ఆంధ్రాస్ ఆర్ కమింగ్
మాకాలనీలో చాలామంది పిల్లలు ఇంటర్ పరీక్షలు రాశారు. అయితే పరీక్షలు రాస్తున్నప్పుడే వాళ్ళ పరీక్షా ఫలితాలు ఎలా వుంటాయో మాకు తెలిసిపోయాయ్. ప్రశ్నాపత్రంలో ఒకటి రెండు ప్రశ్నలు తప్ప మిగతా వాటి గురించి తమ టెక్ట్స్ బుక్స్ లో ఎక్కడా ఏమీ లేదని, ఉన్నా ఆ పోర్షన్ సిలబస్ లో లేదని తామనుకున్నామనీ అన్నారు వాళ్ళు.
అయితే తీరా వాళ్ళ ఫలితాలు ఆ రోజు పేపర్లో వచ్చేసరికి కాలనీలో అందరికీ మతులు పోయినంత పనయింది.
అసలు చదవని వాళ్ళకు ఫస్ట్ క్లాస్, కొంచెం చదివిన వాళ్ళకు సెకండ్ క్లాస్, బాగా చదివిన వాళ్ళకు థర్డ్ క్లాస్ వచ్చాయ్.
ఎప్పుడూ డిస్టింక్షన్ లో పాసయ్యే ఒక్క అమ్మాయి మాత్రం తప్పింది.
మా అందరికీ అర్థమయిపోయింది.
"ఇది ఖచ్చితంగా కంప్యూటర్ పనే" అన్నాడు రంగారెడ్డి ఖచ్చితంగా.
"కంప్యూటర్ కాకపోతే ఇంత అవకతవకలుండవ్. నాకూ అదే అనిపిస్తోంది" అన్నాడు శాయిరామ్. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఇలాంటి అవకతవకలకు ప్రథమస్థానం వహిస్తున్న విషయం నిజమే అవడం చేత మిగతా వారందరూ కూడా మా అభిప్రాయాలతో ఏకీభవించారు. అయితే హఠాత్తుగా మాకో విషమ సమస్య ఎదురయింది.
అందరూ న్యాయంగా అయితే తప్పాలి గనుక వాళ్ళ భవిష్యత్తు గురించి పెద్దగా ప్లాన్ చేయడానికి ఏమీ లేకపోయింది.
"మళ్ళీ సెప్టెంబర్ లోనో, మార్చిలోనో పరీక్షలకు కట్టి పాసయినప్పుడు చూద్దాం!" అనుకున్నారు.
ఇంక గత్యంతరం లేక నగరంలోని అన్ని కాలేజీలకు అప్లికేషన్ ళు గుప్పించాం. మామూలుగానే ఎక్కడా సీటు దొరకలేదు.
ఎవర్నడిగినా బి.ఎ. కయితే సీటు ఇస్తామంటున్నారు. బి.ఎ. చదివితే ఆ వచ్చే ఫ్యూన్ ఉద్యోగం కూడా రాదని మాకు తెలుసు.
"బి.కామ్, బి.ఎస్సీ, కంప్యూటర్ లాంటివి కావాలంటే ఆంధ్రప్రదేశ్ లో కుదరదు. మా కర్నాటక వెళ్ళండి" అన్నాడు ఓ కన్నడ ఫ్రెండ్.
"అక్కడ మనకే కోర్సు కావాలంటే అది చదువుకోవచ్చా?" ఆశ్చర్యంగా అడిగాం మేము.
"ఎంట్రెన్స్ కూడా లేకుండా చదువుకోవచ్చు."
"ఎంట్రెన్స్ కూడా లేకుండానా?" మరింత ఆశ్చర్యపోతూ అడిగాము.
"అవును...." మేము ఆశ్చర్యంలో మరింత లోతుకి కూరుకుపోయాము.
"అదే కాదు, ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, పాలిటెక్నిక్, బి.ఇడి., ఏదైనా సరే."
అందరం ఘోల్లున నవ్వేశాం అతని మాటలకు.
"ఏం జోక్ చేస్తున్నావ్ రా నాయనా! ఎంట్రెన్స్ లేకుండా ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ లో సీట్లు దొరుకుతాయా?"
మిగతా వాళ్ళందరూ కూడా అతనిని పిచ్చివాడిని చూసినట్టు చూశారు.
"పిచ్చి నాక్కాదయ్యా! మీ ఆంధ్రాస్ కి ఎక్కింది. అడుక్కుతినే రాష్ట్రం! అడుక్కుతినే చదువులు! బోడి సినిమాలు తీయడంలోనే ఫస్ట్ మీరు!" అనేసి కోపంగా వెళ్ళిపోయాడతను.
ఒకవేళ వాడు చెప్పేది నిజమేనేమో" అన్నాడు గోపాల్రావ్ అనుమానంగా.
