Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 12


                                          వంటొచ్చిన పెళ్లాం

    "ఏమిటీ?" అరిచినట్టుగా ఒక్కసారే అన్నారు తల్లి, తండ్రి, మామ్మ.
    "అవును. నాకు ఇంజనీరింగులు, ఎంబిఏలు, ఉద్యోగాలు చేసే అమ్మాయిలు వద్దు. హాయిగా ఇంటిపట్టున ఉండి వండిపెడుతూ, ఇల్లు, సంసారం, పిల్లల్ని చూసుకునే అమ్మాయి చాలు" అమెరికాలో ఎమ్మెస్ చదివి మంచి ఉద్యోగం చేసే పండుబాబు ఉరఫ్ చైతన్య తెగేసి తన నిర్ణయం చెప్పేశాడు. పెళ్లి చేసుకోమని అడిగిన తల్లిదండ్రులు, ఇలాంటి కోరిక కోరిన కొడుకుని చూసి తెల్లబోయారు.
    "అవును, నాకు వంటొచ్చిన పెళ్లాం కావాలి. ఏదో మామూలు డిగ్రీ చదువుకుని, కాస్త స్మార్ట్ గా ఉంటే చాలు" అర్థమయ్యేట్టు మళ్లీ చెప్పాడు.
    "వంటొచ్చిన పెళ్లాం అంటే వంటల్లో డిగ్రీలు ఉండాలా?" అర్థం కానట్టు అడిగింది తల్లి.
    "పో అమ్మా! అది కాదు, చక్కగా రుచిగా మన సంప్రదాయ వంటలు చేసే అమ్మాయిని చూడండి. ఉద్యోగాలు చేసే అమ్మాయిలు నాకొద్దు. నాకు తిండి సుఖం, ఇంటి సుఖం కావాలి. వద్దని మొత్తుకున్నా వినకుండా యు.ఎస్. పంపారు నన్ను. నాలుగేళ్లనించీ తిండి లేకుండా మలమలా మాడిపోతున్నాను. ఇప్పటికన్నా హాయిగా కావల్సినవి తినాలి నేను."
    "ఓర్నీ! నీ తిండిగోల ఏమిట్రా బాబూ! ఎవరన్నా అందం, చదువు, ఉద్యోగం కావాలంటారు."
    "ఆ చూశాలే, ఉద్యోగం చేసే అమ్మాయిల సంగతి! మా ఫ్రెండ్స్ నానాగడ్డీ కరుస్తున్నారు. కూరలు వీళ్లే తరగాలి. కుక్కర్లు వీళ్లే పెట్టాలి.గిన్నెలు వీళ్లే తోమాలి. తరిగిన కూర పోపులో వేసో వేయించో, ఇంత పప్పు కుక్కర్లో వండి, ఇండియా నుంచి తెచ్చిన పచ్చడి ప్లేట్లలో వేసేసరికి చాకిరీ అంటా వాళ్లే చేస్తున్నట్టు పోజులు, చికాకులు, కసుర్లు, విసుర్లు, సరిసమాన జీతం, సరిసమానంగా పని పంచుకోవాలని నినాదాలు, ఇంటికి ఎవరు ముందుగా వస్తే వాళ్ళే వండాలని షరతులు, ఓ వారం నీవు, ఓ వారం నేను అంటూ సర్దుబాట్లు. పిల్లలుంటే సరేసరి! నేపీలు మార్చాలి, ఫీడింగ్ బాటిల్స్ స్టెరిలైజ్ చెయ్యాలి. రాత్రిళ్లు ఏడిస్తే వాళ్లతోపాటు వీళ్లూ మేలుకుని కూర్చోవాలి. ఓరి నాయనో! వాళ్ల సంసారం పాట్లూ, ఆడవాళ్ల డిమాండ్లూ చూశాక చచ్చినా ఉద్యోగం చేసే అమ్మాయి వద్దనుకున్నా!"
    "బానే ఉంది, మరి నీ ఒక్కడి జీతంతో మేనేజ్ చేయగలవా?" తండ్రి ఆరా.
