Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 14


                                                   బాబోయ్ హైదరాబాద్
                                                 నాలుగొందలేళ్ళ ముసల్ది            
    హఠాత్తుగా ఏ రాజకీయ నాయకుడి నోట చూసినా "నాలుగొందలేళ్ళ హైదరాబాద్" అన్న పాట వినిపించేసరికి మా కాలనీలో కూడా అందరికీ హుషారు పుట్టుకొచ్చింది. చాలా రోజుల్నుంచీ ఎలాంటి కార్యక్రమాలూ, మీటింగ్ లూ లేకుండా గాప్ వచ్చేయడం చేత ఆ స్లోగాన్ పట్టుకొని కాలనీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శాయిరామ్ విజృంభించేశాడు. వెంటనే కాలనీ వాళ్ళంతా కూడా ఆ మీటింగ్ కి హాజరయ్యారు.
    "మనం కూడా మన కాలనీ తరపున "చార్ సౌ శహర్ హమారా" కల్చురల్ కార్యక్రమం నిర్వహిద్దాం! నలుగురి సంబరంలో పాలుపంచుకుందాం" అన్నాడతను ఆవేశంగా గేయం చదువుతున్నట్లు మాట్లాడుతూ.
    పార్వతీదేవికి అతని మాటలేమీ అర్థం కాలేదు.
    "హైదరాబాద్ కి నాలుగొందలేళ్ళు రావటమేమిటి?" అంది అర్థంకాక. మిగతా ఆడాళ్ళు కూడా అదే ప్రశ్న వేశారు.
    అందరం ఆమె అజ్ఞానాన్ని చూసి మాలోమేము తృళ్ళి తృళ్ళి నవ్వుకున్నాం.
    "మన ఆడవాళ్ళకు కామన్ సెన్సు రావడానికి ఇంకెన్ని వందలేళ్ళు పడుతుందో" అన్నాడు రంగారెడ్డి జాలిగా.
    ఆ మాటతో ఆడవాళ్ళందరికీ కోపం ముందుకొచ్చింది.
    "మహా మీ అగవాళ్ళకేడ్చిందిలే కామన్ సెన్సు! బోఫోర్సు కుంభకోణంలో ముడుపులు కొట్టేసింది ఎవరూ అనడిగితే నోరు మెదపలేక పోతున్నారు" అంటూ విరుచుకు పడ్డారు.
    వాళ్ళతో గొడవెందుకని గోపాల్రావ్ ఎక్సప్లనేషన్ ఇచ్చాడు.
    "అంటే ఉదాహరణకు మీరూ మీ పిల్లలూ ప్రతి సంవత్సరం పుట్టిన రోజులు జరుపుకుంటారు కదా! అలా మన నగరం తాలూకూ నాలుగొందలో సంవత్సరం తాలూకూ బర్త్ డే అన్నమాట ఇది"
    ఆడవాళ్ళందరూ అతి కష్టం మీద నవ్వాపుకున్నారు.
    "బ్రహ్మంగారు చెప్పింది నిజమేనేమో! ఈ ఏడు రాజకీయాల్లో ఉన్న వారందరికీ పిచ్చెక్కుతుందని స్పష్టంగా అన్నారటాయన" అంది సావిత్రమ్మ.
    "పోనీ వాళ్ళకెక్కిందంటే అర్థం వుంది. మరి మన మగాళ్ళకెందుకెక్కినట్లు?" జానకి అడిగింది.
    మాకు వాళ్ళ సంభాషణ వింటూంటే వళ్ళు మండిపోతోంది.
    "ఏమ్ సంగతి? దమాక్ లేని మాటలు మాట్లాడుతున్రు? మాకు పిచ్చెక్కినాది?" కోపంగా అడిగాడు యాదగిరి.
    "అవును మరి౧ లేకపోతే ఊరికి పుట్టింన్రోజేమిటి.. ఎవడయినా వింటే నవ్విపోతాడు..." అందామె.
    "వీళ్ళ వరస చూస్తుంటే ఆ మూసీనదికీ, నగరం చుట్టూ వున్న కొండలకూ, చెట్లకూ, రాళ్ళకూ, రప్పలకూ కూడా పుట్టిన్రోజు చేసేట్లున్నారు" అంది ఇంకొకావిడ.
