"సుప్రియా! ఎలా వుందే నీ ఉద్యోగం... ఎడ్జస్ట్ అయ్యావా కొత్త ఆఫీసులో. మీ బాస్ ప్రకాష్ ఏమంటున్నాడు" సునీత వంటింట్లో పనిచేస్తూ ఆరా తీసింది క్యారెట్ కొరుకుతూ.
"ఆఫీసుపని ఏముందే రెండురోజుల్లో అర్థం అయిపోయింది. అర్థం కానిది మా బాస్ గారే" చిలిపిగా అంది సుప్రియ.
"బాస్ ని అలాగే వదిలెయ్. ఆయనగారిని నీవేం అర్థం చేసుకోనక్కరలేదు. ఆ ప్రాబ్లమ్ శారదది. బుద్ధిగా తలదించుకుని నీ పని నీవు చూసుకో" సునీత బెదిరిస్తున్నట్టు వేలుచూపిస్తూ అంది.
సుప్రియ నవ్వేసి "అది సర్లేగాని, ప్రకాష్ గారు కాస్త సీరియస్ టైపనుకుంటానేం. కాస్త స్మయిల్ లుక్ ఇస్తే కొంపమునుగుతుందనుకునే రకంలా కనిపించాడు మహానుభావుడు. అవునూ, శారద హ్యాపీనా అతనితో" క్యారెట్ తరుగు పెరుగులో కలుపుతూ అంది.
సునీత ఒక్కనిముషం మాట్లాడలేదు. "శారద సంగతి నీకు తెలుసుగదా. మనసు విప్పి చెప్పదు. కానీ నేను చూసి అర్థం చేసుకున్నదాన్ని బట్టి అతనిది షార్ట్ టెంపర్డ్ నేచర్. ఇప్పుడస్తమానం శారదని ప్రాక్టీస్ మానేయమంటాడట... శారదని చూసి కావాలని వెంటపడి పెళ్ళాడాడు. తనకి సంపాదన ఎక్కువ లేనన్నాళ్ళూ ఊరుకున్నాడు. ఇపుడు శారదకి మంచిపేరు, డబ్బు వస్తూంటే ఇగో తలెత్తింది. ఇల్లు, వాకిలి చూసుకో అంటూ దాన్ని నిరుత్సాహపరుస్తాడు.
వాళ్ళకి కావల్సినప్పుడు భార్యలు ఉద్యోగాలు చెయ్యాలిగాని వారికంటే మంచిపేరు, స్థాయి పెరిగితే చూడలేని రకాలు కొందరు మగాళ్ళు. ప్రకాష్ అలాంటివాడు. ఎంతసేపూ డబ్బు సంపాదనే ధ్యేయం. ఆ డబ్బు దొరికినా ఏదీ దాని జీవితం దానిష్టం వచ్చినట్టు గడపనీ అనుకోడు మహానుభావుడు. సాధిస్తుంటాడు దేనికోదానికి. లక్కీగా దాని అత్తగారు దాని తరుపు. శారద ఖచ్చితంగానే చెప్పేసింది ప్రాక్టీస్ మాననని. అది డబ్బుకోసం కాకుండా సమస్యల్లో చిక్కిన ఆడవాళ్ళ కేసులు మాత్రం తీసుకుంటుంది.
పిల్లాడు ఒకడున్నాడు గదా అంచేత ఇంట్లోనే లిమిటెడ్ గా కేసులు తీసుకుంటుంది. ఏమిటో ఈ పెళ్ళిళ్ళు... అంత ప్రేమించే రవీంద్రే అలా చేసినపుడు ఈ మగాళ్ళ గురించి ఏం చెప్పుకోవాలి! మాట, మనసు అన్నీ కలిసి ఆనందంగా జీవించే దంపతులు అరుదే సుప్రియా! నీ సంగతి చూస్తే ఇలా వుంది. ఎవరం పెద్ద హ్యాపీగా లేం కదా..." నిట్టూరుస్తూ అంది. సునీత. "ఏమిటో ఊహలకి, నిజాలకి ఎంత తేడా... ఆప్యాయత అనురాగాలకోసం మనం అలమటిస్తున్నాం... ఆ మాత్రం కూడా ఆశించడం తప్పే అన్నట్టుంది ఈ రోజుల్లో" మళ్ళీ సునీతే అంది.
సుప్రియ తలాడించింది. 'మీరు కొన్నాళ్ళయినా సుఖపడ్డారు. కాపురాలు చేశారు. ఓ కుటుంబం, ఇల్లు వుంది... నాకేం వుంది! గాలికి తెగిపడిన గాలిపటంలా ఇక్కడికొచ్చి వాలాను. కావాలనుకునే మనిషి లేకుండా బతకడం ఎంత దౌర్భాగ్యమో మీకేం తెలుసు?' అని అనాలనుకుంది. కాని అనలేదు. ఆమెలో ఓ రకమైన కసి లాంటిది మనసుపొరల్లో పేరుకుంటోంది. కనిపించిన మగాడినల్లా వలవేసి ఇరికించి ఏడిపించి ఆనందించాలి. తనంటే ఏమిటో రుచి చూపాలి... ఆడది తలుచుకుంటే ఏదన్నా చెయ్యగలదు అని చెప్పాలని.... కానీ అదంతా చెయ్యాలంటే ముందు తనకో స్థాయి రావాలి. ఆ స్థాయికి చేరుకోడానికి దొరికిన ఆలంబన ప్రకాష్... వదలకూడదు ఈ నీడ.
