"నన్నడిగితే... ఓ.కే... మరి మా పార్ట్నర్ ని కూడా అడగండి" అన్నాడు అవినాష్.
"ఏం రోష్ణి... మాస్టారిది సిన్మాల ఖర్చు... నీది... హోటల్ ఖర్చు... ఓడిపోయారు కదా..." లలిత అంది.
కళ్ళెత్తి అవినాష్ వేపు చూస్తూ "అలాగేలే" అంది రోష్ణి.
ఆ చూపుల్లో భావాలు అవినాష్ పసికట్టేశాడు.
మర్నాడు-
సిన్మాహాల్లో అవినాష్, రోష్ణి మరింత దగ్గరయ్యారు. చీకట్లో పక్కనే కూర్చున్న ఆమె చేతిని తన చేత్తో ముట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుని-
"ఐ లవ్ యూ..." అన్నాడు.
"ఎవరైనా వింటారు..." మెల్లగా అంది రోష్ణి.
ఆ మాటకు అవినాష్ పొంగిపోయాడు.
ఆ తర్వాత అవినాష్, రోష్ణి ఎన్నెన్నో సినిమాల కెళ్ళారు. బీచ్ కెళ్ళారు. షికారుగా భీమునిపట్నం వెళ్ళారు... గంటా, రెండు గంటలు హాయిగా ఎవరికీ కనబడకుండా గడపాలనుకుంటే...
సింహాచలం వచ్చేస్తారిద్దరూ.
కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోతారు...
అలాగే ఇవాళ-
సింహాచలం వస్తానని తను ఫోన్ చేస్తే అవినాష్ తో చెప్పింది రోష్ణి.
"ఇవాళ రోష్ణీతో తన పెళ్ళి గురించి మాట్లాడాలి" దృఢంగా అనుకున్నాడు అవినాష్.
"రోష్ణీని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలి" దృఢంగా నిశ్చయించుకున్నాడు అవినాష్.
అప్పటికి సమయం సరిగ్గా పదకొండు అయింది.
అప్పుడే బస్టాండులోకి నీలిరంగు మారుతీకారు ప్రవేశించింది.
ఆ కారు స్టీరింగు ముందు రోష్ణీ, రోష్ణీ కారుని అవినాష్ పక్కనే ఆపింది.
"ఏమిటంత లేటు..." విసుగ్గా అడిగాడు అవినాష్.
"నీకేం బాబు... మగాడివి... ఎంత మంది కళ్ళు కప్పి రావాలో తెల్సా...రా...కూర్చో..." డోర్ తెరిచింది రోష్ణీ. పక్కనే కూర్చున్నాడు అవినాష్.
కారు కొండ పైకి దూసుకుపోయింది.
* * * *
కొండ పైన-
చందనా గెస్టుహౌస్ కి కుడివేపున కొంచెం దూరంలో నున్న పూలతోటలో కూర్చున్నారిద్దరూ.
రోష్ణీ, అవినాష్ ఒడిలో పడుకొని ఉంది ఆ సమయంలో. నుదురు మీదున్న ఆమె జుత్తును పక్కకు తోసి, ఆ నుదురుని ముద్దుపెట్టుకొని-
"నావేపు మనకేం ఇబ్బంది రాదు తెల్సా..." అన్నాడు.
"దేనికి" ప్రశ్నించింది రోష్ణీ.
"పిచ్చీ...మన పెళ్ళికి..." అన్నాడు అవినాష్.
"మన పెళ్ళి జరగడం అంత సులభం అనుకున్నావా..." ప్రశ్నించింది రోష్ణీ.
"ఏం...హత్యలు జరుగుతాయా...?" ప్రశ్నించాడు అవినాష్.
"ఏమో...ఎవరు చెప్పొచ్చారు..."
"ఎవర్ని హత్య చేస్తే మన పెళ్ళి జరుగుతుందో చెప్పు... ఆ హత్య వెంటనే చేసేస్తాను..." ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని గోళ్ళమీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు అవినాష్.
ఆ సమయంలో అవినాష్ కి వెంటనే గౌతమి జ్ఞాపకానికొచ్చింది.
"నేను చేసే మొదటి హత్య గౌతమినే అనుకో" అని మనసులో అనుకున్నాడు.
"నన్నే హత్య చెయ్యి...ఏ సమస్యా ఉండదు..." నవ్వుతూ అంది రోష్ణీ.
"నిన్నా...నిన్ను హత్యచేస్తే... నేను ఆత్మహత్య చేసుకోవాలి తెల్సా..." అన్నాడు అవినాష్.
"నిజమా..." "నిజం..."
"పోనీ... మరోచరిత్ర సిన్మాలోలా... ఏరాడ కొండమీంచి దూకి ఇద్దరం చచ్చిపోదామా..." అవినాష్ అన్నాడు.
'ఎందుకలా...అంత పిరికివాళ్ళమా... మనం..." ప్రశ్నించింది రోష్ణి.
"మరి..."
"ఇంట్లో వాళ్ళందరూ కాదన్నా... ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తాను... తెల్సా...నా డేరింగు నీకస్సలు తెలీదు..." బుంగమూతి పెట్టి అంది రోష్ణి.
"నీకేం డేరింగూ లేదు..." వెక్కిరింతగా అన్నాడు అవినాష్.
"ఎందుకు లేదు..."
"ఎందుకా... అయితే... పద గెస్టుహౌసులోకి పోదాం..." ఆమె ఎదమీద చేయి వేస్తూ అన్నాడు అవినాష్.
"అదే వద్దని చెప్పాను... అన్నీ పెళ్ళయ్యాకే..." చేయి తీసేసి అంది రోష్ణి.
"అయితే... పెళ్ళి గురించి మీ డాడీతో నువ్వు మాట్లాడు... లేకపోతే ఓ ఫైన్ మార్నింగ్ నేనే వెళ్ళి మాట్లాడేస్తాను..." ఆమె పెదవుల మీద చేత్తో రాస్తూ అన్నాడు.
"ఆ తొందరే వద్దు... నేనే మాట్లాడుతా... అంతవరకూ నువ్వు గప్ చుప్..."
"అదెప్పుడటా..."
"ఇంకో పదిహేను రోజుల లోపు..."
"నిజంగానా..."
"నిజంగా నిజం...ఆ దేవుడిమీదొట్టు..." అవినాష్ చేతిని ముద్దు పెట్టుకుంటూ అంది రోష్ణి.
ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ పూలతోటలో ఒక అరగంట సేపు గడిపారు. కబుర్లాడుకున్నారు. ముద్దులు పెట్టుకున్నారు. దారిలో వస్తున్నపుడు కొండదిగువ పూల మార్కెట్ దగ్గర కారాపమని, కార్లోంచిదిగి, సంపెంగ పూల దండ కొన్నాడు అవినాష్.