ఎస్.ఐ. రాఘవ తిమ్మడ్ని గుర్తుపట్టాడు. కాని ఎంత కాలంగానో చెప్పాలనుకుంటున్న కృతజ్ఞతలు వెలిబుచ్చటానికి సందర్భం ఇది కాదని ఆగిపోయాడు.
"ఎనీ ప్రాబ్లమ్ మిస్టర్ ఎస్.ఐ....?" సుదర్శనరావు కేజువల్ గా అడిగాడు.
"తిమ్మడు అనే వ్యక్తిని మీ మనుష్యులు ఛేజ్ చేస్తున్నట్టు వర్తమానం వచ్చింది. గంటక్రితం అతన్ని బంధించి మీ ఇంట్లోకి తీసుకెళ్ళినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. అందుకే వచ్చాం ఇలా" రాఘవ నిర్భయంగా అన్నాడు.
సుదర్శనరావు, ప్రియాంకలు కించిత్ కూడా షేక్ అవలేదు సరికదా, చిరునవ్వుతో తిమ్మడివేపు చూశారు.
"నేనే తిమ్మడ్ని. ఆయన నాకేం హాని తలపెట్టలేదు. నాతో పనుండి పిలిపించారు."
"అంటే?" రాఘవ తిరిగి ప్రశ్నించాడు.
"అంటే ఏముంది...?" తిమ్మడు ఓ క్షణం ఆగాడు. సుదర్శనరావు కూల్ గా వున్నా. ప్రియాంక మాత్రం ఆతృతగా ఎదురుచూస్తోంది.తిమ్మడు ఏం చెబుతాడోనని.
"వాళ్ళమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయాలని పిలిపించారు. ముహూర్తం నాలుగు సంవత్సరాల తర్వాత ఇదేరోజున నిర్ణయించారు. అందుకే వచ్చాను. ఇంతకుముందే తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నాం" అన్నాడు చిరునవ్వుతో ప్రియాంకవైపు చూస్తూ.
అక్కడున్న అందరూ తృళ్ళిపడ్డారు.
అర్ధంకానట్టు ఓ క్షణం అయోమయంగా చూశారు.
కనీసం పేరు తలవటానికే భయపడే గ్రేట్ బిజినెస్ మాన్ సుదర్శనరావు ముందే అలా మాట్లాడ్డం విస్మయంగా వుంది వారికి.
ప్రియాంక నవ్వింది పెదాలు విడివడనట్టు.
ఆవేశంగా ముందుకు దూకబోతున్న తండ్రిని ప్రియాంకే ఆపింది.
తిమ్మడు చాలా నింపాదిగా ముందుకు సాగిపోయాడు.
పైకి కనిపించకపోయినా తిమ్మడి తెగువకు, ధైర్యానికి లిప్తపాటు షేక్ అయ్యాడు సుదర్శనరావు.
ఈ వివరాలన్నీ క్షణాల్లో మాలినికి చేరిపోయాయి. అలా చేరిపోయేలా చూసుకుంది తన అవసరం కోసం.
* * * *
"ఎలా గెలవాలనుకొని ఆ పందెం కాసావు...?" మాలిని తిమ్మడికే ఆసక్తిగా చూస్తూ అడిగింది.
"గెలవగలనని ఆ పందెం కాయలేదు. అప్పటికా ప్రమాదం నుంచి తప్పించుకొనేందుకే కాసాను..." తిమ్మడు సూటిగా చూస్తూ అన్నాడు.
యుక్తి వుంది... శెభాష్... మనస్సులోనే అనుకుంది మాలిని.
"ఆపద్ధర్మానికి పందెం కాసినా పందెమే కదా...?" ఆమె మరలా అడిగింది.
"కావచ్చు...." తిమ్మడు పొడిగా అన్నాడు.
