అంతే... డ్రైవర్ రాముడు ఇంజన్ ఆఫ్ చేసి" నీయవ్వ... నేన్ బస్సుని నడప... సావండి..." అంటూ బస్ దిగి ఎదురుగా వున్న కిళ్ళీకొట్టు దగ్గరకెళ్ళి ఓ కిళ్ళీ వేస్కుని తాపీగా సిగరెట్టు కాలుస్తూ నిల్చున్నాడు...
దాంతో బస్సులోని జనం మొత్తం డ్రైవర్ కి కోపం తెప్పించిన ఆ ముగ్గురివంకా అసహ్యం నిండిన చూపుల్తో గుచ్చి గుచ్చి చూశారు. దాంతో ఆ ముగ్గురూ సిగ్గుతో చితికిపోయారు.
అలా వదిలేస్తే లాభం లేదనీ... డ్రైవర్ రాముడు గంటైనా రెండు గంటలైనా కిళ్ళీ కొట్టుదగ్గరే వుంటాడని గ్రహించిన విజ్ఞులు కొందరు బస్సుదిగి వెళ్ళి డ్రైవర్ రాముడి గడ్డం పట్టుకుని బ్రతిమలాడి... అలాంటి పొరబాట్లు ఎప్పుడూ జరగవని భరోసా ఇచ్చి చెంపలు చెఠాల్ చెఠాల్ మని వాయించుకుని అతన్ని శాంతపర్చి వెనక్కి తిస్కోచ్చారు.
బస్సు బయలుదేరింది.
బస్సు కాస్త దూరం వెళ్ళిన తర్వాత రియర్ వ్యూ మిర్రర్ లోంచి వెనక గుమ్మం వైపు చూశాడు డ్రైవర్ రాముడు. ఆ గుమ్మాన్ని పట్టుకుని డజనుమంది ద్రాక్షపళ్ళ గుత్తిలాగా వేళ్ళాడుతున్నారు.
"అర్రే... ఇస్కీ గుమ్మం పట్టుకుని ఎందుకట్ల వేళ్ళాడాలే... వేరే బస్ ల ఎక్కరాదు?..." మనసులో చిర్రుబుర్రు అన్నాడు డ్రైవర్ రాముడు. కానీ కావలసినన్ని బస్సులు లేకే వాళ్ళు అంత కష్టపడి బస్సుకి వేళ్ళాడ్తూ ప్రయణిస్తున్నారన్న విషయం డ్రైవర్ రాముడి పెద్దబుర్రలోని చిన్న మెదడుకు తట్టలేదు.
హఠాత్తుగా ఉన్నట్టుండి పెంచి తర్వాత ఠక్కున సడన్ బ్రేక్ వేశాడు. అంతే... ఆ కుదుపుకి గుమ్మానికి వేళ్ళాడ్తున్న ద్రాక్షగుత్తిలోని నాలుగైదు పళ్ళు రాలి నేలమీదపడి తలపండు పగలి లబ్బున మొత్తుకున్నాయ్. వాళ్ళు రాలిపడగానే బస్సు మళ్ళీ ఒక్క కుదుపుతో ముందుకు పరుగెత్తింది...
రియర్ వ్యూ మిర్రర్ లోంచి నేలమీద పడి డేకుతున్న ఆ నలుగుర్నీ చూసి పకపకా నవ్వాడు డ్రైవర్ రాముడు.
"మంచిగైంది... సాలేగాళ్ళు... హ...హ హ... హ హ హా.."
ఓ నిముషం తర్వాత డ్రైవర్ రాముడికి ఫర్లాంగు దూరంలో బస్సు స్టాపు కనిపించింది. ఇప్పుడతనికి డబుల్ చిలిపి ఊహ వచ్చి బస్సుని ఠకీమని అక్కడే ఆపేశాడు.
"ఊ.. ఊ... ఎవ్వల్ దిగుతార్ దిగూండ్రి... జల్ది... జల్ది..." అన్నాడు వెనక్కు చూస్తూ.
"అదేంటయ్యా... బస్సు స్టాపు ఇంకాస్త దూరంలో వుందిగా?" ఎవరో అన్నారు.
"ఛల్ నీయవ్వ... ఆడ అగదు... ఈడనే దిగూండ్రి... ఊ... డుర్ ర్ ర్ ... హె... హెహె ..." అన్నాడు.
ఆ స్టాపులో దిగాల్సిన వాళ్ళంతా అక్కడే దిగేశారు.
ఫర్లాంగు దూరంలో బస్సుకోసం ఎదురుచూస్తున్న జనం బస్సు అంత దూరంలో ఆగడం గమనించి "వాన్... టూ... థ్రి..." అని కోరస్ గా అని ఒక్కసారి బస్సువైపు పరుగులు పెడ్తూ రాసాగారు. డ్రైవర్ రాముడు వాళ్ళని చూస్తూ ముసిముసిగా నవ్వాడు. బస్సుని గేర్లో వేస్కుని రెడీగా వున్నాడు. జనం బస్సుని సమీపించగానే బస్సుని ముందుకు పరిగెత్తించాడు.
