ఇన్నాళ్ళు కేవలం అంకుల్ గానే తను తెలుసు. అంతకుమించి వీసంమాత్రం తను చెప్పలేదు. తెలియనివ్వలేదుకాని.... "కాని ఎలా తెలిసిందనా? ఎలా తెలిసినా ప్రస్తుతం జాప్యానికి తావులేదు. మరొక్క 43 రోజుల్లో అన్నీ ఐపోవాలి చెప్పండి: ఇక మీరు చెప్పటం_ నేను చేయటం. నా శక్తిసామర్ధ్యాలు మీరు ఆశిస్తున్నట్లుగానే నాలో పెరిగాయని నా ఆత్మవిశ్వాసం."
సూటిగా, ఎంతసేపైనా చూపు మరల్చకుండా చూడగల వాడి చూపులు....సాధనతో సాధ్యమైందా?
ఎప్పడూ చదువు, తప్పితే రైడింగ్ తప్ప మరోదాని గురించి ఆలోచించని భరత్_ ఎంత మార్పు.... ఎంత పెద్దరికం....?!
భరత్ వెనుకవున్న తెర కొద్దిసేపటినుండి కదులుతూ వుండడం శుక్రాచార్యకు అనుమానం కలిగించింది.
అంతలోనే నిర్ధారణ అయిపోయింది. ఇది ఖచ్చితంగా శంకర్ రెడ్డి పనే. ఓ క్షణం కోపంవచ్చినా తన లక్ష్యాన్ని విడమర్చి చెప్పే బాధ్యత శంకర్ తీసుకోవటం ఆనందాన్ని కూడా కలిగించింది.
అప్పుడు లేచాడు శుక్రాచార్య.
పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు.
"నా చదువు మధ్యలో ఆగుతుందని మీ ఆలోచనా....?"
"కాదు. చదువుకన్నా జీవితం గొప్పదని నా నమ్మకం."
"మరీ?!"
అప్పుడు చూసాడు శుక్రాచార్య సూటిగా అశ్వభరత్ కళ్ళలోకి. తీక్షణమైన శుక్రాచార్య చూపులకు ఎవరైనా భయంతో తలవంచాల్సిందే_
కాని ధీమాగా, నిర్భయంగా, ధిలాసాగా చూసాడు భరత్.
సంతృప్తి పడ్డాడు శుక్రాచార్య.
"మొదటి పధకం__" అంటూ విశ్వదత్త చుట్టూ బిగిసిన వల గురించి చెప్పాడు.
"ఇప్పుడతన్ని ఎలాగైనా నువ్వు విడిపించాలి. అక్కడితో కథ ప్రారంభమవుతుంది. దాన్ని నేను మలుపులు తిప్పుతాను."
అప్పుడడిగాడు అశ్వభరత్ పిడుగుపాటులా.
"నాకేంటి ప్రయోజనం?"
ఓక్షణం కలవరపడ్డాడు. శుక్రాచార్య మొఖం పేలవంగా మారింది. సమాధానం ఏం చెప్పాలో తోచలేదు.
పది నిముషాలు నిశ్శబ్దం....
గుండెల్ని పిండేసే శ్మశాన నిశ్శబ్దం....
అగ్నిపర్వతం బద్దలవబోతూ ఆఖరిక్షణంలో చల్లారిపోయిన భావన....
"ఈ పగ తీర్చుకోవటంలో నాకు ధ్యేయం వుండాలనికాని, నాలో హుమికియేషన్ ఆరంభం కావాలినిగాని నేనడగలేదు. మీ శిక్షణలో మీ కష్టార్జితంతో పెరిగిన నాకు, నా జీవితానికి ఏమిటి ధ్యేయం? కేవలం వ్యక్తిగత కక్షలేనా? అంత స్వార్ధపూరితంగా మీరు నన్ను పెంచలేదని నా నమ్మకం...."
"ఇక వ్యక్తిగత కక్షలతో ఆరంభమైనా, కొంత ముందుకెళ్ళాక సామాజిక ప్రయోజనం చేకూరుతుందనే నమ్మకం వుంది నాకు. ఆ నమ్మకం నీకు నామీద వుంటే బయల్దేరు....లేదంటే నా బాధలేవో నేనే పడతాను" అంటూ లేచాడు బయటకు వెళ్ళేందుకు.
ఏం సమాధానం చెబుతాడోనని శంకర్ రెడ్డి తెరచాటు నుండి ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.
