Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 16

    ఉదయం ఐదు గంటలకే రామదాసు నిద్రలేచాడు.
   
    పహరాలో వున్న సెంట్రీని పిలిచి ఆ రోజెవరన్నా కొత్తగా జైల్ కి రాబోతున్నది, లేనిదీ తెలుసుకున్నాడు. తనకి తెలిసినంతవరకూ లేదని సెంట్రీ చెప్పాడు. జైలుకెవరన్నా కొత్త ఖైదీలు వచ్చేది వుంటే ముందుగానే ఇన్ ఫామ్ చేయబడుతుంది. వెళ్ళబోతున్న సెంట్రీతో నాయుడికి కబురుపెట్టాడు రామదాసు.

    "మీకింకా అనుమానమా ఎవరయినా జైలుకొస్తారని?" ఐదుగంటలకే నిద్ర లేచిన వివేక్ పడకమీంచి లేవకుండా, చేతుల సందుల్లోంచి రామదాసుకేసే చూసి విషయం అర్ధం చేసుకొని, లేచి కూర్చుంటూ అడిగాడు.

    "ఫర్వాలేదు. నీలో బద్ధకం లేదు- అవును. అనుమానం కాదు, ఖచ్చితంగా వస్తారు. అదెప్పుడనేదే తెలుసుకోవాలిగా" రామదాసు అన్నాడు కేవలం చేతులతో ఎక్సర్ సైజ్ లు చేస్తూ.

    "రావటం లేదని సెంట్రీ చెప్పాడుగా....?"

    "సెంట్రీకేం తెలుస్తుంది....? వారంట్ జైలు ఇన్ ఛార్జ్ కిగాని, జైలర్ కిగాని కోర్టునుంచి డైరెక్ట్ గా వస్తుంది. అది సెంట్రీకి తెలియకపోవచ్చుగా."

    "ఒక వ్యక్తిని జైల్లో బంధించాలంటే కోర్టునుంచి జైలుకు ముందుగా వారంట్ వస్తుందా....?"

    "ఎస్! కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, అండర్ సెక్షన్ 418- ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్ మెంట్ ప్రకారం వారంట్ వస్తుంది. మరణశిక్ష అమలుకు వచ్చే వారంట్ సెక్షన్ 413 వేరే దీనిలో కలవదు. ఒక్కోసారి కోర్టు ప్రారంభమయ్యేవరకు నేరం మోపబడిన వ్యక్తిని బంధించాల్సివస్తే, ముందుగా వారంట్ లేకుండానే డైరెక్ట్ గా జైలుకి కోర్టు పంపించగలదు. ఇట్ షల్ నాట్ బీ నెస్సెసరీ టు ప్రిపేర్ ఆర్ ఫార్ వార్డ్ ఏ వారెంట్ టు ఏ జైల్ ....

    మన న్యాయశాస్త్రం బహు విచిత్రమైంది. మనలాంటి నేరస్థుల చేతుల్లో వుండే కత్తికి, సారీ! నాలాంటి నేరస్థుల చేతుల్లో వుండే కత్తికి రెండువైపులా పదునుంటే మన న్యాయశాస్త్రానికి ఒక్కోసారి మూడువైపులా పదునుంటే, మరోసారి ఒకవేపు కూడా పదునుండదు.

    సెక్షన్ 419- డైరెక్షన్ ఆఫ్ వారంట్ ఫర్ ఎగ్జిక్యూషన్ ప్రకారం ఎక్యూజ్డ్ (నేరం మోపబడ్డవాడు)కి జైలుశిక్ష వేస్తే సదరు జైలుకి ఖచ్చితంగా వారంట్ పంపించాలి.

    అది జిలే కానక్కర్లేదు, లాకప్ రూమైనా అంతే....

    నీ విషయం వేరు. ఎందుకంటే నీకు పడింది ఉరిశిక్ష కనుక-" చెప్పటం ఆపాడు రామదాసు.

    "మీ చట్టం గురించి బాగా తెలిసుంటుందని అడుగుతున్నాను. సెక్షన్స్ కోర్టు నాకు ఉరిశిక్ష వేసి ఎన్నాళ్ళో అయినా, ఇంతవరకెందుకు యింకా అమలు పర్చలేదు?" అడిగాడు వివేక్.

    "నీ ఉరిని నీవే ముందుగా కోరుకుంటున్నట్లుందే....?" రామదాసు నవ్వుతూ అన్నాడు.

    "అలా అనికాదు-జస్ట్ తెలుసుకోవడానికి...."   

    "నీకు సెషన్స్ కోర్టులో ఉరిశిక్ష పడింది. ఆ విషయాన్ని లోకల్ జ్యూరిస్ డిక్షన్ లో వున్న డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కి తెలియపర్చాలి- సెక్షన్ 365 ప్రకారం.