"ఏడ్చావ్! మనక్కావలసిన చదువు చదువుకోవడం ఇండియాలో ఎలా సాధ్యమవుతుంది?" అన్నాడు జనార్ధన్. "వాడు చెప్పేది ఇంకేదో దేశంలో కర్నాటక అనే ఊరు గురించి అయి వుంటుంది-"
"అయితే ఈ కర్నాటక అనేది ఒక వేళ ఎక్కడయినా విదేశాల్లో వుందేమో. ఎంక్వయిర్ చేద్దాం" అన్నాడు రంగారెడ్డి.
"అవును. ఆ పేరుతో ఇంకెక్కడో ఏదో దేశం వుండి ఉంటుంది. లేకపోతే మనదేశంలో మామూలు మిడిల్ క్లాస్ మనుషులకు చదువుకునే అవకాశం ఎందుకుంటుంది?" అన్నాడు శాయిరామ్.
"ఈ కిరికిరంత ఎందుకు భాయ్! జర వరల్డ్ మాప్ ల చెక్ జేస్తే మంచిగుంటది కద!" అన్నాడు యాదగిరి. ఎవరో ఇంట్లోకి పరుగెత్తుకెళ్ళి మాప్ తీసుకొచ్చారు. అందులో అన్ని దేశాలూ చూశాంగానీ ఎక్కడా కర్నాటక అనేది కనిపించలేదు.
"అయితే ఇది మనదేశంలోని కర్నాటకే అయి వుంటుంది" అన్నాడు గోపాల్రావ్ మళ్ళీ అనుమానంగా.
ఈలోగా చంద్రకాంత్ ఛటోపాధ్యాయ్ ఓ ఇంగ్లీష్ డెయిలీ తీసుకొచ్చాడు.
"ఇది మన పొరుగు కర్నాటక రాష్ట్రమే గురూ! ఇదిగో ఈ పేపర్ నిండా ఆ రాష్ట్రంలోని కాలేజీల ప్రకటనలే! ఎల్.ఎల్.బి., పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్ అన్నీ ఎంట్రెన్స్ లేనివే వున్నాయక్కడ. మన దిక్కుమాలిన రాష్ట్రంలాగా ఎంట్రెన్స్ లూ, పిచ్చిరాంకులూ, కొశ్చెన్ పేపర్లు అవుటయి కొంతమంది రాజకీయ నాయకుల బంధువుల పిల్లలే సెలక్టవటాలూ ఇవేమీ లేవట! కేవలం సెకండ్ క్లాస్ లో ఇంటర్ పాసయితే, ఇంజనీరింగ్, మెడికల్ రెండింటికి అప్లయ్ చేసుకోవచ్చు-" న్యూస్ పేపర్లోని ప్రకటనలు చూస్తూ అన్నాడతను.
ఆ రాత్రి మా కాలనీలో చాలా కుటుంబాల్లో ఎవరికీ నిద్రపట్టలేదు.
"ఏమండీ! మన వాడికి మన రాజధానిలో ఎక్కడా పనికిమాలిన డిగ్రీకి కూడా సీటు దొరకలేదు కదా! వాడిని పోనీ కర్నాటకలో ఇంజనీరింగ్ లో చేర్చేద్దాం..." అంటోంది మా పక్కింటావిడ.
"సరే! వాడు ఇంజనీర్ కావాలని వాడి జాతకంలో రాసి పెట్టి వుందేమో! అందుకే మన రాష్ట్రంలో బి.ఏ.కి సీటు దొరకలేదు అంతా మనమంచికే" అన్నాడతను.
రంగారెడ్డి భార్య ఇంకో మెట్టు పైకెళ్ళిపోయింది.
"కర్నాటకలో నాలుగేళ్ళ నుంచీ వున్న వాళ్ళ పిల్లలకు కేవలం సంవత్సరానికి ఎనిమిది వేలే ఫీజుటండీ- ఇంజనీరింగ్ లో! అదీ ఎంట్రెన్స్ లో సెలక్టయితే ఇంకా తక్కువట! మనం కర్నాటకకు ట్రాన్స్ ఫర్ చేయించుకుని వెళ్ళిపోదాం పదండి- మన పిల్లలు పెద్దాళ్ళయేసరికి లోకల్ కాండిడేట్స్ అయిపోతారు-" అంటోందామె.
"కానీ మన రాష్ట్రం నుంచి కర్నాటక రాష్ట్రానికి నాకు ట్రాన్స్ ఫర్ ఇవ్వరే!"
"అయితే ఈ దిక్కుమాలిన ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగానికి రాజీనామా చెయ్యండి. కర్నాటకలో ఏదొక ఉద్యోగం దొరక్కపోదు."