Previous Page Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 12


    ఆవిడ ముఖంలో ఒకింత ప్రసన్నతా భావం తొంగి చూడడంతో ఆనందం మళ్ళీ పులైపోయాడు.

 

    "మేం నిత్యం... చిక్కడపల్లి వెంకటేశ్వరాలయంలో పద్మావతీ దేవిని సందర్శించుకోవడం అలవాటు కానీ, మిమ్మల్ని చూసిన మరుక్షణం నుంచీ ఏ మంచి జరగాలన్నా, మిమ్మల్నే తల్చుకుని వెళ్ళడం మా అలవాటు. ఇన్నాళ్ళూ బాగానే వుంది. ఈ మధ్యే అకస్మాత్తుగా మాకు కష్టాలు ప్రారంభమై పోయాయి. మీ దర్శనం చేసుకుని ఆ కష్టాలు చెప్పుకుందామని ఇలా వచ్చాం..."

 

    జాలిగా ముఖం పెట్టుకుని ఒక్కొక్కమాటా అంటున్న ఆనందం వేపు, ఆ ప్రక్కన అమాయకంగా నిలబడిన ఆంజనేయులు వేపూ అభిమానంగా చూసిందావిడ.

 

    తనలోని 'లక్ష్మీ కళ'ను ఇన్నాళ్ళకు వీరిద్దరూ గుర్తించారన్న మాట!

 

    "ఏంటి మీ కొచ్చిన కష్టం?" అడిగిందావిడ.

 

    "ఈ వీధి చివర ఉంటున్నామని చెప్పాను కదా పిన్నిగారూ... ఆ హౌస్ ఓనర్ సడన్ గా మమ్మల్ని ఆ ఇల్లు ఖాళీ చెయ్యమన్నాడు అంతే... ఈ వీధిలోంచి మేం వెళ్ళిపోతే... మీ దర్శన భాగ్యం కరువై పోతుందని" నర్మగర్భంగా ఆంజనేయులి వేపు చూశాడు.

 

    ఆ పొగడ్తలకు తబ్బిబై పోయింది భువనేశ్వరీదేవి.

 

    "మీకేం పర్వాలేదు... మీకిప్పుడో రూం కావాలి... అంతేనా..." ఆ మాట ఆవిడ నోట్లోంచి రావడంతో గభాల్న ఆవిడ కాళ్ళమీద పడిపోయాడు ఆనందం.

 

    ఆంజనేయులు బిత్తరపోయి చూస్తుండిపోయాడు.

 

    "పిన్నిగారూ... మీరు జ్ఞాని... మీలాంటి 'జ్ఞానులికి' అర్జంటుగా 'భరతరత్న' అవార్డులివ్వాలి... నేనే గనక..." ఏదో అనబోయేటంతలో-

 

    "అతి ఎక్కువైపోతే... అసలుకే ప్రమాదం వస్తుంది జాగ్రత్త... అందుబాటులొ వున్న ఆనందం చెవిని కొరికాడు ఆంజనేయులు.

 

    "నీ పేరు" అనడిగింది ఆంజనేయులు వేపు చూస్తూ.

 

    "ఆంజనేయులండి..." అన్నాడు ఆంజనేయులు నెమ్మదిగా.

 

    "మరి నీ పేరు ఆంజనేయులైతే..... వాడు కోతి వెధవలా ప్రవర్తిస్తాడేం..." అంది ఇబ్బంది పడిపోతూ ఆవిడ.

 

    ఆ మాటకు జవాబేం చెప్పాలో అర్థం కాలేదు ఇద్దరికీ.

 

    "ఏదో... చిలిపితనం..." నెమ్మదిగా గొణిగాడు ఆంజనేయులు.

 

    "నీకు పెళ్ళయిందా?" అడిగిందావిడ తిరిగి.

 

    "అయిందండి... మొన్న ఏప్రెల్లో అయిందండి. మీలాంటి మంచిల్లు దొరికితే కాపురం పెడదామని..." సమాధానం ఆనందం చెప్పాడు.

 

    "ఇంకా కాపరం పెట్టలేదా?"

 

    "లేదండి... మొట్టమొదటిసారి భార్యను తీసుకురావాలంటే కొంచెం ఇల్లూ, పరిసరాలూ బాగుండాలి కదండీ..." తిరిగి ఆనందమే సమాధానం ఇచ్చాడు.

 

    ఆంజనేయులికి సమాధానం చెప్పే అవకాశం ఇస్తే ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని ఆనందం భయం. అప్పటికే అన్ని అబద్ధాలు వెంట వెంటనే ఆడేయగలుగుతున్న ఆనందాన్ని చూసి ఆంజనేయులు విస్తుపోతున్నాడు. ఆంజనేయుల్ని అడిగితే ఆనందం సమాధానం ఇవ్వటం ఆమెకు నచ్చలేదు. అయినా పొగడ్తలకు ఉబ్బిపోయి ఉండటంతో ఏమనలేకపోయింది.

