అయినా తప్పదు. నీ వర్తమానం, భవిష్యత్తు శుభప్రదంగా వుండాలంటే నువ్వాస్థితికి ఎదిగి తీరాలి.
ఎలా?
చిన్న ఉదాహరణ చెపుతున్నాను.
ఆ మధ్య ఓ స్త్రీ వచ్చింది పేషెంట్ గా ముఫ్ఫై ముఫ్ఫై అయిదు సంవత్సరాలుంటాయి. చాలాకాలంగా బ్యాంకులో పనిచేస్తూ గుమాస్తా స్థాయినుంచి ఎదగడానికి ప్రయత్నిస్తూ డిపార్టుమెంట్ టెస్ట్ లు రాస్తూ విఫలురాలవుతుంది. ప్రమోషన్ రావటం లేదు. ఈ పరాజయం ఆమెను చాలా బాధిస్తుంది.
ఒకవైపు నుంచి ఏదో అశాంతి, రెండోవైపు నుంచి అనారోగ్యం ఆమెను వెన్నాడుతున్నాయి.
ఆమెను పరిశీలనగా చూశాను. అందగత్తె అనే చెప్పవచ్చు. చురుకుగా, చాలా తెలివైనదానిలా కూడా కనబడుతోంది. కాని ఆమె కదలికల్లో, హావభావాల్లో చాలా అలజడి కనిపిస్తోంది.
ఆమెను కొన్ని ప్రశ్నలడిగాను. యథాలాపంగా అడుగుతున్నట్లు చాలా సున్నితంగా ఆమెమీద సానుభూతి కనబరుస్తూ నాకు కావాల్సిన సమాధానాలు రాబట్టుకున్నాను.
ఆమెకు తోటి ఉద్యోగులలో కొందరంటే పడదు. ఆమెను వాళ్ళు హేళన చేస్తున్నారన్న కోపం వుంది. ఆ కోపం ద్వేషంగా కూడా మారింది. బాంక్ మేనేజర్ తాను ఎంత నిజాయితీ పనిచేస్తున్నా గుర్తించక దూషిస్తుంటాడన్న అక్కసు వుంది.
కుటుంబ సభ్యులంటే కూడా కొంతవరకూ కోపం, ద్వేషం వున్నాయి. చిన్నతనంలో తండ్రి కుటుంబ బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడనీ, తల్లిని అకారణంగా హింసించేవాడనీ బలీయమైన వ్యతిరేకతతో కూడిన భావం నాటుకుపోయి వుంది. అన్నిటికీ మించిన ఒక అపరాధభావం..... పెళ్ళికి ముందు ఒకతనితో లవ్ ఎఫైర్ వుంది. అది ఫెయిలయ్యి కొన్నాళ్ళకి ఇతన్ని పెళ్ళిచేసుకున్నది. ఇద్దరూ అన్యోన్యంగానే వుంటారుగానీ, అతనిముందు ఈ రహస్యం దాచి మోసం చేస్తున్నానే అన్న అపరాధభావం తీవ్రంగా పీడిస్తున్నది.
ఆమె ఆలోచనా విధానాన్ని ప్రక్షాళనం చెయ్యడానికి ఉపక్రమించాను.
నాకు తెలిసినంత వరకూ పదిమంది పనిచేసే ఏ ఆఫీసులోనైనా ఒకరంటే ఒకరికి పడదు. ఏవో గొడవలు వుంటూనే వుంటాయి. నాకు ప్రపంచంలో అత్యంత సహజంగా కనిపించే విషయాల్లో ఇదొకటి. ఈ పడకపోవడమనేది ఓ వ్యసనం. దీన్ని చాలా క్యాజువల్ గా తీసుకోవాలి.
మేనేజర్ అప్పుడప్పుడూ దూషించటం గురించి.
అధికారి అన్నవాడు అప్పుడప్పుడూ చీవాట్లు వేస్తూ వుంటాడు. మనం మన ఇంట్లో పనివాళ్ళను చీవాట్లు వేయడంలేదా? ఎందుకలా చేస్తున్నాం? వాళ్ళు సరిగా పనిచెయ్యటం లేదనో, ప్రదర్శించే వైఖరి బాగాలేదనో ఒక అధికారి బాద్యతలు నిర్వహించటంలో కిందివారిలో అలాంటి తప్పులే అతనికి కనిపిస్తూ వుంటాయి. నిన్ను నీవు నిజాయితీగా ప్రశ్నించుకో నీ విధినిర్వహణ నూటికి నూరుపాళ్ళూ సామర్ధ్యంతో, చిత్త శుద్దితో చేస్తున్నావా? ఒకవేళ చేయాలని వున్నా చేయగలుగుతున్నావా? ఎన్నిసార్లు దొంగకారణాలు చూపించి సెలవు పెట్టి వుంటావు? మీ ఆఫీసు ఫోను అధికారి దృష్టిలో పడకుండా సొంత పనులకు వాడుకోవటం లేదా? అది తప్పని తెలిసే కదా చాటుగా వాడుకుంటున్నావు?
ఇహ... తండ్రిమీద వున్న కోపం, ద్వేషం గురించి.
