Previous Page Next Page 
ధ్యేయం పేజి 14


    సునీత ఇంటి నుంచి ప్రీతమ్ హడావుడిగా ఇంటికి వచ్చాడు. మోటార్ సైకిల్ తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోవాలని ఆలోచన. తర్వాత ఏం చేయాలో నిదానంగా ఆలోచించాలి.

    తల్లీ తండ్రీ ఎవరో స్నేహితులతో మాట్లాడుతున్నారు.

    "వీడే మా అబ్బాయి. డిగ్రీ ఫస్టియర్" ప్రీతమ్ ని పరిచయం చేస్తూ అంది రుక్మిణి.

    "ఏ కాలేజీ?" అడిగాడొకాయన.

    "కొత్తగా తెరిచారు. శ్రీవిద్యా కాలేజీ. చాలా మంచి కాలేజీ. వీడూ బాగా చదువుతాడు లెండి" పిలిచి సీటిచ్చారన్నంత గొప్పగా కొడుకు గురించి చెప్పాడు కృష్ణమూర్తి. కష్టపడి చదివితే ప్రీతమ్ మంచి స్టూడెంటే. కాకపోతే ఆ దీక్షా, పట్టుదల కొరవడ్డాయి. తల్లిదండ్రులు కూడా 'బాగా చదువు. లేకపోతే ఫెయిలవుతావు. అప్పుడు నలుగురిలోనూ తలవంపులు' అని బెదిరించడాలు- 'ఆ అవినాష్ ఎప్పుడూ క్లాస్  ఫస్ట్ వస్తాడని వాళ్ళమ్మా నాన్నలకి గర్వం. నువ్వూ క్లాసు తెచ్చుకో. మోటార్ సైకిల్ కొనిపెడతాము' లాంటి ఆశలు పెట్టడం తప్ప అతడు చదువులో ఏ పొజిషన్ లో వున్నదీ పట్టించుకోలేదు. దాంతో అతడు అత్తెసరు మార్కులతో ఇంటర్ పాసయ్యాడు. పదివేలు డొనేషను కట్టి ఈ కాలేజీలో సీటు సంపాదించారు.

    "ఆ అవినాష్ ఒట్టి కూపస్థమండూకం. ఒక ఆటా లేదు, పాటా లేదు. అందుకే కాలేజీ ఫస్టోచ్చాడు. మావాడికి పరీక్షలప్పుడు బాగా జ్వరం. నూట మూడు డిగ్రీల జ్వరంతో వెళ్ళి పరీక్షలు రాసోచ్చాడు. అయినా ఫస్టుక్లాసు రెండు మార్కులలో తప్పింది" అని తల్లి ఎవరితోనో చెప్పటం విన్నాడు ప్రీతమ్. అప్పటివరకూ మార్కులు తక్కువ వచ్చాయన్న భయం ఏమూలో వున్నా అది కొట్టుకుపోయింది. కాలేజీలో చేరగానే దెబ్బలాడి మోటార్ సైకిల్ కొనిపించుకున్నాడు.

    "డిగ్రీ కాలేజికి పాతడొక్కు లూనా మీద ఎలా  వెళతాడని మొన్ననే కొత్త కవాసాకి కొన్నిచ్చాం" ప్రీతమ్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తుంటే గర్వంగా చెప్పాడు తండ్రి.

    ప్రీతమ్ రయ్యిన రోడ్డుమీద కొచ్చాడు. వయసులో వున్న పొగరుబోతు కుర్రవాడికి కొత్త మోటార్ సైకిల్ చేతిలో వుంటే, కోతికి కొబ్బరికాయ దొరికినంత సంతోషం. లారీలను, కార్లను దాటుకుని స్పీడ్ గా  దూసుకుపోవడం ఎవరెస్ట్ ని ఎక్కినంత గర్వాన్ని కలగజేస్తుంది. అందులో ప్రీతమ్ స్వేచ్ఛ విహారిరోడ్డు తనస్వంతం అయినట్లు, మిగతా జనం అంతా దాన్ని తన పర్మిషన్ లేకుండా ఫ్రీగా  వాడుకుంటున్నట్లు ఫీలవుతుంటాడు.

