"మీ ఇష్టం. మీరెప్పుడొచ్చినా నేనెంతో సంతోషపడతానని గ్రహించండి."
ఆమె అతన్ని సాగనంపటానికన్నట్లు గుమ్మందాకా వచ్చింది. అతను వెళ్లిపోయాక తలుపు గడియవేసుకుని, ఆ తలుపుకానుకుని అలా చాలాసేపు నిలబడిపోయింది.
6
డాక్టర్ కృష్ణచైతన్యకి నిద్రపట్టడంలేదు. తన గదిలో ఈజీఛైర్ లో కూర్చుని ఆలోచిస్తున్నాడు.
ఎంతో కష్టపడి ఈ పద్మ నేత్రాలయం అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. దేశంలో వేరేచోట్ల చెయ్యటానికి సాధ్యంకాని ఆపరేషన్లు తానుగాని, తన హాస్పటల్లోని డాక్టర్లుగాని జయప్రదంగా చేసి హాస్పటల్ కు ఎనలేని కీర్తిప్రతిష్ఠళు తీసుకొచ్చారు. తాను రెటీనాకు సంబంధించిన ఆపరేషన్లు, ముఖ్యంగా రెటీనా డిటాచ్ మెంట్స్ సరిచెయ్యటంలో ఎంతో పేరుపొందాడు. తనకు తెలిసినంతవరకూ తను చేసిన వాటిలో ఒక్క ఆపరేషన్ కూడా ఫెయిల్ కాలేదు. కాని కొత్తగా ప్యాసయి వచ్చిన వారిలో తెలివితేటలు, విద్యా వున్నా తొందరపాటు, మితిమీరిన ఆత్మవిశ్వాసం, అజాగ్రత్త నూటికి నుప్పయి నలభయి వరకూ కేసులు ఫెయిలయిపోతున్నాయి.
కేసులు ఫెయిలవుతూన్నప్పుడు అవి ఎందుకు పాడవుతున్నాయన్న ఆలోచన కూడా వుండటంలేదు. ఆపరేషన్ జరిగాక పేషెంట్సు ఎన్నో కాంప్లికేషన్స్ తో మళ్ళీ మళ్ళీ డాక్టర్ల దగ్గరకు వస్తూన్నప్పుడు "మేము బాగానే చేశాం. ఆపరేషన్ పర్ ఫెక్టుగా జరిగింది. అదంతే" అనటమో రకరకాల ఆయింట్ మెంట్స్, డ్రాప్స్ రాసిపారేసి "ఇది వాడి చూడండి. అది వాడి చూడండి" అనటం. పేషెంటు వాళ్ళచుట్టూ తిరిగి ఎన్నాళ్ళకూ ఫలితం కనిపించకపోయేసరికి 'నా ఖర్మ ఇంతే' అని విసుగెత్తి ఊరుకోవటం జరుగుతోంది.
ప్రతి పేషెంటుకూ ఎంతో అనుభవమున్న డాక్టర్ దగ్గరకు వెళ్ళాలని వుంటుంది. కాని అనుభవమున్న డాక్టర్లు, పెద్ద పెద్ద హాస్పటల్స్ దేశంలో కొన్నిచోట్ల మాత్రమే. ఏ మారుమూల ప్రాంతాల్లోనో ఉంటాయి. అక్కడకు ప్రఖ్యాతులయిన డాక్టర్ల దగ్గరకు వెళ్ళాలనివున్నా సామాన్యులకి అవి ఇంచుమించు అసంభవమయిన విషయంగా పరిణమించింది. ఒకవేళ వెళ్ళగలిగినా టెస్ట్ చేయించుకునేందుకు అపాయింట్ మెంట్ కోసం కొన్ని నెలలు, ఆపరేషవసరమయితే తిరిగి దానికోసం కొన్ని నెలలు, ఆ తర్వాత చెకప్ కోసం తడవ తడవకు రావటం. పేషెంట్లు ఈ ఇబ్బందులు తట్టుకోలేక పోతున్నారు.
ఇన్ని నెలలూ వేచివుండి ఏ చీఫ్ డాక్టరు దగ్గరకో వెళితే అతను ఒక్క నిమిషంకంటే ఎక్కువ మాట్లాడడు. ప్రాథమికమైన పరీక్షలన్నీ అసిస్టెంట్లే చేస్తారు, ఆఖరికి చీఫ్ వచ్చి ఒకే ఒక్క నిమిషం "ఆల్ రైట్. వుయ్ విల్ డూ ఇట్" అని ఒక్కవిషయం మాట్లాడి వెళ్ళిపోతాడు.
పేషెంట్ మనసులో ఎన్నో అనుమానాలున్నా అడగటానికి అవకాశమివ్వడు. ఆపరేషన్ అయిపోయాక కూడా అంతే. ఎక్కువ కార్యక్రమం అసిస్టెంట్లే నిర్వహిస్తారు. చివర్న చీఫ్ వచ్చి చూసి 'ఎక్స్ లెంట్!" అని వెళ్ళిపోతాడు.
