అప్పటికే జనం పోగయ్యారు.
ఆ జనంమధ్యలో బ్రతికుండగానే కాష్టాన్ని రగిల్చిన కిరాతకుల ఆక్రోశాలు ఒక పసికందుని కేవలం నానీని మాత్రమే కదిలించలేకపోతున్నాయి. నానీ చిన్న పిడికిళ్లు బిగుసుకున్నాయి.
ఆ విషయాన్ని అక్కడెవరూ గమనించలేదు.
ఆ రాత్రే...
కొనవూపిరితో వున్న పావని పల్లెకు దగ్గరగావున్న అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడింది.
ఎనభైశాతం శరీరం కాలిన పావని అగ్నిపునీత అయిన సీతలా లేదు. హంతకులతో చేతులు కలిపిన అగ్ని ప్రతాపానికి బూడిదయి కోరని రణరంగంలో ఓడి, పురాణసత్యాలకు ప్రశ్నలా వుంది.
విశ్వమానవ సరోవరంలో వేయిరేకుల పద్మంగా విరిసి సంధ్యవార్చక ముందే అసురసంధ్యలో మరిగిపోతున్న గాయత్రిలా వుంది.
బ్రతికించాలని ప్రయత్నించిన డాక్టర్లు పెదవి విరిచేస్తే ఇంకా ఎవరికోసమో బ్రతకాలన్న తపనతో తురీయ స్థితిలో తన్నుకుంటూంది.
అదో భావాతీతమైన ధ్యానం.
సంకల్ప వికల్పాల కతీతమైన ఓ స్థితి.
స్మృతి విస్మృతులమధ్య ఒక సంధికాలం...
ఊరంతా తరలి వచ్చింది.
కాని ఆమెను చేరే అవకాశం ఎవరికీ లేకపోయింది.
ఆ రాత్రి అమ్మపొట్టని తన పుట్టిల్లుగా మార్చుకుని ఆదమరిచి నిద్రపోవాల్సిన నానీ ఓ మూల మోకాళ్ళపై తలుంచుకుని పిచ్చివాడిలా చూస్తూ వుండిపోయాడు తప్ప ఎవరితోనూ మాట్లాడలేదు.
ఎందుకు కాలిపోయావూ అనికాక ఎందుకు నిన్ను కాల్చేశారూ అని అమ్మనే అడగాలనుంది.
కాని ఎవరూ అమ్మదగ్గరకి తీసుకువెళ్ళడంలేదు.
తీసుకువెళ్ళగల తాత మంచంపైన కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు.
జరిగిన ఓ దారుణానికి ఒకేఒక్క సాక్షి నానీ అని ఎవరూ వూహించని ఆ క్షణంలోనే...
ఉదయం ఆరుగంటలకి పావని కొద్దిగా స్పృహలోకి వచ్చింది.
కళ్ళు తెరవగానే నానీకోసం కలవరపాటుగా చూస్తూ ఏదో గొణిగింది. కాని అక్కడ ఎదురుగా కూర్చున్న పోలీసాఫీసరుకిగాని, మరణవాంగ్మూలం కోసం ప్రిపేరై వచ్చిన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కి గాని అడియా అర్థంకాలేదు.
"అమ్మా పావనీ" ఆత్మీయంగా పిలిచిన మేజిస్ట్రేట్ ధర్మాన్ని రక్షించే విశ్వేశ్వరశాస్త్రిలా కనిపించాడు ఓ క్షణంపాటు.
మూలిగింది సన్నగా.
"ఎలా వుందమ్మా?" రోగి మానసికస్థితిని అంచనా వేయడంకోసం వేసిన ప్రశ్నది.
ఆమె కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరగగా"బా...గా...నే... వుంది" అంది నెమ్మదిగా. ఆమెకు తెలుసు తను ఏ స్థితిలో వున్నదీ!
అక్కడ గ్లాసు డోర్స్ కి అవతలనిలబడ్డ చంద్రం, కాంతమ్మ, సరళ ప్రపంచం కోసం దుఃఖాన్ని అభినయిస్తూకూడా ఏం చెబుతుందో, ఏ జవాబుతో తమ కంఠాలకి ఉరి బిగుసుకుంటుందో అన్న భయంతో నిజంగానే ఏడ్చేస్తున్నారు.
