Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 12


    "చెప్పు. త్వరగా" ఆతృతగా అందామె.

 

    "12155 అంటే ఏమిటి?"

 

    అతని ప్రశ్నకు జయారెడ్డి బిత్తరపోయింది.

 

    "ఏంటది? ఫోన్ నెంబరా? గ్యాస్ కనెక్షనా? కారు నెంబరా?" అడిగింది జయారెడ్డి.

 

    "ఒక వయసులో వున్న అమ్మాయి ఒక వయసులో వున్న అబ్బాయిని అడిగేదే అది. అదేంటో నువ్వు చెప్పాలి" అన్నాడు శ్రీధర్.

 

    ఆలోచనల్లో పడిపోయింది జయారెడ్డి.

 

    ఆమె పరిసరాల్నే మరచిపోయి, అలా పజిల్ విషయం ఆలోచిస్తుండటం చూసి శ్రీధర్ లోలోన నవ్వుకున్నాడు.

 

    ఈమె పజిల్ విప్పిందా ఆ అపరిచితురాలి నోరు మూయించవచ్చు. విప్పలేదా...ఈమె బాధ తనకు కొన్నాళ్ళపాటు తప్పుతుందనుకున్నాడు శ్రీధర్.

 

    కాసేపటికి తేరుకుని, "మరి నా పజిల్ విషయం ఏం చేశావ్?" ప్రశ్నించింది శ్రీధర్ ని.

 

    "ఏంటది?" విస్మయంగా అడిగాడు శ్రీధర్.

 

    "ఏంటీ...అప్పుడే మర్చిపోయావా? ప్రపంచంలో దేనికైనా అనుభవం వుందా అని అడుగుతారు. లేకపోయినా వుందనే చెప్పాలి మగవాళ్ళు ఏమిటది?" గుర్తుచేసిందామె.

 

    ఈసారి ఆలోచనల్లో పడిపోవడం శ్రీధర్ వంతయింది.   

 

    "నీ పజిల్ కి నేను సమాధానం చెప్పాలంటే, ముందుగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పాలి" అంది జయారెడ్డి.

 

    ఈసారి బిత్తరపోవడం శ్రీధర్ వంతయింది. అక్కడ ఎక్కువ సేపుండటం అంత మంచిది కాదని "సరే... సరే" అంటూ చెప్పి వేగంగా లిఫ్ట్ కేసి వెళ్ళిపోయాడు.

 

    వెళ్ళిపోతున్న అతనికేసి చూస్తూ- అవును ఇంతకీ '12155'లో అంటే ఏమిటి? అని తనను తాను ప్రశ్నించుకుంది జయారెడ్డి.


                              *    *    *    *


    శ్రీధర్ ఫ్లాట్ లోకి ఎంటరవుతూనే, లైటు వేసి విండోకున్న కర్టెన్ తొలగించి, ఫోను పక్కనేవున్న సీట్లో కూర్చున్నాడు-దానికేసే ఆతృతగా చూస్తూ.

 

    అప్పుడు సమయం ఏడుగంటల ముప్పై నిమిషాలవుతోంది. నిమిషాలు గడుస్తున్నకొద్దీ అతనిలో టెన్షన్ అంతకంతకు రెట్టింపు కాసాగింది. అపర్ణ ఫోన్ కాల్ మీదే మనసంతా లగ్నంచేసి కూర్చున్నాడు శ్రీధర్.

 

    ఫోన్ వంకే ఆశగా చూస్తున్నాడతడు.

 

    గడుస్తున్న ప్రతి నిమిషం అతని హృదయ కవాటాలలో పరుగెత్తే రక్తాన్ని ఉధృతం చేస్తోంది.

 

    సరిగ్గా ఎనిమిది గంటలకు మోగింది ఫోను.

 

    ఆతృతగా రిసీవర్ అందుకున్నాడు.

 

    అతని అణువణువూ అపర్ణ కంఠం కోసం ఉవ్విళ్ళూరుతున్న వేళది.

 

    "అపర్ణ...అపర్ణ...ఏమిటి? ఇన్నాళ్ళూ ఏం చేస్తున్నావ్? ఏమై పోయావ్?" అన్నాడు.

 

    "........."

 

    అవతలివేపునుంచి సమాధానం సందేహాస్పదమైంది.

 

    ఒక నిమిషం తర్వాత.