"మంచికో, చెడుకో పందెం కాసావు. ఆ పందాన్ని నెగ్గించుకోవాలన్న పట్టుదల, పౌరుషం నీలో లేవా?"
తననెతుక్కుంటూ మామిడితోపు వరకూ వచ్చి, గుచ్చి గుచ్చి ప్రశ్న లేస్తుందేమిటీవిడ...? అసలే కుక్కపిల్ల కనిపించక తను బాధపడుతుంటే- ఇవి తిమ్మడి ఆలోచనలు.
"లేవా చెప్పు..." మాలిని తిరిగి అదే ప్రశ్న వేసింది.
అతను కొద్ది క్షణాలు మౌనంగా వుండి "వుంటే... ఉంటే మాత్రం ఎలా సాధ్యం...? నా దగ్గర అయిదుపైసలు లేవే! ఐ నో మనీ... ఐ నో స్కూల్..."
మాలినికి తిమ్మడు చిత్రంగా కనిపిస్తున్నాడు.
"నీకు ఇంగ్లీష్ వచ్చా...?" ఆసక్తిగా అడిగింది.
"ఐ సీ ఇంగ్లీష్ పిక్చర్స్.... నాట్ తెలుగు... స్మాల్... స్మాల్"
"ఇంగ్లీష్ ఐ నో... వై?"
ఆమె పెదాలు విడివడకుండా నవ్వింది.
"నీకు ఇంగ్లీషు అన్నా... ఇంగ్లీషు సినిమాలన్నా ఎందుకు నచ్చుతాయి....?"
"బిగ్ బిగ్ బిల్డింగ్... బిగ్ బిగ్ కార్... బిగ్ మనీ..."
ఆమె కళ్ళప్పుడు మెరిసాయి.
తనకి కావల్సిన లక్షణాలన్నీ ఇతనిలో వున్నాయి. పట్టుబట్టి పట్టుదలగా ఇతన్ని సానబెట్టి, ఆ పోటీకి అతనిలో స్థిరపడ్డ ఆశలకు తను రెక్కలు కల్పిస్తే చాలు...
"మరవన్నీ ఎలా సాధిస్తావు?"
అతను మౌనంగా వున్నాడు.
అతని ముఖం భావరహితంగా వుంది.
"నీ దగ్గర రెండువేలు లేకేకదా మీ ఫ్రెండ్ తల్లిని రక్షించుకోలేక పోయింది?"
అతను సమాధానం చెప్పలేక సిగ్గుపడ్డాడు.
"ఆఫ్ట్రాల్ రెండు వేలు... అవి కూడా సాధించలేకపోయావు. ఒక పెద్ద సమస్యకు బ్రహ్మాండమైన ఐడియా చెప్పి ఆమెకు లక్ష వచ్చేలా చేసావుగాని- నీ రెండువేలు రాబట్టుకోలేకపోయావు. ఇలాంటి నువ్వు రేపు మీ అమ్మకు జబ్బు వచ్చినా రక్షించుకోలేవుగదా? ఏ మనిషైనా ఇంతటి అధ్వాన్న పరిస్థితిలో వుండవచ్చా?"
అతడు తలెత్తి ఆమెవేపు సాలోచనగా చూసాడు.
"నిజమే. కాని నా దగ్గర చిల్లిగవ్వలేదే?" అతను ఆలోచనల్లో పడ్డాడు.
"చదువుతున్నవాడు చదువును, డబ్బున్నవాడు డబ్బును పెట్టుబడిగా పెడతాడు..."
"అవి రెండూ లేనివాడు..." తిమ్మడు చటుక్కున అడిగాడు.
"తెలివితేటల్ని" ఆమెకి అతనిమీద మరింత ఆసక్తి పెరిగింది.
"ఉన్నాయా నా దగ్గరవి?" అతను అమాయకంగా అడుగుతుంటే ఆమె మందహాసం చేసింది.
"అవి లేనప్పుడు ప్రియాంకకు లక్ష ఎలా గెలిపించి పెట్టావ్...?"