    "అక్కడితో ఆగితే ఫర్లేదు. ఈ పిచ్చి ముదిరిందంటే రాష్ట్రంలోని అన్ని ఊళ్ళవాళ్ళు పుట్టిన్రోజులు మొదలెడతారు"
    "దాంతో మెల్లిగా గూండాలు రంగంలోకి దిగి- పుట్టిన్రోజుల పేరుతో వినాయక చవితిలాగ ప్రతోడూ చందాలు వసూలుచేసి తాగెయ్యటం మొదలుపెడతారు" శాయిరామ్ పరిస్థితి విషమిస్తోందని గ్రహించాడు.
    "సోదర సోదరీమణులారా! మన 'చార్ సౌ శహర్ హమారా" కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్దెత్తున ఎన్నో లక్షలు ఖర్చుచేసి జరుపుతుండటం మీరు చూస్తూనే ఉన్నారు. కనుక మన కాలనీ కూడా ఆ సందర్భంగా ఓ అద్భుత సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తే రాజధాని నగర వాసులుగా మనందరికీ ఆనందదాయకంగా వుంటుంది" అన్నాడు మైక్ దగ్గరకు వెళ్ళి.
    అతని మాటలు వినేసరికి యాదగిరి ఆవేశం వచ్చి మైక్ తను లాక్కున్నాడు.
    "బరాబర్ చెయ్యాలా! చాల్దినాలకెళ్ళి మన కాలనీ వాళ్ళకు పనీ పాటా జర్రగూడా లేకున్నది. పని లేనోడు ఏంజేసిండు? పిల్లి తలగొరిగిండు? ఎందుగ్గొరిగిండు? చేతిలో పని లేకుండబట్టి. పనిలేకుంటే ఏం చేస్తాడు మళ్లా? బరాబరా పిల్లి తల గొరుగుతాడు. గొరగడా మళ్ళా? నువ్వు గొరగవా? ఇది జమానాల ముచ్చట! మరి ఈ దినం ముచ్చటేమి? పని లేనోండ్లు ఏదొక దందాజెయ్యాల! ఏం దందా జెయ్యాల? దినం దినం నయా నయా దందాలు ఏడి కెల్లోస్తాయ్? గందుకే ఈ చార్ సౌ శహర్ నికలాయించిన్రు! దీన్దిక్కుకెళ్ళి జబర్దస్త్ దందాపు నడిపించాలని సౌలతున్నది ఏం జెప్తున్నా!"
    "అవును! మనం గూడా 'చార్ సౌ' ఘుమాయించాలె" వెనుక వరుసలో నిలబడ్డ స్టూడెంట్స్ అరిచారు.
    దాంతో కొంతమంది సైలెంటయిపోయారుగానీ మిగతావాళ్ళు ఇంకా గొణుగుతూనే ఉన్నారు- ముఖ్యంగా ఆడవాళ్ళు. ఈలోగా జనార్ధన్ మైక్ ముందుకొచ్చాడు.
    "సోదర సోదరీమణులారా! నేను ప్రముఖ సినీ నటుడినని ఈ నగరంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు" అన్నాడు చిరునవ్వుతో ఓసారి జనాన్ని 'ప్యాన్' చేసి చూసి...
    వెనుక నుంచి స్టూడెంట్స్ కేకలు వినిపించినయ్.
    "బస్ కరో భాయ్! బస్ కరో"
    "చార్ సౌ" కార్యక్రమాలు నిర్వహించాలని మన కాలనీవాళ్ళు ఏక కంఠంతో పట్టుబట్టడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది.
    ఎంతోకాలం తర్వాత మన కాలనీలో ఒకే కంఠం వినబడుతోంది. ఈ సందర్భంగా కాలనీ తరపున నాలుగొందలేళ్ళ నగరం మీద ఒక వీడియో ఫిలిం తీయాలని నాకు కోరికగా ఉంది. అందులో మన కాలనీ వాళ్ళందరూ కనబడేలా తీస్తే అప్పుడు ఆ ఫిలిం దూరదర్శన్ ద్వారా టెలీకాస్ట్ చేయిద్దాం! ఆ విధంగా మన కాలనీలో ప్రతి ఒక్కరూ దూరదర్శన్ లో కనిపించే అవకాశం కలుగుతుంది."
    జనార్ధన్ మాటలు అక్కడున్న వారందరికీ ఒక్కసారిగా మైకం కలిగించాయి.
    "కానీ... అలా మనం ఏది షూటింగ్ చేసిస్తే అది దూరదర్శన్ వాళ్ళు ప్రసారం చేస్తారా?" అనుమానంగా అడిగింది పార్వతీదేవి.

 Previous Page Next Page