Previous Page Next Page 
లక్ష్యం పేజి 15


    ఇక అన్యాయం విషయానికి వస్తే, మనిషిని పతనావస్థ అంచుకు చేర్చే మందు తయారీ- అమ్మకం తప్పు కాదా? అన్యాయం కాదా? అయినప్పుడు అది వ్యక్తి చేసినా, సంస్థ చేసినా, ప్రభుత్వం చేసినా తప్పేకదా! ఇప్పుడు తప్పు ఒప్పుల పట్టిక గురించి వ్యధ చెందటం కాదు కావాల్సింది. మనం చేసేది ఎప్పుడు అన్యాయమయ్యేదంటే- ఆ ముప్ఫై లక్షలు నేనే తీసుకున్నప్పుడు- ఎవరు అన్యాయమయ్యేవారో తెలుసా? మన బార్ ని నమ్ముకొని బ్రతుకుతున్న మన మేనేజర్!

 

    జీవితం సాఫీగా సాగటంలో థ్రిల్ వుండదు. అతలాకుతలం చేయగల అనుభూతులుండవు. కొంచెం ఓపిక పట్టండి నాన్నగారు. ఏం జరుగుతుందో- కొందరి జీవితాలు ఏ మలుపు తిరుగుతాయో- మీకే తెలుస్తుంది" అంటూ టిఫిన్ బాక్స్ తీసికొని కాలేజీకి బయలుదేరింది మహతి.

 

    ఆమె వాదనలో, ఎత్తుగడలో తనకు కనిపిస్తున్నది ఆమె తాలూకు మానసిక పరిణితో... జస్ట్ గేమో ఆయన కర్థం కాలేదు.

 

    నిట్టూర్చుతూ టేబుల్ ముందునుంచి లేచాడు రాజేంద్రప్రసాద్.

 

                           *    *    *    *    *

 

    రాఘవేంద్రనాయుడు స్నానం చేసి, పూజ చేసుకొని, తండ్రి ఫోటోకి ప్రణామం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఆ హాలంతా నిశ్శబ్దంగా వుంది. మధుకర్ అప్పటికే కాలేజీకి వెళ్ళిపోయాడు.

 

    ఆయనక్కడకు రావటం కోసం రెండు గంటల నుండి ఎదురుచూస్తున్న ఫైనాన్స్ సెక్రటరీ వడివడిగా అక్కడకు వచ్చాడు. ఎయిర్ ఇండియా మహారాజులా వినయంగా తలవంచాడు.

 

    "ప్లీజ్ బి సీటెడ్" అన్నాడు రాఘవేంద్రనాయుడు ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ ని తిరగేస్తూ.

 

    భువనేశ్వరీ దేవి తను దగ్గరుండి చేయించిన బ్రేక్ ఫాస్ట్ ని భర్త ముందు అమరేలా చూసుకుంటోంది. రాత్రి ఎంతసేపు మెలకువగా వున్నా, ఉదయాన్నే లేవటం, మార్నింగ్ వాక్ కి వెళ్ళి రావటం, స్నానం చేయటం, పూజ చేసుకోవటం, చివరలో తండ్రి ఫోటోకి ప్రణామం చేయటం- ఆ పైన వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోవటం- ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్, హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లాంటి పేపర్స్ తిరగేస్తూ, ఫైనాన్స్ సెక్రటరీ చెప్పే వివరాల్ని వినటం, వింటూ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవటం...

 

    ఆఫీసుకి బయలుదేరటం...

 

    తన సీట్లోకి వెళ్తూనే రొటీన్ బిజినెస్ ప్రొసీజర్స్ గురించిన సంతకాలు చేయటం- ఆపైన తరచూ ఉద్భవించే సమస్యలపై నిర్ణయాలు తీసుకోవటం ఆయన దినచర్యలో గతి తప్పని పని గంటల విధానం.

