ఇది జీవితంలో నేను ఎదగటానికి ఎలా దోహదం చేసిందో చెపుతాను.
'కల్కిధర్మం' గ్రంథంలో కొంతవరకూ రాశాను. ఇప్పుడు సందర్భమొచ్చింది కాబట్టి ఇంకో దృక్పథంనుంచి రాస్తున్నాను.
కొన్ని సంవత్సరాలక్రితం.... నేనెంతో శ్రమించి నా సంపాదనంతా ధారపోసి మనసుపడి, నా అభిరుచులమేరకు కట్టుకున్న ఇంటిని పరిస్థితులకు లొంగిపోయి అమ్మేసుకోవలసి వచ్చింది. హాస్పిటల్ గా వున్న బిల్డింగ్ వేరే వుంది. కింద హాస్పిటల్, పైన సిస్టర్స్ నివాసంగా వున్న రెండుమూడు గదులు వాళ్ళకు వేరే అద్దెకు వుండటానికి ఏర్పాటు చేసి అందులోకి వచ్చేశాం. రెండేళ్ళ మనవరాలు, అప్పటికి సమస్యల వలయంలో కూరుకుపోయి వున్న కుమారులు, కోడళ్ళు.
ఆ రాత్రి... వాళ్ళు లగేజ్ చేరవేస్తుంటే డాబామీద చాప పరుచుకుని నిశ్శబ్దంగా పడుకుని వున్నాను.
ఈ లగేజ్, డైనింగ్ టేబుల్, ఫ్రిజ్, సోఫాసెట్టు, బీరువాలు.... ఎక్కడ వుంచాలి? మేము ఎక్కడ వుండాలి?
అద్దె ఇంట్లోకి వెళ్ళి వుండవచ్చు. కాని ఎందుకో ఎంత ప్రయత్నించినా మనస్కరించలేదు.
ఏప్రిల్ నెల ఎండలు, గదుల్లోంచి కాలు బయటపెడితే పసిదానికి పాదాలు మాడిపోతూ వుండేవి. గదుల ఇవతల స్లాబ్ లుగానీ, కనీసం షెడ్ గానీ వేయించుకునేందుకు చాలా వ్యవధి కావాలి.
ఆ జీవితం... ఒక్కసారి ఉన్నతస్థితినుంచి ఎక్కడికో పడిపోయాను.
తట్టుకోలేకపోతున్నాను.
అప్పుడు భయంకరమైన డిప్రెషన్ కు లోనయ్యాను.
సరిగ్గా అలాంటి రోజుల్లో ఇందాక చెప్పిన బిజినెస్ మేగ్నెట్ కుటుంబాన్ని గమనించటం జరిగింది.
నాలో కదలిక మొదలైంది.
ఎలాంటి కదలిక?
స్ఫూర్తితో కూడిన కదలిక.
ఆత్మపరిశీలనకు తావిచ్చే కదలిక.
మనిషిని పెంచే కదలిక.
మంచి ఆలోచనకు అంత శక్తి వుంటుందన్నమాట. చాలా కొద్ది సమయలో నాలో డిప్రెషన్ మాయమైపోయింది. నాకు తెలియకుండానే మామూలు మనిషినై పోయాను.
ఒకసారి పేషెంట్ గా ఒక పరిచితుడు వచ్చాడు. పాత ఇంటి పరిసరాల్లో వుంటున్న వ్యక్తి.
ఎంత విముఖత చూపిస్తున్నా ఆ ఇంటి ప్రస్తావనే తీసుకొస్తున్నాడు.
"ఆహా! ఏమి భవనమండీ అది. ఆ భవనం మెట్లు దిగి మీరు కారెక్కుతుంటే చూడటానికి రెండుకళ్ళూ చాలేవి కావు."
"మీకు కలిసిరాలేదా? ఇప్పుడా ఇంట్లో కాపురముంటున్న వారి పరిస్థితి మూడుపువ్వులూ ఆరుకాయలుగా వుంది. పట్టిందల్లా బంగారమవుతోంది."
అప్పటికీ వారించటానికి ప్రయత్నిస్తున్నాను.
"అలాంటిది.... ఆ ఇల్లు అమ్ముకోవల్సి వచ్చినందుకు..... మాకే ఇంత బాధగా వున్నదంటే మీరెంత బాధపడుతున్నారో..."
"చూడండీ, ఆ టాపిక్ వదిలెయ్యండి" అన్నాను ఈసారి కొంచెం కటువుగా.
"మీకు..."
"మీరంటున్న మాటలు అప్రస్తుత ప్రసంగం. మీరనుకుంటున్నట్లు నాకు కోపం రాలేదు. రాదుకూడా ఇహ బాధ అంటారా? ప్రస్తుతం లేదు ఒకవేళ వున్నా అది నాకూ, మా కుటుంబసభ్యులకూ మధ్య వుండవలసిన వ్యక్తిగత విషయం. దయవుంచి వచ్చిన పని చెప్పండి" సాధ్యమైనంత మృదువుగా అన్నాను.