    అసలే ఈ  రోజు అతడి మూడ్  బావోలేదు. ఒకతియ్యటి అనుభవం పెదవుల దాకా వచ్చి రుచి చూపించి, హఠాత్తుగా జారిపోయిన బాధ అతడి కోర్కెని, అహాన్ని రెచ్చగొడుతోంది. ఎవరినో, ఏదో  చెయ్యాలన్న కసి. సరికొత్త మోటారు సైకిల్ రోడ్డుమీద మెత్తగా జారిపోతుంది. అరవై మైళ్ళ స్పీడుతో ఒక బస్సుని ఓవర్ టేక్ చేశాడు. ఎదురుగా వస్తున్న లారీ పక్కనించి కట్ చేసుకుంటూ దూసుకుపోయాడు. అటు పక్కనుంచి లారీని ఓవర్ టేక్ చేసి ఎదురుగా వస్తున్న ఆటోని వెంట్రుకవాసిలో తప్పించుకొని ముందుకెళ్ళాడు. ఇలాంటి రైడ్ అతడికి విజయోత్సాహాన్ని కలిగిస్తోంది. నెమ్మదిగా నత్తనడక నడుస్తున్న రెండెద్దుల బండి పక్కనుంచి వేగంగా దూసుకెళ్ళబోయాడు. ఏదో ప్రమాదం పసిగట్టినట్లు బెదిరిపోయిన ఎద్దు సడెన్ గా  రెండడుగులు పక్కకు వేసింది. అది ఊహించని ప్రీతమ్ మోటార్ సైకిల్ పక్కకి  తిప్పుతూ బ్రేక్ వేశాడు. ఎదురుగా సైకిల్ మీద వస్తున్న మనిషి కన్ ప్యూజ్ అయి  సైకిల్ వదిలేయడంతో, దానికి తగిలి సడెన్ గా బండిమీద నుంచి ఎగిరి అవతల పడ్డాడు. కాలి మడమ దగ్గర కలుక్కుమంది.

    సైకిల్ మీద వస్తున్న పోలీస్ కానిస్టేబుల్ దగ్గరగా వచ్చి, "ఏరా చేతికి బండి దొరకగానే వళ్లు తెలియకుండా పోయిందా? అసలు లైసెన్సుందా నీకు" అంటుండగా ప్రీతమ్ కి స్పృహ తప్పింది.


                          *    *    *


    అర్థరాత్రి అవుతుండగా భర్త ఇంటికి వచ్చాడు. సునీత ముందు హాల్లో అలాగే కూర్చునుంది. బాగా ఏడ్చినట్లు ఆమె కళ్ళు ఎర్రగా  ఉబ్బిపోయి వున్నాయి. అయినా అతడు పట్టించుకోలేదు. వెళ్ళి పడుకున్నాడు. ఆమె కూడా అభోజనంగా పడుకోవటం గమనించాడు.

    మర్నాడు క్యాంప్ కెళ్ళిపోయి నాలుగు రోజుల తర్వాత వచ్చాడు. సునీత బాగా చిక్కిపోయి వుంది. అతడు పలకరించకుండా ఆమె మొదటగా మాట్లాడదల్చుకోలేదు.

    ఆ రాత్రి అతడే వచ్చి నడుంమీద చెయ్యివేశాడు. ఆమె అతడి గుండెలమీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. "నేనేం తప్పు చేశానని ఇలాంటి శిక్ష వేస్తారు? నిజంగా నాకేమీ తెలియదు" అంది వెక్కుతూ. ఈ ఏడ్పుతో అతడు పూర్తిగా తగ్గిపోతాడని ఆమెకు తెలుసు.

    "నువ్వు తప్పుచేసినా ఏమీ అనలేను. ఆ బాధనంతా నాలో నేనే అనుభవిస్తాను. అది నాలో బలహీనత" తనెంత విశాల హృదయుడో పరోక్షంగా చెప్పుకుంటూ ఆమెని ఆక్రమించుకున్నాడు.

    ఒకసారి ఆత్మవంచన చేసుకుంటే అది అతన్ని ఎంతకైనా దిగజారుస్తుంది. కాలక్రమేణా డానికి అలవాటు పడిన తరువాత, తను చేసుకుంటున్న  ఆత్మవంచనే నిజమని నమ్మే స్థితికి వస్తాడా మనిషి. వారం రోజుల తర్వాత మరో కాలనీలో యిల్లు చూసి ఆమె భర్త అక్కణ్నుంచి మకాం మార్చేశాడు. సునీత అభ్యంతరం చెప్పలేదు.


                         *    *    *

    కాలికి ఫ్రాక్చరవడంతో ఆరు వారాలపాటు మంచం మీదనించి లేవకూడదన్నారు డాక్టర్లు. ప్రీతమ్ కి బోరుగా వుంది. సునీత వాళ్ళు ఇల్లు ఖాళీచేసి వెళుతున్నారన్న వార్త అతడికి సంతోషాన్నే కలుగజేసింది. అంతలోనే తల్లిదండ్రులు సునీత భర్త  గురించి మాట్లాడుకోవటం వినిపించగానే అతడి కాళ్ళూ చేతులు చల్లబడ్డాయి. అందులో తన ప్రసక్తి కూడా రావటంతో గుండె వేగంగా కొట్టుకుంది.