 

    "చెప్పండి" అన్నాడు రాఘవేంద్రనాయుడు ఒకవైపు పేపర్ చూస్తూ, మరోవైపు టిఫిన్ తీసుకుంటూ.

 

    "నలభై గంటల క్రితం చిన్నబాబు ఒక బార్ ని కొనేయటం జరిగింది. దానికి గాను ముప్ఫై లక్షలు పే చేయటం జరిగింది" అన్నాడు సెక్రటరీ పాజ్ ఇస్తూ!

 

    అది తనకో పెద్ద విషయం కాదన్నట్లు భావరహితంగా వుండిపోయాడు రాఘవేంద్రనాయుడు.

 

    కొద్దిక్షణాల నిశ్శబ్దం...

 

    భర్త ఎలా రియాక్టు అవుతాడని భువనేశ్వరి...

 

    దాన్ని తమ ఛైర్ మెన్ లాభంగా ఎలా మార్చుతాడని ఫైనాన్స్ సెక్రటరీ... ఉత్కంఠనే ఊపిరిగా చేసుకొని ఎదురుచూస్తుండగా, క్షణాల్ని లెక్కిస్తుండగా రాఘవేంద్రనాయుడు మెదడు చురుగ్గా పనిచేయటం ప్రారంభించింది.

 

    నష్టాల్ని లాభాలుగా...

 

    లాభాల్ని మరింత లాభాలుగా మార్చే పథక రచన ఇండస్ట్రియల్ ఎంపరర్ రాఘవేంద్రనాయుడి మెదడులో క్రమంగా ఊపిరి పోసుకుంటోంది.

 

    ఆ సమయంలో సాధారణంగా రాఘవేంద్రనాయుడు అర్థనిమీలిత నేత్రుడయి, గంభీరంగా కనిపిస్తాడు.

 

    ఆ సమయంలో ఆయన్ని చూసిన ఎవరికైనా చిరు గగుర్పాటు కలుగుతుంది. ఒక మేధావి- మట్టిని బంగారంగా మార్చే జీనియస్ ముందు కూర్చున్నప్పుడు అబ్బురపు ఉద్విగ్న క్షణాల్ని ఎవరైనా అనుభూతిస్తారు.

 

    అలాంటి అనుభూతిని ఎన్నిసార్లు రుచి చూసినా, ప్రతిసారీ ఆ అనుభూతి కొత్తగానే అనిపించటం ఫైనాన్షియల్ సెక్రటరీకి కూడా అంతుపట్టని రహస్యం.

 

    తను సి.ఏ. చేసినా, ఐ.సి.డబ్ల్యు.ఏ. చేసినా, ఏ.సి.ఎస్. చేసినా- ఆ మూడు ప్రొఫెషనల్ డిగ్రీస్ ఒక వ్యక్తి సంపాదించుకోగలగటం అద్భుతమే అయినా వాటికి తోడు ఎం.కామ్, ఎం.బి.ఏ. కూడా చేసి ఏషియన్ ఎకనామిక్ ట్రెండ్ అనే సబ్జెక్టు మీద రీసెర్చ్ చేసి పి.హెచ్.డి. తెచ్చుకున్న ఫైనాన్షియల్ సెక్రటరీకే రాఘవేంద్రనాయుడి తెలివితేటలు అద్భుతంగా అనిపిస్తాయి.

 

    మొట్టమొదటిసారి తను రాఘవేంద్రనాయుడ్ని కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకునే సందర్భంలో తన విజిటింగ్ కార్డ్ ని ఆయన పి.ఏ.కి ఇస్తూ, చూశావా నాకెన్ని డిగ్రీలున్నాయో అని అతనికేసి ఒకసారి గర్వంగా చూసినప్పుడు- ఆ పి.ఏ. కళ్ళద్వారానైనా అభినందించకపోవటం, అడ్మిరేషన్ గా చూడకపోవటం ఒకింత కోపాన్ని తెప్పించింది.

