడిగినందుకు చెంప పగలగొట్టిన మొట్టమొదటి అమ్మాయి .....ఆఖరి అమ్మాయి కూడా.
    ఆ రోజు నుంచీ తనతో మాట్లాడలేదు మళ్ళీ ఆ రూమ్ ఖాళీ చేసేవరకూ.
    జీవితంలో ఓ పెద్ద లాండ్ మార్క్ ఆ చెంపదెబ్బ. మొదటిసారిగా ఆడపిల్లలంటే ఓ బెరుకు కలుగజేసింది.
    కానీ అంత కోపం, అంత అఫేన్సివ్ గాళ్ ఇప్పుడిలా - ఎలా పలుకరించగలుగుతోంది?
    ఈ అయిదారేళ్ళలో మానసికంగా యింత మార్పెలా వచ్చింది? చెరుకురసం బండి దగ్గర ఆగారు.
    "చెరుకు రసమా మనం తాగేది?" అడిగిందామె.
    "ప్రస్తుతం మన స్టాండర్డ్ అదే"
    "నేను విద్యానగర్ లో వుంటున్నాను" అందామె.
    "ఐసీ!"
    "అడ్రస్ అడగరేం?"
    "అవును - అడ్రసేమిటి?"
    "శివం ఎదురుగా సందు - ఒక కిలోమీటరు నడుస్తే ఓ పంపు .......అక్కడ కుడివేపు తిరిగితే పెంకుటిల్లు, వేనుకవేపు తిరిగితే ఆరు పోర్షన్లు- అందులో ఆఖరిది."
    రెండు గ్లాసుల్లో చెరుకురసం ఇచ్చాడు బండి అతను.
    "నాకో సహాయం చేస్తారా?"
    ఉలికిపడ్డాడు.
    "చెప్పండి"
    "నాకేక్కడైనా జాబ్ కావాలి ఇప్పించగలరా?"
    సురేష్ నవ్వేశాడు.
    "నాకింద పనిచేస్తారా?"
    ఆమె నమ్మలేనట్లు చూసింది.

 Previous Page Next Page