Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 15


    శాయిరామ్, రంగారెడ్డి పరుగుతో వెళ్ళి ఆకస్మిక యుద్ధాన్ని నివారించేశారు.

 

    "సోదరులారా- మనం మన తెలుగు వాచకాల తీరుతెన్నుల గురించి మాట్లాడుతున్నాం గానీ- రాజకీయాల గురించి కాదు! ఇప్పుడు నేను మా రాజిగాడి రెండో తరగతి తెలుగువాచకంలో కొన్ని జోకులు లేక కొన్ని బూతులు చదువుతాను! అందరూ నిశ్శబ్దంగా విని నన్నానందింప జేయవలసిందిగా కోరుతున్నాను-"

 

    అందరూ నిశ్శబ్దమయిపోయారు.

 

    రెండోతరగతి వాచకం-

 

    ఐదోపాఠం- నాకథ-

 

    పేజీ ఇరవై ఎనిమిది!

 

    "బ్రిటీష్ వారు మనల్ని బానిసలుగా చూస్తున్నారు. మరో దేశం వారు మనకి అన్యాయం చేయడమేమిటి? నాకు బాధ కలిగింది! అందుకే బ్రిటీష్ వారితో పోరాడదలిచాను..."

 

    ఇక్కడ ఒక క్షణం ఆపాడు రంగారెడ్డి.

 

    "మరో దేశం వారు మనకి అన్యాయం చేస్తున్నారట. అందుకని గాంధీ గారికి బాధకలిగి బ్రిటీష్ వారితో పోరాడారట! ఇంతకంటే పెద్ద జోక్ ఇంకేమయినా వుంటుందా? బ్రిటీష్ వారు మనకి అన్యాయం చేయకపోతే వారిని అలాగే పరిపాలన చేయనిస్తారా? అదలా ఉండనీయండి మరో దేశంవారు మనకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి గాంధీగారికి బాధ కలిగిందట! అంటే మన దేశంవారే మనకి అన్యాయం చేస్తే ఫరవాలేదనేగా దాని అర్థం?"

 

    అంతా నవ్వులూ తప్పట్లూ మార్మోగి పోయినయ్.

 

    "ఇంకో జోక్ చదవండి" అరచారు స్టూడెంట్స్.

 

    అదే పాఠం - 29వ పేజీలో.

 

    "నేను ప్రజలకు సత్యాగ్రహం గురించి చెప్పినాను. ఒకరు మనల్ని కష్టపెడుతున్నారనుకోండి! మనం ఓర్చుకుంటూ వారి మనస్సు మారేటట్లు చేయవలె? అదే సత్యాగ్రహంటే!"

 

    "చూశారా? సత్యాగ్రహం అంటే మనస్సు మార్చటమట!"

 

    అందరూ ఘోల్లున నవ్వారు.

 

    "ఇంకో జోక్- ఇంకో జోక్-" అరచారు కొంతమంది ఉత్సాహంగా. రంగారెడ్డి మళ్ళీ ఉత్సాహంగా అందుకున్నాడు.

 

    "తెలుగు భాష గురించిన పాట- 32వ పేజీలో-

 

    "అమ్మను పిలిచే భాష
    తమ్ములు పలికే భాష
    చెల్లెలి అల్లరి భాష
    పిల్లల చల్లని భాష-"

 

    అంటే తెలుగు భాష కేవలం పిల్లలే మాట్లాడేది అన్నమాట! లేదా తమ తల్లిని పిలవటానికి కూడా తెలుగు భాషను ఉపయోగిస్తారు-"

 

    ఈసారి తప్పట్లు కూడా మార్మోగినయ్.

 

    విప్లవజ్యోతి మళ్ళీ రౌద్రంగా మైక్ దగ్గరకొచ్చి నన్నూ, శాయిరామ్ ని ఒక్కతోపుతోసి మైక్ అందుకున్నాడు.

 

    "ఇప్పుడేమంటారు? తెలుగుభాష తెలుగు ప్రజలు అంటూ శోష వచ్చేవరకూ చైతన్య రథంలో ఉపన్యాసం ఇస్తారుగా మీ అన్నగారు? ఇదేనా ఆయన మన తెలుగుతల్లి పిల్లలకు నేర్పే తెలుగుభాష" వెటకారంగా అన్నాడతను.

 

    మళ్ళీ అందరం కలసి విప్లవజ్యోతిని వెనక్కు లాగేశాము.

 

    రంగారెడ్డి మళ్ళీ అందుకున్నాడు.

 

    "కొబ్బరిచెట్టు" పాఠం 36వ పేజీ...

 

    మనకు ఈ పాఠంలో చాలా కొత్త విషయాలు తెలుస్తాయ్-

 

    "కొబ్బరి నూనె రాస్తే తల వెంట్రుకలు నిగనిగలాడి జుత్తు ఒత్తుగా పెరుగుతుందట-"

 

    అందరూ ఘోల్లున నవ్వారు.