 

    డాక్టర్ పి. రవికిరణ్, ఎం.కామ్, ఎమ్.ఫిల్, ఐ.సి.డబ్ల్యూ.ఏ. సి.ఏ., ఏ.సి.ఎస్. పి.హెచ్.డి. అని గోల్డెన్ లెటర్స్ తో విజిటింగ్ కార్డ్ ప్రింట్ చేయించుకున్నప్పుడు తనకు తానుగా తానో మేధావినని ఫీలయ్యాడు.

 

    తనకు రాఘవేంద్రనాయుడి విజిటింగ్ కార్డ్ అతని పి.ఏ. అందించినప్పుడు అతనెందుకలా చేశాడో తన కర్థంకాక ఒకరకమైన అలకని కూడా తను ఫీలయ్యాడు.

 

    ఆ విజిటింగ్ కార్డ్ అతి సాధారణంగా వుంది. దానిమీద జస్ట్ రాఘవేంద్రనాయుడు, ఛైర్ మెన్ అనే అక్షరాల క్రింద ఆయన ఫర్మ్ స్ పేర్లున్నప్పుడు తనకు రాఘవేంద్రనాయుడు మీద పెద్ద గొప్ప అభిప్రాయం కలగలేదు. ఒక వ్యక్తి తెలివితేటల్ని, మేధస్సుని, వ్యాపార దక్షతని, సమయస్పూర్తిని- జస్ట్ బట్టీ పడితే వచ్చే ఎకడమిక్ క్వాలిఫికేషన్స్ సంపాదించిపెట్టేరేమో అన్న న్యూనతా భావం తను ఉద్యోగంలో చేరిన మొదటి నెల అనుభవంలో అనిపించటం- రిసర్చ్ చేయటానికి అభ్యర్థుల్ని ఎన్నిక చేసేందుకు యు.జి.సి. యూనివర్శిటీల ద్వారా ప్రవేశపెట్టిన ఎమ్.ఫిల్. అనే ఫ్రీ- క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కేపిటల్ లెటర్స్ ని కూడా డిగ్రీలా భావించిన మందభాగ్యులు తను- అని అనిపించటం మరీ అసహ్యమనిపించింది.

 

    ఎమ్ సెట్ ఎగ్జామ్ రాయందే ఇంజనీరింగ్ లో సీటు రాదని తెలిసి కూడా, ఇంజనీరింగ్ అయ్యాక ఎమ్.సెట్., బి.ఇ. అని పెట్టుకొనే వారిని చూసి జాలిపడటం తప్ప ఏం చేయలేం అని, రాఘవేంద్రనాయుడి ఎంపైర్ లో కొందరు అన్నప్పుడు తను ఇంటికి వచ్చి లెటర్ హెడ్స్ ని, విజిటింగ్ కార్డ్స్ ని తగలబెట్టాడు.

 

    అలా తగలబెట్టే ముందు ఒక అర్థంలేని వాదనకూడా తను చేశాడు- ఉస్మానియా ఎమ్. ఫిల్ కి ప్రత్యేకమైన గుర్తింపు వుంది- దాన్ని అక్కడ డిగ్రీగా భావిస్తారని అన్నప్పుడు, ముప్ఫైయ్యేళ్ళుగా ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఎకౌంటెంట్ గా చేస్తున్న ఓ నడివయస్కుడు తనను చూసి జాలిపడుతూ- ఉస్మానియా ఎమ్.ఫిల్ కి ఒక గుర్తింపు, ఆంధ్రా యూనివర్శిటీ ఎమ్.ఫిల్ ఎక్కడైనా ఒకటే- ఒకలానే చూస్తారన్నప్పుడు తలను నేలకేసి కొట్టుకోవాలనిపించింది.

 

    అప్పుడు మరికొన్ని నగ్నసత్యాలు కూడా తెలిశాయి.     

 Previous Page Next Page