ఇంత అనర్థానికి కారణమైన చంద్రం, కాంతమ్మ ఆ క్షణంకూడా ఆలోచిస్తున్నదొక్కటే. పూర్తిగా కాలి ప్రాణాలు పోగొట్టుకోక ఇంకా కొనవూపిరితో బ్రతికి తమ ప్రాణాలమీద కెందుకు తెచ్చిందా అని .
పావని కథ అక్కడే ముగిసిపోతే అది ఏక్సిడెంటుగా నిర్ధారించి యీపాటికి చేతులు కడిగేసుకునేవారేమో!
"నీ పేరు?" మేజిస్ట్రేట్ నోట్ చేసుకుంటూ అడిగాడు.
"పావని."
"భర్తపేరు?"
క్షణం ఆగింది. తాళిని ఉరిగా బిగించినవాడు భర్త అవుతాడా, కాడా అన్నట్టు "చంద్రం"
"అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో గుర్తుచేసుకుని చెప్పగలవా?" మరణవాంగ్మూలం సేకరణలో అతి ముఖ్యమైన ప్రశ్నది.
క్షణకాలం నిశ్శబ్దం తుఫానుకుముందు ప్రశాంతతలా...
ఆమె కనుపాపలు భయంతో అటూ ఇటూ కదిలిపోతున్నాయి.
కాలి మాడువాసన వేస్తున్న శరీరంలోని కమిలిపోయిన నరాలు ఏ క్షణంలోనైనా చిట్లిపోయేట్టు అనూహ్యమైన సంఘర్షణకి లోనవుతుందామె.
అది సంఘర్షణ కూడా కదు...
ఇది మిధ్యాప్రపంచమని తెలిసే ఇక్కడకు తమ ఉనికిని పొడిగించుకోడానికి ఎంతటి నీచానికైనా దిగజారే మనుషులపై జుగుప్స... జలసింధులలో మొదట జీవంగా ఉద్భవించిన పిదప 'అమీబా'గా అక్కడనుంచి జంతువుగా ఆ తర్వాత మనిషిగా జంతువులనుమించి ఎదిగి పాపపుణ్య విచక్షణ గ్రహాంతరవాసాలు చేయగల దీశక్తినీ సమకూర్చుకుని ఇంకా ఆటవికతనే ప్రోగుచేసుకుని బ్రతుకుతున్న మానవాళిపై ఏహ్యభావం.
వేదభూమిగా స్తుతింపబడుతున్న ఈ నేలపైపుట్టి రేపటి తరానికి ఇలాంటి సంస్కృతిని అందించాలని ప్రయత్నిస్తున్న అసురనీతిపై అసహ్యం.
"చెప్పమ్మా" ఏ క్షణంలో అయినా ఆ దీపం ఆరిపోతుందని గ్రహించిన మేజిస్ట్రేట్ ఆమెను అయిష్టంగానైనా తొందరచేస్తున్నాడు.
"చె...బు...తా...ను...నా బ్రతుకుడైరీలో... ఆ చివరి... పేజీని చెప్పిగాని... చావను... నిన్న అర్థరాత్రి."
నోట్ చేసుకుంటున్నాడు.
"నన్ను తట్టి లేపారు..."
"ఎవరు...?"
కొన్నిక్షణాల విరామం... ఒక జీవితకాలపు అనుభవాన్నే పరిణామదశ కందని విచిత్రమైన నిర్వేదపు స్థబ్ధతతనీ సూచించే అతిస్వల్పమైన గడువు.
"మా అబ్బాయి నానీ."
ఏ భవిష్యద్దర్శనం జరిగిపోయిందో ఏ ఫలితాన్ని ఆశించి కథనీ మలుపు తిప్పిందో అక్కడెవ్వరికీ తెలీదు. "అమ్మా పాలు కావాలీ అన్నాడు. వంటగదిలోకి వెళ్ళాను. గాస్ వాసనొస్తుంటే రాత్రి స్టౌ బటన్ని ఆఫ్ చేయలేదని గుర్తుకొచ్చి చూడాలని లైటు వెలిగించబోయాను. అంతే! మంటలు..." ఆ తర్వాత ఆమె చెప్పలేకపోయిందిక...
అంతా రాసిన మేజిస్ట్రేట్ ఇదంతా తను స్పృహలో వుండగా తన వాంగ్మూలాన్ని అనుసరించే రాయబడిందీ అన్న వాక్యాలను జోడించి బయటకు చదివి వినిపించి ఆమె సంతకం తీసుకున్నాడు.