"అవే సరిపోతాయా?"
"అసలు కావల్సింది అవే."
"ఇంతకీ ఏమిటి మీ ఉద్దేశ్యం?" తిమ్మడు ఆసక్తిగా అడిగాడు.
"నీకు పౌరుషం- ఆత్మాభిమానం వుంటే నీవు కాసిన పందానికి నిలబడతావు. నీవు పందెంలో నెగ్గేందుకు నేను నీకు సహకరిస్తాను. నేనెందుకీ సహాయం చేసేదీ ఇప్పుడప్పుడే నీవు అడగవద్దు. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను."
అతను ఆశ్చర్యంగా చూసాడామెవేపు.
"ఈ ప్రపంచంలో చదువున్నవాడు. డబ్బున్నవాడు బ్రతకలేకపోవచ్చేమో కాని తెలివితేటలున్నవాడు బ్రతగ్గలడు. బాగా బ్రతగ్గలడు. తెలివితేటలున్నాయని ఎవరైనా సమయం వచ్చినప్పుడు రుజువు చేసుకోగలిగితే- అవి లేనివాడు ఉన్నవాడ్ని అడ్డం పెట్టుకొని పైకెళ్ళాలనుకొంటాడు. సో... ఆ విధంగా తెలివితేటలున్నవాడు మొదట అంధకారంలోంచి బయటకొస్తాడు..."
"ఇంతెందుకు... మీరు నాకు సహకరించండి, నేనేమిటో నిరూపించుకొంటాను..."
"శెభాష్... అదీ పట్టుదల అంటే. ఈరోజునుంచీ నీ పేరు తిమ్మడు కాదు. త్రినాధ్. నీ పరంగా ప్రతి విషయంలోను సరికొత్త మార్పు రావాలి. ఇప్పుడు సుదర్శన్ రావుకి ఫోన్ చేసి నీవు పందానికి సమాయత్తమవుతున్నట్లుగా చెప్పనా? చెప్పాక జారిపోవుగదా?"
"నాది మాటంటే మాటే... నో ఫియర్... ఐయామ్ డేంజర్..." తిమ్మడు నేలమీంచి లేస్తూ అన్నాడు స్థిరంగా.
అతని కళ్ళలో ఇప్పుడు పట్టుదల... పగ... ప్రతీకారం... లక్ష్యశుద్ధి కనిపిస్తున్నాయి.
ఆమె కానందంగా వుంది... ప్రపంచాన్ని జయించబోతున్నంత ఆనందంగా వుంది.
* * * *
ఫోన్ మ్రోగుతుంటే ప్రియాంక ఎత్తి "మీకే" అంటూ తండ్రికిచ్చింది.
ఏవో ఫైల్స్ చూసుకుంటున్న సుదర్శన్ రావు ఫోన్ ని చేతిలోకి తీసుకున్నాడు.
"హలో... ఎవరు...?" స్టయిల్ గా అడిగాడు.
ఫోన్ నిశ్శబ్దంగా వుంది.
"హలో..." మరలా అన్నాడు విసుగ్గా.
"నేను... నీ మృత్యువుని... నీ ఆపదను... నీ ఒకప్పటి అవసరాన్ని. గుర్తుపట్టావా?"
సుదర్శన్ రావుకి ఆ గొంతు ఎవరిదయిందీ కొద్దిక్షణాలు గుర్తుకు రాలేదు. కాని, ఎప్పుడో, ఎక్కడో బాగా పరిచయం వున్న గొంతులా అనిపిస్తోంది... ఫోన్ కి ఆవేపు, ఈవేపు కొద్ది క్షణాలు నిశ్శబ్దం.
ప్రియాంక ఆశ్చర్యంగా తండ్రివేపే చూస్తోంది.