"నా గురించి తెలుసుకున్నావ్....నీ గురించి తెలుసుకున్నావ్....ఆ తదుపరి ఏం చేయాలో చెప్పమన్నావ్.... మరలా ఇప్పుడు ఇలా అడ్డం తిరిగావు. యువకులలో లోపించేది అదే_ స్టెబిలిటీ, నీకు మరో సంవత్సరంలో డిగ్రీ అయిపోతుంది. ఏం దాచుకోవటంలేదు. నిజమే చెబుతున్నాను, నీకు కావాలనే అశ్వభరత్ అనే పేరు పెట్టాను, నీ పేరులో మొదటి రెండక్షరాలు నా ధ్యేయాన్ని సూచించేందుకు మిగతా మూడక్షరాలు నా దేశంమీద నాకున్న అభిమానం__
రైడింగ్ నేర్పించింది నా పగ నీతో తీర్చుకోవటానికి__ఇలా ప్రయివేటుగా చదివిస్తోంది భారతదేశం చట్టం లోసుగులతో ఆడుకోటానికి.
అలా ఆడుకోవటం నాకేం సరదాకాదు. సరదా అని ఆడుకుంటున్న వార్ని ఆ సరదాలోనే బందించటానికి.
నేవెళ్తాను.... ఈ చివరి రోజులన్నా నా భార్యా కూతుర్లతో గడుపుతాను" వడిగా బయటకు నడిచాడు శుక్రాచార్య.
కొండలా పుంచుకున్న పగ, కసి చప్పున చల్లారిపోయాయి. అసలు వ్యక్తే ఎదురు తిరిగాక చేయగలిగిందేంలేదు.
తన జీవిత లక్ష్యం అశ్వభరత్ ని ఓ ఆయుధంలా ఆటంబాంబులా తయారుచేసి తన శత్రువుపైన కక్ష తీర్చుకోవాలన్నదే....
అందుకే తన సుఖాల్ని, తన భార్యాబిడ్డల సుఖాల్ని కూడా పణంగా పెట్టాడు. ఏ భర్తా చేయని అన్యాయం తన భార్యపట్ల చేసాడు. ఏ తండ్రీ చేయనివన్నీ తాను తన కూతురుపట్ల చేసాడు.
మూగగా, మౌనంగా, గంభీరంగా తన కుటుంబం సాగుతూ వచ్చింది.... సహజంగా వుండాల్సిన ఆప్యాయతలు, అనుబంధాలు లేకుండా.
తను చేసింది తప్పేమో....
ఏది ఏమైనా చావు దగ్గరపడుతుండగా రోజులు లెక్కిస్తూ భార్య, కూతురితో హఠాత్తుగా తన పరిదిని చెరిపెసుకొని ప్రేమగా ఉండటం సాధ్యమా?
కేవలం తన పగకోసం కుటుంబ బాధ్యతలు విస్మరించిన శుక్రాచార్యలో గిల్టీనెస్....
అప్పటికప్పుడు మరో పదేళ్ళు పైబడ్డ భావన__అణువణువునా నిస్సత్తువ.
ఆ నిస్తేజంలోనే స్టేషన్ కెళ్ళి రైలెక్కాడు శుక్రాచార్య.
ఎన్నో ఏళ్ళుగా నా అనే వాళ్ళు లేక శుక్రాచార్యనే అంటిపెట్టుకుని ఆయన సూచనలమేరకు ఓ పథకం ప్రకారం అశ్వభరత్ ను పెంచుకుంటూ వచ్చిన అరవై ఏళ్ళ శంకరరెడ్డికి గుబులుగా వుంది.
నోటిదాకావచ్చి జారిపోయిన ఫీలింగ్....అలా అని, ఆలోచిస్తూ అలాగే నిలబడున్న అశ్వభరత్ ను కదిలించాలంటే జంకుగాను వుంది.
* * *
ప్రయాణం చేస్తున్నంతసేపు శుక్రాచార్య మతిస్థిమితం కోల్పోయిన వాడిలా వున్నాడు.
ఓసారి బతిమిలాడితే భరత్ ఒప్పుకునే వాడనే నమ్మకం వున్నా తన జీవిత సర్వస్వాన్ని ఫణంగా పెట్టి సొంత కొడుకులా అపురూపంగా పెంచుకున్న భరత్ అలా ఎదురు తిరగడమే ఆశదినిపాతంలా తగిలింది శుక్రాచార్యకు.
ఈ ఆఖరి రోజుల్లోనైనా ఇంతకాలం తనెందుకు ఓ బండరాయిలా మారింది తన భార్యకు, కూతురికి చెప్పాలి__ ఎలా?
శుక్రాచార్య ఆలోచనలు ఇలా సాగుతూ వుండగా అక్కడ శంకర్ రెడ్డి తొలిసారి కాస్త గట్టిగా మందలింపు ధోరణిలో భరత్ లో మాట్లాడుతున్నాడు.