జనం హాహాకారాలు చేస్తూ నిలబడిపోయారు. డ్రైవర్ రాముడు బస్సుని బస్ స్టాప్ దాటించి ఓ ఫర్లాంగు అవతల ఆపాడు. బస్సు మళ్ళీ ఆగడం గమనించిన జనం మళ్లీ "వాన్... టూ... థ్రి..." అంటూ బస్సువైపు పరుగులు తీశారు. మళ్ళీ వాళ్ళని బస్సుదాకా రానిచ్చి బస్సుని రివ్వున ముందుకు పోనిచ్చాడు డ్రైవర్ రాముడు.
జనం మళ్ళీ శక్తివంచన లేకుండా హాహాకారాలు చేశారు.
డ్రైవర్ రాముడు పకపకా నవ్వాడు.
అలా ఆరోజంతా జనంతో ఆటలాడుకుని ఇంటికి వెళ్ళి తృప్తిగా నిద్రపోయాడు డ్రైవర్ రాముడు.
* * *
చుట్టాలొస్తున్నారు జాగ్రత్త
"పరంధామయ్య గారిల్లు ఇదేనండీ?...
వరండాలో కూర్చుని పేపరు చదువుతున్న శివరావు తలెత్తి చూశాడు. ఒక యువకుడు చేతిలో సూట్ కేసుతో నిల్చుని ఉన్నాడు.
"పరంధామయ్యగారిల్లు?... ఇదే!" అన్నాడు శివరావు.
"మరేమోనండీ... నేనేమోనండీ జంగారెడ్డిగూడెం నుండి వచ్చానండి...ఇక్కడేమో నాకేదో ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉందండి... నాపేరేమోనండీ... వెంకట్రావండీ..." వినయంగా అన్నాడు అతను.
అంటే అతను తన యింటి ఓనరైన పరంధామయ్య ఇంట్లో దిగడానికి వచ్చాడన్నమాట.
శివరావుకి చాలా ఆనందం కలిగింది. అదే ఆ యువకుడితో అన్నాడు.
"నాకు చాలా ఆనందంగా వుంది వెంకట్రావ్... అయితే ఇంటర్వ్యూకి వచ్చావన్నమాట!..."
"ఇంటర్వ్యూ ఎప్పుడూ?..."
"ఇంకో నెల్రోజులుందండీ..."
"నాల్రోజుల ముందే ఎందుకొచ్చావ్?" ఆనందం ఆశ్చర్యం మిళితమైన స్వరంతో అడిగాడు.
"ఇంటర్వ్యూముందు ఈ ఊళ్ళో ప్రిపేరవుదామనండీ" అన్నాడు వెంకట్రావు.
శివరావు ఆనందంతో తల మునకలై పోయాడు. ఇంటి ఓనర్ చచ్చాడు!...
పీనాసిపీనుగ... వడికలా కావాల్సిందే... వాడిల్లు చుట్టాల్తోనిండి పోవాల్సిందే!!...లేకపోతే రాత్రి తొమ్మిది దాటితే లైట్లేస్కోనివ్వడు. తలుపులూ కిటికీలూ వేసేప్పుడు కాస్త శబ్దం అయినా వచ్చి అడుగుతాడు. ప్రతి సంవత్సరం అద్దె పెంచుతాడు.
"నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. నువ్వు మా ఊరికి అతిధివి... మరో నాల్రోజులు ఎక్కువే ఉండు బాబు... హిహి..."
వెంకట్రావుకి శివరావు చూపించే అభిమానానికి కళ్లలో నీళ్ళు తిరిగాయ్.
చొక్కా ఎత్తి కళ్ళు తుడుచుకుని "థాంక్సండీ" అన్నాడు.
"పరంధామయ్య పై పోర్షనులో ఉంటాడు బాబూ... మెట్లు ఇదిగో ఈ పక్కనుండి ఉన్నాయ్... త్వరగా వెళ్లు బాబు వాడిగుండె బద్దలవ్వాలి!!!..." అన్నాడు శివరావు ఆనంద భాష్పాలు నిండిన కళ్లతో.
వెంకట్రావు ఆశ్చర్యంగా చూశాడు.
"అయితే మీరు పరంధామయ్య కారా?..."
"నేనేం కానుగా ... నేనెంత లక్కీనో... హిహిహి..."
అయినా నేను పరంధామయ్య ఇంటికొచ్చానని ఎవరు చెప్పారు?...
"మరి పరంధామయ్య ఇల్లు ఇదేనా అని ఎందుకడిగావ్?" శివరావ్ అయోమయంగా అడిగాడు.
"పరంధామయ్య ఇల్లు ఇదో కాదో కనుక్కుందామని! ఆయనింట్లో అద్దెకుండే శివరావ్ గారింటికి వచ్చాను నేను."
"ఆ..."
కుర్చీలోంచి ఢామ్మని పడిపోయాడు శివరావు.
వెంకట్రావు సూట్ కేసు కిందపెట్టి కంగారుగా శివరావ్ ని లేవనెత్తి కుర్చీలో కూర్చోబెట్టాడు.
"అదేంటండీ?... ఎందుకలా పడిపోయారు?"
"నేనే శివరావుని గనుక!... ఇంతకీ నువ్వెవరు నాయనా... నిన్నెప్పుడూ చూడలేదే!" నీర్సంగా అన్నాడు శివరావు.
"జంగారెడ్డి గూడెంలో మీ స్నేహితుడు కన్నారావు అని ఉన్నాడు కదండీ..."