Previous Page Next Page 
నానీ పేజి 13


    ఆ వార్త మరో అరగంటలో వూరంతా ప్రాకింది.

 

    కాంతమ్మ, చంద్రం, సరళల గుండెలు తేలికపడ్డాయి.

 

    ఒకవేళ ఆమె మరణవాంగ్మూలం యివ్వకముందే మరణించినట్లైతే వూరంతా ఆ సాధ్వీమాతల్లి పడిన కష్టాలను ఏకరువు పెట్టి ఇది ప్రమాదంకాదు కావాలని చేసిన హత్యగా సాక్ష్యమిచ్చేవారే...

 

    కాని...

 

    ఇన్నాళ్ళు యిన్ని బాధలనెలా ఓర్చుకుంటుందో అర్థంకాని పావనికి ఇప్పుడూ అర్థంకాలేదు.

 

    మరో అర్థగంటలో మృత్యువుకి చేరువవుతున్న పావని చివరిగా చుట్టూ నిలబడ్డ అత్తయ్య, ఆడపడుచులతోపాటు భర్తకూ చేతులు జోడించాలని ప్రయత్నించి విఫలరాలయింది.

 

    "బాబునొక్కసారి చూపించారూ" అంది ప్రాణాలు కడగంటిపోతుంటే.

 

                               *    *    *

 

    ఊరంతా ప్రాకిన విషయం నానీదాకా వచ్చింది.

 

    అంతే...

 

    ఊపిరందనట్టు ఓ క్షణం ఉక్కిరి బిక్కిరవుతూ ఏడుస్తూ పైకి లేచాడు.

 

    తనముందు గదిలో కాలిపోతూ ఆక్రందనలు చేసిన అమ్మను ఆర్పాలని ప్రయత్నించకుండా అలాగే చూస్తూ నిలబడ్డ నాన్న, అందరూ గుర్తుకొస్తుంటే అమ్మను కావాలని చంపేశారు అని తెలిసినా ఇప్పుడేం చేయాలో తెలీని నానీ ముందు తాతయ్య దగ్గరకు పరుగెత్తాడు.

 

    కొన్నిగంటల వ్యవధిలోనే మిగిలివున్న జీవకళను కోల్పోయిన ఆ వృద్ధుడు జీవన్ముక్తికోసం తపించే మహర్షిలా నిర్వికల్ప సమాధిలోకి జారిపోయి వున్నాడు.

 

    "తా...త...య్యా" తాత నేర్పిన ఏ అక్షరసత్యాలో నానీ మనస్సును తొలిచేస్తుంటే నెమ్మదిగా పిలిచాడు.

 

    మరో లోకంలోనుంచి వినబడినట్టుగా వుంది.

 

    మరోసారి పిలుస్తూ నెమ్మదిగా తట్టాడు.

 

    శక్తిని కూడగట్టుకుని తలతిప్పిన తాతయ్యవేపు నిబ్బరంగా చూడగలిగింది ఒక్కక్షణమే! ఆ తర్వాత వెక్కిపడుతూ చుట్టుకుపోయాడు.

 

    ఆ పెనుగులాటలోనే అమ్మేం చెప్పిందీ తెలియపరిచాడు.

 

    "అమ్మెందుకబద్ధం చెప్పింది తాతయ్యా?"

 

    దిగంతాలను తాకి ప్రతిధ్వనిలా మరలివచ్చిన ప్రశ్నది.

 

    సుతజల పోరితంబులగు నూతుల నూరిటికంటే సూనృత వ్రతమొక బావి మేలు అన్న పద్యం చెప్పి... "నూరు బావులుకన్నా ఒక క్రతువు గొప్పదంది. నూరు బ్రతుకులకన్నా కొడుకు గొప్పవాడంది" రొప్పుతున్నాడు నానీ."నూరుగురు కొడుకులకన్నా ఒక నిజం గొప్పదంటే... మరెందుకు అబద్ధం చెప్పింది."

 

    నిలదీసి అడుగుతుంటే విశ్వేశ్వరశాస్త్రి గొంతు మూగపోయింది. ఏమని బదులివ్వగలడు?

 

    ఇన్ని శాస్త్రాలను నేర్చిన తన తప్పిదానికి మన్నించమంటాడా లేక శాస్త్రాలగురించి ఏకరువు పెట్టి వాటికి విలువనివ్వని సంఘంలో నీతల్లి ఒక సమిధగా మారిందంటాడా...

 

    నిశ్శబ్దంగా రోదిస్తున్నాడాయన కూడా.

 

    సరిగ్గా ఆ సమయంలో ఓ వ్యక్తి లోపలికి వచ్చాడు పోలీస్ యూనిఫారంలో.

 

    "నానీ అంటే నువ్వేనా" యస్సై యశస్వి అడిగాడు.