 

    "మా అవుట్ హౌస్ ఖాళీగానే వుంది. మాకు రెంట్ అవసరం లేదు. నువ్వు ఇంట్లో దిగిన వారంకల్లా నీ భార్యని తేవాలి. అది మొదటి కండిషన్" ఏవంటావన్నట్టుగా చూసింది భువనేశ్వరీదేవి ఆంజనేయులి వేపు.

 

    జవాబు కోసం ఆనందం వేపు చూశాడు ఆంజనేయులు.

 

    "తెచ్చేస్తాడండీ... వారం రోజులెందుకు... ఇలా టెలిగ్రాం కొట్టగానే అలా ఎస్సారెమ్ టీలొ వచ్చేస్తుంది" వెంటనే అన్నాడు ఆనందం.

 

    "ఎస్సారెమ్ టీలోనా... ఆవిడ తెప్పించమంటోంది పెళ్ళాన్నిరా... లగేజీని కాదు" చెవిలో గొణిగాడు ఆంజనేయులు ఒకింత కోపంగా.

 

    "మీకు గది ఇస్తాను. కానీ ఈ విషయాన్ని ఫైనలైజ్ చెయ్యాల్సిన వారు మా ఆయన. ఆయనతో మాత్రం నీకు పెళ్ళయిందని చెప్పకూడదు అంతే..."

 

    "ఇంట్లోకి అమ్మాయొస్తే మరి కనబడదా అండీ..." అమాయకంగా అన్నాడు ఆనందం.

 

    "అప్పుడు ఎలాగోలా మానేజ్ చెయ్యొచ్చయ్యా... ప్రస్తుతానికి... ఆయన దగ్గర అబద్ధం ఆడాలి... అంతే..."

 

    "అలాగే పిన్నిగారూ మాకయితే అబద్ధాలాడటం రాదు, మీ కోసం ఆడుతున్నాం" అన్నాడు ఆనందం బుద్ధిమంతుడిలా.

 

    "అయితే పదండి" అందామె.

 

    భువనేశ్వరి వెనక ఇద్దరూ నడుచుకుంటూ ముందు హాల్లోకి వచ్చారు. అప్పటికి భుజంగరావు కాళ్ళూపుకోవడంలో తాదాత్మ్యతను అనుభవిస్తున్నాడు.

 

    "ఏవండీ... వీళ్ళని మన "అవుట్ హౌస్'ను ఇద్దామనుకుంటున్నాను."

 

    భువనేశ్వరి గొంతువిని కళ్ళిప్పాడు భుజంగరావు.

 

    "ఎందుకూ... వీళ్ళు అండమాన్ జైల్లోంచి వచ్చిన వాళ్ళలా వున్నారు. ఇలాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చే ముందు, మంచి చెడులన్నీ జాగ్రత్తగా ఆలోచించాలి" ఆంజనేయులు వేపు కన్నుగొడుతూ అన్నాడు భుజంగరావు.

 

    "లంకంత ఇల్లుని ఒక్క గూర్ఖా చూసుకోలేకపోతున్నాడు గదా... కుర్రాళ్ళు బుద్ధిమంతులు. ఏవంటారు?"

 

    "ఇంతవరకూ మనం హాయిగా వున్నాం. రేపు వీళ్ళు దిగాక, వీళ్ళ కోసం వచ్చే అమ్మాయిలతో మన గార్డెన్లోనే డ్యూయట్లు అవీ సృష్టిస్తారేమో!" కాళ్ళూపుకుంటూ అన్నాడు భుజంగరావు.

 

    "అలాంటిది జరిగితే కాళ్ళు విరిచెయ్యనూ... కుర్రాళ్ళిద్దరూ బుద్ధిమంతులు. రేపు మనింట్లో ఏదైనా శుభకార్యం జరిగితే మనకు మనవాళ్ళనే వాళ్ళు ఉండొద్దూ" శుభకార్యం అన్నమాటను 'వత్తి' పలుకుతూ అంది భువనేశ్వరి.

 

    "అలాగే... కానీ... నీ ఇష్టం నేనెందుకు కాదనాలి?" అన్నాడు అయిష్టాన్ని నటిస్తూ.

 

    ఆవిడ సంతృప్తిగా లోపలకెళ్ళిపోయింది.

 

    "థాంక్స్ బాబాయిగారూ!" అన్నాడు ఆనందం.

 

    ఆంజనేయులు కూడా తననేదైనా వరసపెట్టి పిలుస్తాడేమోనన్న భయంతో...

 

    "వరసలవీ తర్వాత. ముందెళ్ళి సామాను గట్రా... తీసుకొచ్చి దిగిపొండి" అన్నాడు భుజంగరావు నవ్వుతూ...

 

    "ముందు ఈ ఇంట్లో దిగినట్టు మీ సంతకంతో ఓ ఉత్తరం కావాలి సర్... అది మా ఆఫీసరు చూస్తేనే నన్ను ఉద్యోగంలోకి తీసుకుంటాడు" చెప్పాడు ఆంజనేయులు.

 

    "అయితే ఆ ఉత్తరం తయారు చెయ్యి... సంతకం పెడతాను..." హుషారుగా నవ్వుతూ అన్నాడు భుజంగరావు.

 Previous Page Next Page