Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 14


    మరొకవైపు నల్ల శానపు రాతిలో చెక్కిన చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం-బ్రహ్మకు ఒకవైపు విష్ణువు మరొకవైపు బాగా పొడుగ్గా వున్న శివలింగం! ఏ కారణం చేతనో శివలింగాలు అన్నిచోట్లా ఒకే పరిమాణంలో వుండవు.
    శ్రీశైలంలో శివలింగం బాగా చిన్నదిగా నేలలోకి కూరుకుని పోయినట్లుగా వుంటుంది. ఆ లింగానికి నుదురు తాకించి నమస్కారం చేస్తారు. అమరావతీ క్షేత్రంలో శివలింగాలు బాగా పొడుగ్గా చిన్నసైజు స్థంభాలలా వుంటాయి. శంకరాచార్యులు తపస్సు చేసిన స్థలం అని చెప్పబడుతున్న శ్రీనగర్ లోని ఎత్తయిన కొండమీద వున్న శివలింగం కూడా పొడుగ్గానే వుంటుంది.
    పరస్పర పరిచయాలయ్యాక తనకు ప్రాచీన సంస్కృతి తెలుసుకోవటంలో చాలా ఆసక్తి వున్నట్లు చెప్పాడు విష్ణు. అప్పుడు రవి తనకు దొరికిన తాళపత్ర గ్రంథం గురించీ, అందులో విషయాల గురించీ చెప్పాడు.
    "నాకా గ్రంథం ఒకసారి ఇవ్వటానికి వీలవుతుందా" అన్నాడు విష్ణు.
    ఆలోచించాడు రవి "ఇస్తాను. కానీ ప్రభుత్వం అనుమతి లేకుండా మనం తవ్వకాలు జరిపించకూడదు. తవ్వకాలలో ఏం దొరికినా, అది ప్రభుత్వానికే అందజేయాలి."
    "అది నాకు తెలుసు! నేనూ ఆ పుస్తకం చదువుతాను. ఒకవేళ అందులో వ్రాసిన విషయాలలో ఏమైనా నిజం వుండొచ్చునని నాకూ అనిపిస్తే అప్పుడు మీరు తవ్వకాలు జరిపించటానికి తగిన ఆర్ధిక సహాయం నేనే చెయ్యగలను. కానీ ఇదంతా నిజం అయితే గియితే, క్రీ.పూ. మూడవ శతాబ్దినాటి సంగతి. అప్పటి శిల్పాలు గానీ, నిధులు గాని ఇప్పటివరకూ ఎవ్వరూ తీసేసుకోకుండా వుంటారా?"
    "చెప్పలేం! సుశర్మ మహారాజు దాచటమే జరిగితే అందరికీ స్పష్టంగా తెలిసేలా దాచడు. అప్పటి శిల్పులు ఏవో కొన్ని రహస్య సంకేతాలతో గుహద్వారాలు నిర్మించేవారు. ఆ సంకేతాలు తెలియకపోతే, అక్కడ ద్వారమున్నట్లే తెలుసుకోవటం కష్టం!
    క్రీ.పూ. మూడవ శతాబ్ది నాటివి ఇప్పటివరకూ వుంటాయా అని సందేహించక్కర్లేదు. ఇంచు మించు ఆ కాలం నాటివే అయిన నాగార్జునకొండ తవ్వకాలలో బయటపడిన బంగారు ఆభరణాలు చెక్కు చెదరకుండా లేవా! అవి నాగార్జునకొండ మ్యూజియంలో వున్నాయి. అందరికీ చూపించారు. అక్కడ పెద్ద బంగారు పాత్ర కాక, ఒక బంగారు నెక్లెస్ కూడా వుంది. ఆ నెక్లెస్ మీద సన్నని జాలీ లాంటి పనితనం మనకు విభ్రాంతి కలిగిస్తుంది.