    సెక్షన్ 366 ప్రకారం ఆ ఉరిశిక్షని హైకోర్టు ధృవీకరించాలి. అంటే సెషన్స్ కోర్టునీ సెంటెన్స్ ఆఫ్ డెత్ ప్రొసీడింగ్స్ ని హైకోర్టులో సబ్ మిట్ చేయాలి.

    ఎక్యూజ్డ్ అప్పటికే జైల్లో ఉంటాడు గనుక అతనికా విషయాన్ని వారంట్ ద్వారా తెలియపర్చాలి. సెక్షన్ 367 ప్రకారం హైకోర్టు అవసరం అనుకుంటే ఫర్ దర్. ఎంక్వయిరీకి ఆజ్ఞ జారీ చేయవచ్చు. ఆ అధికారం హైకోర్టుకి వుంటుంది. అలాగే మరణశిక్షను ధృవీకరించటానికి మరికొంత సాక్ష్యం కావాలనుకున్నా, హైకోర్టు ఉరిశిక్ష ధృవీకరించటం ఆపి....ఆ సాక్ష్యాన్ని సేకరించమని సెషన్స్ కోర్టుని ఆజ్ఞాపించవచ్చు. లేదా తనే ఆ ప్రయత్నం చేయవచ్చు.

    సెషన్స్ కోర్టు సేకరించిన సాక్ష్యాలు, ఎంక్వయిరీ- హైకోర్టుని సంతృప్తి పరిస్తే- అదే విషయాన్ని సెషన్స్ కోర్టుకి తెలియపర్చటం జరుగుతుంది. సెక్షన్ 366 కింద విధించిన శిక్షను సెక్షన్ 368 ధృవీకరింస్తుంది.

    సెక్షన్ 369 ప్రకారం మరణశిక్ష ధృవీకరణకు వచ్చిన హైకోర్టులో ఇద్దరూ లేక ముగ్గురు జడ్జీలుంటే మరణశిక్షను కనీసం ఇద్దరు జడ్జీలు ధృవీకరించాలి.

    ఆపైన మరో తమాషా వుంది....

    ఆ ఇద్దరు జడ్జీలు మరణశిక్ష విషయంలో వద్దని ఒకరు, వేయాలని ఒకరూ అనుకుంటే....ఆ కేసుని సెక్షన్ 370 కింద మరో జడ్జీకి అంటే- మూడో జడ్జీకి నివేదిస్తారు. సెక్షన్ 392 ప్రకారం మూడవ జడ్జీ మరణశిక్షను ధృవీకరించాల్సిందీ లేనిదీ నిర్ణయిస్తారు.

    ఒక్కోసారి అదీకాకుండా చాలామంది జడ్జీలతో కూడిన బెంచ్ కి నివేదిస్తారు.

    వాళ్ళూ మరణశిక్షను ధృవీకరిస్తే సెక్షన్ 371 ప్రకారం హైకోర్టు అధికారి ఎలాంటి జాప్యం లేకుండా ఆ విషయాన్ని వెంటనే మరణశిక్షను విధించిన సెషన్స్ కోర్టుకి తెలియపరచాలి.

    చూశావా ఎంత తతంగముందో? ఇంత జరగాలి నీ మరణశిక్ష అమలుజరగాలంటే- ఇంత తతంగం. ఎందుకో తెలుసా? ఒకవేళ పొరపాటున ఒక నిర్దోషికి ఉరిశిక్ష పడితే- ఈ తతంగం జరిగేలోపు ఏదో ఒక సాక్ష్యం- అతని నిర్దోషిత్వాన్ని నిరూపించేది బయట పడకపోతుందా అని.

    రే రెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లోనే ఉరిశిక్ష వేయాలని అన్న జస్టిస్ సర్కారియాలోని మానవతావాదానికి ఈ తతంగం వుపయోగపడుతుంది గదా? అందుకు మీ మరణశిక్షని ఇంకా హైకోర్టు ధృవీకరించలేదన్నది నిజం....

    నీకు మరణశిక్ష విధించినట్లు సెషన్స్ కోర్టునుంచి వారంట్ వచ్చింది. కాబట్టే ఈ జైల్లో అందరికీ నీకు మరణశిక్ష పడినట్లు తెలిసిపోయింది.

    కానింకా అది హైకోర్టు ధృవీకరించలేదని- ఫర్ దర్ గా నీకే వారంట్ రాకపోవటాన్నిబట్టి అర్ధమవుతోంది.

    అది రావటానికి మధ్యన అడ్డంగా తతంగముందికదా?

    నీకు ఎలాగూ బతకాలని, పోరాడాలని లేదు. ఉంటే సెషన్స్ కోర్టు నీకు మరణశిక్ష విధించగానే నువ్వు పై కోర్టుకి అప్పీల్ చేసుకునేవాడివి....అప్పీల్ టైమ్ అయిపోయింది.

    నూటికి నూరు శాతం నీకు మరణశిక్ష ఖాయం.... నువ్విప్పుడు పూర్తిగా డెస్పరేట్ కండిషన్ లో వుండాలి. అంటే దేనికయినా ఎదురు తిరిగి పోరాడాలనే కసితో వుండాలి. అది లేదు నీలో.... అదే నా బాధ.

