"మీరు కాదు అసలు కష్టం నాకు. మిమ్మల్ని పొమ్మనమని గట్టిగా చెప్పలేకపోతున్నాను. అలాగని లోపలికి రమ్మనమనీ అనలేకపోతున్నాను."
"పోనీలెండి - దీనిగురించి మీరు మరీ ఫీలై పోనక్కర్లేదు. బయటపడితే నా శత్రువులు నన్ను చంపేస్తారు. అంతేకదా. ఎప్పుడైనా చచ్చిపోవలసిందేగదా. యాభై ఏళ్లు పైబడి కూడా బతకాలనుకోవడం బ్యాడ్ టేస్ట్ అన్నాడు శ్రీశ్రీ. నాకు కేవలం ఇరవై ఎనిమిది ఏళ్ళే కాబట్టి తటపటాయిస్తున్నాను గానీ ఏభై ఏళ్ళయితేనా శత్రువుల ముందు గుండెలు చూపిస్తూ నిలబడేవాడ్ని."
అతను ఈ ఆవరణ దాటి బయటికి వెళ్లడం - అక్కడ పొంచి వున్నవారు అతని మీదపడి కత్తులతో పొడవడం ఆమె కళ్ళ ముందు మెదిలింది.
"వద్దు... వద్దు" కంగారుగా అంది.
"ఏమంటున్నారు?"
"బయటికి వెళ్ళకండి."
"మరిక ఏం చేయమంటారు? మీరేమో లోపలికి రానివ్వడంలేదు."
"ఒక్క షరతు మీద మీరు లోపల పడుకోవచ్చు" ఆమె ఆగింది. షరతు ఏదైనా ఫర్వాలేదు. తల దాచుకోవడానికి ఒప్పుకుంది. అంతేచాలు. అతను ఖుషీ అయిపోయాడు.
"తెల్లవారుజామున లేచి వెళ్ళిపోవాలి"
"అలానే. థాంక్యూ వెరీమచ్"
ఆమె పక్కకు తప్పుకుంది లోనికి రమ్మన్నట్లు.
అతను ముందుకి నడిచాడు.
ముందు పెద్దగది. దాని వెనక చిన్నగది ఓ పక్క, మరోపక్క టాయ్ లెట్ వున్నాయి.
తల తుడుచుకోవడానికి ఏమైనా వుందేమోనని చూస్తూ నిలబడ్డాడు. ఇది గ్రహించి ఆమె లోపల గదిలోంచి ఓ టవల్ తెచ్చింది.
"థాంక్యూ! ఇలా ప్రతిసారీ థాంక్స్ చెప్పడం ఎబ్బెట్టుగా వుంటుంది. వెళ్ళే ముందు ఓ పెద్ద థాంక్స్ చెప్పేస్తాన్లెండి.
మాటలు ఇంక అనవసరం అన్నట్లు ఆమె మంచంవైపు చూస్తూ - "మీరిక్కడ పడుకోండి. నేను లోపలున్న గదిలో పడుకుంటాను" అని వెళ్ళిపోయింది.
ఒళ్లంతా బాగా తుడుచుకున్నాక మంచం మీద పడుకున్నాడు.
"ఉదయాన్నే వెళ్ళిపోవాలి. ఆమె చివరిసారి హెచ్చరిస్తున్నట్లు చెప్పింది."
"ఉదయం మాటకదా! ఈ రాత్రికే ఎన్ని జరగకూడదు? ఏం జరిగినా జీవితంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రళయం వచ్చి మొత్తం ఈ ప్రపంచమంతా జలమయం అయిపోవచ్చు. లేదూ విజయదశమిలోగా 'నిన్ను ప్రేమిస్తున్నాను' అని మీరు నాతో చెప్పచ్చు..." అతను ఏదో ట్రాన్స్ లో వున్నట్లు చెప్పుకుపోతున్నాడు. అందులోనూ ధర్మప్రచారిణి అంటే ఏమిటో అతనికి తెలియదు. సరదాగా మాట్లాడుతున్నాడు - అంతే.
ఆమె మాత్రం అక్కడే ఆగిపోయింది. పూర్వాశ్రమంలో వితంతువుగా వుండి, ఇప్పుడు ధర్మప్రచారిణిగా అంకితం కాబోతున్న ఆమె ఈ మాటలకు నిలువెల్లా వణికిపోయింది. పిడుగు తనమీదే పడి శరీరమంతా ఛిద్రమైపోయినట్లు విలవిల్లాడిపోయింది.
తరుణ్ ని చంపడానికి సరితాదేవి పెట్టిన గడువూ, ధర్మచారిణిగా మౌనిక దీక్ష తీసుకునే రోజూ, ఆమెచేత ఐ లవ్ యూ అనిపించుకోవడానికి అతను తనకు తానే పెట్టుకున్న గడువూ - విజయదశమే కావడం యాదృచ్ఛికమే.
ఏది ఏమైనా అసలు సిసలు కథ ఇప్పుడే ప్రారంభమైందన్న మాట.
తరుణ్ పడుకున్నాడే గానీ నిద్ర రావడంలేదు.
గుండెల్లో పూలమొక్కలు మొలిచిన ఫీలింగ్. నీలాకాశం నునుపుకి జారుతున్న తెల్లటి మబ్బుతునకలా వున్న మౌనిక పక్కగదిలోనే పడుకుని వుందన్న భావాన రక్తంలో హోలీ పండుగను జరుపుకున్నట్టుంది.
