కహకహ నవ్వాడు రావణుడు.
'వీరుడికి చావు ఒక్కసారే! పిరికివాడికి అనుక్షణం చావే! ఇంద్రుడంతటి పిరికివారు ఈ రేడు లోకాల్లో ఉంటాడంటావా ప్రహస్తా!'
'పశువుల కాపరి అయినా అతనికంటే ధైర్యవంతుడే ప్రభూ. మేకలమంద మీదకి పులి దూకబోతే తన జంతు సంరక్షణ కోసం కత్తి ఝుళిపిస్తాడు. ఇంద్రుడి వజ్రాయుధం వన్నెలన్నీ అతని చుట్టూ అంగరక్షకుల్లా అశేష దేవగణం ఉంటేనే.'
'ఊ! తర్వాతేం జరిగింది! దేవ సభలో జగదేకసుందరి ఎవరో నిర్ణయమైపోయిందా?'
'ఇంద్రుడు అలా ప్రశ్నిస్తే జిహ్వకో రుచి. పుర్రెకో బుద్ధి అని ఒక్కొక్కరు ఒక్కోపేరు సూచించారట ప్రభూ! తాను వలచింది రంభ...తా మునిగిందే గంగ అని తమ సోదరుడు కుబేర పుత్రుడు నలకూబరుడన్నాడట ప్రభూ!'
రంభ ప్రసక్తి రాగానే రావణుడికి ఆనాటి సంఘటన గుర్తుకొచ్చింది. ఉద్యానవనంలో రంభను చూసి తాను తొందర పడటం, ఆమె అతనూ శృంగార లహరిలో తేలియాడిన తనని శపించడం అంతా క్షణాలమీద గడిచిపోయినట్లు అనిపించింది.
చెదిరిన మనస్సుని చేరదీసుకుని అడిగాడు 'తర్వాత!'
'అలా ఒక్కొక్కరే ఒక్కొక్క స్త్రీని ప్రస్తుతిస్తూ, ఆమె ఒక్కతే జగదేక సుందరి అని వాదించడం మొదలుపెట్టారు. సభ అంతా అల్లరే అల్లరి! సందడే సందడి! దిక్పాలురను కాదనలేక, ముని పుంగవులను తిరస్కరించలేక ఇంద్రుడు సమస్యా పరిష్కారానికి తమ వంశ మూలపురుషుడయిన పరమేష్టి వద్దకు వెళ్ళారట!'
'ముది మది తప్పిన ముదుసలి బ్రహ్మ ఏమన్నాడట?'
'ఇంత వరకూ ఏ లోపమూ లేని అందగత్తెని తను సృష్టించలేదని ఒప్పుకున్నాడట ప్రభూ!'
'వేదజడుడు కదా మా ప్రపితామహుడు. అంతకంటే ఇంకేం అనగలడు? సర్వ మంగళ జగన్మాత కంటే వేరే ఎవరున్నారు? ఐశ్వర్యం ఇచ్చే శోభాసంపన్న శ్రీలక్ష్మి అందగత్తె కాదా? చదువు తెచ్చే వన్నె చిన్నెలతో వన్నెకెక్కిన సరస్వతీ మాతకంటే సుందరి ఎవరున్నారు? ఒకరికొకరు తీసిపోకుండా అందచందాలతో అపూర్వ లావణ్య శోభతో అందానికే అందం తేగల ముగ్గురమ్మల కంటే అందగత్తె ఎవరయ్యా ప్రహస్తా!'
'చిత్తం ప్రభూ! అందగత్తెల్లో అందరినీ మించే అందగత్తెని ఇప్పుడు సృష్టిస్తానని అప్పటికప్పుడు ఓ సుందరాంగిని సృష్టించాడట ప్రభూ!'
'ఏమిటేమిటీ? ఏమిటేమిటీ? అందగత్తెని ఆ క్షణంలోనే సృష్టించినాడా! ఎవరా సుందరాంగి?'
'అహల్య ప్రభూ!'
'అహల్య! అందమైన పేరే! పేరులాగే అందంగా ఉంటుందా! ఎక్కడుండా సుందరి!'
'నిజంగా జగదేక సుందరేనట ప్రభూ! రంభాది అచ్చెరలంతా అచ్చెరువందారట! శచీదేవి మొదలైన వాళ్ళంతా చిన్నబోయారట ప్రభూ!'
'తర్వాత్తర్వాత....'
'ఏ ప్రశ్న కారణంగా అహల్యా సృష్టి జరిగిందో- ఆ ప్రశ్నకి కారకుడు తానే కాబట్టి- మూడులోకాలకూ ఏలిక కనుక తనకిచ్చి పెళ్ళి చేయమన్నాడట ఇంద్రుడు'
'అర్ధ సింహాసనంలో శచీదేవిని, అహల్యనూ వంతులవారీగా కూచోబెట్టుకుని కులుకుతాడటనా సుర నాధుడు?' నవ్వుతూ అడిగాడు రావణబ్రహ్మ.
'విశ్వామిత్రుడు తనకు ధారపోయమన్నాడట!'
'అపర సృష్టికర్త కదా! ఆ ముక్కోపి మునిపుంగవుడు. ఎలా కాదన్నాడు బ్రహ్మ!'
'సమస్యా పరిష్కారం తోచని తమ ముత్తాతగారు తమ తాతగారిని సలహా అడిగారట!'
'ఎవరిని- త్రిలోక సంచారి- కలహా భోజనుడూ- అయిన నారద మహర్షినే!... బావుంది! బావుంది! చక్కని అవకాశం దొరికిందని చిక్కుముడి వేశాడా దేవర్షి?'
'పందెం పెట్టారట ప్రభూ!'
'ఏమిటీ? పందెమే!'
'అవును పరుగుల పందెం...'
'భలే భలే! ఉవిద కోసం ఉరుకులు పరుగులా!'
'అవును ప్రభూ! భూ ప్రదక్షిణం చేసి వచ్చిన వారికి కన్న కూతురినిచ్చి కన్యాదానం చేస్తానని ప్రకటించాడట పరమేష్టి!'
'మంత్రంతోనో, మాయతోనో మహేంద్రుడే ముందువచ్చి మునుముందు నిలిచి ముగ్ధనిమ్మని అడిగాడా ఏమిటి?'
'అదే జరిగింది ప్రభూ...'
'అయితే అహల్య అమరేంద్రుడి అర్ధాంగి...'
'కాలేదు ప్రభూ! అంతకంటే ముందుగానే మహర్షి గౌతములు వచ్చి చేరాడట ప్రభూ! నిబంధనల ప్రకారం భూ ప్రదక్షిణం చేసి వచ్చానని చెప్పాడట! నారదుడు సాక్ష్యం పలికాడట!'
'ఎలా జరిగింది?' కుతూహలంగా అడిగాడు. బ్రహ్మ వంశ సంభవుడు పులస్థ్య బ్రహ్మ సంతానం-రావణబ్రహ్మ.