    "ఏమిటో రుక్మిణీ, ఆయన మాటలు నాకు సరిగ్గా అర్థంకాలేదు. ప్రీతమ్ కి బుద్ధి చెప్పమంటాడు. ఏం జరిగిందో చెప్పడు. భార్య నేదో చెయ్యబోయాడంటాడు. ఏమిటంటే స్పష్టంగా చెప్పక గొణుగుతాడు" అంటున్నాడు తండ్రి.

    "ఆ వగలాడిని ఎవరేం చేస్తారండి. మగవాళ్ళని కొరుక్కుతినేలా చూస్తుంది. తప్పేమయినా  వుంటే దానిదే అయివుండాలి. ఏమీ లేకపోతే అర్థంతరంగా యిల్లు ఖాళీ ఎందుకు చేస్తాడాయన? మనవాడి గురించి  అనడంలో అర్థంలేదు. వాడికింకా పద్దెనిమిద్దేళ్ళే" అంది రుక్మిణి.

    "నిజమే నాకూ అలాగే అనిపించింది. ఆయన వట్టి అనుమానస్తుడనుకుంటాను. పోనీలే కాలనీ నుంచి వెళ్ళిపోయారు. అంతేచాలు".

    ప్రీతమ్ 'హమ్మయ్య' అనుకున్నాడు.

    అయితే సునీతగానీ, ఆ అనుభవంగానీ అతడిని వదిలి పెట్టలేదు. అంతవరకు తనొక 'హీరో' నని అనుకున్నాడు. ఐఇపుడు ఒక 'మగవాడిని' అన్న ఆలోచన వచ్చింది. కనిపించిన ఆడపిల్లనల్లా ఏడిపించి ఆనందం పొందడం మాత్రమె అనుభవమున్న అతడికి, వాళ్ళనేదో చెయ్యవచ్చుననీ అందులో సుఖం వుందనీ తెలిసింది. 

    ఆనాటి సంఘటన పదే పదే గుర్తుకు రావటం, వళ్ళు వేడెక్కి పోయి ఏం చెయ్యాలో తెలీక ఆరాటపడిపోవడం మామూలయిపోయింది.

    కాలు పూర్తిగా నయమై కాలేజీకి తిరిగి వెళ్ళడం ప్రారంభం  కాగానే  అమ్మాయిల్ని ఏడిపించే అవకాశం మళ్ళీ దొరికింది. అందులో అతని స్నేహబృందం కూడా అలాంటిదే. ఈసారి అనుభవం కాస్త కొత్తది. ఊరికే మాటల్తో ఏడిపించంటం కాదు. సినిమాహాళ్ళల్లో, గుళ్ళల్లో రద్దీగా వున్నప్పుడు వెళ్ళి ఆడవాళ్ళని రాసుకుంటూ వెళ్ళి, తాకకూడని ప్రదేశాలు తాకి ఆనందించడం దినచర్య అయిపోయింది. పార్కుల్లోకి వెళ్ళి, అక్కడ బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగే అమ్మాయిల్ని గుర్తు పెట్టుకుని వెంబడించి వేధించడంలో ఆనందం కలుగుతోంది.

    ఇంట్లో తనకూ ఒక చెల్లెలుందని, తనలాంటి వాళ్ళవల్ల ఆమె  కూడా బాధపడుతుందేమోనన్న ఆలోచన అతడికి ఎప్పుడూ రాలేదు.

    ఒకరోజు ఉదయం అనుకోకుండా అతడి దృష్టి నిఖితమీద పడింది. సాధారణంగా అతడు ఏడు దాటితేగాని నిద్రలేవడు. కరెంటు పోవడంతో డాబామీద పడుకున్నవాడు ఎండ చురుక్కుమనడంతో ఆరింటికే లేచాడు. కళ్ళు తెరిచి చూడగానే జాగింగ్ డ్రస్ లో వస్తున్న  నిఖిత కనిపించింది.

    ఇంత చక్కటి బ్యూటీ కాలనీలోనే వుండగా పట్టించుకోనందుకు బాధ కలిగింది. ఇన్నాళ్ళూ తారసపడినా, అప్పటికి వాళ్ళంతా చిన్న పిల్లలుగానే కనిపించారు. కానీ వాళ్ళకూ ఇప్పుడు వయసొచ్చింది. 'పదేహేనేళ్ళ వయసులో అమ్మాయిలు చాలా బాగుంటారు' అనుకున్నాడు.

    నిఖిత అయిదింటికే లేచి జాగింగ్ కి వెళుతుందని అర్థమయింది. మర్నాడు  లేచి ఎదురు చూశాడు. నిఖితతోపాటు వాళ్ళన్నయ్య రాము కూడా వుండటంతో నిరాశ కలిగింది. అయినా వెనకే వెళ్ళాడు.