అతను అటూ ఇటూ దొర్లుతున్నాడు గానీ నిద్రాదేవి రావడంలేదు. ఒక్కోరాత్రి ఇంతే. నిద్ర శరీరానికి అంటుకోదు. మౌనికతో మాట్లాడాలన్న ఒత్తిడి ఎక్కువ కావడంతో ఇక భరించలేక "మౌనికగారూ" అంటూ పిలిచాడు.
అప్పుడే దిగ్గున లేచినట్లు ఆమె "ఆఁ" అంది.
"ఈ అనాథ మహిళా సదన్ లో నేనొక్కడ్ని పురుషుడ్ని కదా, పొరపాటున మీవాళ్ళు ఎవరైనా నన్ను చూస్తే ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని బెంగగా వుంది. అలాంటిదేదైనా జరిగితే నా పని నెరభైలు శీనులా అయిపోతుందేమో?" అన్నాడు.
"నెరబైలు శీనా! ఎవరతను?" మామూలు ఉత్సాహంలో తను అలాంటివి అడిగి వినకూడదన్న విషయం మరిచిపోయింది ఆమె.
"మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. మా నాన్న టీచర్. రకరకాల పల్లెటూర్లలో పెరిగాను. టౌన్ కి వచ్చేసేముందు నెరబైలులో వుండేవాళ్ళం. శీనూది ఆ ఊరే. ఊరంటే పెద్ద ఊరేం కాదు. రెండే వీధులు వుండేవి. శీనూ వాళ్ళ నాన్న దగ్గర్లోని ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు శ్రీను. రెండోవాడు నాగరాజు.
ఫ్యాక్టరీలో బాగానే సంపాదించేవాడనుకుంటాను, శీనూ తండ్రి పొలాలు కొనడం ప్రారంభించాడు. అదిగో ఆ సమయంలోనే ఏటిగట్టునున్న రెండకరాల పొలం కూడా కొన్నాడు. ఈ పొలం కొన్న దగ్గర్నుంచి శీనూ ఊర్లో వుండడం మానేశాడు. ఎప్పుడు చూసినా ఏటిగట్టునున్న పొలం దగ్గరే.
వాడికి అప్పటికి పెళ్ళి కాలేదు. ఆ వయసులో ఎప్పుడు పని తప్పించుకుంటామా, ఊర్లో తిరుగుదామా అనే వుంటుంది. అలాంటిది వాడు పొలానికి అతుక్కుపోవడం విచిత్రంగా అనిపించింది.
అసలు విషయం తర్వాత తెలిసింది.
పక్కవీధిలో పైభాగమంతా - అంటే ఓ పదిహేను ఇళ్ళుదాకా వుండేవి. ఆ ఇళ్ళల్లో చాలామంది అమ్మాయిలుండేవాళ్ళు. బాగా డబ్బున్న కుటుంబాలు కాబట్టి అందంగా వుండడంతోపాటు ఆకర్షణీయంగా కూడా వుండేవాళ్ళు. వాళ్ళంతా శీనూ పొలం పక్కనుండే ఏటికి బట్టలు ఉతుక్కోవడానికి వచ్చేవాళ్ళు.
వాళ్ళు వచ్చే సమయానికి శీను తన పొలం పక్కనున్న చెట్ల వెనక నక్కేవాడు. మొదట్లో ఆ విషయం అమ్మాయిలకి తెలిసేది కాదు. ఎవరూ లేరని కాస్తంత ఫ్రీగా వుండేవాళ్ళు. బట్టలు వుతికేప్పుడు చీరకుచ్చిళ్ళు, లంగా కొసను బాగా పైకెత్తి బొడ్లో దోపుకునేవాళ్ళు. ఏటిగట్టున వేసున్న బండరాయిలపై కూర్చుని బట్టలు వుతుక్కునేవాళ్ళు. ఇక శీను చెట్ల వెనక జేరి వాళ్ళ పాదాల సౌందర్యాన్ని తనివితీరా చూసేవాడు.
ఇలాంటివి ఎక్కువ రోజులు ఆగవు. వాళ్ళలో సుభాషిణి అనే అమ్మాయి వుండేది. కాస్త తెలివైన పిల్ల. తాము బట్టలు ఉతకడానికి వెళ్ళేప్పుడు పొలంగట్టు మీద తెల్లటి కాళ్ళ కొంగలా కనిపించే శ్రీను తాము ఏట్లోకి దిగగానే ఎటు ఎగురుకుంటూ పోతున్నాడని గమనించడం ప్రారంభించింది.
చెట్ల ఆకుల సందుల్లో ఓరోజు రెండు తెల్లటి కనుగుడ్లు కనపడగానే విషయం అర్థమైపోయింది.
'శీనూని గమనిస్తున్నారా? రోజూ వాడు మనం ఏట్లోకి దిగి కుచ్చెళ్ళు పైకెత్తగానే చెట్ల సందుల్లోంచి దొంగతనంగా చూస్తున్నాడు గమనించండి' అంది ఆమె మిగిలిన అమ్మాయిలతో.
వాళ్ళూ గమనించారు. అయితే శీనూకి ఇలా తన గుట్టు అమ్మాయిలకి తెలిసిపోయిందని తెలియదు.