అదే గదిలోవున్న మరికొందరు వ్యక్తులు ఇంగ్లీషు, ఫ్రెంచి, అరబిక్, స్పానిష్ భాషల్లో అందుకునే సందేశాల్ని వేగంగా డీకోడ్ చేసి ఎప్పటికప్పుడు మిష్టర్ నెపోటేకి అందిస్తున్నారు.
నిన్న మొన్నటిదాకా అంతర్జాతీయస్థాయి నేరవ్యవస్థలకి సింహస్వప్నంగా ఖ్యాతిగాంచిన 'జాన్ నెపోటే' షా విషయంలో ఎంత కలవరపడుతున్నాడూ అంటే సాధ్యమైనంత త్వరలో అతడి ఉనికిని తెలుసుకోనినాడు తన పదవిని వదలిపెడతానని శపథం చేసాడు.
షా తప్పించుకున్న తర్వాత అతడికోసం గాలింపు ఉధృతం చేస్తూ ఇంటర్ పోల్ అధిపతి నెపోటే రెండు కోణాల్లో తన పరిశోధన ప్రారంభించాడు.
ఒకటి... ..
ఐరోపా ఖండంలో ప్రముఖులయిన ప్లాస్టిక్ సర్జెన్స్ వివరాల సేకరణ. షాకి ఎవరు సర్జరీ చేసిందీ తెలుసుకోవడం.
రెండు... ..
కెనడా విదేశాంగశాఖకి చెందిన పాస్ పోర్ట్ కార్యాలయంలో షాకి ఇవ్వబడిన ఫ్రాంట్యులెంట్ పాస్ పోర్టుని సంపాదించడం.
రెండింటిద్వారా నెపోటే తెలుసుకోవాలనుకుంటున్నది, సాధించాలని ప్రయత్నిస్తున్నది ఒక్కటే -
ఇప్పటి షా రూపం.
అదిచాలు ప్రపంచంలో అన్ని దేశాలనీ అలర్టుచేయొచ్చు.
సగం సాధించాడు ప్రారంభంలోనే.
* * *
ఓ విశాలమైన భవంతి ప్రాంగణంలోకి దూసుకొచ్చిన కారులోనుండి దిగాడు శ్రీహర్ష.
విద్యుద్దీపాల కాంతిలో స్వర్గధామంలా అనిపిస్తూంది ప్లజర్ గార్డెన్ లాంటి పూతోట.
ముఖద్వారం దగ్గరేవున్న ఆర్చర్ పై అందంగా పెరిగిన బోగన్ విల్లా. రెండు పక్కలా రంగునీళ్ళని చిమ్ముతున్న ఫాంటెన్స్, పోర్టికోదాకా చిన్నబాటలా తాపడంచేయబడ్డ ఫ్లాగ్ స్టోన్స్, బారులుతీరిన పోస్ట్ లాంతర్లు, పోర్టికోకి వేలాడుతున్న పూలతొట్టెలు, పవర్ బెడ్.
తానో అరుదయిన కోటీశ్వరుడి యింట అడుగుపెట్టినట్టు గ్రహించిన శ్రీహర్ష - పరిసరాల్ని గమనిస్తూ హాల్లోకి వచ్చాడు. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ హవుస్ లో వాల్ టూ వాల్ కార్పెట్. గోడలకి క్రిస్ క్రాస్ కర్టెన్స్.
హాలుని ఆనుకుని వున్న గదిలోనుంచి బయటికి వస్తూ కార్డ్ లెస్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు సూట్ లోని వ్యక్తి.
"ఓ.కె సుదర్శనం. అది నేను చూసుకుంటాను. మీరు రిలాక్స్ కండి. మీ స్థాయి దిగి యిలాంటి చిన్న విషయాలలో తల దూర్చాల్సిన అగత్యం లేదు. లివిట్ టు మి. మన రాష్ట్రంలో చాలామంది ఉగ్రవాదులున్నారు. వాళ్ళకి పోలీసు ఆఫీసర్లు శత్రువులే కాబట్టి కిడ్నాప్ చేస్తుంటారు. ఇప్పుడు అలాగే శమంత్ కిడ్నాప్ చేయబడతాడు. ఆ తరువాత దారుణంగా చంపబడతాడు. నేరం తీవ్రవాదులదవుతుంది. ఓ.కె. అర్థమైందనుకుంటాను."
ఏకాగ్రతగా వింటున్నాడు శ్రీహర్ష.
తన ముందున్న ఆ వ్యక్తి ఎవరో తెలీదు. కాని తనముందు భేషజాన్ని ప్రదర్శిస్తూ ఎవరితోనో శమంత్ గురించి మాటాడుతున్నాడు. ఇంత బాహాటంగా తన పథకం గురించి చెప్పగలుగుతున్న ఆ వ్యక్తి ఏ స్థాయికి చెందినవాడో శ్రీహర్ష ఊహించి ఉండడు. అంతసేపూ ఆ వ్యక్తి మాటాడింది దేశ ఉపప్రధాని సుదర్శనరావుతో.
దేశంలోనేకాక విదేశాలలో సైతం ఫ్యాక్టరీలు గల ఆవ్యక్తి పేరు సవ్యసాచి.
