"అంతా ట్రాష్! చేతబడులూ, బాణామతులూ- అంతా బోగస్! నేను నమ్మ!" అన్నాడతను.
"అవును! బుద్ధున్న వాడెవడూ నమ్మడు!" అన్నాడు రంగారెడ్డి. రాజేశ్వరమ్మ అలాంటి ఫాల్తూ స్టేట్ మెంట్లు బంద్ జేస్తే మంచిగుంటది!" అన్నాడు వెనుక నిలబడ్డ స్టూడెంట్స్ లో మార్క్సిస్ట్ (ఎక్ట్ర్సీమ్ లెనినిస్ట్ మీడియం గ్రూప్) వాళ్ళు.
రాజేశ్వరికి కోపం వచ్చి "ఇంకోసారి ఛస్తే ఏ కేసూ పరిశోధించను!" అంటూ చరచరా స్టేజి దిగి వెళ్ళిపోయింది.
హఠాత్తుగా శాయిరామ్ కేదో అయిడియా వచ్చినట్లుంది- వెంటనే మైక్ కోసం వెతికి- దానిముందుకెళ్ళి నిలబడ్డాడు.
"సోదర సోదరీమణులారా? చిరంజీవి రమేష్ ఇలా ఎందుకయిపోయాడో ఎవరికీ అంతుబట్టడం లేదు. హైద్రాబాద్ టీవీ ప్రోగ్రామ్స్ తరచుగా చూడడం వల్లే అలా అయిపోయాడని చాలామంది అనుకుంటున్నారు గానీ చిరంజీవి రమేష్ కున్నది పిచ్చి కాదు కాబట్టి అలా అనుకోవడం సమంజసం కాదు. ఒక్క భాష విషయంలో తప్ప రమేష్ ప్రవర్తన అంతా సహజంగానే ఉంది! కనుక ఇంకేదో కారణం అయి ఉండాలి-"
"అవును?" అన్నాడు రంగారెడ్డి.
గోపాల్రావ్, జనార్ధన్ కూడా శాయిరామ్ అభిప్రాయంతో ఏకీభవించారు.
తిండిపోతు వెంకట్రావ్ నెమ్మదిగా జనాన్ని తోసుకుంటూ చేతిలోని కారెట్ తింటూ స్టేజి దగ్గరకొచ్చాడు తన భారీకాయంతో.
"ఈ సందర్భంలో మీకో విషయం చెప్దామని వచ్చాను!" అన్నాడతను కారెట్ ఇంకో ముక్క కొరుకుతూ.
"ఇలా మైకు ముందు నిలబడు!" పిలిచాడు రంగారెడ్డి.
మైకుముందు నిలబడి మిగతా కారెట్ అంతా నోట్లో పెట్టేసుకుని నములుథూ మాట్లాడాడు వెంకట్రావ్?
"జరిగిందేమిటంటే నాల్రోజుల కిందట మా అన్నయ్య గారబ్బాయ్ కూడా ఇలాగే వింతగా మాట్లాడటం మొదలుపెట్టాడు! ఆ రోజు మా వదిన వంకాయ మషాలా కూర వండింది. బాగా గుర్తు నాకు౧ కూరలో కొంచెం కారం తక్కువయింది కూడాను- నేను బగారా బైగన్ వండమంటే వినకుండా వంకాయ వండినందుకు తగిన శాస్తి జరిగిందని అంటే ఆమెకు కోపం కూడా వచ్చింది."
అతనిని చప్పున ఆపకపోతే ఆ మీటింగ్ ని బగారా బైగన్ సంస్మరణ సభగా మార్చేస్తాడని మాకందరికీ అనుమానం కలిగింది.
"చూడు వెంకట్రావ్- నువ్వు 'కూరలు, మానవుల ఆహారం' అనే టాపిక్ వదిలేసి అసలు విషయమేదో చెప్తే బాగుంటుంది.." అన్నాడు రంగారెడ్డి.
వెంకట్రావ్ ఆ టాపిక్ ఆపేసి జేబులోంచి ఓ గుప్పెడు కార్న్ ఫ్లాక్స్ తీసి నోట్లో నింపాడు.
"జరిగిందేమిటంటే, నాల్రోజుల క్రిందట మా అన్నయ్యగారబ్బాయ్ కూడా ఇలాగే స్కూలునుంచి ఇంటికొచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు.
"బాబాయ్ నా కళ్ళకు రాకుమార్తె కనబడుతోంది. నా మనోవేదన ఎక్కువయి పోయింది. మనోవేదన చల్లారేందుకు చందన గృహానికెళ్ళి చంద్రకాంత శిలావేదికపై కూర్చున్నా గాని మనశ్శాంతి లభించటం లేదు.. తలుచుకుంటే ఒళ్ళు గగుర్పాటు చెందుతోంది. ఆమెతో ప్రణయ విహారం చేస్తూ కుసుమాకరమనే ఉద్యానవనం చేరుకోవాలి" అంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు.
"ఏమిటా పిచ్చి వాగుడు? నీ వయసుకలాంటి ప్రేలాపనలు పేలవచ్చా?" అంటూ బెల్టు తీసుకుని వాడిని చావగొట్టాడు మా అన్నయ్య-కానీ వాడు ఏడుస్తూ చెప్పిందేమిటంటే ఆ వర్ణనంతా వాడి ఏడో క్లాసు ప్రభుత్వ తెలుగు వాచకంలో ఉందిట. అంచేత టీచర్ ఆ విరహ వేదనంతా వాళ్ళ మనసు కెక్కేట్లు వివరంగా చెప్పిందట- అప్పటినుంచీ వాళ్ళకందరికీ కూడా వళ్ళంతా గగుర్పాటు చెందటం ఇంకేదో- ఏదోగా అవటం- జరుగుతోందిట-"
అందరూ నిశ్శబ్దం అయిపోయారు.