    అంచేత ఇప్పటివరకూ ఆ రహస్య సంకేతాలు ఎవరూ తెలుసుకోకపోతే, ఆ నిధులు అలాగే వుండొచ్చు. ఇంతవరకూ లక్ష్మీ నగరమనే ప్రాంతం ఎక్కడ వుందో తెలుసుకుని, అక్కడ తవ్వకాలు జరిపిస్తున్నట్లుగా వినలేదు. మన పురాణాల్లో వున్న గ్రామ నామాలకీ, ఇప్పటి పేర్లకీ పోలిక వుండదు. మనం ముందు ఆ ప్రాంతమేదో తెలుసుకోవాలి."
    "మగధ రాజంటే, నార్త్ ఇండియా! బహుశా బీహార్ ప్రాంతం కదూ?"
    "అతడు పాలించింది మగధనే అయినా, మగధ వదిలి అరణ్య ప్రాంతాలలో వున్న నగ్న భైరవస్వామిని ఆరాధించటానికి వచ్చాడంటున్నారు కదా! విశ్వనాథ నవల కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తోంది.
    ఆ రోజుల్లో దైవారాధన కోసం ఎంతెంత దూరమయినా ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు. తన సేనా నాయకుడే తన మీద కుట్ర పన్నుతున్నాడని గ్రహించిన సుశర్మ తన సంపదనే రహస్యంగా అరణ్యమార్గాలలో నగ్న భైరవస్వామి దేవాలయానికి వచ్చి ఉండొచ్చు.
    ఆ ప్రాంతం అప్పట్లో సుశర్మ సామంత రాజుదే కావచ్చు. తగిన చారిత్రకాధారాలు లేవు. ఏదీ చెప్పలేం. శంకరాచార్యులు కాశ్మీర్ శ్రీనగర్ లోని పర్వతం మీద తపస్సు చేశారని చెప్పుకోవటం లేదా? ఆ రోజుల్లో ఎంతెంత దూరమయినా ప్రయాణం చేసేవారనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?"
    "సరే! మీరా పుస్తకం ఇవ్వండి. ఒక పదిరోజులు పోయాక రండి. ఈలోగా నేనది చదివి, నా నిర్ణయం చెప్తాను."
    "మీరు సంస్కృతం చదవగలరా?"
    "చదవలేను. కానీ సంస్కృతం వచ్చిన వాళ్ళతో చదివించుకుని అర్థం చెప్పించుకోగలను."
    రవి తను సంపాదించిన తాళపత్ర గ్రంథం విష్ణుకిచ్చాడు. పది రోజులయ్యాక వచ్చాడు.
    "నాకీ పుస్తకంలో ఉన్న విషయాల మీద నమ్మకం కలుగుతుంది. మనం ప్రయత్నించి చూద్దాం! తవకాలకు అవసరమైన డబ్బు నేను భరిస్తాను. గవర్నమెంట్ పర్మిషన్ కూడా నేనే సంపాదిస్తాను. ఆ ప్రదేశం ఎక్కడో నిర్ణయించండి" అన్నాడు విష్ణు.
    రవి, విష్ణు చాలా చోట్ల తిరిగారు. నగ్న భైరవస్వామి దేవాలయం ఉందని విన్న ప్రతిచోటికీ వెళ్ళారు. చివరికి సిరిమిట్టకీ, లచ్చింబోడుకీ మధ్య ఉన్న నగ్న భైరవస్వామి ఆలయమే ఆ తాళపత్ర గ్రంథంలోని ఆలయం కావచ్చునని ఊహించారు.
    ఒకప్పటి లక్ష్మీ నగరమే లచ్చింబోడుగా మారి ఉండొచ్చు. సిరిమిట్టకీ, లచ్చింబోడుకీ మధ్య అడవి. ఆ అడవిలో ఉన్న కొండమీదనే ఉంది నగ్న భైరవస్వామి ఆలయం. సిరిమిట్టనీ, లచ్చింబోడునీ చుట్టుకుని అడవులు.