నిజమే. అతని ప్రవర్తనలో లోప భూయిష్టంగానే వుండివుండవచ్చు. నిజజీవితంలో మనని ఎంతోమంది గాయపరుస్తూ వుంటారు. మనం అంతగా ప్రాముఖ్యం ఇవ్వనవసరంలేని వాళ్ళగురించి పట్టించుకోకు. వాళ్ళకు దూరంగా వుండు. వాళ్ళని శాపనార్ధాలు పెట్టకు. వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి క్రమంగా మరిచిపో.
ఇహ తప్పని సరైనవాళ్ళు....ప్రస్తుత సందర్భంలో తండ్రి, ఇంకా అప్పుడప్పుడూ గాయపరచిన ఇతర కుటుంబసభ్యులు.
"వాళ్ళను క్షమించెయ్యి."
"నేను క్షమించలేకపోతున్నాను. నాకు చేతకావటంలేదు."
"ఎందుకని?"
"బహుశా అంత ఉదారహృదయం నాలో లేదు. అంత క్షమాగుణం నాకు లేదు."
"ప్రతివారిలో ఏదో ఒక శాతంలో క్షమాగుణం వుంటుంది. వుండి తీరుతుంది. అది బయటకు తీసుకురావటం నీకిష్టంలేదు. అంటే పరోక్షంగా నీవు మారటానికి ఇష్టపడటం లేదన్నమాటా!"
ఆమె అర్ధంకానట్టు చూసింది. కాని ఆ చూపులో అలజడిగానీ, అసహనంగానీ లేవు. కొత్త సత్యాన్ని తెలుసుకుంటున్నానన్న ఆసక్తి గోచరించింది.
"అవును, చాలామందికి ఇంకా నిజం చెప్పాలంటే మనందరికీ, మనం వున్న నారో మైండెడ్ పరిధి నుంచి బయటకు రావటానికి, అంటే మనం మారటానికి ఇష్టంలేదు. ఆ అల్పబుద్దులే మనకు సుఖంగా, ఆనందంగా కనిపిస్తూ వుంటాయి. వాటినుంచి బయటపడితే భావ స్వేచ్చ కోల్పోతామని భయం. ఇంకా లోతుగా పోవాలంటే, పవిత్రత అంటే గౌరవమే గానీ, పవిత్రంగా వుండాలంటే ఇష్టంలేదు. అలా వుంటే మనమేదో కోల్పోతున్నామన్న భయం. ఉదాహరణకు ఎప్పుడూ అసహ్యంగా బూతులు మాట్లాడేవాడిని చూడండి. అతను ఆ బూతులు మాట్లాడటంలో ఓ నిషా, సంతోషం అనుభవిస్తూ వుంటాడు. ఆ అలవాటు మానటం అతనికిష్టంలేదు."
ఆమెలో కొత్త ఆలోచనలు ప్రవేశిస్తున్న విషయాన్ని గమనించాను.
"మనిషికి బేసిక్ గా తాను మారటం ఇష్టంలేదు. ఇది చాలా కఠోరసత్యం."
"మీరు చెప్పింది నిజమే అనుకుందాం. మారటంవల్ల అనేక ఉపయోగాలు వున్నాయనుకుందాం. మారటం అంత కష్టమైనదైతే ఆహ్ది నేను సాధించేదెలా?"
"మీరు మారటానికి మీ అంతట మీరు ప్రయత్నం చెయ్యనక్కర్లేదు. మీరు మారటం పట్ల సుముఖత చూపించండి."
"అంటే?"
"నేను మారితే బావుండును' అనుకునే స్థితికి మీరు వస్తే చాలు. అంటే మీరు మారటాన్ని మీరు ఆమోదిస్తున్నారన్నమాట."
"ఇంకా విపులంగా చెప్పండి."
"నేను మారాలి, నేను మారాలి" అని ఓ మంత్రంలా అనుకుంటూ వుండండి. అది నెమ్మదిగా పనిచెయ్యటం మొదలుపెడుతుంది."
ఆమె చాలా సిన్సియర్ గా ఆలోచిస్తున్నదని ఆమెముఖం చూస్తే తెలిసిపోతుంది.
"మారాలన్న సాధన కష్టమైతే కావచ్చు. మారటం పట్ల సుముఖత చూపించటం ఏమంత కష్టం కాదు. మీరు మారాలన్న ఆలోచన మీ మెదడులోకి ప్రవేశించటం మీకిష్టమేనా?"
"ఇష్టమే."
"గుడ్, ఇప్పుడు క్షమించటం జోలికి వెడదాం. మీ తండ్రిప్రవర్తన మీద చాలా కోపం, ద్వేషం పెంచుకున్నారు. ఆయనలో మీకంతా చెడే కనిపించిందా? మంచి లక్షణం ఒక్కటికూడా కనిపించలేదా?"
ఆమెముఖంలో ఆలోచించటం ఇష్టంలేని చిహ్నాలు కనబడుతున్నాయి.
"ఇంతవరకూ ఎప్పుడు ఆలోచించలేదు. అవునా? అలోచించి చెప్పండి."
ఆమె కళ్ళు మూసుకుంటోంది.