"కనుక నేను చెప్పేదేమిటంటే- రమేష్ గాడికి కూడా వాడి తెలుగు టెక్ట్స్ పుస్తకం తాలూకు ప్రభావం ఏమయినా సోకిందేమోనని..."
అందరూ ఒకరి మొఖాలొకరు చూచుకున్నారు.
"మీ అన్నయ్య కొడుకు వర్ణించిన వర్ణన ఏ పాఠంలో ఉంది?" కల్చురల్ సెక్రటరీ పార్వతీదేవి అడిగింది. పెన్నూ నోట్ పుస్తకం తీసుకుంటూ.
"జీమూత వాహనుడు అనే పాఠంలో" మరో గుప్పెడు వల్లీ బఠానీలు నోట్లో నింపుకుంటూ చెప్పాడు వెంకట్రావ్.
అందరూ కాసేపు తమలో తాము మాట్లాడుకున్నారు.
హఠాత్తుగా కాలనీ కవి విప్లవజ్యోతి రౌద్రంగా మైక్ దగ్గర కొచ్చాడు.
"అంతేకాదు! అదే వెధవ సెవెన్త్ క్లాస్ తెలుగు టెక్ట్స్ పుస్తకంలో ఇంకో పద్యం ఉంది! దానర్ధం ఏమిటంటే మానం కాపాడుకోవటానికి స్త్రీ మంటల్లో దూకుతేనే ఆమెకు కీర్తి లభిస్తుంది" అని! అది చదివి మా అమ్మాయి మంటల్లో దూకుతేనే ఆడదాని జీవితం ధన్యమవుతుందనే అభిప్రాయానికొచ్చేసింది. మన దేశంలో పౌరుల మనస్తత్వాన్ని మన తెలుగు టెక్ట్స్ పుస్తకాలు ఎంత చక్కగా తీర్చిదిద్దుతున్నాయో చెప్పేందుకు మరో ఉదాహరణ ఇది!" ఆవేశంగా అరచాడతను.
పార్వతీదేవి మళ్ళీ పెన్నూ నోట్ పుస్తకం తీసుకుంది.
"ఆ పద్యం ఏ పాఠ్యభాగంలో ఉంది" అడిగిందామె.
"కన్యక" అనే గేయ సంపుటి! పేజి నెంబర్ ఇరవైఏడు-"
అంతా కలకలం చెలరేగింది.
"ఇదెక్కడి అన్యాయం- గవర్నమెంటోళ్ళు ఇలాంటి చెత్తరాతలన్నీ రాయించి అభంశుభం తెలీని చిన్న పిల్లలతో చదివిస్తున్నారా? అయ్యో- అయ్యో వాళ్ళకేం పోయేకాలమొచ్చింది?" గట్టిగా అరచింది విమలాదేవి.
శైలజమ్మ పక్కనున్న ఇద్దరినీ చెరో వేపుకు తోసేసి ఆవేశంగా ముందుకొచ్చింది.
"అయ్యో అదొక్కటే కాదండీ! మా చెల్లెలి వాళ్ళ తెలుగువాచకంలో కూడా ఇంద్రజిత్తు భార్య సతీసులోచన సతీసహగమనం చేయటం చాలా గొప్ప కీర్తివంతమయిన పని అని రాశారు. పైగా ఆ సహగమనాన్ని అందరూ వేనోళ్ళ స్తుతించారట! సతీసహగమనాన్ని ఈ విధంగా మన ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తోందన్న మాట!"
అంతా హాహాకారాలు చెలరేగాయ్.
విప్లవజ్యోతి మళ్ళీ ఆవేశంగా స్పీచ్ మొదలు పెట్టేశాడు.
"ఇదండీ- మన తెలుగుదేశ ప్రభుత్వం చేసిన ఘనకార్యం! మన ముఖ్యమంత్రిగారు అర్థరాత్రి నిద్రలేపి, "తెలుగు సంస్కృతి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం- తెలుగుభాష" అంటూ కలవరింతలు కిలోల్లెక్కన ఇస్తారు! ఆ తెలుగు సంస్కృతీ, తెలుగు ప్రజల ఆత్మగౌరవం, తెలుగు భాషలను మన ప్రభుత్వమే మన ప్రభుత్వ టెక్ట్సు పుస్తకాల ద్వారా నడిబజార్లో వేలం వేస్తోంది! మనల్ని కించపరుస్తోంది"- అన్నాడాయన.
అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న జనంలో కలకలం చెలరేగింది.
"అదేమిటి? ఈ విప్లవ జ్యోతి మన 'ఎన్.టి.ఆర్.' అన్న మీద విరుచుకుపడతాడేం మధ్యలో అన్నగారికేం తెలుసని?" అంది పార్వతీదేవి.
"అహ్హహ్హహ్హ-" వికటంగా నవ్వాడు విప్లవజ్యోతి." తెలుగు వాచకాలు ఎవరు అచ్చు వేయిస్తున్నారు? ప్రభుత్వం! ప్రభుత్వమంటే ఎవరు! అన్నగారు! అహ్హహ్హహ్హ- మరి ఈ తప్పు ఇంకెవరిది?"
"ఒరేయ్-'అన్న' నేమయినా అన్నావంటే మంచిగుండదు." జనంలోంచి కుర్రాళ్ళు అరచారు.
"మంచిగుండదా? నేనంటా! ఏం జేస్తావ్?" అంటూ ఆ విప్లవజ్యోతి ఆ కుర్రాళ్ళవేపు దూసుకెళ్ళబోయాడు.