"అమ్మయ్యా! కిరికిరి వదిలిపోయింది" అన్నాడు రంగారెడ్డి తేలిగ్గా గాలి పీల్చుకుంటూ.
"ఇంకోసారి ఛస్తే ఇలాంటి ఫాల్తూ సోషల్ సర్వీస్ చేయొద్దు" అన్నాడు శాయిరామ్.
"అయినా ఈ మూర్ఖపు ప్రజలకు మనం ఎంత చెప్పినా, ఏం చెప్పినా ప్రయోజనం లేదు. లారీల్లో వెళ్తూనే ఉంటారు. ఛస్తూనే వుంటారు!" అన్నాడు గోపాల్రావ్.
దూరంగా మరో ఎర్ర బస్ కనిపించింది.
"పదండి! మనదారిన మనం ఆ బస్ లో వెళ్ళిపోదాం!" అన్నాడు శాయిరామ్.
అందరం బస్ ఆపమన్నట్లు చేయి అడ్డంగా చాపాంగానీ బస్ ఆగలేదు.
"ఓ గంట ఆలస్యం అయితే అయింది. ఇంకో బస్ వచ్చాక వెళ్దాం! అంతేగానీ ఈ ఊరోళ్ళలాగా కొంప మునిగిపోయినట్లు లారీల్లో వెళ్ళాల్సిన ఖర్మ మనకేంటి?" అన్నాడు రంగారెడ్డి.
అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం అంతలోనే టైం ఒంటిగంటయిపోయింది. ఒక్క బస్ కూడా రాకపోయేసరికి మాకు చిరాకు మొదలయింది.
"నాకు ఆకలేస్తోంది! ఇంతవరకూ ఎప్పుడూ ఒంటిగంటవరకూ భోజనం చేయకుండా ఉండలేదు" అంది డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరీ.
"నిజం చెపుతున్నాను. నాకు ఇందాకట్నుంచీ ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయ్" అంది పార్వతీదేవి.
"అయినా ఈ దరిద్రపు బస్సులు ఒక్కటికూడా తగలడటం లేదేమిటి?" కోపంగా అన్నాడు శాయిరామ్.
"నాకు నాలుగింటికల్లా మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాలి! లేకపోతే చాలా ఫీలవుతాడు వాడు" అన్నాడు చంద్రకాంత్.
"మా బాస్ ఇవాళ సాయంత్రం మీటింగ్ కి ఫైల్స్ తీసుకుని రమ్మన్నాడు! లేకపోతే ఉద్యోగమే ఊడిపోయినంత ప్రమాదం జరుగుతుంది" అన్నాడు శాస్త్రి దిగులుగా.
"ఇవాళ ఆరింటికి మంజు టాకీస్ దగ్గర మా గాళ్ ఫ్రెండ్ ని కలుసుకోవాలి. లేకపోతే రేపట్నుంచీ ఆ విశ్వనాథం గాడికి గాళ్ ఫ్రెండయిపోతుంది" అన్నాడు స్టూడెంట్ సురేష్.
అప్పుడె ఆ ఊరి సర్పంచ్ వచ్చాడు ఓ సంచితో.
"అప్పటికెళ్ళి ఈడనే ఉన్రా మీరు?" అనడిగాడు ఆశ్చర్యంగా.
"బస్ కోసం చూస్తున్నాం!" అన్నాడు రంగారెడ్డి.
"బస్సా! ఈ టైమ్ ల బస్సేడున్నది? సాయంత్రం నాలుగ్గంటల కొకటున్నది!"
మా గుండెలవిసిపోయినయ్.
అప్పుడే లారీ వచ్చి ఆగింది.
సర్పంచ్ లారీ ఎక్కి మావేపు జాలిగా చూశాడు.
"మీరు భీ లారీలో ఎక్కండ్రి! బస్ గురించి నుల్చుంటే ఈడనే రుకాయించి పోతరు" అన్నాడతను.
మేము మొఖాలు చూసుకున్నాంగానీ లారీ ఎక్కడానికి ధైర్యం చేయలేకపోయాం!
లారీ వెళ్ళిపోయింది.
సాయంత్రం నాలుగ్గంటలకల్లా శోష వచ్చినట్లు వాలిపోయాం అందరం ఉండుండి దూరంగా ఉన్న పాకలో పాచిపోయిన జంతికలు మాత్రం తీసుకొచ్చి తలోటీ ఇస్తున్నాడు యాదగిరి.
