Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 13


    "రేటు చెప్పడానికి టైమ్ కావాలి. టి.పి. నెంబర్ సెవెన్..."
    
    "అలాగే."
    
    ఆ తరువాత రెండువేపులా ఫోన్స్ క్రెడిల్ అవుతాయి.
    
    ఆ మరుసటి రోజు సరీగ్గా అదే టైమ్ కి ఫస్ట్ పార్టీ నుంచి థర్డు పార్టీకి ఫోన్ వస్తుంది.
    
    "ఈజిట్ టీ.పి...?" ఫస్టు పార్టీ ప్రశ్న.
    
    "ఎస్..." ఫోన్ దగ్గరున్న ఎవరైనా అలాగే సమాధానం ఇస్తారు.
    
    "ఐ వాంట్ టి.పి. నెంబర్ సెవెన్."
    
    ఆ చుట్టుప్రక్కల ఎక్కడున్నా టీపీ సెవెన్ ని ఫోన్ దగ్గరకు పిలుస్తారు.
    
    అతను ఫోన్ దగ్గరకు వచ్చేవరకు ఫోన్ నిశ్శబ్దంగా ఉంటుంది.
    
    "ఎస్. టి.పి. సెవెన్."
    
    "రేటు చెబుతారా....?"
    
    "చెబుతాను ట్వంటీ" టి.పి. సెవెన్ సమాధానం.
    
    "టూ మచ్"
    
    "కాదు సెకెండ్ పార్టీ బాగా సొమ్మున్న పార్టీ ఓన్ సెక్యూరిటీ ఉంది. సమాజంలో చాలా పలుకుబడి ఉంది. కనుక ట్వంటీ పెద్ద మొత్తం కాదు. ఇష్టమైతే అడ్వాన్స్ పంపండి."
    
    అంటూ టి.పి. సెవెన్ ఫోన్ ని క్రెడిల్ చేస్తాడు.
    
    అక్కడ థర్డు పార్టీస్ చాలామంది ఉంటారు.
    
    వాళ్ళ అసలు పేర్లు బయటికి రావు.
    
    వాళ్ళకు పేర్లుండవు. నెంబర్స్ ఉంటాయి.
    
    వాళ్ళలో వాళ్ళకు పోటీ ఉండదు.
    
    ఒకరికొచ్చిన ఎస్సైన్ మెంట్ ని మరొకరు ముట్టుకోరు.
    
    మరోరోజుకి ఫస్టుపార్టీ నుంచి థర్డు పార్టీ సెవెన్ కి ఫోన్ వస్తుంది.
    
    "ట్వంటీ ఓకే అడ్వాన్స్ ఎలా పంపాలి?"
    
    థర్డు పార్టీ లైన్ లోకి వస్తుంది.
    
    "ఒక ఓల్డ్ బ్యాగ్ తీసుకో దానిలో నెంబర్స్ వరుస క్రమంలో లేని హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఐదులక్షలకు సరిపడపెట్టు. విక్టోరియా టెర్మినస్ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్ దగ్గరకు నీ మనిషిని పంపు. అక్కడ లేసర్ ప్రింటింగ్ ఫోటో స్టూడియో ఉంది. దానికి ఎదురుగా పథ సామాన్లు కొని, అమ్మే, మొయినుద్దీన్ షాపు ఉంది. ఆ బ్యాగ్ ని సెకండ్ హేండ్ రేట్ కి అమ్మివేసి నీ మనిషిని వెంటనే అక్కడినుంచి తప్పుకొమ్మను. మరో నిముషానికి నా మనిషి అక్కడికి చేరుకొని ఆ బ్యాగ్ నే కొంటాడు. ఇది సరీగ్గా ఈ రాత్రి 7.30కి జరిగిపోవాలి. టైమ్ సెన్స్ చాలా ముఖ్యం" అని థర్డు పార్టీ ఫోన్ పెట్టేస్తుంది.
    
    మరుసటి రోజు అనుకున్న ప్రకారం ఐదులక్షల కేష్ ఉన్న బ్యాగ్ థర్డు పార్టీ సెవెన్ కి అందుతుంది.
    
    ఆ డబ్బులోంచి ముందే తన కమీషన్ తీసుకొని, మిగిలిన డబ్బుతో కంట్రీ క్లబ్ కి వెళతాడు టి.పి.సెవెన్.
    
    అక్కడ ఉండే సెలెక్టర్ ని కలుస్తాడు.
    
    సెలెక్టర్ పని సెకండ్ పార్టీ బ్యాగ్రౌండ్ ని బట్టి- ఏ ట్రిగ్గర్ మెన్ అయితే సరిపోతాడని భావిస్తే అతని పేరుని సూచిస్తాడు.
    
    సెలెక్టర్ కమీషన్ సెలెక్టర్ కిచ్చేసి ట్రిగ్గర్ ని కలుస్తాడు టి.పి. సెవెన్.
    
    తిరిగి ఆ ఇద్దరి మధ్య బేరం కుదురుతుంది.
    
