"నేను మీతో కలిశానని తెలిస్తే విక్కీ జైలు నుంచి బయటికొచ్చాక నన్ను చంపేస్తాడు. అందుకని మీరు నన్ను బలవంతంగా ఆ ఇంటికి తీసుకెళ్ళినట్లు వీర్రాజుని నమ్మించడానికి వాడు చూస్తూండగానే బయటకు పారిపోయాను"
రాంబాబుకి నమ్మకం కలగటంలేదామె మాటలు.
దూరంగా నిలబడ్డ లేడీ కానిస్టేబుల్స్ కి సైగ చేశాడు.
ఇద్దరూ వచ్చి రాణీని పక్క గదిలోకి తీసుకెళ్ళి ఆమె బ్యాగంతా వెతికారు. తర్వాత ఆమె బట్టలన్నీ తీయించి వెతికారు.
"ఇప్పటికయినా తీరిందా అనుమానం?" అడిగింది రాణి.
"మాక్కాదు అనుమానం_ మా బాస్ కి"
ముగ్గురూ మళ్ళీ రాంబాబు దగ్గరకొచ్చారు.
"దొరకలేద్సార్!"
"ఇదిగో రాణీ! నిన్నిప్పుడు వదిలేస్తున్నా గానీ ఇరవై నాలుగ్గంటలూ నిన్నే కనిపెడుతూంటానన్న సంగతి మర్చిపోకు! విక్కీ గాడితో నువ్వూ చేతులు కలిపావని తెలిస్తే మాత్రం నా చేతిలో చచ్చావే_ గుర్తుంచుకో!"
"ఒకవేళ విక్కీ మనిద్దరినీ మోసగించాడనీ ఋజువయితే?"
"అప్పుడు మనిద్దరం ఒకటవుతాం, నువ్వు నా లైఫ్ పార్టనర్ వి అవుతావు"
"మా ఇల్లు కూడా సోదా చేయించావా?" అనుమానంగా అడిగింది.
"అవును అక్కడ కూడా దొరకలేదు కాబట్టే వదిలేస్తున్నా"
"నీయమ్మ..." అని ఇంకేదో తిట్టబోయి ఆగిపోయింది రాణి.
రాంబాబు కోపంగా చూశాడు.
"ఏంటే? నోటిమీద బెల్టు దెబ్బ కావాలా_ మళ్ళీ మళ్ళీ పిచ్చివాగుడు వాగకుండా."
రాణి బయటికెళ్ళిపోయింది.
* * * *
గోపాల్రావ్ కారు గారేజ్ లో వుంచి నిశ్శబ్దంగా బాత్ రూమ్ పక్కనున్న గది కిటికీ దగ్గరకెళ్ళి "ఒరే భజన్ రావ్!" అంటూ పిలిచాడు.
వాడు పలకలేదు.
వాడి గురక వినబడుతోంది.
రాయి తీసుకుని కిటికీలో నుంచి వాడి మంచం మీదకు విసిరాడతను.
గావుకేక పెట్టి ఎగిరి మంచం దిగి నిలబడ్డాడు. లైట్ స్విచ్ వేసి తన ముఖానికి తాకిందేమిటో అర్థంకాక మంచం కింద వెతకసాగాడు.
"ఏయ్! నేన్రా రాయి వేసింది" అన్నాడు గోపాల్రావ్ రహస్యంగా.
వాడు ఆశ్చర్యంగా కిటికీ వైపు చూశాడు.
"మీరా సార్!"
"తలుపు తియ్యరా_ తర్వాత ఆశ్చర్యపోదువుగానీ"
"రాత్రంతా ఎక్కడున్నారు సార్?"
"షటప్! ఆ సంగతి నీకనవసరం. నౌఖరుగాడివి నౌఖరుగాడిలా వుండు. ముందు తలుపు తియ్!"
"సరే తప్పేదేముంది సార్! మీరెలా చెప్తే అలా. ఎక్స్ స్ట్రా యాక్టివిటీ నాకెందుకు?"
తలుపు దగ్గరకు నడిచి తలుపు తెరిచాడతను.
గోపాల్రావ్ లోపలికొచ్చాడు. సోఫాలో కూర్చుని బూట్లు తీయసాగాడు.
"ఏం గొడవ లేదు కదా?"
"ఏం లేద్సార్!"
"నాకోసం సీత ఎదురుచూసిందా?"
"చూశారు సార్!"