 

    నానీ భయపడుతుంటే పైకెత్తుకుని "మీ అమ్మగారు నిన్ను చూడాలనుకుంటున్నారు" అన్నాడు జీపుదగ్గరకు తీసుకువెళుతూ...

 

    పాతికేళ్ళ వయసుగల యశస్విని మొదటిచూపులోనే ఆకట్టుకున్నాడు నానీ.

 

    నానీ తేరుకునేవరకూ యశస్వి మాట్లాడలేదు.

 

    మరో అయిదునిముషాల్లో జీపు హాస్పటల్ చేరుతుందనగా "రాత్రంతా నిద్రపోలేదా నానీ" అడిగాడు మామూలుగా.

 

    "అవును" తలూపేడు... "అమ్మలేదుగా?"

 

    "అంటే మరి అన్నం తినలేదా?"

 

    తల అడ్డంగా వూపేడు.

 

    "పాలు..."

 

    "నేనస్సలు తాగనుగా !"

 

    చెళ్ మనిపించిన ఆ జవాబు యశస్విని మరెక్కడో సూటిగా తాకింది. "అంటే కాఫీ తాగుతావన్నమాట."

 

    "ఆహఁ... చెడ్డలవాటుగా."

 

    యశస్వి ఆలోచనల తేనెతుట్ట అక్కడే కదిలింది.

 

    ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో తాము కేకలు విని నిద్ర లేచామని చెప్పిన కాంతమ్మ, చంద్రం, సరళల స్టేట్ మెంట్సుకి, మరణ వాంగ్మూలంలో కొడుక్కి పాలివ్వాలని వెళితే వంటగదిలో ప్రమాదం జరిగిందని చెప్పిన పావని మాటలకి ఏదో 'గేప్' కనిపిస్తూంది.

 

    మరో రెండు నిముషాలలో నానీని హాస్పిటల్ దగ్గర దించిన యశస్వి చేతులు ముడుచుక్కూర్చోలేదు.

 

    నిగూఢంగా వున్న మరో వాస్తవాన్ని సకాలంలో వెలికి తీసే ప్రయత్నంగా మేజిస్ట్రేట్ కోసం జీపును వేగంగా కదిలించాడు.

 

    గదిలోకి నానీ ఒక్కడ్నే పంపేరు డాకర్లు.

 

    అది ఆమె చివరి కోరిక.

 

    లోపలికి బితుకుమంటూ అడుగుపెట్టిన నానీ బడినుండి వచ్చేటప్పుడు చేతులుచాచిన అమ్మ ఒడిలోకి లంఘించేటంత వేగంగా వెళ్ళలేదు.

 

    అడుగు చప్పుడైతే అమ్మ నిద్రచెడిపోతుందేమో నన్నంత నెమ్మదిగా ఏ పులిరక్కసి వాతపడో చివరిశ్వాస పీల్చుకునే తల్లి ఆవుని చేరి పాలు తాగాలనుకునే లేగదూడలా అతినెమ్మదిగా నడిచాడు.

 

    బెడ్ పై చర్మం అడ్డంగా వూడిపోయిన అమ్మ గుడిలో కాలిన పోలేరమ్మ విగ్రహంలా కనిపిస్తుంటే "అ...మ్మా..." అని పిలిచాడు కాని దుఃఖం గొంతుకడ్డంపడి గుండెలోనే సమాధైపోయింది.

 

    "అమ్మా... ఏంటిదే..." చైతన్యాన్ని కోల్పోయి రెప్పలు మూసుకుని వున్న అమ్మని తట్టబోయి వెక్కిపడుతూనే భయంతో నిగ్రహించుకున్నాడు.

 

    అమ్మపొట్టపై కూర్చుని అప్పుడెప్పుడో పాలుతాగిన గుండెలు కాలిన రాక్షసి బొగ్గుల్లా కనిపించాయి.

 

    ఒంటికి నలుగు రాసిన చేతులు ఎముకల్లా వేలాడుతూంటే తన స్నానానికి అడ్డాళ్ళుగా మారిన కాళ్ళు రాయీరాప్పలక్రింద నలిగిన వెదురుకర్రల్లా నజ్జయిపోయి వున్నాయి.

 

    "అమ్మా... అమ్మా... ఇన్ని దెబ్బలుతినీ తట్టుకున్న నీ ఒళ్ళేమే మంటకిలా అయిపోయింది? తాతచెప్పిందే నిజమైతే కట్టెగా మారకముందే నిన్నెందుకు కాల్చేశారు? నేను నిద్రపోవాలంటే కాలెక్కడ వేయనే... రోజూ నేనెక్కడ పడుకోనే!" రక్తం నీరుగా మరి కళ్ళనించి ఉబికివస్తుంటే ఊపిరి వేడిసెగలై పావన్ని తాకి తట్టిలేపింది.

 Previous Page Next Page