    ఇటు నీ తల్లి మాటనన్నా గౌరవించి జైలు నుంచి తప్పించుకుని పగ తీర్చుకోవాలి. అటు నీ ప్రియురాలు ఆకాంక్షను అర్ధం చేసుకుని పై కోర్టులో అప్పీలన్నా చేసుకోవాలి.

    నీ లైఫ్ కోర్టులో ఇద్దరు జడ్జీలున్నారు. ఇద్దరిదీ డిఫరెంట్ ఒసీనియిన్.

    నువ్వంగీకరిస్తే నేను థర్డ్ జడ్జీని.

    నేను మీ అమ్మ నిర్ణయాన్నే, అభీష్టాన్నే ధృవీకరిస్తాను. సో.... 2:1- నీ ప్రియురాలి ఓటు వీగిపోయింది.

    ఏ మనిషికయినా రెండే రెండు దారులుంటాయి. 

    ఒకటి.... కడదాకా పోరాడయినా జీవించాలి.

    రెండు....ఓడిపోయి మరణాన్ని ఆహ్వానించాలి. మరో దారే లేదు. లేని దారిలో అడుగువేయాలని చేసే నీ ప్రయత్నం వృథాప్రయాసే. ఇప్పటికయినా బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా....

    కాలాతీతమైతే గడువు కరిగిపోతుంది...." సెంట్రీల నాడాల శబ్దం విన్పించడంతో చెప్పటం ఆపాడు రామదాసు.

    రామదాసు విషయ పరిజ్ఞానానికి వివేక్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.

    "ఇవన్నీ మీకు....అదే....ఆ.... సెక్షన్స్.... ఆ ప్రొసీడింగ్స్...."

    రామదాసు వివేక్ మాటల్ని, సందేహాల్ని మధ్యలోనే కట్ చేశాడు.

    "కొత్త డాక్టర్ కంటే పాత రోగే మేలు.

    కొత్త లాయర్ కంటే పాత నేరస్థుడు మేలు. నేరాలు చేసి బతకటం నా వృత్తి. ఎవరు ఏ వృత్తిలో వున్నా ఆ వృత్తిలోని లోతుపాతుల్ని తెల్సుకున్నప్పుడేగదా ముందుకెళ్ళగలిగేది? 

    నేరం చేసిన ప్రతిసారీ జైలుకెళ్ళవస్తే నేరస్థుడు ఎక్కువ రోజులు జైల్లోనే కోల్పోవాల్సి వస్తుంది. అదే చట్టం గురించి పూర్తిగా తెలుసుకుని....అందులోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని నేరాలు చేస్తే- నేరాలు చేసేందుకే ఎక్కువ కాలాన్ని వుపయోగించుకోవచ్చు. కాదంటావా?"

    వివేక్ నోటమాట రాలేదు.

    శిలాప్రతిమై చూస్తుండిపోయాడు. రామదాసు చెప్పిన ఏ నిజాన్ని తను కాదనగలడు?

    TRUTH IS THE ULTIMATE REALITY....

    ఎస్....నిజమే వాస్తవం.... వాస్తవమే నిజం....

    తనేదో చేయాలి....చేయాలా?! ఎస్ చేయాలి....అసలేమీ చేయకపోవటం కంటే ఏదోకటి చేయటమే మేలుకదా?

    "గుడ్డికన్నా మెల్ల కన్ను మేలు.... సాధించదలుచుకుంటే మెల్ల కన్నుతోనయినా సాధించవచ్చు. ఇంతకంటే ఇంకేం చెప్పగలను? ఎలా చెప్పగలను?" అన్నాడు రామదాసు నిట్టూరుస్తూ.

    వివేక్ మెదడు పొరల లోతుల్లో ఎక్కడో....ఏ మూలో....ఓ అతిచిన్న ప్రకంపన....ఓ చిన్న ఆరంభం..... అదే రేపటి పెనుప్రళయానికి పునాదేమో?


                         *    *    *    *


    "చెప్పింది అర్ధమైందిగా? పని సవ్యంగా- జైల్ సూపరింటెండెంట్ వీరనారాయణగారి దృష్టికి వెళ్ళకుండా జరిగితే- మీకు కిట్టూ బయట బరువైన కవర్స్ అందిస్తాడు. వాటిలో రెండు వేలుండవచ్చు, ఐదు వేలుండవచ్చు- మీరు పన్నే పథకాన్నిబట్టే మీకు బహుమానం" రామదాసు తనకు ఎదురుగా వున్న పన్నెండవ వార్డ్ సెంట్రీలు చిదంబరం, నిరంజనంకేసే  చూస్తూ మెల్లగా అన్నాడు.

    వాళ్ళొక్కక్షణం భయపడ్డా- డబ్బు కాశపడ్డారు. అదేమంత పెద్దపని కూడా కాదన్పించింది వారికి.

 Previous Page Next Page