మన గతంలోని ఒడిదుడుకుల్ని ఎత్తి చూపేవారి సానుభూతి మనకక్కర్లేదు. అందులో సానుభూతి శాతంకంటే శాడిజం శాతం ఎక్కువ వుంటుంది. అందులో సందేహమక్కర్లేదు.
జాగ్రత్తగా ఆలోచించు. అందులోంచి కొత్తమనిషిగా ఆవిర్భవించు.
ఒక్కసత్యం తెలుసుకో ఏ వైభవమూ శాశ్వతంకాదు. అది సాధ్యంకాదు. ఏదో కొద్దిమందిని దృష్టిలో పెట్టుకుని పోల్చుకోకు. ఆ కొద్దిమందీ నిరంతర వైభవంలో వున్నట్టు కనబడుతున్నా, వారెదుర్కుంటున్న రహస్యపు ఒడిదుడుకులు నీకు తెలీదు.
చాలామందిని పరిశీలించు వారు గతవైభవమని చెప్పుకునేది. "అబ్బో ఆ రోజుల్లో మన ప్రభ అలా వెలిగిపోయేది" అంటూ చెప్పే వాటిల్లో చాలావరకూ అతిశయోక్తులు. లేకపోతే ఇప్పటి తమ ఉనికిని గౌరవప్రదం చేసుకునేందుకు పడే తాపత్రయం లేకపోతే ఓ ఇమేజ్ సృష్టించుకోవటానికి చేసుకునే అందమైన ఆత్మవంచన.
ఇంకా లోతుకుపోయి ఆలోచించు. ఒకవేళ నిజంగా నీకు గతవైభవం వుండి వుంటే... ఆ అదృష్టం చాలామందికి దక్కలేదనీ, అలా దక్కిన కొద్దిమంది అదృష్ట వంతులలో నువ్వూ ఒకడివనీ గుర్తించి సంతోషపడు. దాన్ని ఓ తియ్యని అనుభూతిగా ఆస్వాదించు.
నిన్ను నీవు ప్రేమించుకో
ఈ అంశంకూడా గతానికి సంబంధించినదే. ఇప్పుడు మనం గతంలోని ఇంకో విభాగంలోని వెడుతున్నాం. ఇది ఇందాకటి కన్నా ముఖ్యమైనది. నీ ప్రస్తుత జీవితాన్ని తీర్చిదిద్దేది.
నా మట్టుకు నాకు గతం గుర్తుకొస్తే అది చాలా వికారంగా వుంటుంది. చాలా సందర్భాలలో తెలివితక్కువగా ప్రవర్తించటం, పరీక్షలకు చదవవలసిన శ్రద్దగా చదవినా, వున్నత ప్రమాణాలతో ప్యాస్ కాకపోవటం, పరిస్థితులకు ఎదురీది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యలేకపోవటం... ఇలా ఎన్నో...
అవన్నీ గుర్తుకువస్తూంటే చాలా అసహనంగా వుంటుంది. అందుకని గుర్తుకు రాకుండా జాగ్రత్త పడుతూంటాను. నీవు గతాన్ని మార్చగలవా? గతాన్ని మార్చలేవు. అదెప్పుడో జరిగిపోయింది. అందుకని అందులోని అపశ్రుతులు మరిచి పోవటం మినహాయించి నీకు వేరే గత్యంతరం లేదు. భవిష్య ప్రణాళిక నీ చేతుల్లో వుంది. ఫలితం విషయమై మంచి వ్యూహం స్వాధీనంలో వుంటుంది. భవిష్యత్తును గురించిన వ్యూహరచనలోనే గతాన్ని చెరిపెయ్యి. ఆ చెడు స్మృతులన్నీ నిర్మాణాత్మకమైన వ్యూహరచనకు అవరోధం కలిగిస్తూ వుంటాయి.
గతంలో నీకెన్నో చేదు అనుభవాలు వుండవచ్చు. ముఖ్యంగా నీ తల్లిదండ్రుల వల్ల నీకెంతో గాయం కలిగి వుండవచ్చు. నీ అన్నయ్యలు, అక్కయ్యలు.... వారు ఎన్నో సందర్భాలలో నీకు బాధ కలిగించి వుండవచ్చు. అవి నీవు మరిచిపోలేకుండా వున్నావు. వారిమీద కినుక, ద్వేషం.... ఇవి నిన్ను వదిలిపెట్టటంలేదు.
క్షమాపణ గురించి ఎన్నోసార్లు చెబుతూ వచ్చాను. ముందు ముందుకూడా దీని ప్రస్తావన ఎన్నోసార్లు రావచ్చు. ఎందుకంటే జీవితంలో దీని ప్రాముఖ్యం ఎంతో వుంది. నీ జీవితాన్ని మలుపు తిప్పగలిగింది ఈ క్షమాపణే.
అయితే ఇది నీకు సాధ్యం కాదని నాకు తెలుసు.
చెప్పటం తేలికనీ, ఆచరించటం కష్టమనీ, కొన్ని సందర్భాల్లో అసాధ్యమనీ తెలుసు.