    "చేయాలి, ఇదివరకు ఆడవాళ్లు ఉద్యోగాలు చేశారా? ఎంత ఉంటే అంత సరిపెట్టుకోవాలి" కొడుకు సమాధానం.
    "ఉద్యోగం చెయ్యొద్దు, వంట చేసుకుంటూ పడి ఉండు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఈ రోజుల్లో?" తల్లి వసుమతి అనుమానం.
    "అవునురా కన్నా, డబ్బుకి అంతేముంది? పిచ్చినాగన్న, తిండికి మొహం వాచిపోయాడు. ఎంత సంపాదించినా కడుపు నిండా తిండి లేకపోతే ఆ సంపాదనెందుకు?" మనవడికి వత్తాసు పలికింది బామ్మ నిర్మలమ్మ. కోడలు వసుమతి ఆమెకేసి చురచుర చూసింది.
    'మీరూరుకోండి. అసలు వాడినిలా తయారుచేసింది మీరే. వాడు అడిగినవన్నీ ముప్పొద్దులా చేసిపెట్టి వాడిని మేపి ముద్దు చేసి పాడుచేశారు. ఎప్పుడూ తిండిగోలే! కూరేమిటి, పులుసేమిటి, అప్పాలు చేయవా, బొబ్బట్లు చెయ్యవా అంటూ వాడు మీ చుట్టూ తిరగడం, చిన్నవెధవ అంటూ మీరు వాడికి రుచులన్నీ మప్పడం... ఇన్నేళ్లు వచ్చినా ఇంకా వాడికి ఆ తిండియావ తగ్గలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో?" నిర్మలమ్మను దులిపేసింది కోడలు.
    "నీ గోలెప్పుడూ వాడి తిండిమీదే.కన్నతల్లివేనా నువ్వు?" అంటూ ఆవిడా ఊరుకోకుండా మొదలెట్టింది.
    పండగనాడు బొబ్బట్లు చేస్తుంటే రెండేళ్ల పండుని వంటింట్లో పీటమీద కూర్చోపెట్టి వేడి వేడి బొబ్బట్లు మీద నెయ్యి వేసి పెడితే చిన్న ముక్క కూడా కింద పడకుండా బుజ్జిచేతుల్తో ఆప్యాయంగా తింటుంటే చిన్నికృష్ణుడు వెన్న తిన్నట్టు ఎంత ముద్దుగా ఉన్నాడో అనుకుని మురిసిపోయింది. పులిహోర పెడితే కారం తిని చొంగ కార్చుకుంటూ, బొబ్బట్టుముక్క కొరికి నోరు తీపి చేసుకునే మనవడి తెలివికి మురిసిపోయేది. మనవడిని చంకనేసుకుని ఈ చిరుతిండి ఆ చిరుతిండి తినిపిస్తుండేది నిర్మలమ్మ. చిరుతిళ్లే కాదు, మూడు పూటలా ఏది పెట్టినా సుష్టుగా తినేవాడు. 'పిల్లాడసలు తిండికి అల్లరి పెట్టడమ్మా' అని ఇరుగమ్మ పొరుగమ్మల దగ్గర చెప్పి మురిసిపోయేది.
    ఎదుగుతున్నకొద్దీ పండుగాడికి రుచుల యావ పెరిగింది. తిండిలో వెరైటీలు పెరిగాయి. ఎదిగే పిల్లాడు ఆకలి ఉండదా, ఆటలాడుకుని వచ్చి తింటే ఇనుప ముక్కలు కూడా అరిగిపోతాయి అంటూ ఇంత నెయ్యి వేసి కందిపచ్చడి కలిపి, ఉల్లిపాయ పులుసు నంచిపెడితే గుటుకు గుటుకు మింగేసేవాడు. మామ్మ ఏది పెట్టినా వద్దనకుండా తిని పెరిగాడు. ఆ రుచులకు అలవాటు పడిపోయాడు. ఇడ్లీ చేస్తే 'ఉత్తి పచ్చడేనా? సాంబారు లేదా?' అనేవాడు. 'దోసెలోకి కూరేనా పచ్చడేది? పెసరట్టుకి అల్లం పచ్చడే కావాలి, పప్పుకూరకి ఇంగువనూనె ఏది?' అని అడిగేవాడు. ఇలా అన్ని రుచులు తెలిసిపోయాయి పండుబాబుకి. విస్తర్లో నాలుగు రకాలున్నా 'పచ్చడే చెయ్యలేదా?' అని డిమాండ్ చేసేవాడు.