అయినా బస్ జాడమాత్రం లేదు.
"నేను లారీలో వెళ్ళిపోతాను" హఠాత్తుగా పూనకం వచ్చినట్లు లేచి నిలబడింది రాజేశ్వరి.
"మీకేం పిచ్చెక్కిందా? లారీల్లో ప్రయాణం చేస్తే ప్రమాదమని అందరికీ చెప్పటానికొచ్చి మీరు లారీలో వెళతారా?" కోపంగా అన్నాడు శాయిరామ్.
"ఈ బోడి ఆర్టీసీ బస్సులను నమ్ముకోవటం నావల్లకాదు. మీరెవరొచ్చినా రాకపోయినా నేను లారీలోనే వెళ్తున్నా" అందామె మొండిగా.
నిజానికి మాకూ లోపల్లోపల లారీలోనో, ట్రాక్టర్ లోనో, టెంపోలోనో, ఎలాగోలా ఆ ఊరువదలి ఇంటికి చేరుకోవాలనుంది. సరిగ్గా అప్పుడే సర్పంచ్ సిటీకి వెళ్ళటం, పని చూసుకుని ఇంకో లారీలో తిరిగి రావటం కూడా జరిగిపోయింది.
"నీయవ్వ! ఇంకా బస్ గురించే ఇంతజార్ లో ఉన్నారు? అహహ" అంటూ వెళ్ళిపోయాడు.
అప్పుడె ఓ లారీ శరవేగంతో వచ్చి ఆగింది.
"ఆ! లష్కర్ లష్కర్ లష్కర్" అరచాడు క్లీనర్ మావేపు చూస్తూ.
రాజేశ్వరి పరుగుతోవెళ్ళి ఇసుకమీద ఎక్కికూర్చుంది.
ఆమె వెనుకే అందరం ఆర్టీసీ బస్ లను తిట్టుకుంటూ లారీ ఎక్కాం.
డ్రైవర్ కి మందు ఎక్కువయిపోవటం వల్ల లారీ పిచ్చెక్కినట్లు రోడ్డంతా తిరిగేస్తూ శరవేగంతోపోతోంది.
అయినాగాని మాకా ప్రయాణం రిస్క్ అనిపించలేదు. భయం వేయలేదు.
ఇంకా ఆర్టీసీ బస్ కోసం ఎదుర్చూడ నక్కర్లేదన్న నిజం ఎంతో ధైర్యాన్నిస్తోంది.
ఇసుకలో మా పక్కనే కూర్చున్న ఓ ఆర్టీసీ డ్రైవర్ న్యూస్ పేపర్ లోని ఓ అయిటమ్ గట్టిగా చదివి తన సహోద్యోగికి వినిపిస్తున్నాడు.
"విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ కంటే అతిచిన్న రాష్ట్రాలయిన మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, కేరళల్లో ఆంధ్రప్రదేశ్ కంటే కొన్ని వేల బస్ లు ఎక్కువగా తిరుగుతున్నాయ్. మన రాష్ట్రంలో మన ప్రజావసరాలకు సరిపోయేన్ని బస్ ళు వేయాలంటే కనీసం పదహారువేల బస్ ళు కొని నడపాల్సి ఉంటుంది. ఏనాటికయినా అది మన దివాణాకోరు ప్రభుత్వం వల్ల కాని పని! అంతవరకూ రాష్ట్ర ప్రజలు చచ్చినట్లు లారీల్లో తిరగాల్సిందే ఆర్టీసీ బస్ కోసం ఎదుర్చూస్తూ చావటం కంటే, బ్రతుకుమీద లాటరీ వేసుకుంటూ లారీల్లో తిరగటమే ఉత్తమం!"
మేమందరం ఆ వార్తలు వినీవిననట్లు ఊరుకున్నాం.
కాసేపటికి హైదరాబాద్ పొలిమేరల్లోకొస్తోండగా రోడ్ మీద కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాం. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని నుజ్జునుజ్జయాయ్.
పోలీసులు వాటిమధ్య నుంచి డెడ్ బాడీస్ తీసి అంబులెన్స్ లోకి చేరుస్తున్నారు.
* * * * *