తెలుగువాడిగా తెలుగురాష్ట్రం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న సవ్యసాచి రెండు దశాబ్ధాల క్రితం రాజకీయాల్లో ఓ మామూలు కార్యకర్త మాత్రమే, అయితే హత్యా రాజకీయాలలో విశిష్టమైన ప్రతిభతో రాజకీయరంగంలో మంచి ప్రఖ్యాతి సంపాదించాడు. అలా సంపాదించిన ప్రాపకాన్ని రాజకీయనాయకుడు కావడానికి కాక బిజినెస్ టైకూన్ గా వృద్ధిచెందడానికి వినియోగించుకుని చిన్న ఇటుకల వ్యాపారము మొదలుపెట్టి ఇప్పుడు ఈ దశకి ఎదిగిపోయాడు.
అలా అని తన హత్యారాజకీయాలు అతను మరిచిపోలేదు.
బిజినెస్ లో తన బలమయిన ప్రత్యర్థి అనిపించినవాడ్ని వ్యాపారలాఘవంతో ఖండించాలని ప్రయత్నించడు. హత్య చేయించి అడ్డు తొలగించుకుంటాడు. ఈ మధ్యనే బొకాడియా అనబడే ఓ ఇండస్ట్రియలిస్ట్ ని హత్య చేయించడానికి ఏభై లక్షలదాకా ఖర్చుచేసాడని ఓ ప్రముఖ దినపత్రిక చాలా అల్లరిచేస్తే ఆనక కేంద్రప్రభుత్వంలో తనకుగల అండతో ఆ పత్రిక మనుగడకే బలమైన ముప్పుతేగలిగాడు. ఇలాంటి విజయం సాధించడానికి కారణం ఉపప్రధాని సుదర్శన్ రావు.
అసలు బొకాడియా చేసిన తప్పు విదేశీమారక ద్రవ్యానికి సంబంధిత సవ్యసాచి రిజర్వ్ బేంక్ నిబంధనల్ని ఉల్లంఘించాడని పత్రికలకి తెలియజెప్పడం. దానితో బాంబేలోని చాలా ప్రముఖుడయిన ఓ ట్రిగ్గర్ మేన్ని రంగంలోకి దించాడు సవ్యసాచి.
పోలీసులు గుర్తించక కాదు. ఆ మాటకొస్తే ఓ ఎస్సై తన పరిశోధనలో సవ్యసాచిని నేరస్థుడిగా కనిపెట్టగలిగాడు. ఆ మాట తన పైఅధికారులకి చెప్పిన రాత్రే రివాల్వర్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత బొకాడియా హత్యకి కారణం ఆఫ్ఘనిస్తాన్ లోని ఓ తీవ్రవాద వర్గం అని తేల్చిచెప్పిన ఓ డిప్యూటీ కమీషనర్ చాలావేగంగా ఐ.జి స్థాయికి ఎదిగిపోయాడు.
ఇంత సులభంగా సమస్యల్ని పరిష్కరించగల సవ్యసాచిని ఉపప్రధాని సుదర్శన్ రావు ఇష్టపడటానికి చాలా బలమైన కారణం వుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా విసుగెత్తిన సుదర్శనరావు ఆ మధ్య ఎన్నికల్లో కేంద్రానికి ప్రాకేద్దామని గట్టిగా తీర్మానించుకుని తన పలుకుబడితో లోక్ సభ టిక్కెట్టు సంపాదించుకున్నాడు. అయితే అతడి నియోజకవర్గంలోని ప్రజలు కాస్త తెలివిమీరి సుదర్శనరావులాంటి అవినీతిపరుడికి ఓటెయ్యం అంటూ మొహంమీదే తెగేసి చెప్పడం ప్రారంభించారు. ఇది నచ్చని సవ్యసాచి మరో వారంలో ఎలక్షన్ అనగా ఇండిపెండెంట్ అభ్యర్థిని హత్య చేయించేసాడు. ఎలక్షన్ పోస్ట్ పోన్ అయిపోయింది.
ఇండిపెండెంట్ అభ్యర్థిని హత్యచేసిన హంతకుడి స్థానంలో తన మనిషిని జైలుకు పంపిన సవ్యసాచి ఆ తర్వాత ఓ పదికోట్లు ఖర్చుచేసి ఆ నియోజక వర్గంలో మనుషుల్ని కొనలేదు. పాతికలక్షల ఖర్చుతో భయంకరమయిన టెర్రరిజం సృష్టించాడు.
పాతికమంది ప్రాణాలు కోల్పోయాక అలా బెదిరింపుల ద్వారా ఓట్లు సంపాదించి రెండులక్షల పాతికవేల మెజారిటీతో సుదర్శన్ రావు గెలిచేట్లు చేసాడు. (ఆ తర్వాత టెర్రరిజం సాగించింది లిబియా దేశానికి చెందిన టెర్రరిస్టులంటూ నిరూపించాడు. అక్కడివాళ్ళు ఇక్కడికెందుకొచ్చారని అడగలేదు ప్రజలు. సుదర్శన్ రావులాంటి నిజాయితీ పరులంటే లిబియా టెర్రరిస్టులకి పడదని ప్రజల్ని సునాయాసంగా నమ్మించాడనుకోండి... అది వేరే విషయం)