 

    "నేను రోజూ కొబ్బరి నూనె రాస్తాను"

 

    అన్నారు అవధాన్లు గార్లు ముప్పయ్ రెండో ఏట తనకు సంక్రమించిన బట్టతలను చూపిస్తూ.


    
    మళ్లీ నవ్వులూ కేకలూ-

 

    "అంతేకాదు. పెళ్ళి పందిరిని కొబ్బరి మట్టలతోనే వేస్తారట."

 

    "మళ్ళా నవ్వులు-"

 

    "బాలచంద్రుడు పాఠం-73వ పేజీ"

 

    బాలచంద్రుడు తన బొంగరాన్ని అరచేతిలో నిలబెట్టి, తాడు చుట్టి, గిర్రున తిప్పి 'హుమ్ హుమ్' అంటూ నేలకేసి విసిరాడట!

 

    ఆ తరవాత-77వ పేజీలో-

 

    "బాలచంద్రుడు 'హుమ్' అన్నాడట సైనికుల పారిపోయానారట" అంటే దీనిని బట్టి తెలుగు సినిమాల్లో హాస్యగాడికి ఓ ఊతపదం వున్నట్లే ఆనాడు బాలచంద్రుడికి కూడా 'హుమ్' అనే ఊతపదం ఉండేదన్నమాట? అంటే ఈ పాఠాన్ని తెలుగు సినిమాల్లో హాస్యగాడి పాత్రను సృష్టించిన రచయితే రాశాడన్నమాట."

 

    మళ్ళా నవ్వులు!

 

    కొంతమంది "హుమ్" అని అరచారు వెనకనుంచీ.

 

    విమానం పాఠం - 83వ పేజీ.

 

    "విమానం అంటే ఇనుప పక్షి ఆట. అంటే ఈ పాఠం తయారుచేసిన వాళ్ళకి విమానాన్ని ఏ లోహంతో తయారుచేస్తారో కూడా తెలీదన్నమాట."

 

    మళ్ళీ హాహాకారాలు చెలరేగాయ్.

 

    రంగారెడ్డి అందరికీ వినయంగా నమస్కరించి వెనక్కు వెళ్ళిపోయాడు.

 

    వెంటనే శాయిరామ్ మైక్ దగ్గరకొచ్చాడు.

 

    "ఇంకెవరయినా తమ పిల్లల ప్రభుత్వ టెక్ట్స్ బుక్స్ లోని జోకులు కానీ బూతులు కానీ చదివి వినిపించదల్చుకుంటే ఇక్కడికి రావచ్చు" అన్నాడు ఉత్సాహంగా.

 

    సదాశివరావ్ వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చాడు మైక్ దగ్గరకు. "సోదరులారా! మా అబ్బాయిని ఓ నిముషం మీ అందరి ఎదురుగ్గా మాట్లాడిస్తాను. దయచేసి వినండి!" అన్నాడు.

 

    "ఏరా బాబీ! నువ్వు స్కూలుకెలా వెళ్తావ్ చెప్పమ్మా!" అడిగారాయన గారాబంగా.

 

    "బస్ ని కరుచుకునెళ్తా" అన్నాడు వాడు.

 

    అంతా ఘోల్లున నవ్వారు.

 

    "అమ్మ భోజనం వడ్డించిందనుకో! ఏం చేస్తావ్"

 

    "కరుచుకుంటూ"

 

    మళ్లీ నవ్వులు


    
    "స్కూల్లో ఏం చేస్తావ్ నువ్వు?"

 

    "కరచుకుంట"

 

    సదాశివరావ్ మళ్ళా అందరికీ నమస్కరించాడు.

 

    "అయ్యా ఇదండీ మా వాడికి వచ్చిన తెలుగు! సంగతేమిటని టీచర్ని అడిగితే."

 

    మేమేం కరుచుకోమండీ? మూడో క్లాస్ తెలుగు వాచకంలో అలా కరుచుకోటం గురించి కరచారు" అంది.

 

    ఆయన వెళ్లిపోగానే రామచంద్రరావ్ గారు వాళ్ళమ్మాయిని తీసుకొచ్చారు. మైక్ దగ్గరకు.

 

    "అయ్యా, తెలుగువాచకమే కాదు! హిందీ టెక్ట్స్ పుస్తకం కూడా మన పిల్లల్ని మరింత అధోగతికి దిగజారుస్తోంది. మా అమ్మాయి ఏడో క్లాస్ చదువుతోంది. ఆమె చెప్పే సమాధానాలు విని తరించండి..."

 

    అంతా చెవులు రిక్కించారు.

 

    "చెప్పమ్మా! స్వర్ణా! తెలుగులో చక్కని సాహిత్య సృష్టి చేసి తెలుగు భాషకు గొప్ప సేవ జేసిన రచయిత ఎవరు?"

 Previous Page Next Page