"ఏమిటి ఆలోచనలో పడ్డావు... మమ్మల్ని చూశాక మరింతగా నమ్మకం పోయింటుంది నీకు మగాళ్లమీద. అవునా! ఏవో కష్టాలు పడ్డావు... అవి తీరి మంచిరోజులు వస్తాయేమో నీకు. నచ్చినవాడు ఎవరన్నా దొరకచ్చు. ముందు ఉద్యోగంలో స్థిరపడడం నీకు ముఖ్యం."
"అవును, మొదటిజీతం తీసుకున్నాక ఏ వర్కింగ్ హాస్టలులోనో, ఏదన్నా రూమో చూసుకోవాలి సునీతా..."
"సరేలే, ఆ విషయం ఆలోచిద్దాంలే... వర్కింగ్ హాస్టల్ లో ట్రై చేద్దాంలే" అంది. ఇంట్లో రవీంద్ర వుండడంతో సుప్రియని ఇంట్లో పెట్టుకోడానికి కాస్త ఇబ్బందిగానే వుంది సునీతకి. అసలే తమ మధ్య గొడవల్లో మూడోమనిషి... ఒక నెల తప్పదు.. తర్వాత ఏ హాస్టల్ లోనో చేర్పించడం మంచిది అనుకుంది.
* * *
జ్వరం నించి కోలుకుని, నీరసం తగ్గాక మామూలుగా రొటీనులో పడ్డాడు రవీంద్ర. గత మూడురోజులుగా రంజని ఆఫీసులో అతనితో మాట్లాడలేదు ఎదుటికి రాలేదు. రంజని అలక అర్థమైనా బతిమలాడే ఓపిక లేక ఊరుకున్నాడు.
ఆరోజు ఆఫీసుకి రాగానే రంజనినీ రమ్మనమని ఫ్యూన్ కి చెప్పాడు. రంజని మెల్లగా వచ్చి ఓ ఆఫీసర్ ఎదుట సెక్రటరీ నిల్చున్నట్టు నించుంది చెప్పమన్నట్టు.
రవీంద్ర మొహం ప్రసన్నంగా పెట్టి "ఏం, ఇంకా కోపం తగ్గలేదా? అలక తీర్చే ఓపిక లేకపోయిందిన్నాళ్ళూ..." అంటూ లేచివెళ్ళి వెనకనించి భుజాల చుట్టూ చెయ్యి వేశాడు.
రంజని విసురుగా చెయ్యి తీసేసింది.
"ఆపండి, మీ నాటకాలు. మళ్ళీ నా అవసరం మీకేం వచ్చింది? ఆరోజు అంతలా ఆవిడగారు అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవడమే కాక, నన్నే అని అని పొమ్మన్నారు. అంత అవమానం చేసి మళ్ళీ నేనెందుకు కావాల్సి వచ్చాను? వెళ్ళండి మీ పెళ్ళాం దగ్గిరకి... ఎంతైనా మీకు భార్యాపిల్లలమీద వున్న ప్రేమ నామీద ఎందుకుంటుంది? నేను వెర్రిదాన్ని. మీ ప్రేమ నిజమని నమ్మాను" గొంతు రుద్ధమై ఏడుపు ముంచుకు వచ్చింది.
"సారీ రంజనీ. ఆ రోజు నీవలా ఇంటికి రావడం సరికాదు. వద్దని చెప్పినా వచ్చావు."
"నీవు జ్వరంతో పడుంటే చూడాలన్పించి రావడం తప్పా?" ఉక్రోషంగా అంది.
"చూడాలనిపించవచ్చు. కానీ అలా వచ్చినపుడు ఏ భార్య అయినా అలాగే ప్రవర్తిస్తుంది" అన్నాడు రవీంద్ర.
"అవును, నీవెప్పుడూ ఆవిణ్ణే వెనకేసుకొస్తావు."
"అర్థం చేసుకో రంజనీ. సునీత ఇంకా నా భార్యే. ఆమెకి చట్టపరంగా ఆ ఇంట్లో అన్ని హక్కులూ వున్నాయి. ఆమె నిన్ను ఆనందంగా ఆహ్వానిస్తుందనుకున్నావా?"
"ఆమె ఆహ్వానించదు. కాని నీవు ఆహ్వానిస్తావని వచ్చాను. కాని, నీవే నన్ను పొమ్మని అవమానించావు..."
"ప్లీజ్. ఫర్ గాడ్ సేక్. అర్థం చేసుకోవేం! తనముందు నిన్ను లోపలికెలా తీసుకెళతాను? నీవిలా అలిగి నా ప్రాణాలు తీయకు" విసుగ్గా అన్నాడు.