ఈ పరిస్థితి బాధాకరంగానే వుంటుంది. తనని కలుసుకునేందుకు ఒక్కొక్క పేషెంటూ ఎంత ఇబ్బంది పడవలసివస్తుందో తలుచుకుంటే అతని గుండె విలవిల్లాడిపోతుంది.
కళ్ళు!
ఈ అవయవానికి శరీరంలో ఎంత ప్రాముఖ్యత వుంది? కళ్ళు ఎన్ని భావాలు ప్రదర్శిస్తాయి? కళ్ళు ఎన్ని కథలు చెబుతాయి? కళ్ళలో ఎంత వెలుగుంటుంది! కొందరికి ఎంత అద్భుతమైన విశాల నేత్రాలుంటాయి! గుండెమీద కానీ, కిడ్నీస్ మీదకానీ, ఇతర అవయవాలమీద కానీ స్పెషలిస్టులకు ఓ అథారిటీ వుంటుంది. శరీర పరిణామంతో పోలిస్తే ఎంతో చిన్నదైన ఈ అవయవం మీద ఒకపట్టాన డాక్టరుకు సాధికారం రాదు.
కోపం, అసహ్యం, ఉద్రేకం, పగ, ద్వేషం, కసి, ప్రేమ, మమకారం, జాలి, కరుణ, సౌజన్యత్వం ఈ భావాలన్నీ కళ్లలో ఎంత అపురూపంగా ప్రదర్శించబడతాయి!
కళ్ళు లేకపోతే ఉన్నట్లుండి చూపుపోతే ఆ మనిషి ఎంత విలవిల్లాడతాడు! నేనే ఆ స్థితిలో వుంటే?" అని ఆలోచించే డాక్టర్లెందరు?
ఈ మధ్య అతను ఇంట్లో ఒక్కడూ ఉండలేక హాస్పిటల్లోనే తన గదిలో వుంటున్నాడు.
ఎంతకూ నిద్రపట్టక అతను బయటకు వచ్చాడు. పగలు ఎంతో కళకళ్ళాడుతూ, మనుషులతో బిలబిల్లాడుథూ సందడిగా వుండే హాస్పటల్ రాత్రయేసరికి ఎంత నిశ్శబ్దంగా వుంది! అసలు మనుషులున్నారా లేరా అని భ్రమ కలిగించేటంత చప్పుడు లేకుండా వుంది. అందులో తమ హాస్పిటల్ లో రూల్స్ ఎక్కువ. రాత్రిళ్ళు ఒక్కో పేషెంటుదగ్గర ఒక్కో అటెండరుకన్నా వుండటానికి వీల్లేదు. సిస్టర్స్ కూడా హడావుడిలేకుండా, నిర్ణీతమైన పద్ధతిలో పనిచేస్తారు.
ఈ హాస్పిటల్ తన ప్రాణం. ఆ ప్రాంగణంలో వేసే ప్రతి అడుగూ, తనలో ప్రతి అణువునూ స్పందింపజేస్తూంది.
పద్మ నేత్రాలయలో జనరల్ వార్డులోకన్నా స్పెషల్ రూమ్స్ లో వుండే పేషెంట్స్ ఎక్కువ. ఐదో అంతస్తులో డీలర్స్ రూమ్సున్నాయి.
కృష్ణచైతన్య లిఫ్టు స్వయంగా ఆపరేట్ చేసుకుని ఐదో అంతస్థులోకి వెళ్ళాడు.
అవన్నీ ఎయిర్ కండీషన్డు రూమ్స్, వాటిల్లో ప్రతి గదిలో పేషెంట్స్ వున్నారు. కానీ ఒక్కరయినా వున్నారా లేరా అన్నంత నిశ్శబ్దంగా వుంది.
కృష్ణచైతన్య రూమ్స్ కూ రూమ్స్ కూ మధ్యనున్న కారిడార్ లో ఏదో ఆలోచించుకుంటూ నడుస్తున్నాడు.
రూమ్ నెంబర్ నూటపన్నెండు దగ్గరకొచ్చేసరికి అప్రయత్నంగా ఆగిపోయాడు. ఆ రూమ్ లో ప్రఖ్యాత సినీనటి హేమసుధ వున్నది. మర్నాడు ఉదయం ఆమె కుడికంటికి చిన్న ఆపరేషన్ వుంది.
ఎందుకో అతనికి ఆ రూమ్ డోర్ లాక్ చేసి వున్నట్లనిపించలేదు. చూద్దామని మెల్లగా తోశాడు. స్ప్రింగ్ డోర్ మెల్లగా తెరుచుకుంది.
"ఎవరూ?" అంది ఓ మృదువైన కంఠం.
"నేను" అంటూ కృష్ణచైతన్య లోపలికడుగు పెట్టాడు.
గదిలో బెడ్ లైటు వెలుగుతుంది. బెడ్ మీద హేమసుధ పడుకుని వుంది. కంఠం వరకూ బ్లాంకెట్ కప్పుకుని చాలా అందంగా, చీకట్లో వెలుగులా మెరుస్తూన్నట్లు గోచరిస్తోంది. విప్పారి, విస్ఫారితాలై, డోలాయమానమైన డోలబ్జాలవలె గొప్పగా అద్భుతంగా కదలాడే కన్నులు.