    ట్యాంక్ బండ్ మీద కెళ్ళగానే వాళ్ళిద్దరూ చెరోవైపుకి పరిగెత్తడం అతనికి సంతోషాన్ని కలుగజేసింది. నిఖిత వెనకే కొంతదూరం పరిగెత్తి ఒక చెట్టుచాటున నిలబడ్డాడు. అప్పటికి చాలామంది వాకింగ్ చేస్తున్నారు. కొందరు ఖాళీస్థలాల్లో ఆసనాలు వేస్తున్నారు. ఉదయపు చల్లటిగాలీ, ఆ ప్రశాంతత ఎవరికయినా కొత్త ఉత్సాహాన్ని పుట్టిస్తాయి. కానీ ప్రీతమ్ దృష్టి నిఖితమీదే వుంది. ఆమె దగ్గరికి రాగానే చెట్టుచాటునుంచి సడన్ గా బయటికొచ్చినట్టు ముందుకు అడుగుపెట్టాడు.

    వేగంగా పరిగెత్తుకు వస్తున్న నిఖిత వేగం ఆపుకోలేక అతని మీద పడింది. ఇద్దరూ ఒకరి మీదకు ఒకరు జారారు!

    "సారీ!" అంటూ ఆమె ఎవరో గమనించనట్లుగా లేచి, భుజాలు పట్టుకొని ఆమెని లేపే ప్రయత్నం చేశాడు.  అతడి చేతివేళ్ళు  ఆమెశరీరం మీద నాట్యం చేస్తున్నాయి. ఆమె విదిలించుకుని లేచి నిలబడింది.

    "అరే నిఖితా నువ్వా! గుర్తు పట్టలేదు. అయామ్ రియల్లీ సారీ" అన్నాడు అప్పుడే గుర్తుపట్టినట్టు.

    "ఫర్వాలేదులే" అని చిన్నగా నవ్వింది.

    "దార్లో పడే పిల్లే...... ఏమో అనుకున్నాను" అనుకున్నాడు మనసులో. ఆమె మెల్లిగా నడుస్తోంది. పక్కనే నడుస్తూ మాటలు కలపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రయత్నం కొనసాగనివ్వకుండా 'నువ్వెళ్ళు ప్రీతమ్ నాకు ఒంటరిగా నడవటం ఇష్టం' అంది. అతడి మొహం వాడిపోయింది. తన మొహంలో భావాలు కనిపించనివ్వకుండా, వేగం పెంచి పరిగెడుతూ దూరంగా వెళ్ళిపోయాడు. కాస్త దూరం వెళ్ళి వెనక్కి తిరిగాడు.

    నిఖిత వస్తోంది. దగ్గిరగా వచ్చాక, మళ్ళీ ఆమెతో కలిసి నడుస్తూ "సాయంత్రం బిర్లామందిర్ కి వస్తావా నిఖితా?" అని అడిగాడు.

    "ఎందుకు?" అంది మొహం చిట్లించి.

    "అరే, అదేమిటి నిఖితా! మనం  ఒకే కాలనీలో వుంటున్నాం. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం. ఇప్పుడేదో తేడా వచ్చినట్టు మాట్లాడతావేమిటీ?" అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ.

    నిఖిత నవ్వింది. "అదే నేనూ అంటున్నాను. చిన్నప్పటికీ, ఇప్పటికీ తేడా లేదా అని....." అంటూ అతన్ని ఓరగా చూసి, "ఈ వయసులో బిర్లాటెంపుల్ ఏమిటి?" అంది చిరునవ్వుతో.

    ప్రీతమ్ హుషారుగా "మరి.........ఇంగ్లీష్ పిక్చర్ కి వెళ్దామా?" అన్నాడు.

    "అది టీనేజర్స్ చేసేది. ఆఫ్కోర్స్ మనం టీన్స్ లోనే వున్నామనుకో. కానీ నాకెందుకో అందరూ చూసేచోట కలవాలపించదు. మనసులో ఎన్ని కోర్కెలున్నా కూడా, పెళ్ళి కావాల్సిన అమ్మాయిని కదా!"

    ప్రీతమ్ కి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. పైకి మామూలుగా కనపడే నిఖిత ఇంత ఫాస్ట్ అని అనుకోలేదు. అమ్మాయిల గురించి ఇంకా సరిగ్గా తెలుసుకో (లే)ని తన అనుభవ రాహిత్యానికి కాస్త సిగ్గుపడ్డాడు. రెట్టించిన ఉత్సాహంతో  "పోనీ షమీర్ పేటగానీ, కిద్వాయ్ గార్డెన్స్కిగాని వెళ్దామా" అన్నాడు.

 Previous Page Next Page