    టి.పి.సెవెన్ ట్రిగ్గర్ కి అడ్వాన్స్ ఇస్తాడు.
    
    ఆ సాయంత్రం ట్రిగ్గర్ మార్క్స్ మెన్ ని కలుస్తాడు.
    
    మార్క్సు మెన్ సెకెండ్ పార్టీ మూమెంట్స్ ని, సెక్యూరిటీని బట్టి ఎక్కడ చంపాలి? ఎలా చంపాలి? అనే విషయాల్లో సలహా యిస్తాడు.
    
    మార్క్స్ మెన్ పేరుతో ఒకే వ్యక్తి ఉండవచ్చు. నలుగురైదుగురు ఉండవచ్చు.
    
    నిజానికి ఈ మార్క్స్ మెన్ కే పనెక్కువ.
    
    మార్క్స్ మెన్ కొన్ని వరాలు సెకండ్ పార్టీ మూమెంట్స్ ని స్టడీ చేసి, హత్యా చేయదగ్గ స్థలాన్ని, ఏ ఏంగిల్ లో షూట్ చేయాల్సింది, మూవింగ్ వెహికల్స్ వేగాన్ని, దూరాన్ని గురించి ట్రిగ్గర్ మెన్ కి తెలియజేస్తాడు.
    
    ఒక్కోసారి ట్రిగ్గర్ మెన్ ఆ ఏర్పాట్లన్నింటిని, తనే చూసుకొని ఎక్కువమంది మధ్యవర్తులు లేకుండా చూసుకుంటాడు. ఆ విధంగా ట్రిగ్గర్ మెన్ కి ఎక్కువ మిగిలే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ట్రిగ్గర్ మెన్ కి చాలాకాలం పడుతుంది.
    
    తనే ప్రత్యక్షంగా సెకెండ్ పార్టీని పరిశీలిస్తాడు.
    
    సెకండ్ పార్టీ దినచర్యని, వ్యాపార వ్యవహారాల్ని, తరుచూ వెళ్ళే ప్రాంతాలను, రూట్స్ ని, అతన్ని అంటిపెట్టుకు ఉండే సెక్యూరిటీని, అతని ఇంటికున్న భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా తెలుసుకొని తనకు సేఫ్టీ ప్లేస్ ని ఎన్నుకుంటాడు. సెకండ్ పార్టీని అసాసినేట్ చేసేందుకు, తను క్షణాల్లో క్షేమంగా బయటపడేందుకు, అవకాశాలు గల స్థలాన్ని అసాసినేషన్ సైట్ గా సెలక్ట్ చేసుకుంటాడు.
    
    అసాసినేషన్ కి డెడ్ లైన్ సెట్ అయిపోతుంది. ఆ తరువాత మిగతా ఎమౌంట్స్ సరీగ్గానే ఎవరికి అందవలసినవి వారి కందుతాయి.
    
    ఫస్టు పార్టీకి, థర్డు పార్టీకి మధ్య మరో మనిషి ఉంటాడు. అతను సమాజంలో రుజువర్తనగల మనిషిగా గుర్తింపబడి ఉంటాడు. అతనే మనీడీలింగ్స్, ఎస్సైన్ మెంట్ వ్యవహారాన్ని సమన్వయ పరుస్తుంటాడు.
    
    నిజానికి ఫస్టుపార్టీకి థర్డుపార్టీ ఫోన్ నెంబర్ తెలీదు. ఇతన్నే కో ఆర్డినేటర్ అంటారు. ఈ కో ఆర్డినేటర్ ఫస్టు పార్టీకి తెలియకుండా థర్డు పార్టీ నెంబర్ రింగ్ చేసి ఫోన్ ని చేతికిస్తాడు.
    
    ఒకవేళ పోలీసులు రంగంలోకి దిగినా ఈ లింక్ ఎక్కడో ఒక చోట కట్ అయిపోతుంది. ముఖ్యంగా సాక్ష్యాలు దొరకవు.
    
    సస్లీ వాడియాని అసాసినేట్ చేసేందుకు సిద్దమైన పథకంలో నాలుగు దశలున్నాయి. నలుగురు వ్యక్తులున్నారు. ఇప్పటివరకు ఫస్టు పార్టీ ఎవరయింది? ట్రిగ్గర్ మెన్ ఎవరయిందీ బొంబాయి పోలీసులు తెలుసు కోలేకపోయారు.
    
    ఈ క్రైమ్ కారిడార్స్ లో తిరుగాడే వ్యక్తులు ఒకవేళ పోలీసులకు దొరికినా నోరు విప్పరు. చచ్చినా, చంపినా, థర్డు డిగ్రీని ప్రయోగించినా పూర్తి వివరాలు, అసలు వ్యక్తుల పేర్లు బయటకు రావు.
    
    అందుకే ఇంకా ఈ క్రైమ్ కారిడార్స్ ని పోలీసులు మట్టుబెట్ట లేక పోతున్నారు.

 Previous Page Next Page