"మహా అనుమానం పక్షి. అనుమానానికి తగ్గట్లే మనం ఏదొక వ్యవహారంలో ఇరుక్కుపోతూంటాం"
"అవున్సార్!"
"పైగా ఇవాళ ఆ కర్నల్ పక్షి కూడా ఇక్కడే వున్నట్లున్నాడు. కనుక అగ్గికి ఆజ్యం పోసినట్లే_ కదూ?"
"అది కేవలం మీ అభిప్రాయం సార్! దాంతో నాకేం సంబంధం లేదు"
"సరే ఓ పని చేస్తావా?"
"చేయదగినదయితే తప్పకుండా చేస్తాను సార్!"
"మరేంలేదు_ నేను రాత్రి ఒంటిగంటకు ఇంటికొచ్చేసి ఈ సోఫాలోనే పడుకుని నిద్రపోయినట్లు అమ్మగారికి చెప్పాలి"
"అలాగా సార్!"
"ఏం? ఏమయినా అనుమానమా?"
"కానీ అలా చెప్తే వాళ్ళు నమ్మరు సార్! ఉన్నదున్నట్లు చెప్తే బాగుపడతారు"
"ఎందుకు నమ్మరు?"
"ఎందుకంటే అందరూ ఆ మూల వున్న కేన్ చెయిర్స్ లో కూర్చుని మన మాటలన్నీ వింటున్నారు సార్! లైట్ డిమ్ చేశారు కనుక వాళ్ళు మీ కంటికి కనిపించటం లేదు"
గోపాల్రావ్ అదిరిపడి తలతిప్పి కేన్ చెయిర్స్ వున్నవేపు చూశాడు.
సీత, రత్నప్రభ, సీత చెల్లెలు పూజ కూర్చుని తనవంకే చూస్తున్నారు.
పై ప్రాణాలు పైనే పోయాయి అతనికి.
తన సీత ముందు ఎంత పెద్ద ఫూల్ అయిందీ తెలిసిపోయింది.
పూజ అతని అవస్థ చూసి పగలబడి నవ్వేయసాగింది.
"అరె! మీరంతా ఇంకా మేలుకునే వున్నారా? ఎందుకని పడుకోలేదు సీతా?" చాలా కాజువల్ గా మాట్లాడుతున్నట్లు నటిస్తూ అన్నాడు.
సీతకు ఉద్రేకం ఆగటం లేదు.
నెమ్మదిగా అతని దగ్గరకొచ్చి లాగి అతని చెంప పగలకొట్టింది. అదిరిపడ్డాడు.
"ఏంటిది? నీకేమైనా మెంటలా?"
"ఆహా... ఏం యాక్షన్ చేస్తున్నావు బావా! ఏం తెలీనట్లు_ ఇంత యాక్షన్ ఉండి నువ్వు సినిమాల్లో ఎందుకు చేరలేదు బావా?" టీజ్ చేస్తూ అంది పూజ.
గోపాల్రావ్ ఇరకాటంలో పడిపోయాడు.
"సారీ సీతా! అనుకోకుండా ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ ఒకడికి..."
"తెలుసు. అనుకోకుండా హార్ట్ ఎటాక్ వచ్చింది. అనుకోకుండా మీరొక్కరే పక్కనున్నారు. అనుకోకుండా హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఎడ్మిట్ చేశారు."
గోపాల్రావ్ గుండె ఆగినంత పనయింది.
నిజంగా తను అదే చెప్దామనుకున్నాడు.
సరిగ్గా అప్పుడే బిగ్గరగా కల్నల్ కేక వినిపించింది.
"వాట్ బేబీ! ఇంకా పడుకోలేదా? డోంట్ వర్రీ_ మార్నింగ్ నేను గన్ తీసుకుని రాత్రి 'మా ఇంట్లోనే ఉన్నాడని' చెప్పిన వాళ్ళందరి ఇళ్ళకూ వెళతాను" అంటూ హాల్లోకి కళ్ళు నులుముకుంటూ వచ్చాడు.
"ఒరే భజన్ రావ్!"
"ఏం సార్?"
"నిన్న నాకు నువ్వు తెచ్చిచ్చిన విస్కీ ఏ షాప్ నుంచి తెచ్చావురా?"
"అగర్వాల్ వైన్ షాప్ నుంచండి"
"వాడినీ, నిన్ను కూడా కాల్చిపారేస్తానొరేయ్! మీరిద్దరిలో ఎవడో ఒకడు కల్తీ చేశాడది."
"కల్తీయా.. నేనెలా చేస్తాను సార్?"