అంతలో వినిపించింది సుదర్శన్ రావు గొంతు-
"పాపం నీకేమిటిలే- ఎవరికైనా మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ఎలా వస్తుందో తెలుసుకోలేరు..."
అప్పటికి గుర్తువచ్చింది అతనికి- వెంటనే ఉలిక్కిపడ్డాడు. అతని వేళ్ళు టెలిఫోన్ పై బలంగా బిగుసుకుపోయాయి.
"కథ పాకాన పడబోతోంది. నేను రంగప్రవేశం చేయబోతున్నాను. నేనేమిటో నీకు తెలుసు. నేను రంగప్రవేశం చేస్తే ఏం జరుగుతుందో, ఎలా జరిపించగలనో నీకు తెలుసు. ఇప్పుడు నా చేతిలో ఒక వజ్రాయుధం వుంది. ఆ వజ్రాయుధం పేరు తిమ్మడు- కాదు, కాదు- నేటి నుంచి త్రినాధ్- కొన్నాళ్ళకి త్రినేత్రుడు. ఇప్పుడు నా పని ఆ వజ్రాయుధాన్ని సానపట్టడం- పాపం ఇక నీకు నిద్రలేని రాత్రులెన్నో-? ఉంటాను మరి- బై-" ఆ వేపు ఫోన్ పెట్టేసింది మాలిని.
* * * *
ప్రాతఃకాలం-
జగతి జాగృతం కాలేదింకా-
అందరూ గాఢసుషుప్తిలో వుండగా-
స్మశాన నిశ్శబ్దం ఆ పాడుబడ్డ శివాలయ ప్రాంగణంలో అలుముకొని వుండగా ఒక జీప్ వచ్చి ఆగిందక్కడ.
అందులోంచి ముందుగా దిగింది మాలిని. ఆశ్చర్యపోతూనే తిమ్మడు దిగాడు.
16వ శతాబ్దపు శివాలయం అది. ఎండకు ఎండి, వానకు తడిసి శిథిలమైపోయినా గత వైభవ ప్రాభవం, కళాత్మకత ఆ శిథిల స్తంభాలపై ఇంకా కనిపిస్తూనే వుంది.
ఐదడుగుల ఆరంగుళాల ఎత్తులో, పట్టుచీరలో, ఆ పైన కప్పుకున్న కాశ్మీర్ శాలువలో, నుదుట ఎర్రటి సింధూరంతో, ప్రశాంతమైన వదనంతో, పట్టుదలను సూచించే విశాలమైన కళ్ళతో ఆమె ఒక్కో అడుగువేస్తూ ఆ గుడి ప్రాంగణంలో వున్న పసరుపట్టిన కోనేటి దగ్గరకు నడిచింది.
గిరుక్కున ఓసారి వెనక్కు తిరిగి తిమ్మడివేపు చూసింది. ఆమె కళ్ళలోంచి ఒక సందేశం సూటిగా వచ్చి తిమ్మడ్ని తాకింది.
తిమ్మడు వెంటనే ఆ బట్టలతోనే కోనేటిలోకి దిగాడు. ఒళ్ళు గడ్డ కట్టించే మంచులాంటి నీరు ఓ క్షణం తిమ్మడ్ని ఒణికించింది. అయినా తిమ్మడు చలించలేదు.
మూడే మూడుసార్లు ఆ కోనేటి నీటిలో మునిగి బయటకు వచ్చాడు.
మాలిని నిశ్శబ్దంగా ఆలయ మండపంలోకి నడిచి మధ్యలో నిల్చుంది.
తిమ్మడి భ్రుకుటి సాలోచనగా ముడిపడింది.
మాలిని తన చూపులతోనే తెలియపర్చింది. తన చూపులు ఆగిన చోటే నిల్చుండిపొమ్మని.
తిమ్మడు ఓ రెండడుగులు ముందుకేసి నిలబడిపోయి మాలినివేపు నిశ్చలంగా చూస్తున్నాడు.