Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 16

                                 


                                     3. బాల భారతి

                                                                  (చిన్న కథలు)

                              మహారాజు - మామిడి చెట్టు

                

    పంజాబు దేశమును "రంజిత్ సింగ్" అను రాజు పాలించుచుండెను. ఆ ప్రభువు ప్రజారంజకుడై తన రాజ్యము నందలి బీదసాదలను కన్నబిడ్డలవలె కనికరముతో కాపాడుచుండెను.
    ఒకనాడు రంజిత్ సింగ్ పరివారసమేతముగా వేటలాడుట కరణ్యమున కరిగెను. ఆ కాంతారములో దినమంతయు నానావిధములగు క్రూర జంతువులను సంహరించి మహారాజు మిక్కిలి అలసిపోయెను.
    సాయంసమయమున చల్లగాలి సేవించుచు మహారాజొక మామిడిచెట్టు క్రింద కూర్చుండెను. వృక్షశాఖలనుండి గుత్తులు గుత్తులుగా చూతఫలములు వ్రేలాడుచుండెను.
    ఇంతటిలో ఎక్కడ నుండియో ఒక రాయి రివ్వున వచ్చి రంజిత్ సింగ్ ఫాలభాగమునకు తగిలెను. ఆ దెబ్బకు చర్మము చిట్లి రాజు ముఖమునుండి రక్తము బొటబొట కారెను. డుండగము చేసినవారిని పట్టుకొనుటకై రాజసేవకులు నలుదెసలకు పరుగెత్తిరి.
    రాజభటులు కొంతసేపటికి ఒక ముసలిదానిని తీసుకొనివచ్చి రంజిత్ సింగు సమక్షమున నిలబెట్టిరి.
    రాజు : అవ్వా! ఎవతెవు నీవు?
    ముసలిది: దొరా! నేనొక నిరుపేదరాలిని. అల్లంత దూరాన పల్లెలో నివసించుచుందును.
    రా    : రాయి విసరినది నీవేనా?
    ము  : నేనే దొరా! కాని బుద్ధిపూర్వకముగ తమపై విసరలేదు. పొరపాటున రాయి గురితప్పి తమకు తగిలినది బాబయ్యా!
    రా    : మరి ఎవరిపై విసరితివి.
    ము  : చిత్తగించండి మారాజా! నాకు నలుగురు బిడ్డలు. ఇంటిలో గిద్దెడు గింజలు లేవు. ఆకలి బాధతో అల్లాడుచున్న పసిపిల్లలకు నాలుగు మామిడి పండ్లు కొట్టుకొనిపోవుటకై అడవికి వచ్చితిని. రాయి విసరితివి. నా చేతులు పాడుగాను; అది దొర గారికి తగిలినది. తప్పు చేసితిని.
    అని పలికి ముసలి అవ్వ వెక్కి వెక్కి యేడ్వసాగెను. ఆ వృద్ధురాలికిక మరణ దండన తప్పదని అచ్చటివారందరు తలంచిరి. కాని దయామయుడగు మహారాజు తనవెంట గొనివచ్చిన ఆహారపదార్థములలో కొన్ని యిప్పించి సాదరముగా వృద్ధురాలిని సాగనంపెను. అక్కడనున్న వారందరు యిదిచూచి మిక్కిలి అక్కజమందిరి. రంజిత్ సింగు చిరునవ్వుతో ఇట్లు పలికెను.  
    "మనము మానవులము. మనస్సులేని మామిడి చెట్టు సైతము రాతిదెబ్బలను సహించి పరులకు ఫలము లొసగుచున్నది. ఇక మానవులమైన మనము పొరపాటున రాయి విసరినవారిపై కసరుకొనుట న్యాయమా!"  

                                        *  *  *  *   

 Previous Page Next Page