    "ఏమిట్రా నీ గోల, నోరు మూసుకుని పెట్టింది తిను" అనేది తల్లి.
    కోడలు చూడకుండా మడిజాడీ వంచి ఏ చింతకాయో, గోంగూరపచ్చడో తెచ్చి వేసేది మామ్మ. వాడి పదకొండో ఏట "నేనింక ఎన్నాళ్లు బతుకుతానో వాడి పెళ్లి వేళకి ఉంటానో లేదో, ఒడుగు చెయ్యాల్సిందే" అని పంతం పట్టి కొడుకుచేత పండుబాబుకి ఒడుగు చేయించింది మామ్మ.  
    ఓసారి పక్కింట్లో ఆబ్దికం జరుగుతుంటే ఒక భోక్త ఆఖరి నిమిషంలో రాకపోయేసరికి "మీరేం అనుకోకపోతే పండుని ఒక్క అరగంట పంపిస్తారా? భోంచేసి వచ్చేస్తాడు. ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు గదా!" అని పెద్దమనిషి వచ్చి అడిగితే కాదనలేక ఒప్పుకున్నారు.
    "మామ్మా! తద్దినం భోజనం ఎంత బాగుందో! నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్లు, నాలుగు పిండివంటలు, నువ్వుల పచ్చడి, అల్లంపచ్చడితో నాలుగు గారెలు లాగించాను" పదమూడేళ్ల మనవడి మాటలు విని మామ్మ నవ్వితే "వెధవా! మరింకేం తద్దినాల భోక్తగా వెడుతూ ఉంటే సరి, దక్షిణ కూడా ముడుతుంది" అంటూ తల్లి మొట్టికాయ వేసింది.  
    వయసుతోపాటు తిండియావ ఎక్కువైంది పండుబాబుకి. హైస్కూలు, కాలేజీ చదువులయ్యాక, ఉన్న ఊళ్లోనే ఇంజనీరింగ్ చదవడంతో భోజనం ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అమెరికా వెళ్ళను మొర్రో, ఎమ్మెస్ వద్దు ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుంటాను అని వాదించి గోల పెట్టినా, "అక్కడ ఉండొద్దులే, ఎమ్మెస్ చేస్తే బాజ్ అవకాశాలు బాగా ఉంటాయి" అని నెమ్మదిగా నచ్చచెప్పి ఎలాగో పంపించారు తల్లీతండ్రీ.
    రెండేళ్లు నానాగడ్డీ కరిచి తిండికి మొహం వాచి నిజంగానే ఏడ్చేవాడు. ఏ గుళ్లోనన్నా ప్రసాదాలు పెడితే వెళ్లిపోయేవాడు. స్నేహితులు పిలిస్తే వెళ్లి కక్కుర్తిగా తిని వచ్చేవాడు. ఏడాది సెలవులకు వచ్చి ఓ పెట్టి నిండా పచ్చళ్లు, పొడులు, ఊరగాయలు పట్టుకెళ్లి ఎలాగో నెట్టుకొచ్చాడు. తిండికి ఎంత ఇబ్బంది పడ్డా చదువు పూర్తయిపోగానే ఉద్యోగంలో వచ్చిన జీతం డాలర్లని రూపాయల్లోకి గుణించి చూసేసరికి ఇంకో పదేళ్లు ఇండియాలో ఉద్యోగం చేసినా ఇంత జీతం రాదని డిసైడై, ఇండియా వెళ్లాలన్న కోరిక అణుచుకుని కాలక్షేపం చేస్తూ వచ్చాడు. 'తన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే పెళ్లి ఒక్కటే దారి' అనే నిర్ణయానికి వచ్చాడు పండుబాబు.

 Previous Page Next Page