మరుక్షణం ఆమె ప్రక్కకి లాక్కుపోబడుతున్నట్లు గ్రహించి పెనుగులాడటానికి ప్రయత్నిస్తోంది. ఆ రాక్షసబలం ముందు ఆమె శక్తిచాలక నిరుపయోగమైంది. ఇంకోక్షణం గడిచేసరికి ఆమె రోడ్డుప్రక్క ఏకాంత ప్రదేశంలోకి లాక్కుపోబడింది. ఆ పెనుగులాటలో ఆమె కాళ్ళచెప్పులు జారిపోయి నేలమీద వున్న రాళ్ళూ, ముళ్ళూ గ్రుచ్చుకొని రక్తాలు చిమ్ముతున్నాయి. మరికొంచెం దూరంగా ఆమె బలంగా క్రిందకు నెట్టివేయబడి, ఎంత ప్రతిఘటిద్దామన్నా వీలుగాక నిస్సహాయంగా నేలమీదకు వొరిగిపోయింది. పశు కామంతో మదమెక్కి వున్న అతను ఆమె మీదకు వ్రాలాడు. అతని శరీరంలోని ప్రతి అణువూ ఆమెను ఆక్రమించటానికి సిద్ధంగా వుంది.
హఠాత్తుగా అతని భుజంమీద ఓ బరువైన చెయ్యి పడింది. ఉలిక్కిపడి, తలత్రిప్పి చూసేటంతలో అతని మెడను పట్టుకుని ప్రక్కకి లాగేసింది. ఆమెను బలాత్కరించబోయిన వ్యక్తి రెండో వ్యక్తి చేతుల్లోంచి విడిపించుకునేందుకు ప్రయత్నించాడు. కాని అంత బలవంతుడూ రెండోవ్యక్తి శక్తిముందు కొరగాని వాడైపోయాడు. అతి తేలిగ్గా ఓ ప్రక్కకి విసిరివెయ్యబడ్డాడు. క్రిందనుంచి లేచే ప్రయత్నం చేసేలోపల మెడమీద, తలమీదా ఉక్కుపాదాలతో తన్నినట్లు ఎడాపెడా ఊపిరాడనివ్వలేదు. కళ్ళు చీకట్లు క్రమ్మి చివరకు తల ప్రక్కకు వాల్చేశాడు.
మనోజ్ఞకు ఏం జరుగుతున్నదో తెలుస్తోంది. కాని క్రిందపడటంతో వంటికి బాగా గాయాలు తగలటంవల్ల తను లేవలేనిస్థితిలో వుంది.
ఆ వ్యక్తి ఆమె దగ్గరకొచ్చి దిగాబెడతాను" అన్నాడతను.
ఈ సంఘటన జరిగాక ఆమెకి కూడా ఒంటరిగా ఇంటికి వెళ్ళే ధైర్యం లేదు. అతని చెయ్యి పట్టుకుని వెంట నడిచింది.
"ఇలా ఎప్పుడూ జరగలేదు" అన్నది దారిలో. ఆమె గొంతులో చాలా బాధ ధ్వనిస్తోంది.
అతనేమీ మాట్లాడలేదు.
"సమయానికి మీరు రాకపోతే..." అంది.
అప్పటికీ అతనేమీ మాట్లాడలేదు.
"నేనిక్కడ బ్రెయిలీ స్కూల్లో పనిచేస్తున్నాను."
"తెలుసు" అన్నాడు.
ఇద్దరూ ప్రక్కప్రక్కన నడుస్తున్నారు. కొంతదూరం నడిచాక అతనామె చెయ్యి వదిలేశాడు.
ఇంతకుముందు, తనను నేలమీద నుంచి లేవదీసినప్పుడూ, తన చెయ్యి పట్టుకుని నడిచినప్పుడూ, అతని మాట ఎంత ఎత్తునుంచి వెలువడుతున్నదీ- వీటన్నిటినీ క్రోడీకరించుకుని అతని రూపురేఖలు, హైట్ వగైరాలు ఊహించటానికి ప్రయత్నిస్తోంది.
"మీరెవరు?" అని అడిగింది- అతన్ని గురించి ఇంకేమడగాలో తెలీక.
"నేనెవరో తెలుసుకోవటమవసరమా?" అన్నాడు.
"అలా అనికాదు. నన్ను కాపాడిన మనిషి ఎవరో తెలుసుకోవటం సభ్యత అని అడిగాను!"
"చెప్పటానికిష్టం లేదు."
"ఇష్టం లేకపోతే అడగను."
పది నిమిషాల తర్వాత ఇద్దరూ ఆమె ఇంటి దగ్గరకు వచ్చారు. ఆమె తలుపు తాళం తీసింది.
"నే వెళతాను" అన్నాడు.
"కాఫీ తాగి వెళుదురుగాని రండి."
అతను కాదనలేక వూరుకున్నాడు. ఆమె తలుపులు తెరిచి లోపలకు నడిచింది. లోపలంతా చీకటిగా వుంది. కుడిచేత్తో గుమ్మం ప్రక్కనే వున్న స్విచ్ నొక్కింది. లైటు వెలిగింది.
"రండి" అన్నది.
అతను కూడా లోపలకు నడిచాడు. ఇల్లు చాలా చిన్నగా వున్నా నీటుగా, నిరాడంబరంగా, ఆకర్షణీయంగా వుంది. ముందువున్న చిన్నగదిలో నాలుగు ఫేము కుర్చీలు, మధ్యలో చిన్న టీపాయ్, ఓ ప్రక్కన స్టాండుమీద టూ-ఇన్-వన్, కార్నర్ లో ఫ్లవర్ వాజ్...
"కూర్చోండి" అంది.
"తర్వాత అయిదు నిమిషాల్లో వస్తాను" అంటూ లోపలకు వెళ్ళింది. కిచెన్ రూమ్ లో లైట్ వెలగటం, ఆమె స్టవ్ వెలిగించటం, పాలువున్న గిన్నె స్టవ్ మీద పెట్టడం, డికాక్షన్ కలిపి కాఫీ తయారుచెయ్యటం, షెల్ఫ్ లోంచి కప్పుతీసి అందులో పొయ్యటం తడుముకోకుండా చేసింది. కాఫీ కప్పు తీసుకొచ్చి అతనికందించింది.
"మీరో?" అన్నాడు.
"నేనిప్పుడు అన్నం తింటాను."
అతను కప్పు నోటిదగ్గర పెట్టుకోబోతున్నాడు.
"అరె. పంచదార వెయ్యటం మరచిపోయానుండండి" అంటూ ఆమె చెయ్యిజాచి అతని చేతిలోంచి కప్పు తీసుకుంది. తిరిగి కిచెన్ లోకి వెళ్ళి ఓ చిన్న ప్లాస్టిక్ జార్ తీసి అందులోంచి స్పూన్ తో పంచదారతీసి కప్పులో వేసి కలిపింది. మళ్ళీ అతని దగ్గరకు వచ్చింది. ఎక్కడా తడబాటుగానీ, వెదుక్కోవడంగానీ లేదు.
"ఇప్పుడు తీసుకోండి."
అతను కాఫీ త్రాగటం పూర్తిచేసి కప్పు టీపాయ్ మీద పెట్టాడు.
"ఇహ వస్తాను" అన్నాడు లేచి నిలబడి.
"మళ్ళీ ఎప్పుడొస్తారు?" అనడిగింది.
"మళ్ళీనా?"
"ఇష్టం లేకపోతే వద్దులెండి" అంది అతని భావం కనిపెట్టినట్లు.
"వీలు చూసుకుని వస్తాను."