"మీ కోసం, దిక్కూ, మొక్కూ లేని మీకోసం తన సుఖాల్ని కుటుంబ బాధ్యతల్ని విస్మరించాడు. క్షీణిస్తున్న తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా మూడొంతులు మీ భవిష్యత్ కే ఖర్చు పెట్టాడు. ఇదంతా ఊరికే చేసాడా అని మీరు అడగవచ్చు. ఊరికే కాకపోవచ్చు. కాని మిమ్మల్ని పైకి తెచ్చినందుకుగాను ఓ చిన్న కోర్కె మిమ్మల్ని కోరుకునే హక్కు ఆయనకు వుందనే నా అభిప్రాయం."
భరత్ మౌనంగా వింటున్నాడు.
"ఆయనకు పగ వున్న శశాంక తేజదత్త మీద, యజ్ఞభూపతి మీద మీకు పగ వుంటేనే యజ్ఞానికి సిద్ధపడటం తెలుగు సినిమా హీరో లక్ష్యంలా వుంటుంది. ఇక్కడ మనకు తారసపడ్డ పరిస్థితుల్ని బట్టి అది సాధ్యం కాదు. ఎందుకంటే మీరెవరో, ఎవరికి పుట్టారో తెలియదు. ఆ ఇద్దరితో మీకు ఏ విధంగానూ సంబంధాలు లేవు. ఇద్దరి లక్ష్యం ఒకటి కాదు. ఆయన లక్ష్యం వారిని సర్వనాశనం చేయడం__మీ లక్ష్యం కృతజ్ఞతతో శుక్రాచార్య లక్ష్యసాధనకు సహకరించడం...."
అప్పటికి మౌనంగా వున్నాడు భరత్. మరలా శంకర్ రెడ్డి మాట్లాడబోయేంతలో ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తాడు భరత్.
ఎక్కడ నుంచి? ఎవరి నుంచి అని ఆలోచిస్తున్న శంకర్ రెడ్డి భరత్ మొఖంలో క్రమంగా మార్పురావడం గమనించాడు. విషయం ఏమిటో తెలియకపోయినా అది భరత్ కు ఆందోళన కలిగించినట్లుగా అనిపించింది. నిమిషం తర్వాత ఫోన్ క్రెడిల్ చేశాడు భరత్.
"నేను అంకుల్ కి ఆయుధంగా ఉపయోగపడాలని నిర్ణయించుకున్నాను...." స్థిరంగా అన్నాడు భరత్.
ఓ క్షణం అతనేమన్నాడో అర్ధంగాక తికమకపడినా అర్ధంకాగానే మహదానందపడిపోయాడు శంకర్. సడన్ గా భరత్ లో మార్పుని తీసుకొచ్చిన ఆ ఫోన్ రాక గురించే తెలుసుకోవాలనిపించినా సీరియస్ గా కనిపిస్తున్న భరత్ ను చూసి ఆ పని చేయలేకపోయాడు.
"వెంటనే సామాన్లు సర్దు. ఇప్పటికి ఇప్పుడే హైద్రాబాద్ కు బయలుదేరబోతున్నాను. ఈ లోపు మాస్టర్ గ్రౌండ్ కి వెళ్ళొస్తాను" అంటూ వడివడిగా బయటకువచ్చి కింగ్ ని ఎక్కాడు. తన యజమాని మూమెంట్ ని తేలిగ్గా పసిగట్టగల కింగ్ వెంటనే గేలప్ అందుకుంది.
ఐదు సంవత్సరాల వయస్సున్న అకల్ టేకె జాతికి చెందిన "కింగ్" అనే ఆ గుర్రాన్ని భరత్ కి రైడింగ్ లో గురువైన అనంత్ ప్రెజెంట్ చేశాడు.
యజ్ఞభూపతికి చెందిన రాయల్ కింగ్ కి ట్రైనింగ్ ఇస్తున్న అనంత్ పై శశాంక తేజదత్త మనుష్యుల బెదిరింపు, దాడి జరిగినట్లు, అందులో అనంత్ తీవ్రంగా గాయపడినట్లు ఆ విషయాన్ని ఫోన్ లో విన్న భరత్ శంకర్ కి చెప్పలేదు.
ఎంతో సరదాగా, తమాషాగా వుంటూనే కొన్ని విషయాల్లో ఏమాత్రం బయటపడని భరత్ అంటే అటు శుక్రాచార్యకు ఇటు శంకర్ రెడ్డికి గౌరవం, కేవలం 19 సంవత్సరాల వయస్సులోనే ఆ బ్యాలెన్స్ ని అలవర్చుకున్న భరత్ కొన్ని సమయాల్లో శుక్రాచార్యకు హార్స్ రైడింగ్ ట్రైనింగ్ లో మాస్టర్ అయిన అనంత్ కి కూడా అర్ధంగాదు.