 

    "హలో...బాబూ శ్రీధర్, నేను మాథ్యూస్ ని."

 

    "ఓహ్...సారీ ఆంటీ" తమాయించుకుని అన్నాడు శ్రీధర్.

 

    "ఆంటీ కాదు బాబూ, మమ్మీ అని పిలువు."

 

    "సరే మమ్మీ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు...?" అన్నాడు శ్రీధర్.

 

    "నువ్వు ఒకసారి నా ఫ్లాట్ కి రాగలవా? ఈ ఒంటరితనాన్ని నేను భరించలేకపోతున్నాను."

 

    ఆమె కంఠంలో తొంగిచూసిన వ్యధను అర్థంచేసుకున్న శ్రీధర్ కదిలిపోయాడు.

 

    కానీలోపు అపర్ణ కాల్ వస్తే?

 

    అందుకే వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.

 

    "ఏం బాబూ, మాట్లాడవేం?" తిరిగి ఫోన్ కి ఆవేపునుంచి అడిగింది మాథ్యూస్.

 

    "అపర్ణ కాల్ కోసం ఎదురుచూస్తున్నాను మమ్మీ! అది రాగానే మాట్లాడి వచ్చేస్తాను. సరేనా?" ఇబ్బందిపడుతూనే అన్నాడు శ్రీధర్.

 

    "నా ఫ్లాట్ కి కాల్ ట్రాన్స్ ఫర్ చేసి ముందు నువ్వొచ్చేయ్ బాబూ" రిక్వెస్ట్ చేసుకుంటున్నట్టనిపించింది అతనికి ఆ మాట వినగానే.

 

    మారు మాట్లాడలేకపోయాడు శ్రీధర్. కాల్ ట్రాన్స్ ఫర్ చేసి, డోర్ కి తాళం వేసి, మాథ్యూస్ ప్లాట్ కెళ్ళాడు.

 

    డెబ్భైయేళ్ళ మాథ్యూస్ క్రిస్టియన్....

 

    శ్రీధర్ ఫ్లాట్స్ కి ఎదురుగా వున్న ఫ్లాట్స్ లో వుంటోందామె. బాగా డబ్బున్న వంశంలో పెట్టి పెరిగిందామె. కొడుకులూ, కూతుళ్ళూ పెద్ద చదువులు చదివి, మంచిహోదా కలిగిన ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో సెటిల్ అయిపోయి సుఖంగా బ్రతికేస్తుండగా, తమ మాత్రం పుట్టి పెరిగిన మాతృభూమి అనుబంధాన్ని వీడి వెళ్ళలేక స్వదేశంలోనే వుంటోంది.

 

    శ్రీధర్ హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో ఆ అపార్ట్ మెంట్ లో తనకో ఫ్లాట్ అద్దెకివ్వడానికి ఫ్లాట్ ఓనర్ సందేహిస్తుండగా, మాథ్యూస్ శ్రీధర్ తనకు దగ్గరి బంధువవుతాడని చెప్పి ఒప్పించి అతనికా ఫ్లాట్ దక్కేలా సాయపడింది.

 

    కనిపెంచిన కొడుకుల, కూతుళ్ళ ప్రేమాభిమానాలు కరవై ఒంటరిగా వుంటున్న మాథ్యూస్, ఆ ఒంటరితనాన్ని పారదోలుకోవడానికి, దూరమైనా కొడుకులను శ్రీధర్ లో చూసుకోవడానికి, తత్ఫలితంగా అతన్ని అభిమానించడానికి కారణమయింది.

 

    ఆస్తీ, అంతస్తూ, ఐశ్వర్యం-అన్నీ వుండి తల్లి ప్రేమానురాగాలను పొందలేని శ్రీధర్ కు ఒక తల్లిలా మాథ్యూస్ చేరదీసి, కన్నకొడుకుల కంటే అమితంగా ప్రేమిస్తుండడంతో శ్రీధర్ కూ మాథ్యూస్ పట్ల ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి.

 

    ఎన్నాళ్ళనుంచో కొరవడిన ప్రేమ, అభిమానం, అనుబంధం వర్తమానంలో ఒకరి నుంచి మరొకరికి లభిస్తుండడం వల్లే వారిరువురి మధ్య దాదాపు తల్లీ కొడుకుల బంధం నెలకొనడానికి కారణమయింది.

 Previous Page Next Page