    సాధారణంగా తవ్వకాలు ప్రారంభించే ముందు అక్కడి జనాన్ని ప్రశ్నించి విశేషాలు తెలుసుకుంటారు. పాతకాలపు కుండ పెంకులో (నగిషీలు చెక్కిన) పూసలో, శిథిల భవనాలో, నాణేలో ఇలాంటివేమైనా దొరికాయని తెలుసుకుంటేనే తవ్వకాలు ప్రారంభిస్తారు.
    అలాగే రవి, విష్ణు సిరిమిట్టలోనూ, లచ్చింబోడు లోనూ విశేషాలు అడిగారు. లచ్చింబోడులో ఒక పెద్ద దిబ్బ వుందనీ, దానికింద ధనరాసులు ఉన్నాయని ప్రతీతి అనీ, అయితే ఆ దిబ్బని తవ్వటానికి ఎవరు ప్రయత్నించినా నెత్తురు కక్కుకుని చచ్చిపోతారని చెప్పారు.
    అందుకే దానికి "లచ్చింబోడు" అనే పేరొచ్చిందని కూడా చెప్పారు. ఆ గ్రామాలకు కొద్ది దూరంలో అరణ్యాలలో ఉన్న కొండ గుహల్లో పిశాచాలున్నాయనీ, అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగిరారని కూడా చెప్పారు. ఆ ఆధారాలతో ఆ ప్రాంతంలోనే తవ్వకాలు జరపాలని నిశ్చయించుకున్నారు.
    అప్పుడు వచ్చింది జెన్నిఫర్ ఎక్కడినుంచో ఊడిపడ్డట్లు.
    "నేను స్టేట్స్ లో ఆర్కియాలజీలో రీసెర్చ్ చేస్తున్నాను. నన్ను కూడా మీతో వర్క్ చెయ్యనీయండి" అంది.
    మొదట రవి ఒప్పుకోలేదు కానీ విష్ణు బతిమాలి, బలవంతపెట్టి ఒప్పించాడు. రవికి తప్పలేదు. ఒక కొత్త పరిశోధన ప్రారంభించినందుకు ఎంతో ఉత్సాహంగా ఉంది రవికి.
    కానీ విష్ణు నిధి గురించి 'యావ'గా అడిగినప్పుడల్లా ఆ ఉత్సాహం పొంగుమీద చన్నీళ్ళు జల్లినట్లవుతుంది.
    నిజానికి అక్కడ నిధులు ఉన్నాయని రవికి గట్టి నమ్మకం లేదు. కానీ ఆ మాట విష్ణు చెప్పకూడదని అతనికి తెలుసు. అందుకే విసుగు దాచుకుంటూ సహనంగా అన్నాడు "ప్రయత్నిద్దాం! ఏ విషయమైనా ఖచ్చితంగా ఎలా చెప్పగలం?"
    ఉదయం ఎనిమిది దాటింది. సాధారణంగా ఆ సమయానికి అనుమయ్య, నరసింవ్వల నాయకత్వంలో ఉభయ గ్రామాల కూలీలూ, ఆడ, మొగా వచ్చేశారు. ఆ రోజు ఇంకా రాలేదు. అప్పుడే చికాకు పడుతున్నాడు విష్ణు.
    అనుమయ్య, నరసింవ్వ మాత్రం వచ్చారు. వెంట మిగిలిన కూలీలెవ్వరూ లేరు. ఇద్దరూ దండాలు పెట్టారు.
    "ఇయ్యాల కూలి పనికి రాం దొరా! మాకు జాతరుంది. తమరు కూడా రండి" అన్నారు.
    "ఏం జాతర?" విసుగ్గా అడిగాడు విష్ణు. పట్నవాసాల్లో లాగ కూలీల మీద పెత్తనాలు చెయ్యటానికి వీల్లేదని అనుభవం మీద తెలుసుకున్నాడు అతడు. ఒకరోజు వృధా అవుతోందని ఎంత కష్టంగా ఉన్నా, చచ్చినట్టు మర్యాదగానే మాట్లాడాలి.

 Previous Page Next Page